గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 1 వ భాగము.

2 COMMENTS

ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము 
హరి: ఓమ్ సహస్ర శీర్‍షా పురుష:, సహస్రాక్ష స్సహస్ర పాత్, స భూమిం విశ్వతో వృత్వా, అత్య తిష్ఠ ద్దశాఙ్గులమ్, పురుష ఏవేదగ్ం సర్వమ్, యద్భూతం యచ్చ భవ్యమ్, ఉతామృతత్వస్యేశాన:, య దన్నే నాతిరోహతి, ఏతావానస్య మహిమా, అతో జ్యాయగ్‍శ్చ పురుష:. ౧ 
ప్రతిపదార్థము:-
సహస్ర శీర్షా = వేయి తలలు కలవాడును, 
సహస్రాక్ష: = వేయి కన్నులు కలవాడును, 
సహస్ర పాత్ = వేయి పాదములు కలవాడును అగు, 
స: పురుష: = ఆ పురుషుడు, 
(సమస్త ప్రాణ రూపమై బ్రహ్మాండాకారము గల విరాట్టు)   భూమిం = పృథివిని,
విశ్వతో వృత్యా = అంతటను ఆక్రమించుకొని,
దశాఙ్గులమ్ = పది యంగుళముల కొలత గల శరీరమును,
అత్యతిష్ఠత్ = కమ్ముకొని యుండెను.
యత్ = ఏది,
భూతం = జరిగిపోయినదో,
యత్ =ఏది,
భవ్యంచ = జరుగఁ బోవునదియో,
(యత్ = ఏది)
ఇదం = జరుగుచున్న ప్రపంచమో,
తత్ = ఆ,
సర్వమ్ = సమస్త లోకమును,
పురుషఏవ = విరాట్‍పురుషుడే.
ఉత = మఱియు,
అమృతత్వస్య = దేవత్వమునకు,
ఈశాన: = ప్రభువైన,
అయం = ఈ పురుషుడు,
అన్నేన = అన్నము చేత,
అతిరోహతి = మీఱి పొందు చున్నాడు.
ఏతావాన్ = ఇదంతయును,
అస్య = ఈ పురుషుని యొక్క,
మహిమా = సామర్థ్య విశేషము.
పురుష: = పరమాత్మ,
అత: = ఈ మహిమ కన్న,
జ్యాయాంశ్చ = మిగుల నధికుడు.
దండాన్వయము:-
వేయి తలలు కలవాడును, వేయి కన్నులు కలవాడును, వేయి పాదములు కలవాడును, ఆపురుషుడు పృథివిని అంతటనాక్రమించుకొని పది యంగుళముల కొలత గల శరీరమును కమ్ముకొని యుండెను. ఏది జరిగిపోయినదో, ఏది జరుగ బోవునదియోఏది జరుగుచున్న ప్రపంచమో, ఆ సమస్త లోకమును విరాట్ పురుషుడే. మఱియు దేవత్వమునకు ప్రభువైన ఈ పురుషుడు అన్నము చేత మీరి పొందు చున్నాడు.ఇదంతయును ఈ పురుషుని యొక్క సామర్ధ్య విశేషము.పరమాత్మ ఈ మహిమ కన్న మిగుల నధికుడు.
సీ:-
వేయి తలలు గల్గి వేయి కన్నులు గల్గి,
వేయిపాదములను వెలయువాడు.
అట్టి పురుషు డతం డవని నంతట నిండి,
పది యంగుళ శరీర పరిధి నమరె.
జరిగి పోయినదియు, జరుగఁబోవు నదియు,
జరుగుచున్నయదియు చక్క నతడె.
దేవాదిదేవుఁడీ దివ్యుఁడన్నము చేయ
మీరి పొందుచు నుండె మేల్తరముగ.
గీ:-
ఇట్టి దంతయు నీతని దిట్ట తనము.
పట్టి చూడగ పరమాత్మ గట్టి వాడు
దీని కన్నను వే రెట్లు దిట్ట యతడు.
పురుష సూక్తము తెలుపు నీ బోధఁ గనుడు. 1.
వివరణ:-
ఈ లోకమందు ఎల్ల ప్రాణులును పరమాత్మ యొక్క విరాడ్రూపమునం దుండుట వలన ఆ ప్రాణుల శిరస్సు మొదలగు నవయవములు పరమాత్మవి గనుకనే ఆ పరమాత్మ అనేక తలలు గలవాడును,  అనేకమైన కన్నులు గలవాడును, అనేకమైన పాదములు గలవాడును అగుచున్నాడు. అట్టి పరమాత్మయే బ్రహ్మాండ రూపమైన భూగోళ మంతటను ఆవరించుకొని బ్రహ్మాండము వెలుపల గూడా వ్యాపించి యున్నాఁడు. ఆ పరమాత్మ భూత భవిష్య ద్వర్తమానాత్మకమైన సమస్త ప్రపంచముగానగుచున్నాడు.   మఱియు నీ పరమాత్మ స్వయం ప్రకాశమాన మగు అమృతత్వమునకు ప్రభువై జీవులకు అన్నమను కారణముచే స్వకీయ కారణావస్థను అతిక్రమించి ఈ చూడంబడెడి జగ దవస్తను పొందుచున్నాడు.  ఇట్లు పరమాత్మ కర్మ ఫలమనుభవించు జీవుల యొక్క జగదవస్థను అన్నమను నిమిత్తముచే పొందుటయే కాని ఆ యీశ్వరునకు నిజముగా ఈ యవస్థ లేదు. అతీతానాగత వర్తమాన రూపమైన ఈ జగత్తు ఎంత కలదో ఇది అంతయు ఆ పరమాత్మ యొక్క స్వకీయమగు సామర్ధ్యాతిశయమేను.  పరిపూర్ణుడగు పరమాత్మ ఈ యగపడు తన శక్తి కన్న మిగుల నెక్కువయిన వాడు. ఇది 1 వ భాగము. (సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.