గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2010, శుక్రవారం

కరుణామృత వర్షిణి భవాని.(కంద,గీత, గర్భ చంపకమాల)

భక్త బంధువులారా!
కరుణాంతరంగయగు ఆ జగన్మాత వర  కటాక్ష ప్రభావము నా చేత ఈ కంద గీత గర్భ చంపక మాలా వృత్తమును వ్రాయించినది. ఈ ఆనందమును మనసున దాచుకొన జాలని నా తొందర మీ ముందీ పద్యాన్ని ఉంచటానికి కారణమయింది. తప్పులున్న అవి నా అజ్ఞానపు గురుతులు. అనందామృత లేశమైనా అది జగన్మాత కరుణకు గురుతులు. చదివి, ఆయమ కృప నెఱుంగుదురు గాక.
కం.గీ.గర్భ
చll
నిను దరిచేరుచున్, మదిని ని న్నరయంగనె మమ్ముఁ గాంచి, హా
యి నొసగెదే సదా! మదికి నీశ్వరి! తృప్తిని, మా కొసంగి, యీ
శుని కరుణారుణా ప్రథిత సుందర రూపముఁ భావమందు దా
ల్పను గనెదే! కృపన్. గనఁగ భావ్యమటంచును గాంచఁ జేతువే.
గీll
మదిని ని న్నరయంగనె మమ్ముఁ గాంచి
మదికి నీశ్వరి! తృప్తిని, మా కొసంగి
ప్రథిత సుందర రూపముఁ భావమందు 
గనఁగ భావ్యమటంచును గాంచఁ జేతు.
కll
దరిచేరుచున్, మదిని ని 
న్నరయంగనె మమ్ముఁ గాంచి, హాయి నొసగెదే ! 
కరుణారుణా ప్రథిత సుం
దర రూపముఁ భావమందు దాల్పను గనెదే !
>మీ అమూల్యమైన సమయము నిది చదువుటకు వెచ్చించిన మీకు అ యమ్మ కరుణ లభించును గాక.<
జైహింద్. Print this post

4 comments:

కథా మంజరి చెప్పారు...

చంపక మాలను, యందున
సొంపుగ నొక కంద పద్య సుమమును జొనిపీ
యింపుగ రచియించితిగద !
గుంపులు గుది గుచ్చినావు గురు గీతమ్మున్

తెలుగుకళ చెప్పారు...

అపురూపమీ పద్యకుసుమం
అనన్యసామాన్యమీ భావజాలం


జగజ్జనని కరుణాకటాక్ష వీక్షణాలు మీ పట్ల సదా వర్షించాలని ఆశిస్తూ..
తెలుగుకళ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సహోదరా! జోగారావూ!
ఆ:-
ఒక్క పద్యమందు నొప్ప నన్నిటిఁ జేర్చి
చెప్పు నేర్పు, నీవె మప్పినావు.
కంద తేటగీతి కమనీయ చంపకం
బందు నమరె ప్రేమ బంధురముగ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! మీ ఆదరణకు ధన్యవాదములు.
ఆ:-
తెలుఁగు కళను మీరు తేట పరచఁ గోరి
తెలుఁగు కళగ వెలసి, తెలుగు కవుల
కవిత లందు కలుగు కమనీయ భావాలు
ఒకటి నూరు చేసి, ఒనరఁ జేసె.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.