గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2010, మంగళవారం

యువతరం ఉపేక్షించక భరత మాతను రక్షించాలి.


శ్రీ కల్యాణ గుణ సంపన్నులారా! భారతీయ సహోదరులారా! వివేకానందుని జన్మ దినం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. యువజను లందరికీ అభినందనలు.
 ఈ విశాల విశ్వంలో మన భారత మాత స్వప్రాకాశాన్నిచికాగో మహా సభలో ఆహుతులైన విశ్వ శ్రోతలందరి జ్ఞాన నేత్రం తెరిపించి జిగేల్ మనేలగ చూపిన ఏకైక విశ్వ విజ్ఞాన సంపన్నుడైన వెవేకానందుని జన్మ దినమీనాడె. ఆ మహానుభావుని స్ఫూర్తితో భారతీయ యువత ద్విగుణికృత ఉత్సాహంతో తమ మేథా సంపత్తిని తాము దేశభక్తికి జోడించి దేశానికి ప్రపంచ ప్రఖ్యాతి తేవడం ద్వారా మాతౄణాన్ని తీర్చుకొంటున్నారు. ఈ నాడు ఎందరో భారతీయ యువ మేథావులు తమ విజ్ఞానంతో ప్రపంచన్నంతటినీ ఆకట్టుకోవడమే కాక తమ కృషితో ప్రపంచం ఆశ్చర్యపోయేలాగ చేస్తున్నారనడంలో అత్యుక్తి లేదు.
ఇప్పుడు యువత నెత్తిపై అతి ముఖ్యమైన భారం పడింది.
గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచ మంతా సమ్మిళితమైపొతున్న తరుణంలో ధనిక వర్గాలు అత్యంత వేగవంతంగా తమ పావులను కదిపి, నికృష్టమైన స్వార్థ ప్రయోజనాలే ధ్యేయంగా స్వేచ్ఛగా ఏలుబడి చేస్తోందీ దేశాన్ని. పాశ్చాత్య ధనిక వర్గానికి మన దేశంలో ఉన్న ధనిక వర్గం, రాజకీయ మహా నాయకులు వత్తాసు పలుకుతూ ఉన్న కారణంగా మధ్య తరగతి వారు అత్యంత పేదవారుగాను, పేదవారు జీవచ్ఛవాలుగాను మారుతున్న యదార్థ దృశ్యం  మన కళ్ళకు కట్టుతూనే ఉంది.
ఐతే ఇక్కడే యువత పాత్రయొక్క అత్యంత ఆవశ్యకత మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. స్వార్థ పూరితుల చేతిలో బొమ్మల్లాగా అమాయక యువకులు మారుతున్న యదార్థాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. యువకులు స్వదేశ భక్తిని ప్రగాఢంగా  కలిగి ఉండాలి. దేశ ప్రయోజనాల ముందు స్వార్థానికి తావుండ కూడదు. ప్రాంతీయతా భావ జ్వాలలు దేశ ఆర్థిక సాంఘిక రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న యదార్థ దృశ్యం చూస్తూ కూడా ఉపేక్షిస్తే మన భారతావనికి రక్షణ నిచ్చే వారింకెవరుంటారు?
ఎద్దీనిందంటే పాకలో పెయ్యని కట్టమంటున్న చందంగా యువత ఉండే పరిస్థితి కానే వస్తే ఇంక ఈ దేశాన్ని మళ్ళీ పరాయి దేశస్తులు కైవసం చేసుకోలే రనుకోలేం కదా!
యువశక్తికి మించిన శక్తి మరొకటి లేదు. యువత నడుం బిగించండి. స్వార్థాతీతంగా మన భరతమాతకు అండ దండగా నిండుగా ఉండి మీశక్తి సామర్థ్యాలని సద్వినియోగం చేసుకోండి.
సదసద్వివేక సంపన్నులైన మీకు చెప్ప వలసిన పని లేదు.
మరపును దరి చేరనీయకండి. వివేకానందుని ఆదర్శ భావాలను ఆకళింపు చేసుకొన్న మహా జ్ఞానులైన మీ రేదిచేస్తే బాగుంటుందో, అది మీకన్నా ఎవరికీ ఎక్కువ తెలియదు. అందుచే మీరే స్వయం నిర్ణయాధికారం కలిగి ప్రణాళికలేర్పరచుకోండి. మీ వెవేక చంద్రికలు భరతమాతకు చల్లని ప్రశాంత వాతావరణం కల్పించఁ గలగాలి.
ఈ శుభ సందర్భంలో భారతమాత ముద్దు బిడ్డలైన యువజను లందరికీ మరొక్కమారు అభినందనలు తెలియఁజేస్తున్నాను. విజయోస్తు.
జైభారత్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.