గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2008, శనివారం

కవి సామ్రాట్ విశ్వనాధ భావుకత 8

కవి సామ్రాట్ వుశ్వనాధ భావుకతను గూర్చి కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి వివరణను మీ ముందుంచుతూ యిప్పుడు 8 వ భాగాన్ని ఉంచుతున్నాను.

రామాయణ కల్ప వృక్షము కిష్కింధా కాండ లో 1 లో 8 వ పద్యము.
మత్తేభము:-
వనమీనాటికినయ్యె బిల్వ బదిరాశ్వత్థంబు లీతీర్పు తీ
ర్చిన త్రోవన్ తొలి నాటికిద్ది క్రతు ధాత్రిన్ బోలె కన్ పించుచున్
తనయున్ జానకియున్ జనుర్విభవ వృత్తాంతంబు లా పంప యొ
డ్డున దుఃఖోల్బణ కంఠ రోధములు గండూషించె ప్రాణేశుడున్.

జీవితంలో సుఖ దుఃఖాలు బండి చక్రం ఆకుల వలె పర్యాయంగా వస్తూ పోతూ వుంటాయి. రెండూ శాశ్వితం కావు. రామునకు సీతా వియోగం భిన్న భిన్న కోణాల్లో దఃఖ కారకం అవుతోంది.

పంపా అరణ్య భూముల్లో బిల్వ, బదిర, అశ్వద్ధ వృక్షాలు కనిపిస్తున్నాయి. ఈ వృక్షాలు పవిత్రమైనవి. వీటి కాండాన్నే యజ్ఞాల్లో యూప స్తంభాలుగా వుపయోగిస్తారు. పవిత్ర యజ్ఞ కార్యములందుపయోగపడే ఆ వృక్షాలను చూడగానే తన తండ్రి దశరథ మహారాజు చేసిన యజ్ఞాలు రామునకు జ్ఞప్తికి వచ్చాయి. యూప స్తంభాల కోసం ఆనాడు ఖండింప బడిన ఆ వృక్ష కాండములు తెరిగి చిగిర్చి, కొమ్మలు వేసి, మహా వృక్షములై ఇన్నేళ్ళకు ఈ ప్రాంతాన్ని అడవిగా చేసాయి గదా అని తలంచిన రామునికి తన యొక్క పవిత్ర జన్మను, జానకి యొక్క పవిత్ర జనన ఘట్టాన్నీ, జ్ఞప్తికి తెచ్చాయి. దానితో పాటు ప్రస్తుత దురవస్థా జ్ఞపకం వచ్చింది.

పద్యంలో క్రతు స్మరణ రామునికి తన జన్మ వృత్తాంతం జ్ఞాపకంచేసింది. తాను పవిత్ర యజ్ఞ ఫలముగా ప్రభవించిన వాడు. జానకీ జన్మ వృత్తాంతం కూడా అటువంటిదే. జనకుడు యజ్ఞం కోసం భూమిని దున్ను చుండగా ఆమె ప్రభవించింది. క్రతు ధాత్రి వంటి తన యొక్క, సీత యొక్క పవిత్ర జన్మలు స్ఫురించిన రామునికి తమ జీవితములు నేడు యిలా అడవిలా అయిపోయాయికదా అని అనిపించి, దఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఆ గాద్గద్యములతో కూడిన దఃఖాన్ని భరించాడు.

అత్యంత ప్రతిభావంతమైన కల్పనలో విరిసిన కవి భావుకతకు సాక్ష్యం యీ పద్యం. రుద్ధ కంఠము నాయకుని నిర్వేద స్థితిని తెలుపుతుంది. నిర్వేదము ఒక సంచారీ భావము. రోదనము తత్ సంజాతము. రస నిర్వహణ యందు శాస్త్ర ప్రావీణ్యము కవి భావనను దీప్తిమంతం చేస్తుంది. విప్రలంభ శృంగార నాయక అవస్థలన్నీ ప్రస్తుత వర్ణనలో అంతస్సూచ్యంగా విశ్వనాధ వారు ప్రవేశ పెట్టారు.

చూచారా విశ్వనాధవారి భావుకతను శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వివరించిన విధాన్ని. మరొక పర్యాం మరొక పద్యాన్ని గూర్చి మీముందుంచే ప్రయత్నం చేయగలను.
జైహింద్. Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పైన వ్రాయ బడినది 9 వ భాగము కాదు. పొరపాటున 9 అని పడింది. దీనిని 8 వ భాగముగా పాఠకులు గ్రహించ వలసినదిగా మనవి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.