గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2010, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 78.

ఆత్మీయ పాఠకులారా!
సుపుత్ర: కుల దీపక:. అంటారు. ఇందులో ఎంతటి అనుభవ సారం మనకు కనిపిస్తుందో కదా!
మీలో ఎందరినో లోకం మంచివారుగా పొగడుతుంటే అది వింటున్న మీ కుటుంబీకులు ఎంతటి ఆనంద పారవశ్యం పొందుతున్నారో కదా! ఔను. అది నిజమే.
ఇంకా అనుమానం కలిగితే మన పూర్వీకులే ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా అర్థమయే విధంగా చెప్పారో మీరే ఈ క్రింది శ్లోకంలో చూడండి.
శ్లో:-
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా
వాస్యతే తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా!
ఆ:-
మంచి చెట్టు పూసి యెంచగా లేనంత
పరిమళంబు నింపు వనమునెల్ల.
మంచి పుత్రు డున్నమన్ననల్ కలిగించి
వంశమునకు, తాను వరలు నటుల. 
భావము:-
అరణ్య మంతనూ ఒక్క మహా వృక్షము పుష్పించి, సువాసనలచే సుగంధితముగా చేయుచున్నది. అట్లే ఒక్కడైననూ సుపుత్రుడు కలిగినచో వంశమున కంతకును కీర్తి చంద్రికలు పర్వు చున్నవి.
ఇది మీకు అనుభవైక వేద్యమే అని మీ కీర్తి చంద్రికలు చూచు చున్న నేను గ్రహించకపోలేనండోయ్.
అట్టి మిమ్ములను కలిగి ఉన్న మీ వంశస్తులందరికీ అభినందనలు.
జైహింద్. Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నూతన సంవత్సర + సంక్రాంతి శుభా కాంక్షలు.
సాహితీ వనంలొ ఇంత మంచి పద్య పుష్పాలను { శ్లోకాలనుంచి }పూయిస్తున్న తమని అభినందించటానికి నా ఈ చిన్న కలం సరిపోదు.ఐనా ఉడతా భక్తిగా " ధన్య వాదములు." ఇంకా ఇంకా ఎన్నో తెలుసుకోవాలని కోరుతు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నేదునూరిపలుకు నిత్యంబు నుత్తేజ
పరచుచుంద కవిత పలుకుటెంత?
అహరహమ్ముఁ గనెదరాంధ్రామృతము మీరు
సాధు శీల ధన్య వాదమయ్య!

Vasu చెప్పారు...

మాష్టారు బావుంది శ్లోకం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.