గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 13/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
145.చటుకునఁ బెల్లు రేఁగినపిశాచ నిశాచర కోటి పీచ మా 
ర్చుటకయి సల్పు కయ్యములలోఁ బలు చోటులఁ బడ్డ గాయముల్ 
సొట సొట నెత్తురుల్చిదుముచున్మొయిలంచుననెఱ్ఱఁబారెనో!
స్ఫుటిత నవారుణ ప్రభలు సుందరముల్ పరమాత్మ తత్వముల్!
146.అమృత సమృద్ధి కాంతి!నిగమాంతములేనిగనంగ లేవు నీ
సముదయ దీప్తి వైభవము చాయ! యనంగ నబోధ చింతన
క్రముఁడ నెఱుంగ శక్యమె? యఖండ రమాయిత పద్మజాండ!వే
యి మొగము లీను వెల్గు దొర! ఈశ్వర మౌళి కలా వతంసమా!
147.వెలుఁగులుతేరఁటే!నడపువీరుఁడుపిచ్చుకకుంటు!బాగు!పో
వలసిన దవ్వనంతమఁటె!పాఱుటకుండలు రెండులేవఁటే!
అలఘు మనో జవాధిక రయంబున సత్ పథి సాగునట్టె, ఆ
జలజ ముఖీ సుఖంకరుఁడు! సౌరము సర్వ గతి స్వరోచియౌ!
148.నిను రూపింపఁగ లేరులోకహితకాంతీ!సుంతయేనిన్దమో
ఘన భల్లూక మహాటవీ జనము దుఃఖ ప్రాప్త సంచారులై
యిన సాహస్ర ఫణీ! మహా ద్యుమణి! రాశీభూత చింతాఘృణీ!
కనుజూపున్ దయ సేయవే! త్రి జగతీ కల్యాన రమ్యాకృతీ!
149.కనకన లాడు నిప్పు ఖర కాంతులతో వెదఁజల్లు, దంత లో
జినుకుదు చందనాతి మృదు శీతలమౌ చిఱు వాన జల్లు! నే
మనుకొనఁ జెల్లు! నీ మధు మయ ప్రకృతి ప్రియ వృత్తి, లోక రం
జన! జన చేతనాభ్యుదయ సంస్కృతి భూషణ! నిత్య తోషణా!
150.చరచర లక్క దారములు సాగిన యట్టులు ప్రొద్దు గట్టుపై
పరగె నవారుణాంశువులు బంగరువుల్ జన లోక బంధువుల్
గిరి శిఖరాగ్ర దీపములు శ్రీమదమేయ శుభ ప్రభావముల్
సరసిజ హాస మూలములు చారు రవ స్ఫుట తామ్ర చూడముల్! 
151.ఉదయాస్తాచల పుణ్య రూపవసతీ! ఓంకార తత్వ ద్యుతీ! 
త్రిదశానేకప కుంభ రంగ నటన క్రీడా కుసుంభాకృతీ!
మదిరాలోల విలాసినీ నయన తామ్ర ప్రాంశు రమ్యావృతీ!
యిదె పూ దోయిలి! స్వీకరింపఁ గదె! తండ్రీ! విప్పి కన్దమ్ములన్!
152.సుకపడుటన్న దేమయినఁ జూచితివా? గడె సేపు నిల్వ, వే
యొక యెడ! నీడపట్టయిన ఓపి యెఱుంగవె! యెంతసేపు నే
రికొ తెక తేర సేవ పొనరించుటయే పరమార్థమా? సహ
స్ర కిరణ!ఋగ్యజుఃస్ఫురణ!సామ జగద్భరణైక కారణా!
153.నినుజూతున్,గనువిచ్చిచూతు!సవితా!నీవేవెలుంగుల్గనుం
గొనెదన్, గన్నులు, వెన్నెలల్ విరియ నీ కొల్వున్ సమీక్షించెదన్!
కను విందుల్ గనకాంబర ద్యుతులు నీ కాంతుల్ విలోకింతు! నా
కనులీవే! చన వీవె! నా పసిడివే!కల్యాణ కామ్య చ్ఛవీ!
154.పరయగుపింపదే!యెటులఁబ్రాకెనిటుల్గనుగప్పి,యేమి చీ
దర, పరమాదర ప్రభువు, తామరస ప్రియ దైవతమ్ము, నా
తిరుమణి రేఖ కన్నెదుర దివ్య విభుతి వెలుంగ! వెల్గుతో
పరపర గోసి, చూపొసఁగి, పాయస మానిన హాయిఁ గూర్పడే?
155.అరుణ ఘృణీ! హిరణ్మయ మహా మణి హార మరీచి చక్ర భా
సుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదప శైల తోయధీ!
కిరణ రుచి ప్రియా! జలజ కేసర వర్ణ మహోదయా! తమో
హర! హర మౌళి లాలస వియత్తటినీ విచల త్తరంగమా!
156.ఒక పరి స్వర్ణ శైల శిఖరోన్నత శృంగము పైన నిల్తు, వే
రొక పరి భీకరాకుల మహోరగ ఫూత్కృత లోక గహ్వరాం
తికమున నిల్తు, వా వెలుగు నీడల తత్వ మదేమొ? కాననే
తికమక చెందుచున్, ఋత గతీ! కనుచూపు నొసంగి కావవే!
157.అది యేమో! ఒక నాడు లొకమది, ఊహాతీత సౌందర్య సం
పదతో భూతల స్వర్గమట్లు బహు శోభల్ చిమ్మె కందోయికిన్,
అదియే ఆరని మంచు కూరినటులై, అందమ్ము కోల్పోయి అం
దదుకుల్గా అగుపించు నేడు విధి లీలా? చూపులో లోపమా!
158.చీమమొదల్సటాజటిలసింహముదాకసమస్త జంతువుల్
నీ మసృణారుణ ద్యుతులనే తలపోయుదు రెల్ల వేళలన్.
స్వామికి తీపి పాయస ముపాయన మిత్తురు బత్తిఁ జేసి, నీ 
గోము, హొరంగు, నీటు వెలుఁగొందఁగ నెత్తుదు రాత్మ దీపముల్! 
సంపూర్ణం.
Print this post

1 comments:

durgeswara చెప్పారు...

అద్భుతం .ఆమహాకవి భావనామృతం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.