గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2010, బుధవారం

ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 5/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
49.లోకమిదేమి? యేమి వగలో, సెగలో, అవి యేమి సేతలో 
సీ, కసుమాల మెంత ససి చెడ్డది! తల్లిని బిడ్డ నమ్మఁడే!
చేకొనఁడే, తలెత్తి చను జీవన మార్గము, మేల్ తలంపఁడే!
చీఁకటి మాయునా? వెలుగు జీరగుపించున? శాంతి కల్గునా?
50.ఒడలు చెడన్ మయూర కవి యోపఁగ రాని భరమ్ముతోఁ దడం
బడి, దశ మాలి, దగ్గడిలి, ప్రాణము గుప్పిటఁ బెట్టుకొంచు, నీ
యడుగుల మ్రోల స్రగ్ధరల యారతు లెత్తఁగ రక్తిఁ దేరి, క
న్బడి చెడ రాని ముక్తి రమ నవ్వులఁ దేల్చితె! పద్మవల్లభా! 
51.నిను సేవింప రవీ! మయూరుడఁను గానే, లేక, శ్రీనాథుఁడై
నను గానే! దరినుండు చాయనయినన్ గానే, ఉషః కాంతినై
నను గానే! ప్రియ పద్మినీ రమణి నైనన్ గానె! త్రైలోక్య పా
వనముల్ నీ అరుణారుణ ప్రభ లెటుల్ వర్ణింపఁగాఁ జాలుదున్?
52.నిను గొనియాడ నౌనె తరణీ! పురి విప్పక నెమ్మి లోపలన్?
జనవుగ నీవె నీ ప్రకృతి చాయగఁ జూపితి, వంతలోనె ప
ద్మిని చిఱు నవ్వు రేకులను దేరి, నినుం గనినట్లు ధారగా
తనకుఁ దనంత పుట్టి కవితా రస వాహిని పొంగెనో యిటుల్!
53.నిను గొండాడఁ దరమ్మె? చాయ వలెఁ దండ్రీ! చేరి పాలింతువే!
చనవుల్ గూర్తువె! సేమమౌ ఋతువులన్ చక్రమ్ము చేఁ దాల్తువే!
కను చీఁకట్లు తొలంతువే! వెలుఁగులన్ గైసేసి రక్షింతువే!
యిన దేవా! కొనుమా ప్రణామము లివే! యీవే శుభ  శ్రేయముల్!.
54.నిను దలఁతున్ బదింబదిగ! నీ వెలుగున్ గనులారఁ జూతు, నీ
చనవు నుతింతు! నీ చరణ సారసముల్ మది నిల్పుకొందు! నీ
సునిశిత లోక పాలనకు సోలుదు! వాలుదు నీ బవంతిలోఁ,
గనికర ముంచి, నీదు కరకాంతులతో ననుఁ దేర్చవా! రవీ!
55.కరుణ చెలంగ నీ కిరణ కాంతిని దోగుదు! ఆబ తీర నా
కరపుటిఁ ద్రావుదున్! ద్విపటిగా మెయిఁ గప్పుదు! పైడి పాగగా
శిరసునఁ జుట్టుదున్! నయన సీమఁ బ్రహారిగఁ గట్టుకొందు! అ
త్తరువుగఁ బూసి కొందు మెయి, దర్శన మీఁగదె! పద్మ సౌరభా!
56.కరుణ దలర్చు నీ కిరణ కాంతులతో నను  బ్రోవలేవ? భా
స్కర! వెయి వెల్గులందగిలు చక్కని వేలుపువే! తమిస్రముల్
బిరబిర మాపుదే! హృదయ వేదనఁ బాపుదె! చేతు లెత్తి నీ 
శరణము గోరు యీ కృపణు సాకఁ గదే, కను విప్పి రక్తిమై?
57.సవితా నీవు వినా మఱెవ్వరు ప్రశంసా పాత్రు లాలోక బాం
ధవ శబ్దమ్మున, కర్థి కామ్య కిరణాంతస్తత్వ వారాశికిన్!
నవ నాడుల్ చెడె, మూలఁ జేరి, దరి కానన్ రాక అల్లాడి, కేల్
గవ మోడ్తున్ నును దమ్మి మొగ్గ యటులన్, లాలించి పాలించెదో!
58.ఇన దేవా! కన రావ! నా కనుల కీవే కావ రావేమి? చే
సిన నా కీడు తొలంచ లేవ? కినుకా? చీకాక? లోకేశ్వరా?
కను పాపన్ తన తల్లి అక్కునకు బల్ గారాన తా చేర్పదే?
ఘను లవ్యాజ కృపా స్వరూపులు గదా! కల్యాణ కాంతి ప్రభూ!
59.ఖరకర! యెవ్వరయ్య! నిను గన్నులఁ జూడఁగ వేడుకొండ్రు, నీ
కఱకుఁదనమ్ము, కాఁక, వెయి కాంతుల దర్పము చూచి కూడ? నే
నెఱుఁగక, బేలనై పలవరింతు సదా నిను గోరి, సార సా
దరము, సమానురాగ మృదు తత్వ మెదన్ దలపోసి, యర్యమా!
60.తిమిర హరా! హరింపఁ గదె? తీవ్ర రుషాగ్నులతో శరీర దో
షములు, మనో రుజల్, నయన జాడ్యము, లింద్రియ దుర్వికారముల్,
కమల సుహాసినీ ప్రణయ కాంతి సుధల్ వెద జల్లి, మ్లాన జీ
వమును వసంత వల్లరిగ భాసిలఁ జేయవె? పల్లవారుణా! 


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.