గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2008, శనివారం

చితా, చింతా ద్వయోర్మధ్యే . . . మేలిమి బంగారం మన సంస్కృతి 11

చితి - చింతల తారతమ్యం.

మానవులు ఎంత భోగ భాగ్యాలతో తులతూగుతున్నా కొందరిలో ఏదో తెలియని లోటు, ఏదో తెలియని విచారం, అంతుచిక్కని ఆలోచనలు, వాటి వలన వారు కృంగిపోవడం మనం గమనిస్తుంటాం. ఈ విషయంలో ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలిద్దాం.
శ్లో. చితా, చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీ.
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణ యుతం వపుః !

క. చితికిని చింతకు నడుమన
చితి కన్నను చింత గొప్ప. జీవము పోవన్
చితి కాల్చును భౌతికమును,
బ్రతికుండగ కాల్చు చింత. పరికించుడయా !

భావము:- భూమిపై చితి కన్నా చింత గొప్పది. చితి జీవము పోయిన పిదప మాత్రమే మన శరీరమును దహించును. చింత ఆవిధముగా కాక అది బ్రతికుండగనే మానవుని దహించివేయును.
మనము చేయ గలిగినదీ, చేయదగినదీ ఒక్కటే. శక్తి వంచన లేకుండా న్యాయ బద్ధంగా కృషి చేయడం. ప్రాప్తించిన దానితో తృప్తి పడడం. అలా వుంటే మనలను చింత అన్నదే సమీపించదుకదా !. ఆరోగ్యంగా, హాయిగా వుండగలుగుతాం కదా ! అందుకని అలా చేయడానికి ప్రయత్నిద్దామా మరి?
జైహింద్.
Print this post

4 comments:

Unknown చెప్పారు...

మీ పోస్టు ఇప్పుడే చూచాను.ఇదే శ్లోకానికి నేను చేసిన అనువాదం
చితి చింతల రెంటి నడుమ
చితి కంటెను చింత యధిక చింతా కరమౌ
చితి కాల్చును నిర్జీవిని
చితి లేకయె కాల్చు చింత జీవము తోనే.
దయతో తప్పులు వుంటే సరిదిద్దగలరు. మీ అభిప్రాయం తెలియజేయండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నరసిం హా! పద్యములో
సురుచిరమగు భావముండె. చూచితినయ! నే
నరయగ దోషము లేదయ.
వర పెద్దాపుర నివాస, వర గుణ పోషా!

Unknown చెప్పారు...

దయతో నా మరొక బ్లాగ్ sooktimuktaavali.blogspot.com ను చూచి మీ అభిప్రాయం తెలియజేయగలరు.
మీ పొగడ్తకి ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చితి చింత అను వానిని గూర్చి చెప్పిన పద్యంలో 2 వ పాదంలో చితి చింత తారుమారయాయి. సరిచేసి ఇక్కడ వ్రాసినది చూసి సరయిన విషయ గ్రహణ చేయగలందులకు మనవి

కందము:-
చితికిని చింతకు నడుమన
చితి కన్నను గొప్ప చింత . జీవము పోవన్
చితి కాల్చును భౌతికమును
బ్రతికుండగ కాల్చు చింత. పరికించుడయా !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.