గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, నవంబర్ 2008, శనివారం

సత్యపిచ సుకృత కర్మణి . . . మేలిమి బంగారం మన సంస్కృతి 20

దుష్ట స్వభావ ఫలము:-

మనము పుణ్య కర్మల నెన్నిటిని చేయు చున్నను మన ప్రవర్తన దుష్ట మార్గమున నున్నచో అవి అన్నియు వ్యర్థములు సుమా! ఈ విషయమున ఒక చక్కని శ్లోకము కలదు. పరిశీలిద్దామా!
చూడండి.
శ్లో. సత్యపిచ సుకృత కర్మణి
దుర్నీతిశ్చే చ్ఛ్రియం హరత్యేవ
తైలైః సదోపయుక్తానాం
దీప శిఖాం విదళయతి హి వాతాళిః .

గీ. పుణ్య కర్మలు చేసెడి పురుషునకును
దుష్టుడగునేని శ్రీలెల్ల నష్ట మగును.
తైల మెంతగా నున్నను దీప కళిక
నార్పి వేయును సుడిగాలి యరసి చూడ.

భావము:- ఎంత తైలము వున్నప్పటికీ దీపమును సుడిగాలి ఆర్పివేయు విధముగా మనుజునిలో దుస్స్వభావములు, దుశ్చేష్టలు ఉన్నచో అట్టి వాడు ఎన్ని పుణ్య కార్యములు చేయుచుండువాడైననూ వాని శ్రీలెల్ల హరించుకుపోవుట తథ్యము .
ఇది తెలుసుకొనిన మనము దుశ్చేష్టలకు దూరముగా నుండి, పుణ్య కార్యాచరణ వలన పుణ్య శ్రీని, శ్రీలను సంపాదించుకొనుచు నిలబెట్టు కొనుట అన్ని విధములా శ్రేయస్కరమే కదా! అందుకని అలా చెద్దామా!
జైహింద్.
Print this post

2 comments:

kRsNa చెప్పారు...

మంచి ఆటికల్ని అందించినందుకు కృతజ్ఞ్యతలు. :)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కృష్ణ గారూ! మీరు నా ఆర్టికల్స్ చదివుతున్నందుకూ, ప్రత్యేకించి మీ అభిప్రాయం తెలియ జేసినందుకూ మీకు నా ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.