గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ఆంధ్రామృతముఁ గ్రోలు పాఠకులను ఆది దంపతులు రక్షించుఁగాక.

శ్లో:-
కస్త్వం ? శూలీ. మృగయ భిషజం. నీల కంఠ ప్రియేహం
కేకామేకం కురు. పశు పతిర్నైవ దృశ్యే విషాణే
స్థాణుర్ముగ్ధే నవదతి తరు: జీవితేశశ్శివాయ:
గచ్ఛాటవ్యాం ఇతి హత వచ: పాతువశ్చంద్రచూడ:
 . . . . . . సీll
పార్వతి:- ఎవరివయ్యా నీవు?
శివుఁడు:-ఎఱుగుమా శూలిని.
పార్వతి.:-శూలివా? తగు మందు చూచి, గొనుమ!
 . . . . . . (శూల= బాధ.;శూలి=తలనొప్పితో బాధ పడుచున్నవాఁడు)
శివుఁడు:-నీల కంఠునిగదే? ఏలనే కినుకయు?
 .. . . . . .(నీలికంఠుఁడు=నీలమైన కంఠముఁగలవాడు. నెమలి.)
పార్వతి.:-నెమలి కూతను కూసి నిలుమ! కనుదు!
శివుఁడు:-పశుపతినే!
పార్వతి.:-లేవు పశువు కొమ్ములు నీకు?
శివుఁడు:-స్థాణు వేనుగ!.(స్థాణువు= కదలనిది=చెట్టు)
పార్వతి.:-వృక్ష జాతి వగుదొ?
శివుఁడు:-శివుడనేను.;పతిని!
పార్వతి.:-శివుడన్న నక్కగా!(శివ=నక్క)
 . . . .  . .ఆడవి తిరుగ రాదె? నుడువులేల?
 . . . . . . గీll
 . . . . . . ఆది దంపతు లిట్టుల యద్భుతముగ
 . . . . . . సరస సల్లాపములఁ దేలు సమయమందు
 . . . . . . భ్రాంతి నాంధ్రామృతముఁ గ్రోలు పాఠకులను
 . . . . . . కాచి రక్షించుఁ గావుత! కాంక్ష తీర.
జైహింద్.
Print this post

5 comments:

తెలుగుకళ చెప్పారు...

శివ పార్వతుల సరస సంభాషణల్లో మాకు కొత్త పదాలు తెలిపారు. ధన్యవాదాలు.

పంతుల జోగారావు చెప్పారు...

చాల బాగుంది.

కామేశ్వరరావు చెప్పారు...

బాగుందండి. ఇలాంటిదే కృష్ణుడి గురించిన శ్లోకం:

అంగుల్యాకః కవాటం ప్రహరతి కుటిలే? మాధవః, కిం వసంతః?
నో చక్రీ, కిం కులాలో? నహి ధరణిధరః, కిం ద్విజిహ్వః ఫణీంద్రః?
నాహం ఘోరాహి మర్దీ, కిమసి ఖగపతిః? నో హరిః, కిం కపీంద్రః?
ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జితః పాతువశ్చక్రపాణిః!

ఊకదంపుడు చెప్పారు...

కామేశ్వర రావు గారు, ఈ టపా జూసి నే రామకృష్ణారావు గారిని అడుగుదామనుకున్న శ్లోకం మీరు చెప్పేశారు, నెనర్లు,

రవి చెప్పారు...

చాలా బావుంది. కామేశ్వరరావు గారి శ్లోకం, "కస్తూరీ తిలకం", "అంగనామంగనామంతరే మాధవో.." వంటి శ్లోకాలు వ్రాసిన లీలాశుకుల (బిల్వమంగళుడు) వారిది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.