గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2010, సోమవారం

ఓం నమో నారాయణాయ. తెలుగులో పురుష సూక్తము

ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము 
హరి: ఓమ్ సహస్ర శీర్‍షా పురుష:, సహస్రాక్ష స్సహస్ర పాత్, స భూమిం విశ్వతో వృత్వా, అత్య తిష్ఠ ద్దశాఙ్గులమ్, పురుష ఏవేదగ్ం సర్వమ్, యద్భూతం యచ్చ భవ్యమ్, ఉతామృతత్వస్యేశాన:, య దన్నే నాతిరోహతి, ఏతావానస్య మహిమా, అతో జ్యాయగ్‍శ్చ పురుష:. ౧ 
ప్రతిపదార్థము:-
సహస్ర శీర్షా = వేయి తలలు కలవాడును, 
సహస్రాక్ష: = వేయి కన్నులు కలవాడును, 
సహస్ర పాత్ = వేయి పాదములు కలవాడును అగు, 
స: పురుష: = ఆ పురుషుడు, (సమస్త ప్రాణ రూపమై బ్రహ్మాండాకారము గల విరాట్టు)
భూమిం = పృథివిని,
విశ్వతో వృత్యా = అంతటను ఆక్రమించుకొని,
దశాఙ్గులమ్ = పది యంగుళముల కొలత గల శరీరమును,
అత్యతిష్ఠత్ = కమ్ముకొని యుండెను.
యత్ = ఏది,
భూతం = జరిగిపోయినదో,
యత్ =ఏది,
భవ్యంచ = జరుగఁ బోవునదియో,
(యత్ = ఏది)
ఇదం = జరుగుచున్న ప్రపంచమో,
తత్ = ఆ,
సర్వమ్ = సమస్త లోకమును,
పురుషఏవ = విరాట్‍పురుషుడే.
ఉత = మఱియు,
అమృతత్వస్య = దేవత్వమునకు,
ఈశాన: = ప్రభువైన,
అయం = ఈ పురుషుడు,
అన్నేన = అన్నము చేత,
అతిరోహతి = మీఱి పొందు చున్నాడు.
ఏతావాన్ = ఇదంతయును,
అస్య = ఈ పురుషుని యొక్క,
మహిమా = సామర్థ్య విశేషము.
పురుష: = పరమాత్మ,
అత: = ఈ మహిమ కన్న,
జ్యాయాంశ్చ = మిగుల నధికుడు.
దండాన్వయము:-
వేయి తలలు కలవాడును, వేయి కన్నులు కలవాడును, వేయి పాదములు కలవాడును, ఆపురుషుడు పృథివిని అంతటనాక్రమించుకొని పది యంగుళముల కొలత గల శరీరమును కమ్ముకొని యుండెను. ఏది జరిగిపోయినదో, ఏది జరుగ బోవునదియోఏది జరుగుచున్న ప్రపంచమో, ఆ సమస్త లోకమును విరాట్ పురుషుడే. మఱియు దేవత్వమునకు ప్రభువైన ఈ పురుషుడు అన్నము చేత మీరి పొందు చున్నాడు.ఇదంతయును ఈ పురుషుని యొక్క సామర్ధ్య విశేషము.పరమాత్మ ఈ మహిమ కన్న మిగుల నధికుడు.
సీ:-
వేయి తలలు గల్గి వేయి కన్నులు గల్గి,
వేయిపాదములను వెలయువాడు.
అట్టి పురుషు డతం డవని నంతట నిండి,
పది యంగుళ శరీర పరిధి నమరె.
జరిగి పోయినదియు, జరుగఁబోవు నదియు,
జరుగుచున్నయదియు చక్క నతడె.
దేవత్వప్రభువు డీదివ్యు డన్నము చేత
మీరి పొందుచు నుండె మేల్తరముగ.
గీ:-
ఇట్టి దంతయు నీతని దిట్ట తనము.
పట్టి చూడగ పరమాత్మ గట్టి వాడు
దీని కన్నను వే రెట్లు దిట్ట యతడు.
పురుష సూక్తము తెలుపు నీ బోధఁ గనుడు. 1.
వివరణ:-
ఈ లోకమందు ఎల్ల ప్రాణులును పరమాత్మ యొక్క విరాడ్రూపమునం దుండుట వలన ఆ ప్రాణుల శిరస్సు మొదలగు నవయవములు పరమాత్మవి గనుకనే ఆ పరమాత్మ అనేక తలలు గలవాడును,  అనేకమైన కన్నులు గలవాడును, అనేకమైన పాదములు గలవాడును అగుచున్నాడు. అట్టి పరమాత్మయే బ్రహ్మాండ రూపమైన భూగోళ మంతటను ఆవరించుకొని బ్రహ్మాండము వెలుపల గూడా వ్యాపించి యున్నాఁడు. ఆ పరమాత్మ భూత భవిష్య ద్వర్తమానాత్మకమైన సమస్త ప్రపంచముగానగుచున్నాడు.   మఱియు నీ పరమాత్మ స్వయం ప్రకాశమాన మగు అమృతత్వమునకు ప్రభువై జీవులకు అన్నమను కారణముచే స్వకీయ కారణావస్థను అతిక్రమించి ఈ చూడంబడెడి జగ దవస్తను పొందుచున్నాడు.  ఇట్లు పరమాత్మ కర్మ ఫలమనుభవించు జీవుల యొక్క జగదవస్థను అన్నమను నిమిత్తముచే పొందుటయే కాని ఆ యీశ్వరునకు నిజముగా ఈ యవస్థ లేదు. అతీతానాగత వర్తమాన రూపమైన ఈ జగత్తు ఎంత కలదో ఇది అంతయు ఆ పరమాత్మ యొక్క స్వకీయమగు సామర్ధ్యాతిశయమేను.  పరిపూర్ణుడగు పరమాత్మ ఈ యగపడు తన శక్తి కన్న మిగుల నెక్కువయిన వాడు.
పాదోzస్య విశ్వ భూతాని, త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుష:, పాదోzస్యేహాభవా త్పున:, తతో విష్వ ఙ్వ్య క్రామత్, నాశనానశనే ఆభి, తస్మాద్విరాడజాయత, విరాజో అధిపురుష:, సజాతోzత్యరిచ్యత, పశ్చాద్భూమి మధో పుర:. ౨.  
ప్రతిపదార్థము:- 
విశ్వ భూతాని = ఎల్ల భూతములును 
పాదోzస్య = ఈ పరమాత్మ యొక్క నల్గవ భాగము. 
త్రిపాదస్యామృతం = ఈ పరమాత్మయొక్క మిగిలిన మూడు భాగములు నాశము  కానిదియైన
దివి (అవతిష్ఠేతి) = స్వప్రకాశమగు స్వరూపమునందు(ఉండును). 
త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుష: = ముప్పాతిక స్వరూపము కల పూర్ణుఁడగు పరమాత్మ.
(సంసారమ్ = శరీర స్పర్శ లేనిపర బ్రహ్మము) ఊర్ధ్వమున ఉత్కర్షముగ నుండెను.
పాదోzస్యేహాభవా త్పున: = ఈ పరమాత్మ యొక్క పాతిక భాగము ఈ మాయను మరల చెందెను.
(అహం = నేను, ఇదం = ఈ, కృత్స్నం = సమస్తమైన, జగత్ = ప్రపంచమును, 
ఏకాంశేన = ఒకభాగముతో, విష్టభ్య = ఆవరించి, స్థిత: = ఉన్నాను,)
తతో విష్వ ఙ్వ్య క్రామత్ = పిమ్మట దేవ తిర్యగాది రూపములతో చేతనా చేతనముల గూర్చి అంతటను  . . . . . . . . . . . . . . . . . . . . . . . వ్యాపించెను.
తస్మాద్విరాడజాయత = ఆ పరమాత్మ నుండి బ్రహ్మాండ దేహము పుట్టెను.
విరాజో అధిపురుష:(అజాయత) = విరాట్ దేహమునకు మీదను పురుషుడు (పుట్టెను).
సజాతోzత్యరిచ్యత = పుట్టిన ఆ విరాట్ పురుషుఁడు అతిక్రమించినవాడాయెను.
పశ్చాద్భూమిమ్ (ససర్జ) = అనంతరము భూమిని, (సృష్టించెను)
అధో (తేషాంపుర:(ససర్జ) = భూమి సృష్టికి వెనుక ఆ జీవులకు దేహములను సృష్టించెను
దండాన్వయము:-
ఎల్ల భూతములును ఈ పరమాత్మ యొక్క నల్గవ భాగము. ఈ పరమాత్మయొక్క మిగిలిన మూడు భాగములు నాశము కానిదియు స్వప్రకాశమగు స్వరూపమునందు(ఉండును) ముప్పాతిక స్వరూపము కల పూర్ణుఁడగు పరమాత్మ. (సంసారం=శరీర స్పర్శ లేనిపర బ్రహ్మము) ఊర్ధ్వమున ఉత్కర్షగ నుండెను. ఈ పరమాత్మ యొక్క పాతిక భాగము ఈ మాయను మరల చెందెను. (నేను ఈ సమస్తమైన ప్రపంచమును ఒక భాగముతో ఆవరించి ఉన్నాను.) పిమ్మట దేవ తిర్యగాది రూపములతో చేతనా చేతనముల గూర్చి అంతటను వ్యాపించెను. ఆ పరమాత్మ నుండి బ్రహ్మాండ దేహము పుట్టెను. విరాట్ దేహమునకు మీదను పురుషుడు పుట్టెను. పుట్టిన ఆ విరాట్ పురుషుఁడు అతిక్రమించినవాడాయెను. అనంతరము భూమిని సృష్టించెను. భూమి సృష్టికి వెనుక ఆ జీవులకు దేహమును సృష్టించెను.
సీ:-
జీవులు పరమాత్మ పావు భాగము కాగ
ముప్పావు భాగమా పూర్ణు డలరు.
ముప్పాతికగ నున్న పూర్ణుడా పరమాత్మ
ఊర్ధ్వము నుత్కర్ష నుండె జగతి.
మరల పాతిక విష్ణు మాయ గాగ, పిదప.
దేవ తిర్యగ్రూప భావ మొంది,
బ్రీతిని చేతనాచేతనంబులు గొల్పి,
మించుచు తానె వ్యాపించె నతఁడు.
గీ:-
పుట్టె బ్రహ్మాండ దేహ మాదిట్టనుండి.
పురుషు డుదయించె హరిదేహమునకు పైన
నట విరాట్ పురుషు డధికు డగుచు మించి
భూమి సృష్టించె, దేహ జీవులను జేసె. 2.
వివరణ:-
తన శక్తి కంటె అతిశయమగు జగత్తు కన్న నెక్కువ వాఁడయిన యా పరమాత్మకు ఈ భూతము లన్నియు నొక పాతిక భాగముగ నున్నవి.  తక్కిన ముప్పాతిక రూపమును నాశ రహితమై స్వప్రకాశ స్వరూపమునందున్నది.  ముప్పాతిక స్వరూపమైన పరమాత్మ అజ్ఞాన కార్యమగు జన్మ జరా మరణాది రూపమున దేహము కంటె బైట నుండు వాడై దాని సంబంధమైన గుణ దోషములచే స్పృశింపఁబడక సర్వోత్కృష్టముగ నుండెను. మిగత పాతిక భాగము సృష్టి సంహారముల చేత మాయను పొందు చున్నది.  మాయను పొందిన వెనుక దేవ తిర్యగాది రూపములతో నానా విధమయి  చేతనా చేతనములలో వ్యాపించి యుండెను.  ఆ పరమాత్మ వలన విరాట్టును పుట్టెను.  ఈ దేహములను ఆధారము చేసుకొని పరిపూర్ణుడగు పరమాత్మ పురుష స్వరూపుడైన జీవుడాయెను.  ఇట్లు జీవించిన విరాట్టువిరాడ్వ్యతిరిక్తమైన దేవతిర్యఙ్మనుష్యరూపుడాయెను.  ఈ ప్రకారము దేవాది జీవ భావమును పొందిన తరువాత భూమిని సృజించెను.  భూమిని సృజించిన వెనుక ఆ దేవాది జీవులకు సప్త ధాతువులతో గూడిన దేహముల సృజించెను. 
యత్పురుషేణ హవిషా,  దేవా యజ్ఞ మతన్వత,వసన్తో అస్యాసీ దాజ్యమ్, గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవి:. సప్తా స్యాసన్పరిధయ:, త్రి స్సప్త సమిథ: కృతా:, దేవ య ద్యజ్ఞం  తన్వానా:, అబధ్న న్పురుషమ్పశుమ్, తం యజ్ఞం బర్‍హిషిప్రౌక్షన్, పురుషం జాతమగ్రత:. ౩. 
ప్రతి పదార్థము:-
యత్ = ఎప్పుడు, 
దేవా: = దేవతలు, 
పురుషేణ = పురుషుడను పేరు గల,
హవిషా = హవిస్సు చేత,
యజ్ఞమ్ = యజ్ఞమును, 
అతన్వత = చేసిరో, 
తత్ = అప్పుడు, 
అస్య = ఈయజ్ఞమునకు, 
వసంత: = వసంత ఋతువే,
ఆజ్యమ్ = నేయి గాను, 
గ్రీష్మ: = గ్రీష్మ ఋతువే, 
ఇద్మ: = కట్టెలుగాను, 
శరత్ = శరదృతువే, 
హవి: = హవిస్సుగాను, 
ఆసీత్ = ఆయెను, 
అస్య = ఈ మానవ యజ్ఞమునకు, 
సప్త = ఏడైన గాయత్ర్యాదిఛందస్సుల, 
పరిధయ: = ఎల్లలు, 
ఆసన్ = ఆయెను, 
త్రెస్సప్త సమిధ: = ఇరువదియొక్క సమిధలు, 
కృతా: = చేయఁబడినవి, 
దేవతా: = దేవతలు, 
యత్ = ఎప్పుడు, 
యజ్ఞమ్ = సాంకల్పిక యజ్ఞమును, 
తన్వానా: = చేయువారలై, 
పురుషమ్ = విరాట్‍పురుషునే, 
పశుం = యజ్ఞపశువుగా, 
అబధ్నన్ = కట్టిరో, 
అగ్రత: = సృష్టికి పూర్వము, 
జాతమ్ = పుట్టినవాడు, 
యజ్ఞమ్ = యజ్ఞ సాధనమైన, 
తం పురుషమ్ = ఆ విరాట్ పురుషుని, 
బర్హిషి = మానస యజ్ఞమునందు, 
ప్రౌక్షన్ = ప్రౌక్షించిరి.
దండాన్వయము:-
ఎప్పుడు దేవతలు పురుషుఁడను పేరు గల హవిస్సు చేతను, యజ్ఞమును చేసిరో అప్పుడు ఈ యజ్ఞమునకు వసంత ఋతువే నేయి గాను, గ్రీష్మ ఋతువే కట్టెలు గాను, శరద్ ఋతువే హవిస్సు గాను ఆయెను. ఈ మానస యజ్ఞమునకు ఏడైన గాయత్రాది ఛందస్సుల ఆయెను. ఇరువది యొక్క సమిధలు చేయఁబడినవి. దేవతలు ఎప్పుడు సాంకల్పిక యజ్ఞమును చేయువారలై విరాట్ పురుషునే యజ్ఞ పశువునుగా కట్టిరో, సృష్టికి పూర్వము పుట్టిన వాడును యజ్ఞ సాధనమైన ఆవిరాట్ పురుషుని మానస యజ్ఞమునందు ప్రోక్షించిరి.
సీ:-ఎప్పుడు పురుషుఁడ నెన్ని హవిస్సుచే
యుచు యజ్ఞములను జేయును దివిజులు
అప్పుడట వసంతు డగు నాజ్యముగ.
గ్రీష్మమగునిధ్మముగ, శరత్తగు హవిస్సు.              
ఏడు ఛందములగు నెల్లలుగ, నవియు
నిరువది యొక్కటై నిరుపమగతిఁ
జేయఁబడె సమిధలై యలరునటుల
సంకల్ప యజ్ఞముఁ సలుపఁ దివిజు
గీ:-
లా విరాట్టుఁ బశువుగాఁగ యతనిఁ గట్టి,
సృష్టి కిని పూర్వుఁడగు వాని, సేవ్యమాన
యజ్ఞ సాధకునాతని యజ్ఞమందు
ప్రోక్షణము చేసిరా దివిజు లాక్షణమున. 3.
వివరణ:-
ముందు విరచించిన ప్రకారము దేవ శరీరములు పుట్టిన తర్వాత ఉత్తర సృష్టి సిద్ధించుటకై దేవతలు అందులకు సాధనముగ నొక యాగమును జేసిరి.  అప్పటి బాహ్య ద్రవ్యములు కలుగక పోవుట చేత వేరొక హవిస్సు  లేకపోవుట వలన బురుష స్వరూపమునే మనస్సు నందు యజ్ఞమున హవిస్సుగా భావించి మానస యజ్ఞము నెప్పుడు చేసిరో అప్పుడట్టి యజ్ఞమునకు ఆజ్యమునకు వసంత ఋతువును, సమిధలకు గ్రీష్మ ఋతువును, పురోడాశాది హవిస్సునకు శరదృతువును భావించుకొనిరి.  ఈ యజ్ఞమునకు ఛందస్సులు ఏడు ఎల్లలుగాను, ఆ ఏడును ఇరువదియొక్కటిగా చేయబడినవి. ఆ ఇరువదియొక్క పదార్థములే సమిధలుగా భావింపఁబడినవి.  బ్రహ్మ యొక్క ప్రాణేంద్రియ స్వరూపములైన దేవతలు మానసికముగా యజ్ఞమును చేయువారై పశువుగ విరాట్టును భావించి యూపమునకు గట్టిరి. ఆ యజ్ఞ సాధనము సృష్టికి పూర్వమును జనించినవాడునగు విరాట్పురుషుడను పశువును విశసించిరి. 
తేన దేవా అయజన్త, సాధ్యా ఋషయశ్చ యే, తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః, సంభృతం పృషదాజ్యమ్, పశూగ్ం స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్, ఆరణ్యా న్గ్రామ్యాశ్చయే, తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః, ఋచస్సామాని జజ్ఞిరే, ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్, యజు స్తస్మా దజాయత. ౪ 
ప్రతిపదార్థము:-
తేన = ఆ పశువుచే,  
దేవా: = దేవతలును, 
సాధ్యా: = సాధ్యులును, 
ఋషయశ్చ = ఋషులును, 
యే = ఎవరో, 
(తే సర్వేzపి = వారందరును,)
అయజంత = మానస యజ్ఞమును చేసిరి, 
సర్వ హుత: = సర్వాత్మకమైన పురుషునిచే హోమము చేయఁబడిన, 
తస్మాత్ = ఆ, 
యజ్ఞాత్ = యజ్ఞమునుండి, 
పృషదాజ్యమ్ = పృషత్ అనెడి నెయ్యి, 
సంభ్రుతం = సంపాదింపఁబడినది, 
వాయవ్యాన్ = వాయు దేవతాకములైన, 
అరణ్యాన్ = పశువులు మొదలగువానిని, 
యే = ఏవి, 
గ్రామ్యా: = గ్రామమందుఁబుట్టిన గోవులు మొదలగువానిలోనుండునో,
తాంశ్చపశూన్ = ఆ పశువులను, 
చక్రే = చేసెను. 
సర్వ హుత: = సర్వ హుతమును, 
తస్మాత్ యజ్ఞాత్ = ఆ యజ్ఞము నుండి, 
ఛందాంసి = గాయత్ర్యాది ఛందస్సులును, 
జజ్ఞిరే = పుట్టినవి. 
తస్మాత్ యజు: = ఆ యజ్ఞమునుండి, 
యజు: = యజుర్వేదము, 
అజాయత = పుట్టెను.
దండాన్వయము:-
ఆ పశువుచే దేవతలు ఋషులు సాధ్యులు ఎవరో వారు అందరు మానస యజ్ఞముఁజేసిరి. సర్వాత్మకమైన పురుషునిచే హోమము చేయఁబడిన ఆయజ్ఞము నుండి పృషత్ అనెడి నెయ్యి సంపాదింపఁ బడినది. వాయు దేవతాకమైన పశువులు మొదలగు వానిని ఏవి గ్రామమందుఁ బుట్టిన గోవులు మొదలగువానిలో నుండునో ఆ పశువులను చేసెను. సర్వ హుతమును ఆ యజ్ఞమునుండి గాయత్ర్యాది ఛందస్సులును బుట్టినవి. ఆ యజ్ఞమునుండి యజుర్వేదము బుట్టెను.
సీ:-
అట్టి పశువుతోడ నాదేవతల్ ఋషుల్
సాధ్యులు యజ్ఞము సలిపినారు.
సర్వాత్ముడతనిచే నిర్వహింపఁబడిన 
హోమ యజ్ఞము నుండి యొదవె నపుడు
పృష దను ఘృతము సమృద్ధిగా.వాయు సం
బంధ పసులు గ్రామ మందు నుండు
నట్టివి చేసె నా యజ్ఞము నుండియే
సర్వహుతములును, చక్కగ మన
గీ:-
మందఁ, గాయత్రి మొదలగు ఛందములును 
పుట్టినవి మహిమం బట నుట్టి పడగ.
నట యజుర్వేదమును బుట్టె నద్భుతముగ.
యజ్ఞమది యౌను మానస యజ్ఞమదియె. 4.
వివరణ:-
సృష్టికి ముందు పుట్టిన విరాట్టుతో బ్రహ్మ ఇంద్రియ స్వరూపులగు దేవతలును ప్రాణ రూపులగు సాధ్యులును వారి కనుకూలమగు మంత్ర వేత్తలగు ఋషులును, వీరలందరును మానస యాగమును జేసిరి.  ఆ విరాట్టే హోమముగాఁ గలిగిన ఆ మానస యజ్ఞము నుండి పృషదాజ్యము లోనగు భోగ్యవస్తు సముదాయ మంతయుఁ గలిగెను.  వాయు దేవతాకములగు పశువులును గ్రామ్యములగు గోవులు మొదలైనవియు వేదములును గాయత్ర్యాది ఛందస్సులును ఆ యాగము నుండియే కలిగెను.
తస్మాదశ్వా అజాయన్త, యేకే చోభయా దతః, గావోహ జజ్ఞిరే తస్మాత్,  తస్మా జ్జాతా అజా వయః, యత్ పురుషం వ్యదధుః. కతిథా వ్యకల్పయన్,  ముఖం కిమస్య కౌ బాహూ, కా వూరూ పాదా వుచ్యేతే, బ్రాహ్మణోzస్య ముఖ మాసీత్, బాహూ రాజన్యః కృతః. ౫. 
ప్రతిపదార్థము:-
తస్మాత్ = ఆ యాగము వలన,
అశ్వా= గుఱ్ఱములును,
యేకేచ = ఏవియేవి,
ఉభయాదత: = ఊర్ధ్వాధోభాగములందు దంతములు గలవియు,
(తేzపి = అవియు)
అజాయంత = పుట్టెను.
తస్మాత్ = ఆ యజ్ఞము వలన, 
గావోహ = గోవులును,
జజ్ఞిరే = కలిగెను.
తస్మాత్ = ఆ యజ్ఞము నుండి,
అజా = మేకలూ,
అవయ: = గొఱ్ఱెలునూ,
జాత: = పుట్టెను.
యత్ = ఎప్పుడు,
దేవా: = దేవతలు,
పురుష: = విరాడ్రూపమును,
వ్యదధు: = సంకల్పము చేత పుట్టించిరో
(తదానీం = అప్పుడు)
కతిథా = ఎన్ని ప్రకారములుగా,
వ్యకల్పయన్ =విషయము కల్పించిరి.
అస్య = ఈ విరాట్టునకు,
ముఖం = ముఖమును,
కిం = ఏది,
బాహూ = రెండు భుజములు,
కౌ = ఏవి,
ఊరూ = రెండు తొడలును,
పాదౌ = రెండు పాదములును,
కౌ = ఏవి,(అవి)
ఉచ్యతే = చెప్పఁబడుచున్నవి.
అస్య = ఈ విరాట్టునకు,
బ్రాహ్మణ: = బ్రాహ్మణుఁడు,
ముఖం = ముఖము,
ఆసీత్ = ఆయెను.
రాజన్య: = క్షత్రియుఁడు,
బాహూ = భుజములుగా,
కృత: = చేయఁబడెను.
దండాన్వయము:-
ఆ యాగము వలన, గుఱ్ఱములును, ఏవి యేవి ఊర్ధ్వాధోభాగములందు దంతములు గలవియు, అవియు పుట్టెను. ఆ యజ్ఞము వలన, గోవులును కలిగెను. ఆ యజ్ఞము నుండి మేకలూ, గొఱ్ఱెలునూ పుట్టెను. ఎప్పుడు దేవతలు విరాడ్రూపమును సంకల్పము చేత పుట్టించిరో, (అప్పుడు)ఎన్ని ప్రకారములుగావిషయము కల్పించిరి. ఈ విరాట్టునకు, ముఖమును, ఏది రెండు భుజములు, ఏవి రెండు తొడలును, రెండు పాదములును, ఏవి, (అవి)చెప్పఁబడుచున్నవి. ఈ విరాట్టునకు బ్రాహ్మణుఁడు ముఖముగా ఆయెను. క్షత్రియుఁడు భుజములుగా చేయఁబడెను.
సీ:-
ఆ యాగ ఫలముచే నమరె గుఱ్ఱములును,
దంతంబులున్నట్టి జంతువులును,
ఆ యాగ ఫలముచే నావులు కలిగెను,
మేకలు, గొఱ్ఱెలుఁ మేల్తరముగ.
ఎప్పుడు  దేవత లీవిరాట్ రూపమ్ము
సంకల్పమును జేసి చక్కఁగొలిపె,
నప్పుడే కల్పించె నన్ని ప్రకారముల్
విషయము లెలమిని విదితముగను.
గీ:-
ఈ విరాట్టుకుముఖమును,ఇరు భుజములు,
రెండు తొడలును పాదముల్ రెండు.చెప్పఁ
బడెను. ముఖమయెచక్కన బ్రాహ్మణుండు.
క్షత్రియు డయెభుజములుగ. సత్ర మహిమ. 5.
వివరణ:-
ఆ యజ్ఞము నుండి గుఱ్ఱములును, గర్దభాదులును, గోవులును, మేఁకలును, గొఱ్ఱెలును పుట్టెను.  బ్రహ్మ వేత్తలు బ్రాహ్మణాది సృష్టిని గూర్చి ప్రశంసించి యెప్పుడు ప్రజాపతి ప్రాణేంద్రియ రూపులగు దేవతలు విరాట్టునాకారమును సంకల్పముచేఁ బుట్టించిరో అప్పు డన్ని ప్రకారములుగా విషయమును కల్పించిరి. ముఖము మొదలైనవి ఏవి యని యడుగఁగా ఈ రూపునకు బ్రాహ్మణుడు ముఖము, క్షత్రియుఁడు భుజము.
ఊరూ త దస్య యద్వైశ్య:, పద్భ్యాగ్ం శూద్రో అజాయత, చన్ద్రమా మనసో జాత:, చక్షో స్సూర్యో  అజాయత, ముఖా దింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయు రజాయత, నాభ్యా ఆసీ దన్తరిక్షమ్, శీర్ష్ణో ద్యౌ స్సమవర్తత, పద్భ్యామ్ భూమిర్దిశ శ్శోత్రాత్, తథా లోకాగ్ం అకల్పయన్.6.   
ప్రతిపదార్థము:- 
అస్య = ఈ విరాట్టుకు 
ఊరూ = తొడలు  
యత్ = ఏవియో
తత్ = అవి
వైశ్య: = వైశ్యుడు.
పద్భ్యామ్ = పాదముల నుండి
శూద్ర: = శూద్రుఁడు
అజాయత = పుట్టెను.
చంద్రమా: = చంద్రుడు 
మనస: = మనస్సు వలన
జాత: = పుట్టెను.
చక్షో: = నేత్రము వలన
సూర్య: = సూర్యుఁడు
అజాయత = పుట్టెను.
ముఖాత్ = ముఖము వలన
ఇంద్ర: = ఇంద్రుఁడును
అగ్నిశ్చ = అగ్నియును
ప్రాణాత్ = ప్రాణము వలన
వాయు: = వాయువును,
అజాయత = పుట్టెను.
నాభ్యా: = బొడ్డు నుండి 
అంతరిక్షం = ఆకాశము,
ఆసీత్ = ఆయెను.
శీర్ష్ణ: = శిరస్సు వలన
ద్యౌ: = ద్యు లోకము
సమవర్తత = కలిగెను.
పద్భ్యామ్ = పాదముల వలన
భూమి: = భూమియును
శ్రోత్రాత్ = శ్రోత్రముచే
దిశ: = దిక్కులును
తథా = అట్లే
లోకాన్ = లోకములును
అకల్పయన్ = పుట్టించిరి.
దండాన్వయము:- 
ఈ విరాట్టుకు తొడలు  ఏవియో అవి  వైశ్యుడు. పాదముల నుండి శూద్రుఁడు పుట్టెను. 
చంద్రుడు మనస్సు వలన పుట్టెను. నేత్రము వలన  సూర్యుఁడు  పుట్టెను. ముఖము వలన ఇంద్రుఁడును అగ్నియును ప్రాణము వలన వాయువును  పుట్టెను. బొడ్డు నుండి ఆకాశము  ఆయెను. 
శిరస్సు వలన ద్యు లోకము కలిగెను. పాదముల వలన భూమియును శ్రోత్రముచే దిక్కులును, 
అట్లే లోకములును పుట్టించిరి.
సీ:- 
విష్ణు తొడల నుండి వెలువడె వైశ్యుండు  
పాదాల శూద్రుఁడు ప్రభవమందె. 
మనసువలన చందమామ జననమందె. 
కండ్లలో నుండి భాస్కరుఁడు బుట్టె.
నీశు ముఖము నుండి యింద్రుండు, నగ్నియు
ప్రాణమునను గాలి ప్రబలె పుట్టి.
నాభి నుండి కలిగె నభమద్భుతమ్ముగ
శిరము వలన కల్గె శ్రీ ద్యుజగతి.
ఆ:-
పాదములను బుట్టె భవ్యమౌ భూదేవి.
దెసలు చెవుల నుండి వెసను బుట్టె.
అటులఁ బుట్టఁ జేసె నన్ని లోకంబులు
నావిరాట్టు మూల మన్నిటికిని. 6. 
వివరణ:- 
కోమటితొడలు, శూద్రుఁడు పదములు ఆయెనని చెప్పి, ఆ విరాట్టు యొక్క మనస్సు వలన చంద్రుఁడును, నేత్రము వలన సూర్యుఁడును, ముఖము వలన ఇంద్రాగ్నులు, ప్రాణము వలన వాయువు బొడ్డు వలన అంతరిక్షము, నెత్తి వలన ద్యు లోకమును, పాదముల వలన భూమియు, శ్రోత్రముల వలన దిక్కులును కలిగెను. ఆప్రకారముననే ఎల్ల లోకములను కల్పించిరి. 
వేదాహమేతం పురుషం మహాన్తమ్ ఆదిత్య వర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీర:, నామాని కృత్వాzభివర్ద యదాస్తే, ధాతా పురస్తాద్యముదా జహార,శక్ర: ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్ర:, తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాzన్య: పన్థాఅయనాయ విద్యతే, యజ్ఞేన యజ్ఞ మయ జన్త దేవా: తాని ధర్మాణి ప్రథమా న్యాసన్.7  
తేహనాకం మహిమాన స్సచన్తే, యత్ర పూర్వే స్సాధ్యా స్సంతి దేవా:  8. 
ప్రతిపదార్థము:- 
యత్ = ఏ   
ధీర: = సధైర్యుడగు విరాట్టు 
సర్వాణి రూపాణి = సమస్త రూపములను,  విచిత్యా = విశేషముగా నిర్మించి,
నామాని = పేళ్ళను
కృత్వా = చేసి,
అభివర్ద = ఎల్లెడల వ్యాపించి
ఆస్తే = ఉన్నాడో
ఏతమ్ = ఈ 
పురుషమ్ = విరాట్టును
మహాన్తమ్ = అధికునిగాను
ఆదిత్య వర్ణమ్ = సూర్యుని వలె ప్రకాశించు వానిని గాను,
అహమ్ = నేను 
వేద = తెలుసుకొను చున్నాను.
సచ = ఆ విరాట్టే  
తమసస్తుపారే = అజ్ఞానమునకు వెలుపల
వర్తతే = ఉన్నాఁడు.
ధాతా = ప్రజాపతి
యం = ఏ విరాట్టును
ఉదాజహార = చెప్పెనో
శక్ర: = ఇంద్రుఁడు
ప్రవిద్వాన్ = ఎక్కువగ తెలిసిన వాడై
చతస్ర: = నాలుగయిన
ప్రదిశ: = దిక్కులను (ప్రసిద్ధి చేసెనో)
తం = అట్టి విరాట్టును
ఏవం = ఏ ప్రజాపతి
విద్వాన్ = తెలుసుకొనునట్టి ఉపాసకుఁడెవఁడో 
ఇజ = ఈ జన్మమునందు
అమృత: = మరణము లేనివాఁడు. 
భవతి = అగుచున్నాడు.
అయనాయ = మోక్ష ప్రాప్తి కొఱకు 
అన్య: = మఱి యొకటి యగు
పంథా: = మార్గము
నవిద్యతే = లేదు.
దేవా: = దేవతలు 
యజ్ఞేన = మానస యజ్ఞము చేతను
యజ్ఞం = యజ్ఞ స్వరూపుఁడగు ప్రజాపతిని
అజయంత = పూజించిరి.
తస్మాత్ = అందు వలన
తాని = ఆ ప్రసిద్ధములగు
ధర్మాణి = జగద్రూప వికారములనుధరించు నట్టివి,
ప్రథమాని = ముఖ్యమైనవిగా 
ఆసన్ = ఉండెను.
యత్ర = ఏ స్వర్గమున 
పూర్వే = ప్రాచీనులగు సాధ్యులును,
దేవా: = దేవతలు
సంతి = కలరో
తే = ఆ
మహిమాన: = మహిమ గలవారలు
తం = ఆ
నాకం = స్వర్గమును
ఇహ = ఇచ్చటనే
సవంతే = పొందు చున్నారు.
దండాన్వయము:-
ఏ  సధైర్యుడగు విరాట్టు   సమస్త రూపములను, విశేషముగా నిర్మించి, పేళ్ళను చేసి, ఎల్లెడల వ్యాపించి ఉన్నాడో ఈ విరాట్టును అధికునిగాను సూర్యుని వలె ప్రకాశించు వానిని గాను నేను తెలుసుకొను చున్నాను. = ఆ విరాట్టే  అజ్ఞానమునకు వెలుపల ఉన్నాఁడు. ప్రజాపతి ఏ విరాట్టును చెప్పెనో ఇంద్రుఁడు ఎక్కువగ తెలిసిన వాడై నాలుగయిన  దిక్కులను (ప్రసిద్ధి చేసెనో) అట్టి విరాట్టును ఏ ప్రజాపతి తెలుసుకొనునట్టి ఉపాసకుఁడెవఁడో ఈ జన్మమునందు మరణము లేనివాఁడు అగుచున్నాడు. మోక్ష ప్రాప్తి కొఱకు మఱి యొకటి యగు మార్గము లేదు. దేవతలు మానస యజ్ఞము చేతను యజ్ఞ స్వరూపుఁడగు ప్రజాపతిని పూజించిరి. అందు వలన ఆ ప్రసిద్ధములగు జగద్రూప వికారములనుధరించు నట్టివి, ముఖ్యమైనవిగా ఉండెను. ఏ స్వర్గమున ప్రాచీనులగు సాధ్యులును దేవతలు కలరో  ఆ మహిమ గలవారలు ఆ స్వర్గమును ఇచ్చటనే పొందు చున్నారు.
సీ:-
ఏ విరాట్టుకొలిపి యింపునన్నింటిని,
పేళ్ళు పెట్టి యతడె పేర్మి నిలిచె
నా విరాట్టుఁ గనఁగ నన్నింట నధికుడు
భాను తేజుడనెడి భావమొదవె.
ఆ విరాట్టునిలిచె నజ్ఞానమున కటు
యసమాన తేజుడై అసదృశముగ.
ఏ విరాట్టును జెప్పెనెఱుగఁ ప్రజాపతి
ఇంద్రుండు నల్దిక్కు లెఱుక పరచె.
గీ:-
ఎఱుఁగువాడది ముక్తుఁడు. ఇతరమేల?
దేవతలుమానసికయజ్ఞదీప్తిఁ గాంచె. 7.
సాధ్య గంధర్వు లేదివిన్ సౌఖ్యమొందు,
ఆ దివి నిటనే పొందుదురట్టివారు. 8.
వివరణ:-
ఈ ముందు చెప్పిన విరాట్టు యొక్క ధ్యాన మంత్రమును జెప్పువాఁడు స్వకీయ ధ్యానము యొక్క అనుభవమును వెల్లడి చేయుచున్నాఁడు.ఏ విరాట్టు ఎల్ల యాకారముల నిర్మించిఇతఁడు దేవుఁడు ఇది పశువు, ఇతఁడు మనుజుఁడు, మొదలగు నామములు బెట్టి ఆ నామములతో నెల్లెడల ప్రవర్తించు చున్నాఁడో అట్టి వానిని ఎల్ల గుణములచే నధికుని సూర్యుని వలెనే ప్రకాశమానమగువానిని ధ్యానముచే సదా అనుభవించు చున్నాఁడు. అట్టి వాఁడు అజ్ఞానాతీతుఁడై యున్నాఁడు. కావున గురు శాస్త్రోపదేశరహితు లగు అజ్ఞానులచేఁ తెలిసికొన శక్యుఁడు గాఁడు. ఏ విరాట్టుని ఉపాసించు వారల మంచికిఁ గాను ప్రజాపతి ప్రసిద్ధ పఱచెనో ఎల్ల దిక్కులయందుండునట్టి ఎల్ల ప్రాణుల గ్రహిమ్చుచున్నైంద్రుఁడును,అ జీవులయనుగ్రహము కొఱకు దేనిని వెల్లడి చేసెనో ఆ ప్రజపతీంద్రుల ఉపదేశము వలన ఆ విరాట్టుచే ఈ చెప్పఁబడిన ప్రకారము తెలిసికొనిన వాఁడు ఈ జన్మముననే మరన రహితుఁడగు చున్నాఁడు.విరాట్టె నేను అని సాక్షాత్కారముఁ జేసికొనెడివాఁడు వర్తమాన దేహ స్వరూపము లేకపోవుటచే వాని స్మరణము వలన మరణము చెందును. అట్టివిరాట్టుని సాక్షాత్కారము లేకమోక్షమునకు ఇతర మార్గము లేదు. కర్మలచే మోక్షము చెంద వీలు లేదు. ప్రజాపతి ప్రాణ రూపులైన దేవతలు మానవ యజ్ఞ స్వరూపుఁడగు ఏ దేవుని పూజించుట వలన జగద్రూప వికారములను జెందిన ధర్మములు ప్రసిద్ధములైనవి ఆయెను. 7. పురాతనులగు సాధ్యులును, దేవతలును విరాట్ప్రాప్తి రూపమునఏ స్వర్గమునందుండిరో అట్టి స్వర్గము మహనుభావులు చెందుచున్నారు. 8.  
అద్భ్యస్సంభూత: పృథివ్యై రసాచ్చ, విశ్వకర్మణ స్సమవర్తతాధి, తస్య త్వష్టా విదధ ద్రూప మేతి, తత్ పురుషస్య విశ్వమాజానమగ్రే, వేదాహ మేతం పురుషం మహాన్తం, ఆదిత్య వర్ణం తమస: పరస్తాత్, తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్య: పన్థా విద్యతే z యనాయ. ప్రజాపతిశ్చరతి గర్భే అంత:, అజాయమానో బహుథా విజాయతే. ౧.
ప్రతిపదార్థము:-
(నారాయణుఁడు)
అద్భ్య: నీళ్ళ నుండి,
(సంభూత: = పుట్టెను.)
పృథివ్యై = భూ సంబంధ మైన
రసాచ్చ ద్రవము నుండియును
(సంభూత: పుట్టెను.)
విశ్వ కర్మణ: పరమేశ్వరుని వలన
అధిసమవర్తత = ఆధిక్యముగ పుట్టెను.
తస్య = ఆవిరాట్టు యొక్క
రూపమ్ ఆకృతిని
విదధత్ కలుగఁ జేయుచున్న
త్వష్టా = జగదీశ్వరుఁడు
ఏతి పొందుచున్నాఁడు.
పురుషస్య విరాట్టు సంబంధమైన
తత్ ఆ ప్రసిద్ధమగు
విశ్వమ్ జగత్తు
అగ్రే సృష్యాదియందు
అజానం = పుట్టెను.
ఏతం 
పురుషం విరాట్టును
మహాన్తం = అధికునిగాను,
ఆదిత్య వర్ణం = సూర్యుని వలెఁ బ్రకాశించు వానిఁ గాను,
అహం నేను
వేద తెలిసికొను చున్నాను.
సచ ఆ విరాట్టే
తమస: = అజ్ఞానమను చీకటికి
పరస్తాత్ బయట
(వర్తతే = ఉన్నాడు)
తం = వానిని
ఏవం ఈ ప్రకారము
విద్వాన్ = తెలుసుకొనువాఁడు
ఇహ ఇచ్చటనే
అమృత: భవతి చావు లేనివాఁ డగుచున్నాఁడు.
అయనాయ = ముక్తి కొఱకు
అన్య: = ఇతరమగు
పంథా: మార్గము
నవిద్యతే లేదు.
గర్భే గర్భమందు
అంత: లోపల
ప్రజాపతి: ప్రజాపతి
చరతి = ఉన్నాఁడు.
అజాయమాన: = పుట్టనివాఁడైనను
బహుథా అనేక ప్రకారములుగా
విజాయతే పుట్టుచున్నాఁడు.
దండాన్వయము:-
నారాయణుఁడు నీళ్ళ నుండి, పుట్టెను. భూ సంబంధ మైన ద్రవము నుండియును ( పుట్టెను.). పరమేశ్వరుని వలన ఆధిక్యము పుట్టెను. ఆవిరాట్టు యొక్క ఆకృతిని కలుగఁ జేయు చున్నజగదీశ్వరుఁడు పొందు చున్నాఁడు. విరాట్టు సంబంధమైన ఆ ప్రసిద్ధమగు జగత్తు సృష్యాదియందు పుట్టెను. ఈవిరాట్టును అధికునిగా సూర్యుని వలెఁ బ్రకాశించు వానిని గాను, నేనుతెలుసుకొను చున్నాను. ఆ విరాట్టే అజ్ఞానమను చీకటికి బయట ఉన్నాడు. వానిని ఈ ప్రకారము తెలుసుకొనువాఁడు ఇచ్చటనే చావు లేనివాఁడగుచున్నాఁడు. ముక్తి కొఱకు ఇతరమగు మార్గము లేదు. లోపల ప్రజాపతి ఉన్నాఁడు..పుట్టనివాఁడైనను అనేక ప్రకారములుగా పుట్టుచున్నాఁడు.
సీ:-
ఆదినారయణుం డంబువుననుఁ బుట్టె
పృథివి రసములను పేర్మిఁ బుట్టె.
అతని వలన గల్గె నాధిక్యమది చూడ. 
ఆ విరాట్కర్తయె అందె దాని.
ఆవిరాట్ సంబంధ యా ప్రసిద్ధ జగత్తు 
సృష్టికాదినె పుట్టె స్పష్టముగను.
ఆ విరాట్టధికుగా యా వెల్గు సూర్యుగా 
తలతు నతని నేను తనివి తీర.
గీ:-
ఆత డజ్ఞాన మవతల నరయ నుండు.
అతనినెఱిఁగిన మృతి లేని యతఁడు ఇతఁడు.
అన్య మార్గము ముక్తికి నరయ లేదు.
లోననుండు ప్రజాపతి జ్ఞాని యరయ.
పుట్టుకయెలేని వాఁడును పుట్టు మిగుల.
వివరణ:-
నారాయణుఁడెవఁడో అతఁడు నీళ్ళ నుండి జనించెను. ఎల్లెడలనుండు నీళ్ళలో బ్రహ్మాండము పుట్టెను. ఇది ముఖ్యముగా నీళ్ళ వలననే పుట్టినది గాదు. భూ సంబంధమైన యుదకము నుండి పుట్టినది. ఇది పరమేశ్వరుని వలన అధికముగఁ బుట్టినది. ఇట్టి బ్రహ్మాండమునకు అభిమాని యైన చేతన స్వరూపుఁడగు పురుషుఁడు ఎవఁడోవాఁడు ఈశ్వరుని యంశము. అట్టి విరాట్టుకు చత్య్ర్దశ లోకావయవ సంస్థితి యైన రూపమును గలుగఁ జేయుచుండెడి విశ్వ కర్మ యైనజగదీశ్వరుఁడు కలఁడు. ఆ విరాట్టు సంబంధమైన ప్రసిద్ధమగు ఈ మనుష్యాది రూపమైన సమస్త ప్రపంచము సృష్యాదియందు అంతట పుట్టెను. ఇట్టి విరాట్టును గొప్ప వానినిఁ గాను, అజ్ఞానమునకు బైట ఆదిత్యుని వలెనే ప్రకాశించు వానినిఁగా నెఱిఁగి ధ్యానించెడి వాఁడు ఇక్కడనే మరణ రహితుఁడగు చున్నాఁడు. ముక్తి కొఱకు యిట్టియుపాసన కంటె నితర మార్గము లేదు. ఈ బ్రహ్మాండము లోపల ప్రజాపతి యున్నాఁడు. నిజమైన యాకారము కలవాఁడు కాఁడు. ఈ ప్రజాపతి పుట్టుక లేనివాఁడైనను నా సంబంధమైన రూపముతో స్థావర జంగమాదికమై అనేక విధములుగాఁ బుట్టు చున్నాఁడు. 
తస్య ధీరా: పరిజానన్తి యోనిమ్, మరీచీనాం పదమిచ్ఛన్తి వేధస:, యోదేవేభ్య ఆతపతి, యోదేవానాం పురోహిత: పూర్వో యో దేవేభ్యో జాత: నమో రుచాయ బ్రాహ్మయే, రుచం బ్రాహ్మం జనయన్త:, దేవా అగ్రే త దభ్రువన్, యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్, తస్య దేవా అసన్వసే.2
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ, అహో రాత్రే పార్శ్వే, నక్షత్రాణి రూపమ్, అశ్వినౌ వ్యాత్తమ్, ఇష్టం మనిషాణ, అముం మనిషాణ, సర్వ మనిషాణ.
ప్రతిపదార్థము:-
ధీరా: = జ్ఞానులు
తస్య = ఆ ప్రజాపతియొక్క
యోనిం = స్వరూపమును
పరిజానన్తి తెలిసికొనుచున్నారు
వేధస: = బ్రహ్మలు
మరీచినామ్ = మరీచి మొదలైన వారి యొక్క
పదమ్ = స్థానమును
ఇచ్ఛంతి  =  కోరుచున్నారు.
య: = ఏ పరమేశ్వరుఁడు
దేవేభ్య: దేవతల కొఱకు
ఆతపతి = అంతటఁ బ్రకాశించుచున్నాఁడో
య: ఎవఁడు?
దేవానాం = దేవతలకు
పురోహిత: = ముందఱ హితమును జేయువాఁడో
య: = ఎవఁడు
దేవేభ్య: = దేవతలకంటె
పూర్వ: మొదటివాఁడై
జాత: = పుట్టెనో (అటువంటి)
రుచాయ = స్వయం ప్రకాశమైన
బ్రాహ్మయే = పరబ్రహ్మ రూపమునకుఁగాను
నమ: = నమస్కారము.
దేవా: = సమస్త దేవతలును
అగ్రే = సృష్ట్యాదియందు
తత్ ఆ బ్రహ్మ తత్వమును గుఱించి,
(సంబుద్ధ్య = సంబోధించి)
అభ్రువన్ పలికిరి.
హే పరమాత్మాన్ ఓ స్వామీ!
య: 
బ్రాహ్మణ: బ్రాహ్మణుఁడు
ఏవం = ఈ ముందు చెప్పిన ప్రకారము
విద్యాత్ = తెలిసికొనునో
తస్య = ఆ బ్రహ్మకు
దేవా: = సమస్త దేవతలు
వశే ఆసన్ స్వాధీనమందుండిరి.
హ్రీ: = లజ్జాభిమానిని యగుదేవతయును
లక్ష్మీశ్చ = ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును
తే నీకు
పత్నౌ = భార్యలు.
అహోరాత్రే = రేయుంబవళ్ళు
పార్శ్వే = పార్శ్వద్వయ స్థానీయములు.
నక్షత్రాణి = నక్షత్రములు
రూపం = శరీరము.
అశ్వినౌ అశ్వినీ దేవతలు
వ్యాత్తం తెఱవఁ బడిన ముఖము. (అట్టి విరాట్టూ!)
ఇష్టం మేము కోరు దానిని
మనిషాణ = ఇమ్ము.
అముమ్ = ఈ ఆత్మ బోధను
మనిషాణ = ఇమ్ము.
సర్వం = ఐహికాముష్మిక రూపమైన సమస్తేష్టమును
మనిషాణ ఇమ్ము.
దండాన్వయము:-
జ్ఞానులు ఆ ప్రజాపతియొక్క స్వరూపమును తెలిసికొనుచున్నారు.బ్రహ్మలు మరీచి మొదలైన వారి యొక్క స్థానమును కోరుచున్నారు. ఏ పరమేశ్వరుఁడు దేవతల కొఱకు అంతటఁ బ్రకాశించుచున్నాఁడో,  ఎవఁడు? దేవతలకు ముందఱ హితమును జేయువాఁడో ఎవఁడు దేవతలకంటె మొదటివాఁడై పుట్టెనో(అటువంటి) స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ రూపమునకుఁగాను నమస్కారము..సమస్త దేవతలును సృష్ట్యాదియందు  ఆ బ్రహ్మ తత్వమును గుఱించి,
(సంబోధించి) పలికిరి.ఓ స్వామీ! ఏ బ్రాహ్మణుఁడు ఈ ముందు చెప్పిన ప్రకారము తెలిసికొనునో ఆ బ్రహ్మకు సమస్త దేవతలు స్వాధీనమందుండిరి. లజ్జాభిమానిని యగుదేవతయును ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును నీకు
భార్యలు. రాత్రింబవళ్ళు పార్శ్వద్వయ స్థానీయములు. నక్షత్రములు శరీరము. అశ్వినీ దేవతలు తెఱవఁ బడిన ముఖము(అట్టి విరాట్టూ) మేము కోరు దానిని ఇమ్ము. ఈ ఆత్మ బోధను ఇమ్ము.ఐహికాముష్మిక రూపమైన సమస్తేష్టమును ఇమ్ము.
సీ:-
జ్ఞానుల్ ప్రజాపతి సద్రూపమెఱుఁగుదు 
ర్బ్రాహ్మల్మరీచాది పదవు లడుగు.
ఎవఁడుదేవతలకై యినుని ప్రకాశుడౌన్ 
దేవ హితముఁజేయు దేవుఁడెవఁడొ
దేవతలకు మున్నె దీపించెనెవ్వడో 
యట్టి ప్రకాశున కంజలింతు
దేవతలెల్లరు  దివ్య తత్వమరయ 
సృష్ట్యాదినె పలికె సృష్టి ప్రభుని.
స్వామి ! యే బ్రాహ్మఁడీ సకలమ్ము నెఱుఁగును, 
దివ్యు నాతనిఁ జేరు దేవతలును.
.హ్రీయు శ్రీయును భార్య లై యలర్చును నిన్ను,
రాత్రియు పవలు పార్శ్వములు నీకు
గీ:-
తారలెల్లను నీదు శరీరమయ్య!
అశ్వినులకనుచు వికసితా! విరాట్టు!
ఇమ్ము కోరిన దానిని. ఇమ్ము బోధ!.
ఐహికాముష్మిక ములెల్ల యరసి యిమ్ము.
వివరణ:-
జ్ఞానులు యోగముచే  నిరోధింపఁ బడిన ఇంద్రియములు గలవారై ఆ ప్రజాపతి యొక్కనిజ రూపమును యెఱుఁగు చున్నారు. బ్రహ్మలు ప్రజాపతి యొక్క , ఆ స్వరూపముచే నియమించు వారలై మరీచి మొదలగు వారి స్థానమును గోరు చున్నారు. ఏ పరమాత్మ దేవతలకు గాను సర్వత్ర ప్రకాశించుచు ఆ దేవతలకు దేవత్వము సిద్ధించుటకు వారి మనస్సులలో చైతన్య రూపమునఁ బ్రవేశించి ఆవిర్భవించు చున్నాఁడో ఎవఁడు దేవతల గురువగు బృహస్పతి అయెనో, ఎవఁడు దేవతలకన్నా పూర్వుఁడగు హిరణ్య గర్భుఁడో, అట్టి పరబ్రహ్మ స్వరూపమునకు నమస్కార మగుఁ గాక. దేవత లందరును బ్రహ్మ సంబంధమైన చైతన్యమును జ్ఞానముచే నుద్భవింపఁజేయుచు ఆ పరబ్రహ్మ తత్వమును సంబోధించి, ఓ పరమాత్మా! ఏ బ్రాహ్మణుఁడు, మరలజన్మించి నిన్నే విధి ప్రకారము తెలియునో అట్టి బ్రహ్మ వేత్తకు ఎల్ల దేవతలును స్వాధీను లగుచున్నారు. వాఁడే తానా దేవతలకెల్లఱకును అంతర్యామి యగు పరమాత్మ యగుచున్నాఁడు.  ఓ పరమాత్మా! లజ్జాభిమానిని యగు దేవతయును, ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును నీ భార్యలు. రాత్రింబవళ్ళే నీ పార్శ్వములు. ఆకాశమందలి నక్షత్రములు నీ రూపము. అస్వినీ దేవతలే నీ ముఖము. అట్టి విరాట్ పురుషుఁడా! మేము కోరు జ్ఞానము నిమ్ము. ఈ ప్రపంచమునందలి సంపదలన్నిటినీ యిమ్ము.ఐహికాముష్మికమైన సమస్తమును దయచేయుము.
పురుష సూక్తము ముగిసెను.
ఓం తత్సత్. 
జైహింద్.









































































































Print this post

2 comments:

కథా మంజరి చెప్పారు...

మీరు ప్రచురించిన పురుష సూక్తం , వివరణ చాల ఉపయుక్తంగా ఉంది. ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!
ధన్యవాదాలు.
మీరు పరిశీలించి దోశములుంటే సవరిచి తెలియఁజేయఁగలందులకు మనవిచేస్తున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.