గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 4 వ భాగము.


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (4 వ భాగము)
తేన దేవా అయజన్త, సాధ్యా ఋషయశ్చ యే, తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః, సంభృతం పృషదాజ్యమ్, పశూగ్ం స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్, ఆరణ్యా న్గ్రామ్యాశ్చయే, తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః, ఋచస్సామాని జజ్ఞిరే, ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్, యజు స్తస్మా దజాయత. ౪ 
ప్రతిపదార్థము:-
తేన = ఆ పశువుచే,  
దేవా: = దేవతలును, 
సాధ్యా: = సాధ్యులును, 
ఋషయశ్చ = ఋషులును, 
యే = ఎవరో, 
(తే సర్వేzపి = వారందరును,)
అయజంత = మానస యజ్ఞమును చేసిరి, 
సర్వ హుత: = సర్వాత్మకమైన పురుషునిచే హోమము చేయఁబడిన, 
తస్మాత్ = ఆ, 
యజ్ఞాత్ = యజ్ఞమునుండి, 
పృషదాజ్యమ్ = పృషత్ అనెడి నెయ్యి, 
సంభ్రుతం = సంపాదింపఁబడినది, 
వాయవ్యాన్ = వాయు దేవతాకములైన, 
అరణ్యాన్ = పశువులు మొదలగువానిని, 
యే = ఏవి, 
గ్రామ్యా: = గ్రామమందుఁబుట్టిన గోవులు మొదలగువానిలోనుండునో,
తాంశ్చపశూన్ = ఆ పశువులను, 
చక్రే = చేసెను. 
సర్వ హుత: = సర్వ హుతమును, 
తస్మాత్ యజ్ఞాత్ = ఆ యజ్ఞము నుండి, 
ఛందాంసి = గాయత్ర్యాది ఛందస్సులును, 
జజ్ఞిరే = పుట్టినవి. 
తస్మాత్ యజు: = ఆ యజ్ఞమునుండి, 
యజు: = యజుర్వేదము, 
అజాయత = పుట్టెను.
దండాన్వయము:-
ఆ పశువుచే దేవతలు ఋషులు సాధ్యులు ఎవరో వారు అందరు మానస యజ్ఞముఁజేసిరి. సర్వాత్మకమైన పురుషునిచే హోమము చేయఁబడిన ఆయజ్ఞము నుండి పృషత్ అనెడి నెయ్యి సంపాదింపఁ బడినది. వాయు దేవతాకమైన పశువులు మొదలగు వానిని ఏవి గ్రామమందుఁ బుట్టిన గోవులు మొదలగువానిలో నుండునో ఆ పశువులను చేసెను. సర్వ హుతమును ఆ యజ్ఞమునుండి గాయత్ర్యాది ఛందస్సులును బుట్టినవి. ఆ యజ్ఞమునుండి యజుర్వేదము బుట్టెను.
సీ:-
అట్టి పశువుతోడ నాదేవతల్ ఋషుల్
సాధ్యులు యజ్ఞము సలిపినారు.
సర్వాత్ముడతనిచే నిర్వహింపఁబడిన 
హోమ యజ్ఞము నుండి యొదవె నపుడు
పృష దను ఘృతము సమృద్ధిగా. వాయు సం
బంధ పసులు గ్రామ మందు నుండు
నట్టివి చేసె నా యజ్ఞము నుండియే
సర్వహుతములును, చక్కగ మన
గీ:-
మందఁ, గాయత్రి మొదలగు ఛందములును 
పుట్టినవి మహిమం బట నుట్టి పడగ.
నట యజుర్వేదమును బుట్టె నద్భుతముగ.
యజ్ఞమది యౌను మానస యజ్ఞమదియె. 4.
వివరణ:-
సృష్టికి ముందు పుట్టిన విరాట్టుతో బ్రహ్మ ఇంద్రియ స్వరూపులగు దేవతలును ప్రాణ రూపులగు సాధ్యులును వారి కనుకూలమగు మంత్ర వేత్తలగు ఋషులును, వీరలందరును మానస యాగమును జేసిరి.  ఆ విరాట్టే హోమముగాఁ గలిగిన ఆ మానస యజ్ఞము నుండి పృషదాజ్యము లోనగు భోగ్యవస్తు సముదాయ మంతయుఁ గలిగెను.  వాయు దేవతాకములగు పశువులును గ్రామ్యములగు గోవులు మొదలైనవియు వేదములును గాయత్ర్యాది ఛందస్సులును ఆ యాగము నుండియే కలిగెను.
ఇది 4 వ భాగము. (స శేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.