గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2008, సోమవారం

కవి సమ్రాట్ విస్వనాధ భావుకత 10

కవి సమ్రాట్ విశ్వనాధవారు కల్పవృక్షంలో గుంభనగా పొదివిన భావుకతను కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వెలువరిస్తూ చేసిన ఉపన్యాసంలో 10 వ పద్యంలోని భావుకతనిప్పుడు తెలుసుకొందాం.

రామాయణ కల్ప వృక్షము - కిష్కింధా కాండ - నూపుర - 10.
తేటగీతి:-
పెనగొనియె నిందు నశ్వత్థ వృక్షకంబు
నింబ వృక్షమ్ము. మిన్ను పూనినది తాళ
ముం బెనంగొనె నిచ్చటభువిని కూట
ములు పవిత్రములపవిత్రములు స్ఫురింప.

శ్రీ రాముడు సీత జాడను వెదుకుతూ పంపా అరణ్య భూముల్లో సంచరిస్తున్నాడు. వసంత సౌందర్య సముపేతమైన అరణ్య భూముల్లోని ప్రకృతిని వీక్షిస్తూ ముందుకు సాగుతున్న రాముని మనః స్థితి మనం విశ్వనాధ భావుకత ద్వరా ఈ పద్యంలోనిది తెలుసుకొంటున్నాం.

ఆ వనములో ఒకచోట వేప చెట్టుతో పెనవేసుకొని పెరిగిన రావి చెట్టు కనిపించినది. శ్రీ రాముడు కొంచెం తల పైకెత్తి చూడగానే ఆ చెట్లను ఒక టాళ వృక్షము కూడా పెనవేసుకొన్నదట. ఈ సమాగమము రామునకు పవిత్ర అపవిత్ర కూటములను స్ఫురింప జేసినది అని కవి వర్ణించెను.

అశ్వత్థ ( రావి ) నింబ ( వేప ) వృక్షములు మన దేశీయులకు దేవతా వృక్షముల వంటివి. ప్రాణ వాయువును శుద్ధి చేయుటలో యీ రెండు వృక్షములూ గొప్ప సామర్ధ్యము కలవని విజ్ఞాన శాస్త్ర వేత్తలు నేడు అంగీకరిస్తున్నారు కూడా. మన పూర్వులు యీ రావి, వేప చెట్లకు పెండ్లి చేసే వారు. వేప చెట్టు అమ్మవారు. రావి చెట్టు నారాయణుడు. భగవద్గీతలో విభూతి యోగంలో " అశ్వద్ధ స్సర్వ వృక్షాణాం " అని సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మయే చెప్పి యున్నాడు.

పవిత్ర ప్రదేశాలలో ఒకే పాదున వేప రావి చెట్లను పెంచుతారు. ఇది మన సంప్రదాయం. ఇది ఆది దంపతుల అన్యోన్యతకు ప్రతీక. ఒకప్పుడు ఇది క్రతు ధాత్రి. కనుక యీ చెట్లు కలయిక పవిత్రముగా కంపించినా ఇప్పుడా క్రతు ధాత్రి అడవి అయిపోయిన కారణంగా ఆ చెట్లతో ఒక తాళ వృక్షం పెన వేసుకొన్నది. అది అపవిత్ర కూటమి అయినది. ఈ వర్ణన వలన జానకీ రాముల పవిత్ర దాంపత్యము, వారి జీవితములందు ప్రవేశించిన రావణుని దౌష్ట్యము ఈ అపురూప భావన ద్వారా కవి తెలియ జేయు చున్నాడు.

విశ్వనాధ సంప్రదాయ వాదిగా పేరు తెచ్చుకొన్న కవి. జతీయత సంప్రదాయకత ఆయన కలానికి తిరుగు లేని శక్తి. ఆయన యెన్ని గ్రంధాలు రచించినా అన్నింటిలో జాతీయ సంప్రదాయ నిష్ఠలనే సందేశముగా చూపినాడు. ఏచిన్న అవకాశం దొరికినా విశ్వనాధ దానిని తన పంథాకు అనుగుణంగా వర్ణిస్తూనే వుంటాడు. ఇది మహా కవి లక్షణం. తన జీవిత కాలం ఒక లక్ష్యం వైపే ప్రయాణిస్తూ గొప్ప రచనలు చేసిన విస్వనాధ తెలుగు వారు గర్వింగా చెప్పుకొనే మహా కవి.
" స్వస్థాన వేష భాషాభిమతా స్సంతో రస ప్ర లుబ్ధ ధియః
సాధ్యోహి రసోః యథా తథం కవిభిః "
అన్న ఆలంకారిక వాకాలకు విశ్వనాధ జీవితం, ఆయన కావ్య జీవితం రెండూ గొప్ప ఉదాహరణలు.
ప్రస్తుత సమయంలో ఈ వర్ణన శ్రీ రాముని నిర్వేద స్థితిని సూచిస్తున్నది.

చూచారుకదా! కవివతంస కవిసమ్రాట్ భవుకతను ఎంత అద్భుతంగా వివరించారో. మరో పద్యాన్ని సమయం చిక్కినప్పుడు చెప్పుకొందాం. శ్రీ బులుసువారు విశాఖ జిల్లాలో చిట్టి వలస గ్రామంలో యి.యస్.ఐ. హాస్పటల్ వద్ద కల్ప వృక్షం అనే స్వ గృహంలో నున్నారు.పిన్:-531 162. నేరుగా మనం వారిని లేఖాముఖగా అభినందించ వచ్చు.
జైహింద్. Print this post

5 comments:

కామేశ్వరరావు చెప్పారు...

రామకృష్ణగారు,
విశ్వనాథ కల్పవృషంలోని పద్యాలని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
బులుసు వేంకటేశ్వర్లుగారి ఉపన్యాసం విజయనగరంలో ఒకసారి విన్నాను. మంచి వక్త!
రామాయణకల్పవృక్షం వ్యాఖ్యతో(కనీసం టీకా తాత్పర్యాలుతో) ఎవరైనా ప్రచురించారా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నమస్తే.
నా బ్లాగును చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ జెస్తున్నందుకు ధన్య వాదములు.

ఉత్పలమాల:-
భైరవభట్ల వర్ధనుడ! ప్రస్ఫుటమాయెను మీమనంబు, సద్
గౌరవ భావ సంపద. ప్రగాఢ మహాద్భుత కావ్య దృష్టియున్.
ధీర వరేణ్యు లెవ్వరును తీరిక తోడుత కల్ప వృక్షమున్
కోరి లిఖింప లేదిలను కోరిన వ్యాఖ్య. లభింప దెయ్యెడన్.

చింతా రామ కృష్ణా రావు.

Bolloju Baba చెప్పారు...

రామకృష్ణ గారు
అద్బుతంగా ఉంది మీ పద్యం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బాబాజీ1 ధన్య వాదాలండీ.

కందము:-
బొల్లోజు వారి పలుకులు
తెల్లంబుగజేయు నతని తీయని మనమున్.
యెల్లరి మెప్పుగ పలుకుట
యుల్లము పొంగించుట, హృద యోన్నతి తెలుపున్.

Bolloju Baba చెప్పారు...

ఏం మాట్లడాలో తెలియటంలేదండి.

మీ విధ్వత్తుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.