గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2010, మంగళవారం

ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 4/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్.

ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.

37.వెలుఁగు తదన్యమౌ వెలుఁగు పేరు సహింపదు, శౌర్య మన్య ని 
స్తుల, మరుణాంతరంగ! పరి చుంబిత కాంతి తరంగ! వేఱెవం

డిల వెలుఁగొందు పాద విదళీ కృత పాప తమిస్ర లోక మం
జులముగ నీ వలెన్, నయన సుందర! కశ్యప భాగ్య మందిరా!
38.అదితి మనస్సు తీపి తరమా గుఱుతింప? వెలుంగు తాత సౌ
హృద మెఱుఁగంగశక్యమ? జనించితి మించిన రవ్వ తీరు. చె
ప్పుదు రిలఁ కాశ్యపుండు కొన ముత్తెము, సత్తెము రూపు, పున్నెముల్
గుది గొను వేల్పు, వెల్గుల వెలుంగని నిన్, జలితాంశు మాలికా!
39.జీవుల నీ వెలుంగుల సృజింతువు, పెంతువు, త్రుంతు వంతలో
లేవిట చీకు చింతలు బలే కురిపింతువు తేనె ధార, నీ
జీవ జగద్దయా గుణము, చేసిన మేలు స్మరింపమే! అహం 
భావులమే! యెటుల్ పనికి వత్తుము నీదరి నిల్వ? భాస్కరా!.
40.హరిదశ్వమ్ముల వన్నెఁ గాంచఁ గలనా? అవ్యోమ సౌవర్ణమౌ 
అరదమ్మున్ త్వరిత త్వరాతి గతి వేగాలోల మీక్షింప నా
తరమా? సారస కేసరారుణ మహా తత్వమ్ము, త్రైలోక్య సుం
దర, మాదిత్య మహమ్ముఁగొల్తు నయనాంతర్జ్యోతి రూపమ్ములో! 
41.ఖర కర మండలంబరయఁ గల్గుదునా? దరి దాపు లేని అం
తరమగుచూపు లేక మఱి దర్శనమౌనె? సహస్ర దీధితీ !
పరుఁడను గాను, గింకరుఁడఁ,  బైన నినుం గనలేను, గాన నీ
కరమును బట్టి యద్దుకొని, కానఁగ నీ కమనీయ ధామమున్!
42.కనులకు వెల్తురై, గగన కన్యకుఁ బాపట పద్మ రాగమై,
పనవిన కోక దంపతుల పాలిట మేలిమిఁ గూర్చు ముత్యమై,
మనసయి వీడనట్టి యభిమానపు చాయకు, దిగ్వధూ ముఖ
మ్మునకు మెఱుంగులౌ ఇనుఁడు పూజ్యుఁడు, మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్!
43.కనుగొంటిన్ కనుగొంటి నీ అరుణమౌ కాంతి స్వరూపమ్ము నా
కనులారన్! సరసీ రుహ ప్రియ రుచీ! గర్భీకృతాంతః శుచీ! 
కన నీవే కద నావ జీవులకు, దుఃఖాబ్ధిన్ దరింపంగ! జీ
వన హేతూ! పురుహూత పూజిత పదా! బంధూక బంధు ద్యుతీ!
44.కనుఁగొంటిన్ గనుఁగొంటిఁ గాంతి రథమున్, కల్యాణ రాగోదయ
మ్మున, బ్రాభాత శుభ ప్రభాకర మహా పుణ్యారుణోద్య ద్ద్యుతుల్
వెను వెంటన్ జని చీఁకటుల్ వెలుఁగు లీ విశ్వాంతరాళమ్ములోఁ
గను విందై పఱతెంచెఁ గంటిని ప్రభూ! కారుణ్య ధారాఘృణుల్!
45.కనుఁగొంటిన్ గనుఁగొంటిఁ గన్నెదురనే కల్యాణ రూపమ్ములో
నను బాలింపఁగ లీల వాలిన మహా నారాయణాంశంబుగా
వినమత్పద్మినిగా, నుషస్సహితమౌ విందైన కన్ చాయగా
ఇన దేవా! దయ సేయవా! శరణ మీవే కావ! అబ్జ ప్రియా!
46.కుఱుచలు శోణ కాంతులవిగో, పఱ తెంచె, క్రమ త్రివిక్రమ
స్ఫురణములై, దిశా వదన చుంబన చారువులై, జలే రుహా
దరణములై, జగత్రితయ తర్పణ రమ్యములై, దివాకరా
భరణములై, సువర్ణ మయ భాండములై, హరి సౌధ వీధికన్!
47.నీ చరితంబిదేమి? స్పృహణీయ రుచీ! మధు సాధు మూర్తి! పూ
ర్వాచల పుణ్య రూప! అరుణారుణ రోచిరుదీర్ణ సర్వ లో
కా! చటులాశ్వ వేగ గతి! అబ్జ మనో ధన పశ్యతో హరా!
పూచిన రాగ వల్లరి! ప్రభూ! చిలికింపవె? నీ దయాద్యుతుల్!
48.నీ యను భావమేమి? రమణీయ ఘృణీ! ధృత శంక చక్ర! నా
రాయణ మూర్తి! రత్న రుచి! హారి హిరణ్మయ దేహ! వర్ణమా
లాయిత కాంతి మండల! అనామయ శాంతి సమృద్ధి లాభ సం
ధాయక! దిక్చకచ్చకిత నవ్య మణిస్ఫుట రత్న మండలా!





Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.