గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 12/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
133.కొలువుగ నిల్పుదున్ నడవ గోపతి! రవ్వల దివ్వె యెత్తి ప 
చ్చలు, పగడాలు, ముత్యములు చాయలలో నిను దేల్తు! చందనం
బలఁది,భజింతుఁబుష్పముల,నార్తి మెయింగయిమోడ్చినీవెలుం
గులనెడి మంగళారతులు కొల్తు దయా ధుని! దైవ రాణ్మణీ!
134.బంగరు చాయ పాయసము, పంకజ వల్లభ, మంధకార మా
తంగ ఘటా విపాటన కృత వ్రత సింహము, పూర్వ పర్వతో
త్సంగ కలా కలాప భర చారు మయూర, ముపాస్య సౌర స
త్సంగము, భాస్కరోత్సవము, సర్వ శుభప్రదమై చెలంగుతన్.
135.నీవు వియద్విహార రమణీయ హిరణ్మయ హంసవో! త్రిలో
కీ విచలత్సటా జటిల కేసరివో! బహు రత్న పిచ్ఛిల
శ్రీ విలసత్ సహస్ర ఫణి సేవధివో! మధురోచి రుజ్వల
శ్రీ నిధివో! నినుంగొలువలేరు జనుల్ దురదృష్ట దర్శనుల్!
136.ఈసకలమ్మునీ వెలుఁగు సృష్టియటే!ఋతుచక్ర మద్భుతో
ద్భాస కలా విలాసమటె! తామర తూడు సుగంధ బంధుర
శ్రీ సిత పద్మమై వలపు చిందునటే! గడె సేపు కానవా,
మూసిన సద్మమై, దిగులు మూగునటే! బహు చిత్ర దీధితీ!
137.ఆకలి దప్పు లెంతటి యనర్థముఁ దెచ్చుటకైనఁ జాలు,  స్వా
మీ! కడ కంటి ప్రేమఁ గనుమీ! కిరణామృత వృష్టిఁ జేసి,  లో
చీకటిఁ బాపుమీ! ఉరక చేసిన పాపముఁ జోపుమీ! నమో
వాక, మహస్కరారుణ! నవప్రియ సూక్తమిదే! దివాకరా!
138.ఎండ యిదేమి! చిచ్చుమిసెనే! సెగఁ బ్రేలిన పేల గింజలై
మండిన నేల చిందెదరుమానవు, లంతయు బూది సేతువా?
నిండుగఁ జూతువా? సుజల నిత్య ఘృణారుణ రాగ దీప్తితో
పండువు సేయవా! పరమ పావన! భాస్కర! రోచిరుజ్వలా!
139.పురువున కేనిఁ గీడు తలపోయనె! చేసిన మేలదెన్నడున్
మఱవనె! పేద గోడు వినినంతఁ జలింతునె! యేమి రాని ని
బ్బరమును వీడనే! సిరులపై మమకార మెఱుంగనే! యెటుల్
దరి గొనెఁ జిచ్చు? నెమ్మది యథా తథలై చిలుకన్ పొగల్ సెగల్!
140.అరుణ మెఱుంగ, నీ సహజమైన హొరంగు నెఱుంగఁ జుట్టు నే
దిరిగి యెఱుంగ, నీ మనసు తీపి యెఱుంగ, సమర్ఘ్య  పాద్యముల్
జరిపి యెఱుంగఁ, గట్టెదుట సాగిలి మ్రొక్కి యెఱుంగ,నెట్టు లీ
తిరిపము నేలుదో! అలతఁ దీరిచి,  లోక విలోకన ద్యుతీ! 
41.ఒడలు పొరల్ పొరల్ చిటిలి, యోడిక నెత్తురు కుండయై, బడ
ల్పడి, కను ముక్కు రూపు సెడి, ప్రాకుచు, దేకుచు, మూగు ఈగలన్
గెడపుచుఁ, గంటి కేవయగు నిష్టుర కుష్ఠు మయూర మూర్ధమున్
పుడికి, భవత్ కిసాలరుచి పుంజముతో శుచిఁ జేసితే! భళా!
142.పొడిచిన కొండ కొమ్మపయి పూచిన బంగరు పూల తీవలై
కలిత పులోమజా నిటల కాంతి పురస్కృత కుంకుమమ్ములై
మలయ దరీ జపా ప్రసవ మంజుల కుంచిత రాగ వల్లులై
చెలఁగు నవారుణాంశవులు శ్రీకరముల్ తొలి సంజ దీపముల్!
143.తిమిరము రేయి కాఱడవి తీవలు త్రుంచిన గండ్ర గొడ్డలై
అమర గజేంద్ర కుంభ తటి కందము గూర్చెడి సిందురమ్ములై
క్రమముగ మన్ను మిన్ కలయికన్ విభజించెడి శోణ రేఖలై
కొమరు చెలంగు తమ్మి చెలి కుట్మల కాంతులు శాంతి నిచ్చుతన్!
144.జగదలివేణి ముంగురుల చల్లిన మంకెన పూల వోలె నీ
వగుపడినంత ప్రొద్దు మల నచ్చెరు, వెల్లెడ నల్లె దీధితుల్!
జిగి జలతారు పైటలయి, చిందిన నెత్తురు పుండ్ల దూదిక
ట్టు గుఱుతులై, జగా పసిడి డోలికలై మిను మబ్బులొప్పెడున్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.