గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, నవంబర్ 2008, సోమవారం

ఆరోప్యతే శిలా శైలే . . . మేలిమి బంగారం మన సంస్కృతి 12


మంచీ - చెడూ.
పుట్టినప్పుడు అందరం అకళంక హృదయులమే. కొంచెం జ్ఞానం వచ్చిన పిదప మనం మంచిగా సంతోషంగా బ్రతకాలనుకొంటాం. కాలక్రమేణా మనలో మంచీ చెడ్డా ప్రవేశిస్తాయి. సుఖంగా బ్రతకాలనే తపన కూడా మొదలౌతుంది. స్వార్ధం మనను క్రమ్ముకొన్న తరువాత మనం ఏం చేస్తున్నామో మంచో చెడో తెలిసికొన లేని మాయ మనల్ని ఆవరిస్తుంది. మంచి నేర్చుకోవడం చాలా దుష్కరంగా వుంటుంది. చేడ్డ ఆశించక ముందే మనల్ని ఆవరిస్తుంది. ఈ క్రింది శ్లోకాన్ని చూద్దామా మనం.

శ్లో. ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా
నిపాత్యతే క్షణేనా2ధః తథాత్మా గుణ దోషయోః !

గీ. పర్వతము పైకి శిల మోయు పగిది, మంచి
నరయు టెన్నగ కష్టంబు నరుని కిలను.
పర్వతము నుండి త్రోయగ పణుకు వోలె.
సులభముగ చేరు మదు లందు మలిన బుద్ధి.
భావము:- వద్దన్నా వచ్చి చేరేది చెడ్డ బుద్ధి. ఎంత ప్రయత్నించినా అలవరచు కొనుటకు సులభముగా వంట పట్టనిది మంచి బుద్ధి.
ఒక ఎత్తైన కొండ పైకి ఒక బండ రాయిని మోసుకొని పోవుట ఎంత కష్టమో మంచి నేర్చుకొనుట అంత కష్టము. ఆట్టి బండ రాయిని కొండ పైనుండి క్రిందికి త్రోసివేయుట ఎంత సులభమో చెడు నేర్చుకొనుట అంత సులభము. హృదయం లోనికి చెడు ప్రవేశించడం మొదలెడితే కొండమీది నుండి క్రిందికి జారి పడుతున్న బండ రాయి వలె వద్దన్నా వదలకుండా మనల్ని ఆక్రమిస్తుంది.
ఇది తెలుసుకొనిన మనం మనలో ప్రవేశించడానికి సిద్ధంగానున్న చేడ్డ విషయంలో యెలా జాగ్రత్త పడాలో ఎంతో సాధన చేస్తేనే కాని అలవడని మంచి గ్రహించే విషయంలో ఎలా ప్రవర్తించాలో తెలివి కలిగి మసలుకోక తప్పదు కదా! ఆలోచించుకొని సాధన చేద్దామా మరి ?
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.