గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 3 వ భాగము.


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (3 వ భాగము)

యత్పురుషేణ హవిషా,  దేవా యజ్ఞ మతన్వత,వసన్తో అస్యాసీ దాజ్యమ్, గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవి:. సప్తా స్యాసన్పరిధయ:, త్రి స్సప్త సమిథ: కృతా:, దేవ య ద్యజ్ఞం  తన్వానా:, అబధ్న న్పురుషమ్పశుమ్, తం యజ్ఞం బర్‍హిషిప్రౌక్షన్, పురుషం జాతమగ్రత:. ౩. 
ప్రతి పదార్థము:-
యత్ = ఎప్పుడు, 
దేవా: = దేవతలు, 
పురుషేణ = పురుషుడను పేరు గల,
హవిషా = హవిస్సు చేత,
యజ్ఞమ్ = యజ్ఞమును, 
అతన్వత = చేసిరో, 
తత్ = అప్పుడు, 
అస్య = ఈయజ్ఞమునకు, 
వసంత: = వసంత ఋతువే,
ఆజ్యమ్ = నేయి గాను, 
గ్రీష్మ: = గ్రీష్మ ఋతువే, 
ఇద్మ: = కట్టెలుగాను, 
శరత్ = శరదృతువే, 
హవి: = హవిస్సుగాను, 
ఆసీత్ = ఆయెను, 
అస్య = ఈ మానవ యజ్ఞమునకు, 
సప్త = ఏడైన గాయత్ర్యాదిఛందస్సుల, 
పరిధయ: = ఎల్లలు, 
ఆసన్ = ఆయెను, 
త్రెస్సప్త సమిధ: = ఇరువదియొక్క సమిధలు, 
కృతా: = చేయఁబడినవి, 
దేవతా: = దేవతలు, 
యత్ = ఎప్పుడు, 
యజ్ఞమ్ = సాంకల్పిక యజ్ఞమును, 
తన్వానా: = చేయువారలై, 
పురుషమ్ = విరాట్‍పురుషునే, 
పశుం = యజ్ఞపశువుగా, 
అబధ్నన్ = కట్టిరో, 
అగ్రత: = సృష్టికి పూర్వము, 
జాతమ్ = పుట్టినవాడు, 
యజ్ఞమ్ = యజ్ఞ సాధనమైన, 
తం పురుషమ్ = ఆ విరాట్ పురుషుని, 
బర్హిషి = మానస యజ్ఞమునందు, 
ప్రౌక్షన్ = ప్రౌక్షించిరి.
దండాన్వయము:-
ఎప్పుడు దేవతలు పురుషుఁడను పేరు గల హవిస్సు చేతను, యజ్ఞమును చేసిరో అప్పుడు ఈ యజ్ఞమునకు వసంత ఋతువే నేయి గాను, గ్రీష్మ ఋతువే కట్టెలు గాను, శరద్ ఋతువే హవిస్సు గాను ఆయెను. ఈ మానస యజ్ఞమునకు ఏడైన గాయత్రాది ఛందస్సుల ఆయెను. ఇరువది యొక్క సమిధలు చేయఁబడినవి. దేవతలు ఎప్పుడు సాంకల్పిక యజ్ఞమును చేయువారలై విరాట్ పురుషునే యజ్ఞ పశువునుగా కట్టిరో, సృష్టికి పూర్వము పుట్టిన వాడును యజ్ఞ సాధనమైన ఆవిరాట్ పురుషుని మానస యజ్ఞమునందు ప్రోక్షించిరి.
సీ:-ఎప్పుడు పురుషుని నెన్ని హవిస్సుచే
యుచు యజ్ఞములను జేయును దివిజులు
అప్పుడట వసంతు డగు నాజ్యముగ.
గ్రీష్మమగునిధ్మముగ, శరత్తగు హవిస్సు.              
ఏడు ఛందములగు నెల్లలుగ, నవియు
నిరువది యొక్కటై నిరుపమగతిఁ
జేయఁబడె సమిధలై యలరునటుల
సంకల్ప యజ్ఞముఁ సలుపఁ దివిజు
గీ:-
లా విరాట్టుఁ బశువుగాఁగ యతనిఁ గట్టి,
సృష్టి కిని పూర్వుఁడగు వాని, సేవ్యమాన
యజ్ఞ సాధకునాతని యజ్ఞమందు
ప్రోక్షణము చేసిరి దివిజు లాక్షణమున. 3.
వివరణ:-
ముందు విరచించిన ప్రకారము దేవ శరీరములు పుట్టిన తర్వాత ఉత్తర సృష్టి సిద్ధించుటకై దేవతలు అందులకు సాధనముగ నొక యాగమును జేసిరి.  అప్పటి బాహ్య ద్రవ్యములు కలుగక పోవుట చేత వేరొక హవిస్సు  లేకపోవుట వలన బురుష స్వరూపమునే మనస్సు నందు యజ్ఞమున హవిస్సుగా భావించి మానస యజ్ఞము నెప్పుడు చేసిరో అప్పుడట్టి యజ్ఞమునకు ఆజ్యమునకు వసంత ఋతువును, సమిధలకు గ్రీష్మ ఋతువును, పురోడాశాది హవిస్సునకు శరదృతువును భావించుకొనిరి.  ఈ యజ్ఞమునకు ఛందస్సులు ఏడు ఎల్లలుగాను, ఆ ఏడును ఇరువదియొక్కటిగా చేయబడినవి. ఆ ఇరువదియొక్క పదార్థములే సమిధలుగా భావింపఁబడినవి.  బ్రహ్మ యొక్క ప్రాణేంద్రియ స్వరూపములైన దేవతలు మానసికముగా యజ్ఞమును చేయువారై పశువుగ విరాట్టును భావించి యూపమునకు గట్టిరి. ఆ యజ్ఞ సాధనము సృష్టికి పూర్వమును జనించినవాడునగు విరాట్పురుషుడను పశువును విశసించిరి.
ఇది 3 వ భాగము. (స శేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.