గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జనవరి 2010, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 76.

భవ్య మూర్తులారా!
ఎవడైతే యదార్థ జ్ఞానం కలిగి ఉంటాడో అతడు అవివేక దూరుడై నిశ్చల మనస్కుడై ప్రశాంత జీవన సామ్రాజ్యాధిపతియై జీవిస్తాడు. ఈ సత్యన్ని ఈ క్రింది శ్లోకం తెలియఁజేస్తోంది.
శ్లో:-
జరాం మృత్యుం భయం వ్యాధిం యో జానాతి స పండిత:
స్వస్థ స్తిష్ఠే న్నిషేదే ద్వా స్వపేద్వా కేనచి ద్ధసేత్.
క:-
జర, మృత్యు, భయ, వ్యాధుల
నరయు  నతడె పండితుండు. అతడు సుఖించున్.
స్థిర చిత్తముతో నుండును.
పరిహాసము సుఖ నిదురల భవ్యత నలరున్.
భావము:-
అపాయములు, వ్యాధులు, ముసలితనము, చావు, ఇవి ఎవ్వరికిన్నీ తప్పవు. కాని ఇవి తప్పవని ఎవ్వరును గుర్తించినట్లు ప్రవర్తించరు. వీటి అవశ్యంభావిత్వమును గుర్తించి ప్రవర్తించేవాడు పండితుడు. అట్టివానికి మనస్సు ఎప్పుడూ స్వస్థముగానే ఉంటుంది. అతడు సుఖంగా కూర్చుంటాడు. నిద్రిస్తాడు. పరిహాసంగా మాటలడుతాడు.
అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును. 
జైహింద్.
Print this post

8 comments:

Vasu చెప్పారు...

మాష్టారూ! పద్యం బావుంది. చిన్న సందేహం.
జరా అని వాడక్కర్లేదా? జర అని వాడచ్చా?
రెండవ పాదం లో అతడు అని (అచ్చు) వాడచ్చా యతడు అని అన్నక్కర్లేదా ??

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన వాసుగారూ!
మను చరిత్రలో సిద్ధుడు ప్రవరునితో అంటాడు "జరయు రుజయు మమ్ము జనకంగ వెరచును" అని.
జర అని వాడవచ్చునని మనక్ర్థమగుచున్నది కదా!
వాక్యావసానంలో సంధి లేమి దోషంబు కాదు.
విసంధి దోషము కాదు అనివ్యాకర్తల నిర్వచనము.
నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానానికి ఇంతవరకూ మాత్రమే తోచింది.

కామేశ్వరరావు చెప్పారు...

తత్సమ పదాలు సమాసంగా మారినప్పుడు, వాటి సంస్కృత రూపాలు వస్తాయి. సంస్కృతంలో "ఆ"కారాంతాలు కూడా తెలుగులో హ్రస్వాంతాలుగా మారతాయి. ఉదాహరణకి "సీతా" అన్నది సంస్కృత పదం, తెలుగులో "సీత" అవుతుంది. కాని సమాసంలో చేరిస్తే, "సీతారాములు", "సీతాదేవి" అని సంస్కృత ఆకారాంతం వస్తుంది. కాబట్టి జర పదానికి సంస్కృత పదం "జరా" (దీర్ఘాంతమైతే), సమాసంలో దీర్ఘమే రావాలి. "జరామరణములు" అని అంటాము కదా. "జరయు రుజయును" అన్నది సమాసం కాదు కాబట్టి అక్కడ దీర్ఘాంతం రానక్కరలేదు. అయితే "జర" పదానికి సంస్కృతంలో దీర్ఘ, హ్రస్వాంతాలు రెండూ ఉన్నట్టున్నాయి (Cologne Digital Sanskrit dictionary ప్రకారం). అందుచేత జరమృత్యు అన్నది కూడా సరైనదే అయ్యుండవచ్చు. పూర్వకవుల ప్రయోగాలేమైనా ఉన్నాయేమో తెలియదు.

"పండితుండు. అతడు" దగ్గర మరీ గ్రాంధికవాదులైతే నకారప్పొల్లు వచ్చి "పండితుండునతడు" అనాలి అంటారనుకుంటాను. "సుఖించున్" అన్నదగ్గర వచ్చినట్టు. యడాగమం మాత్రం కచ్చితంగా రాదు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

కామేశ్వర రావుగారు, పై సమధానానికి అనుసంధానమైన ప్రశ్న.

రామలక్ష్మణులు అనేది కూడా సమాసమే కదా. ఇక్కడ హ్రస్వరూపం వస్తున్నది కాబట్టి ఇలా వాడటం తప్పా లేక వేరే సూత్రం ఏమైనా వచ్చి ఇలా మారుతుందా?

Sanath Sripathi చెప్పారు...

"ఆకారాంత స్త్రీ లింగం సీతా" తో కలిస్తే సీతారాములు అనీ,
ఈకారాంత స్త్రీ లింగం గౌరీ తో కలిస్తే గౌరీశంకరులనీ వస్తునదేమో. రామలక్ష్మణులూ, బలరామకృష్ణులు ద్వంద్వ సమాసం అనుకుంట.

ఏమో సరిగా గుర్తులేదు.

సురేష్ బాబు చెప్పారు...

సమశ్శత్రౌచమిత్రేచ సదామానావమనయోః
శీతోష్ణ సుఖదుఃఖేషు సంస్సంగ వివర్జితః

కామేశ్వరరావు చెప్పారు...

భాస్కర్ గారు,

సంస్కృతంలో "రాముడు" (పుల్లింగ) శబ్దం "రామః", "రామా" అని దీర్ఘాంతం కాదు. అంచేత రామలక్ష్మణులు సరైన పదం. సంస్కృతంలో సాధారణంగా స్త్రీవాచకాలు దీర్ఘాంతాలవుతాయి. సీతా, రమా, గౌరీ, దేవీ, కమలా ఇలా. తెలుగులో హ్రస్వంగా మారతాయి. అందుకే ఈ పదాలు సమాసాలలో వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది. దీనికి కొన్ని ఎక్సెప్షన్లు ఉన్నాయి. "రతి" శబ్దం ఒక ఉదాహరణ. అది దీర్ఘాంతం కాదు. అంచేత "రతిదేవి", "రతిమన్మథులు" సరైన పదాలు. కాని తెలియక సాధారణంగా "రతీదేవి" అని అనేస్తారు.

సంస్కృతభాషలో పాండిత్యం సంపాదించడం కన్నా తెలుగు భాషలో పాండిత్యం సంపాదించడం కష్టమని ఇందుకే అంటారు :-) సంస్కృత భాష అయితే ఒక్క సంస్కృతం నేర్చుకుంటే సరిపోతుంది. తెలుగుభాషా పండితుడు కావాలంటే, తెలుగు సంస్కృతం రెండూ నేర్చుకోవాలి!

Vasu చెప్పారు...

మాష్టారు. నాది మిడి మిడి జ్ఞానం. ఏదో కొత్త విషయాలు చెప్తారు తెలుసుకుందాం అని అడిగాను కానీ అది తప్పని నా ఉద్దేశ్యం కాదు. నాకు చెప్పేంత పరిజ్ఞానం లేదు తెలుసుకునే ఉత్సుకత తప్ప. మీ ద్వారా, కామేశ్వర రావు గారి ద్వారా బోలెడు విషయాలు తెలిసాయి ఈ విధంగా. నెనర్లు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.