గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జనవరి 2010, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 77.

సుజ్ఞాన సంపన్నులారా!
శ్లోll
అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరేః ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మ యద్ధరేః.
తే.గీ.ll
చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.  
భావము:-
స్వధర్మ కర్మలను విడిచిపెట్టి కేవలము కృష్ణ కృష్ణ యనుచు కూర్చొనువారు శ్రీహరిని ద్వేషించు వారు. పాపులు అగుదురు. ఎందుచేతనంటే ఆ హరి యవతారములెత్తినది ధర్మ రక్షణమునకే గాని ఊరకనే కాదు కదా! 
స్వధర్మానికి దూరముగా ఉంటూ భగవన్నామ జపము చేయుచూ కాలము వ్యర్థపుచ్చుట యుక్తము కాదని గ్రహించ వలెను. స్వధర్మాచరణము చేయుచూ భగవాన్నామ స్మరణ చేయుచూ కర్మఫలమా పరమాత్మకే అర్పింప దగును.
ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం  మన సంస్కృతి 29. గా చెప్పఁబడి యున్ననూ ఇచ్చట పునరుక్తమైనది.

౭౭శ్లో:-
పరోపకారాయ ఫలంతి వృక్షా:  
పరోపకారాయ దుహంతి గావ:
పరోప కారాయ వహంతి నద్య: 
పరోపకారార్థమిదం శరీరం.47
గీ:-
పరుల కొఱకని వృక్షము ఫలములిచ్చు.
పరుల కొఱకని ధేనువు పాల నిచ్చు.
పరుల కొఱకని నదులిల పారుచుండు.
పరులకుపకారములుఁ జేయఁ బ్రతుక వలయు.
భావము:-
చెట్లు పరులకుపకరించుట కొఱకే ఫలించుచుండును. ఆవులు పరులకుపకరించుట కొఱకే పాలనిచ్చును. నదులు పరుల కుపకరించుట కొఱకే ప్రవహించు చుండును. పరుల కుపకారము చేయుటయే యీ శరీరము కలిగి యున్నందులకు ప్రయోజనము.
పరోపకార బుద్ధి మనలో మనమేమీ తక్కువ కాదు అనే విధంగా చేస్తూ ఉండవలెను.
జైహింద్.
Print this post

9 comments:

Apparao చెప్పారు...

మంచి మాట చెప్పారు
ఫాలో విడ్జెట్ పెట్టుకుంటే ఫాలో అవుతానండీ !
మనం కూడా పరోపకారం కోసమే పనికట్టుకుని ( ఉన్నపనులు మానుకొని ) బ్లాగులు వ్రాసుకుంటున్నాం కదండీ :)

కథా మంజరి చెప్పారు...

మంచి సూక్తిని అందించారు. శ్లోకానువాదం సరళంగా సుబోధకంగా ఉంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అప్పారావుగారూ! నాతో ఏకాభిప్రాయం కలిగి ఉన్నందుకు సంతోషమండి.
ఇక విడ్జెట్ పెట్టుకొమ్మన్నారు.
అదెలాగో నాకు తెలియదు.
ఏంచెయ్యాలో సలహా యిస్తే ప్రయత్నిస్తాను.
జైహింద్.
జైశ్రీరామ్.

కథా మంజరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Vasu చెప్పారు...

బావుంది మాష్టారూ తేలికగా. నాబోటి వాళ్ళకి అర్థమయ్యే డట్టు ఉంది. నెనర్లు.

Vasu చెప్పారు...

ఫాలో విడ్జెట్ కి ఈ లంకే ప్రయత్నించండి

http://www.google.com/friendconnect/

Sandeep P చెప్పారు...

మీ బ్లాగులోనున్నంతసేపూ నాకు అయోధ్యానగరిలో శ్రీరాముడి రాజ్యంలో ఉన్నట్టుంటుంది. బయటకి రాగానే ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్నవి చూసి, "హయ్యారే! మన దేశం ఏమిటి ఇలాగ తయారయ్యింది", అనిపిస్తుంది అండి. ఆ కృష్ణపరమాత్ముడికి మన దేశం మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందో, మళ్ళీ శాంతి ఎప్పుడు నెలకొంటుందో!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవి సందీప్!
మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః
అన్నారు పెద్దలు.
మీ హృదయం ఆనంద లోకాల్లో విహరించే స్వభావం కలది. కాబట్టే నా బ్లాగులో మీరు పొందిన ఆనందంతో నన్ను ఆనందంలో ముంచారు.

ఎంతటి పుణ్య మూర్తివయ!ఏమని ప్రస్థుతి చేతు నిన్ను? నీ
యంతటి పుణ్య మూర్తిఁ గని హాయిగ పెంచిన తల్లిదండ్రు లిం
కెంతటి భాగ్యశాలురొకొ! ఎల్ల శుభంబులకాలవాలమై
చెంతను నీవు గల్గుటను చేయగ నేర్చితి బ్లాగు నివ్విధిన్.
ధన్యవాదములు.

yuddandisivasubramanyam చెప్పారు...

my gratitude to you sir,.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.