కవి సామ్రాట్ విశ్వనాధ భావుకత ను శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు వివరించిన మరొక పద్యాన్ని మీ ముందుంచుతున్నాను.
రామాయణ కల్ప వృక్షంలోని కిష్కింధా కాండలో 1 -లో 7 వ పద్యం
ఆటవెలది::-
రేగి ముదురు వెలగ క్రింద ముగ్గిన పండ్లు
రాలి కమ్మ తావి గాలి సాగ
మూగికొనిన తేటి మొత్తమ్మునకు స్పృహా
స్పృహల నడుమ తత్తరింపులయ్యె.
శ్రీరాముడు సీతాన్వేషణ చేయుచూ, పంపా నదీ తీరమున ఉండగా అక్కడి ప్రకృతిని వర్ణించుతూ విశ్వనాధ వారు చెప్పిన పద్యం.
శ్రీరాముని మనసు విషాద మగ్నమయి ఉంది. అక్కడి ప్రకృతి సౌందర్యమునందు అనుభవము - నిరనుభవము అయిన ద్వంద్వ స్థితులను పొందుతున్నది. సీతా విషయికమైన స్నేహ నిరీహల యందు రామ హృదయం తల్లడిల్లుతున్నది.
పెద్ద పెద్ద వెలగ చెట్ల క్రింద ముగ్గిన వెలగపండ్లు రాలిపోయి యున్నవి. ఆ పండ్ల పరిమళం గాలిలో కమ్మగా తేలిపోతోంది. ఇక తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆ పండ్లపై వ్రాలి మళ్ళీ గాలిలోకి లేచిపోతున్నాయి. మరల ఆ సుమధుర పరిమళాన్ని వదల లేక స్పృహా స్పృహల మధ్య తత్తర పడుతూ అక్కడే తిరుగుతున్నాయి. ఇదీ పద్యం లోని భావము.
తుమ్మెదల గుంపు వెలగ గుజ్జు రసాన్ని ఆస్వాదించ లేదు. పూల మకరందమే వాటికాహారం. ఐతే ఇక్కడ మిగల మ్రుగ్గిన వెలగ పండ్ల పరిమళం తుమ్మెదల్ని మోసం చేస్తున్నది. పూల వాసనతో కూడిన మకరందం అని ఆ తుమ్మెదలు భ్రమిస్తున్నాయి.
ఆస్వాదనీయంగా కనిపించే ఫల రసం ఆస్వాదనీయం కాకపోయినా మత్తెక్కించే ఆ పరిమళ తరంగాల యందు లీనమౌతున్న తుమ్మెదలు ... శ్రీరాముని స్పృహా స్పృహల నడుమ నలుగుతున్న ఆలోచనలే కదా!
సీతావిషయకముగా ఆశ అంతలోనే నిరాశ ...... ఆశ నిరాశల మధ్య తత్తరపడుతున్న శ్రీరామ హృదయానికి ఈ పద్యం దర్పణం పడుతోంది. ఎంతటి భవుకత!
చూచారుకదా కవి వతంసుని ప్రసంగంలో వెలుగు చూచిన వీశ్వనాధుని భావుకత. మళ్ళీ కలుసుకొన్నప్పుడు మరొక పద్యంలోని భావుకతను మీముందుంచే ప్రయత్నం చేస్తాను. జైహింద్.
Print this post
లాక్షాగృహమందు లవుడు లంకిణి గూల్చెన్. అనే సమస్యకు శ్రీ మరుమామల
దత్తాత్రేయావధాని పూరణ.
-
జైశ్రీరామ్.
శ్రీ మరుమామల దత్తాత్రేయావధాని
సమస్య.
*లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్.*
*మా తమ్ముని పూరణ.*
కం. రక్షణనిడె భీముడెచట?
రక్షాంతక రామ త...
4 రోజుల క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.