గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, నవంబర్ 2008, గురువారం

స్వాధీనతాచ పుంసాం మహదైశ్వర్యం వినాప్యర్థైః. మేలిమి బంగారం మన సంస్కృతి 9

ఆరోగ్యం మొదలైనవే నిజమైన ఆస్తి:-

మనలో ధనికులు, పేదవారు అనేక మందున్నారు. కొందరికి ఎంత ధనమున్నా అనారోగ్యము చేత తిండి తినుటకైనను నోచుకోక దుఃఖ జీవనము గడుపవలసి వచ్చును. కొందరికి ఎంత ధనమున్నను అక్షర జ్ఞానము లేక అక్షర ప్రపంచంలో అంధులులాగా జీవించ వలసి వచ్చును. కొందరికి ఎంత ధనమున్నను సజ్జన సాంగత్యము లేక సత్తుకు దూరమై నీరస జీవనము గడుప వలసి వచ్చును. కొందరు ఎంత ధనమున్నను కులీనులు కాకపోవుటచే అవమానకర జీవితము గడుప వలసి వచ్చును.. కొందరికి ఎంత ధనమున్నను ఇంద్రియ నిగ్రహము లేకపోవుటచే సమస్తమును కోల్పో వలసి వచ్చును. అందుకే విద్వాంసులేమన్నారో క్రింది శ్లోకంలో గమనిద్దామా!

శ్లోకము:-
ఆరోగ్యం విద్వత్తా స
జ్జనమైత్రీ మహా కులే జన్మ
స్వాధీనతాచ పుంసాం
మహదైశ్వర్యం వినాప్యర్థైః.

తేటగీతి:-
అరయ నారోగ్య విద్వత్తు లమరి యుండి,
సరస సన్ మైత్రి, సత్కుల జననమంది
ఇంద్రియాల జయించిన యింటి కాపు ,
పేదవాడయ్యు ధనికుండు పృథివి పైన.

ఆరో గ్యము, విద్వత్తు, సజ్జన మైత్రి, కులీనత, ఇంద్రియ నిగ్రహము ఇవి వున్న వాడు పేదవాడయ్యును ధనికుడే సుమా!
ఎంత ధనమున్నను పైన చెప్పిన ఐదూ లేకపోయినట్లయితే నిరు పేదయే సుమా. అందుకని మనము పైన చెప్పిన ఐదింటినీ కలిగియుండి ధనికవర్గానికి చెందిన వారి గా ఉండడానికి ప్రయత్నిద్దమా మరి?

జైహింద్.
Print this post

4 comments:

Sarath చెప్పారు...

చక్కని పద్యాన్ని అందించి నందుకు ధన్యవాదాలు.
కులీనత అంటే అర్ధం ఏమిటో తెలియజేయగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అయ్యా! శరత్ గారూ! మీరు శ్రద్ధగా చూస్తున్నందుకూ, సందేహాల్ని నిస్సందేహంగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నందుకూ మీకు నా అభినందనలు, ధన్య వాదములు. ఇక " కులీనత " అంటే " మంచి కులము నందు పుట్టుట. " అని అర్థం.
మీరూ ప్రయత్నిస్తే తప్పక పద్యాలు వ్రాయ గలుగు తారు.
యతి ప్రాసలు తెలుసుకోవాలనుకొంటే అక్టోబర్ నెలలో ఆంధ్రామృతంలో చూడగలరు.

Krishna K చెప్పారు...

రామక్రిష్ణారావ్ గారు, "మంచి కులం" అంటే ఎమిటి అనే ఇంకో ప్రశ్న కూడా వెంటనే వచ్చేస్తుంది (కావలనే అడుగుతారు) కాబట్టి, దానికి కూడ సమాధానం ఇచ్చేయండి, ఒక పని అయిపోతుంది, లేకపోతే, మీరు చెబ్తున్న మంచి విషయాలన్ని వదిలేసి, దీనిమీద ఓ బ్లాగ్ టపా కూడా వ్రాసేయగలరు (ఇప్పటికే వ్రాయటం మొదలెట్టక పోయి వుంటే!!)
ఇన్ని మంచి విషయాలు మన సంస్క్రుతి గురించి ఓపికగా, చెబ్తున్నందులకు కృతజ్ఞతలు. మా పిల్లలకు చెప్పటానికి రోజుకో విషయం గురించి చాలా బాగున్నాయి. కొన్ని రోజులు పోతే ఇలా చెప్పేవాళ్లు కూడా కరువు అయిపోతారు ఎమో? మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కృష్ణ గారూ! మీ విజ్ఞాన తృష్ణకు జోహార్.
మంచి కులం అంటే ఏమిటో చెప్పమన్నారు. సంతోషం.
గోవుల జాతి అనే అర్థంలో గోకులం అని ప్రయోగించడం మనకు తెలియని విషయం కాదు కదా. అలాగే మానవ సంబధ విషయము కాబట్టి మానవకులం అని గ్రహించనగును. ఇక మంచి అనే పదానికి వేరే వివరణ చెప్పనక్కరలేదనుకొంటాను. ఈ సమాజం మెచ్చుకొనేలాగ మంచి చరిత గల కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. సంస్కృత శ్లోకానికి అనువాదం సులభ గ్రహణ కోసం చేస్తున్నాను. " యత్ సార భూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం." మంచి ఉందనుకొంటే గ్రహించండి. లేదనుకొంటే విడిచి పెట్టండి.
మీ సూచనకు, సహృదయతకు ధన్య వాదములు. నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.