గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2008, శుక్రవారం

ద్వారం ద్వార మటన్ భిక్షుః . . . మేలిమి బంగారం మన సంస్కృతి 18

యాచకుని హిత బోధ:-
సృష్టిలో మనం గ్రహించ గలిగితే అడుగడుగునా ప్రతీ అంశమూ మనకు పాఠాలు నేర్పుతాయి. మన యింటికి వచ్చే భిక్షగాడి విషయమును ఒక శ్లోకంలో ఎలా చెప్పాడో చూద్దామా?
శ్లో. ద్వారం ద్వార మటన్ భిక్షుః శిక్షత్యేవ న యాచతే
అ దత్వా మాదృశో మాభూః దత్వా త్వం త్వాదృశో భవః.

క. పెట్టక నావలె యుండక
పెట్టుచు మీవలెనె యుండి పెంపును గనుడన్
చట్టుల చెప్పక చెప్పెడి
దిట్ట కదా ముష్టి వాడు. తెలియగ వలదా!

భావము:- ముష్టి వాడు ఇంటింటికీ వచ్చి యాచిస్తున్నాడనుకొనుట కంటే హెచ్చరిస్తున్నాడనుకోవడం మంచిది. ఎలాగంటారా? దానము చేయుట మాని నాబోటి వారు కాబోకుడు. పెట్టి మీవలె మీరుండండి. అని సోదాహరణంగా గృహస్తులను శిక్షిస్తున్నాడనుకొనినచో సముచితంగా నుండును కదా.
ఇంటికి వచ్చిన భిక్షకులను తూలనాడ రాదు. వీలయినచో ధర్మముగా వారి భాగమును వారికర్పించ వలయును. అటుల చేయలేని పక్షమున మంచి మాటలతో తృప్తి పరచి పంప వలెను.
ధర్మం చేయండని యాచకులడుగుట మనకు తెలియునుకదా. ధర్మం అంటే మన ఇంటిలో గృహిణి తాను వంట చేసే ముందు అందరి కొరకై వండే అన్నముకొరకై తీసే బియ్యములోనుండి ఒక పిడికెడు బియ్యం ప్రక్కన వేరే చోట పెట్టుట, ఆ బియ్యం యాచకులకు పోయుట మనకు తెలియును కదా. అదే ధర్మం. ఆ ధర్మాన్నే భిక్షకులు మననుండి కోరేది. వారి వాటా వారికి ఈయకపోతే పాపం కదా! పూర్వ జన్మలో ధర్మం చేయకే తాను యాచకుడవవలసి వచ్చిందనీ, ఈ జన్మలో మనం ధర్మం చేయక రాబోయే జన్మలో తనవలె యాచకులుగా కాక ఈ జన్మలో ధర్మం చేసి మనం మనంగా వుండేందుకు ప్రయత్నించాలని యాచకుడు మనకు చేస్తున్న బోధగా గ్రహించాలి. మరి మీరేమంటారు?
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

చక్కటి హితబోధ.ముష్ఠివాళ్ళను నిందించే బదులు వారినుండి నేర్చుకొని వ్రాసినది చాలాఉన్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.