గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 7 వ& 8 వ భాగములు.


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (7&8 భాగములు)

వేదాహమేతం పురుషం మహాన్తమ్ ఆదిత్య వర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీర:, నామాని కృత్వాzభివర్ద యదాస్తే, ధాతా పురస్తాద్యముదా జహార,శక్ర: ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్ర:, త మేవం విద్వా నమృత ఇహ భవతి, నాzన్య: పన్థాఅయనాయ విద్యతే, యజ్ఞేన యజ్ఞ మయ జన్త దేవా: తాని ధర్మాణి ప్రథమా న్యాసన్.7  
తేహనాకం మహిమాన స్సచన్తే, యత్ర పూర్వే స్సాధ్యా స్సంతి దేవా:  8. 

ప్రతిపదార్థము:- 
యత్ = ఏ   
ధీర: = సధైర్యుడగు విరాట్టు 
సర్వాణి రూపాణి = సమస్త రూపములను,  
విచిత్యా = విశేషముగా నిర్మించి,
నామాని = పేళ్ళను
కృత్వా = చేసి,
అభివర్ద = ఎల్లెడల వ్యాపించి
ఆస్తే = ఉన్నాఁడో
ఏతమ్ = ఈ 
పురుషమ్ = విరాట్టును
మహాన్తమ్ = అధికునిగాను
ఆదిత్య వర్ణమ్ = సూర్యుని వలె ప్రకాశించు వానిని గాను,
అహమ్ = నేను 
వేద = తెలుసుకొను చున్నాను.
సచ = ఆ విరాట్టే  
తమసస్తుపారే = అజ్ఞానమునకు వెలుపల
వర్తతే = ఉన్నాఁడు.
ధాతా = ప్రజాపతి
యం = ఏ విరాట్టును
ఉదాజహార = చెప్పెనో
శక్ర: = ఇంద్రుఁడు
ప్రవిద్వాన్ = ఎక్కువగ తెలిసిన వాఁడై
చతస్ర: = నాలుగయిన
ప్రదిశ: = దిక్కులను (ప్రసిద్ధి చేసెనో)
తం = అట్టి విరాట్టును
ఏవం = ఏ ప్రజాపతి
విద్వాన్ = తెలుసుకొనునట్టి ఉపాసకుఁడెవఁడో 
ఇజ = ఈ జన్మమునందు
అమృత: = మరణము లేనివాఁడు. 
భవతి = అగుచున్నాఁడు.
అయనాయ = మోక్ష ప్రాప్తి కొఱకు 
అన్య: = మఱి యొకటి యగు
పంథా: = మార్గము
నవిద్యతే = లేదు.
దేవా: = దేవతలు 
యజ్ఞేన = మానస యజ్ఞము చేతను
యజ్ఞం = యజ్ఞ స్వరూపుఁడగు ప్రజాపతిని
అజయంత = పూజించిరి.
తస్మాత్ = అందు వలన
తాని = ఆ ప్రసిద్ధములగు
ధర్మాణి = జగద్రూప వికారములనుధరించు నట్టివి,
ప్రథమాని = ముఖ్యమైనవిగా 
ఆసన్ = ఉండెను.
యత్ర = ఏ స్వర్గమున 
పూర్వే = ప్రాచీనులగు సాధ్యులును,
దేవా: = దేవతలు
సంతి = కలరో
తే  = ఆ
మహిమాన: = మహిమ గలవారలు
తం = ఆ
నాకం = స్వర్గమును
ఇహ = ఇచ్చటనే
సవంతే = పొందు చున్నారు.

దండాన్వయము:-
ఏ  సధైర్యుఁడగు విరాట్టు   సమస్త రూపములను, విశేషముగా నిర్మించి, పేళ్ళను చేసి, ఎల్లెడల వ్యాపించి ఉన్నాఁడో ఈ విరాట్టును అధికునిగాను సూర్యుని వలె ప్రకాశించు వానిని గాను నేను తెలుసుకొను చున్నాను.  ఆ విరాట్టే  అజ్ఞానమునకు వెలుపల ఉన్నాఁడు. ప్రజాపతి ఏ విరాట్టును చెప్పెనో ఇంద్రుఁడు ఎక్కువగ తెలిసిన వాఁడై నాలుగయిన  దిక్కులను (ప్రసిద్ధి చేసెనో) అట్టి విరాట్టును ఏ ప్రజాపతి తెలుసుకొనునట్టి ఉపాసకుఁడెవఁడో ఈ జన్మమునందు మరణము లేనివాఁడు అగుచున్నాఁడు. మోక్ష ప్రాప్తి కొఱకు మఱి యొకటి యగు మార్గము లేదు. దేవతలు మానస యజ్ఞము చేతను యజ్ఞ స్వరూపుఁడగు ప్రజాపతిని పూజించిరి. అందు వలన ఆ ప్రసిద్ధములగు జగద్రూప వికారములనుధరించు నట్టివి, ముఖ్యమైనవిగా ఉండెను. ఏ స్వర్గమున ప్రాచీనులగు సాధ్యులును దేవతలు కలరో  ఆ మహిమ గలవారలు ఆ స్వర్గమును ఇచ్చటనే పొందు చున్నారు.
సీ:-
ఏ విరాట్టు కొలిపి యింపునన్నింటిని,
పేళ్ళు పెట్టి యతఁడె పేర్మి నిలిచె
నా విరాట్టుఁ గనఁగ నన్నింట నధికుఁడు
భాను తేజుఁ డనెడి భావ మొదవె.
ఆ విరాట్టు నిలిచె నజ్ఞానమున కటు
యసమాన తేజుఁడై  యసదృశముగ.
ఏ విరాట్టును జెప్పె నెఱుగఁ ప్రజాపతి
ఇంద్రుండు నల్దిక్కు లెఱుక పరచె.
గీ:-
ఎఱుఁగు వాఁడది ముక్తుఁడు. ఇతర మేల?
దేవతలు మానసిక యజ్ఞ దీప్తిఁ గాంచ్రి. 7.
సాధ్య గంధర్వు లేదివిన్ సౌఖ్య మొందు,
ఆ దివి నిటనే పొందుదు రట్టి వారు. 8.
వివరణ:-
ఈ ముందు చెప్పిన విరాట్టు యొక్క ధ్యాన మంత్రమును జెప్పువాఁడు స్వకీయ ధ్యానము యొక్క అనుభవమును వెల్లడి చేయుచున్నాఁడు.ఏ విరాట్టు ఎల్ల యాకారముల నిర్మించిఇతఁడు దేవుఁడు ఇది పశువు, ఇతఁడు మనుజుఁడు, మొదలగు నామములు బెట్టి ఆ నామములతో నెల్లెడల ప్రవర్తించు చున్నాఁడో అట్టి వానిని ఎల్ల గుణములచే నధికుని సూర్యుని వలెనే ప్రకాశమానమగువానిని ధ్యానముచే సదా అనుభవించు చున్నాఁడు. అట్టి వాఁడు అజ్ఞానాతీతుఁడై యున్నాఁడు. కావున గురు శాస్త్రోపదేశరహితు లగు అజ్ఞానులచేఁ తెలిసికొన శక్యుఁడు గాఁడు. ఏ విరాట్టుని ఉపాసించు వారల మంచికిఁ గాను ప్రజాపతి ప్రసిద్ధ పఱచెనో ఎల్ల దిక్కులయందుండునట్టి ఎల్ల ప్రాణుల గ్రహిమ్చుచున్నైంద్రుఁడును,అ జీవులయనుగ్రహము కొఱకు దేనిని వెల్లడి చేసెనో ఆ ప్రజాపతీంద్రుల ఉపదేశము వలన ఆ విరాట్టుచే ఈ చెప్పఁబడిన ప్రకారము తెలిసికొనిన వాఁడు ఈ జన్మముననే మరన రహితుఁడగు చున్నాఁడు.విరాట్టె నేను అని సాక్షాత్కారముఁ జేసికొనెడివాఁడు వర్తమాన దేహ స్వరూపము లేకపోవుటచే వాని స్మరణము వలన మరణము చెందును. అట్టివిరాట్టుని సాక్షాత్కారము లేకమోక్షమునకు ఇతర మార్గము లేదు. కర్మలచే మోక్షము చెంద వీలు లేదు. ప్రజాపతి ప్రాణ రూపులైన దేవతలు మానవ యజ్ఞ స్వరూపుఁడగు ఏ దేవుని పూజించుట వలన జగద్రూప వికారములను జెందిన ధర్మములు ప్రసిద్ధములైనవి ఆయెను. 7. పురాతనులగు సాధ్యులును, దేవతలును విరాట్ప్రాప్తి రూపమునఏ స్వర్గమునందుండిరో అట్టి స్వర్గము మహనుభావులు చెందుచున్నారు. 8.
ఇది 7&8 భాగములు. (స శేషం)
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

మంచి ప్రయత్నమండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీ అదర్శవంతమైన బ్లాగ్‍ఆర్టికల్సే ప్రేరకాలు. ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.