గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2025, మంగళవారం

కవిసింహ పోకూరి కాశీపత్యవధానుల సాహితీపురస్కారము నాకు లభించుట ఆ జగన్మాత అనుగ్రహఫలమే కాని అన్యము కాదు.(తే.27 - 01 - 2025.)

జైశ్రీరామ్.



సభలో నేను చదివిన పద్యములు.
అనేక కంద గీర గర్భ ఉత్పలమాల.
👇🏼
శ్రీ పతియే భువిన్ కనఁగ శ్రీగతి నొప్పెడి కావ్యకర్త  కా
శీ పతియై సదా సుధలు చిందు తపస్విగ శోభగూర్చు దు
ర్గా పతిగా కృతిన్ జయ సుగణ్యత నొప్పును చిత్ర రీతియై,
భూపతి యేలె నీ కవిని పూజ్యత నిల్పె, ప్రకాశమిచ్చి, హా!

ఉత్పల గర్భస్థ కందం1.
👇🏼
శ్రీ పతియే భువిన్ కనఁగ శ్రీ
గతి నొప్పెడి కావ్యకర్త  కాశీ పతియై 
పతిగా కృతిన్ జయ సుగ
ణ్యత నొప్పును చిత్ర రీతియై భూపతియే.

ఉత్పల గర్భస్థ కందం2.
👇🏼
పతియై సదా సుధలు చిం
దు తపస్విగ శోభగూర్చు దుర్గా పతిగా
పతి యేలె నీ కవిని పూ
జ్యత నిల్పె, ప్రకాశమిచ్చి, హా!శ్రీ పతియే.

ఉత్పల గర్భస్థ కందం3.
👇🏼
పతిగా కృతిన్ జయ సుగ
ణ్యత నొప్పును చిత్ర రీతియై భూపతియే.
శ్రీ పతియే భువిన్ కనఁగ శ్రీ
గతి నొప్పెడి కావ్యకర్త  కాశీ పతియై.

ఉత్పల గర్భస్థ కందం4.
👇🏼
పతి యేలె నీ కవిని పూ
జ్యత నిల్పె, ప్రకాశమిచ్చి, హా!శ్రీ పతియే.
పతియై సదా సుధలు చిం
దు తపస్విగ శోభగూర్చు దుర్గా పతిగా.

ఉత్పల గర్భస్థ తేటగీతి.
👇🏼
కనఁగ శ్రీగతి నొప్పెడి కావ్యకర్త
సుధలు చిందు తపస్విగ శోభగూర్చు
జయ సుగణ్యత నొప్పును చిత్ర రీతి
కవిని పూజ్యత నిల్పె, ప్రకాశమిచ్చి, 

అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
* * *
[2:46 pm, 6/2/2025] పురుషోత్తములు భువనగిరి. బీరంగూడ: కందము
చిత్రకవితావిశిష్టులు
పాత్రులుస్తుతికిన్ మహత్వ భాషా వేత్తల్
మిత్రులు కవితల్లజులకు
ఛాత్రుల దీవించగలుగు సచ్చారిత్రుల్.

కందము 
గర్భకవిత్వమునన్ సం
దర్భోచితవాక్ప్రవృత్తి ధారా శుద్ధిన్
నిర్భరభావావిష్కృతి
నిర్భీకత మీకు సాటి నేగన నౌరా!

చంపకమాల 
ఎనుబది యేండ్లు చేరువగు నీతరుణంబున గూడ నెంతయో
చినపిలవానివోలెకవి సింగపు కూనవిభాతి మీరలున్
ఘనతర సత్క విత్వఝరి కమ్రము గాప్రవహింపజేయుటో
యనఘ!మహాద్భుతం బనెద, నయ్యరొ మీకివె నానమస్కృతుల్.

చింతా వారల బొగడగ
స్వాంతంబానందవార్ధి వైళమ మున్గున్
గంతుల్ వేయును దేహము
సంతోషము తోడ  హితుని సామీప్యమునన్.

గురుతుల్యులు
శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి కాశీపత్యవధాని వారి స్మారక పురస్కారం అందుకున్న సందర్భంగా అభివందనములు 🙏
[2:49 pm, 6/2/2025] పురుషోత్తములు భువనగిరి. బీరంగూడ: సభలో చదువుటకు రాసుకుని వచ్చాను.సమయాభావంతో మిన్నకుండిపోయాను.

మరో సభలో నాగళంతో వినిపిస్తాను
🙏
[5:54 pm, 6/2/2025] Chinta Ramakrishnarao: అయ్యో! మీ మైత్రీభావపూర్ణ్ విశాలహృదయ సూర్యప్రకాశంలో  సామాన్యుఁడనయిన నేను ప్రకాశించుట, అంతా ఆ అమ్మదయయేనండిం నిజానికి మీ యంతటి సమర్ధుఁడను కాను నేను. మీరు బహుముఖప్రజ్ఞాశాలి. నేనా ఏదో ఆ జగన్మాత వ్రాయించేవే తప్ప స్వసామర్ధ్యంతో వ్రాసేవేవీ లేవండి. మీ అభిమానం నా ఊహకందలేదు. మీకు నా ధన్యవాద పూర్వక నమస్కృతులు. పద్యాలు మీరు అలవోకగా మనోజ్ఞంగా వ్రాయగలరని తెలుసును కాని ఇప్పుడు స్వయంగా చదివి తెలుసుకున్నాను.  మీలోని భావౌన్నత్యాన్ని నాపై ప్రసరించారు.  అవకాశం కుదిరినప్పుడు మీ గాత్రంలో సభాముఖంగా వినే భాగ్యం నాకు కలుగుతుందని భావిస్తున్నాను.🙏🏼🙏🏼🙏🏼.
[6:26 pm, 6/2/2025] Chinta Ramakrishnarao: ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

కంద గీత గర్భ చంపకమాల.
👇🏼
ఘన పురుషార్థమై, వినుత కావ్యరమాప్రియ విశ్వ తేజమై
కన వరమై జగత్ స్తుత ప్రకాశ రసార్ణవ శోభ పూర్ణ క
ల్పన పురుషోత్తమా కృతి విభాతి రహించెను, కీర్తి గొల్పి తే
ల్చెను స్వరమైత్రితో ప్రకృత చిద్వర భావన భాగ్యమైతివా?
🙏🏼
చంపక గర్భగత కందము.
👇🏼
పురుషార్థమై, వినుత కా
వ్యరమాప్రియ విశ్వ తేజమై, కన వరమై 
పురుషోత్తమాకృతి విభా
తి రహించెను, కీర్తి గొల్పి తేల్చెను స్వరమై.


చంపక గర్భగత తేటగీతి.
👇🏼
వినుత కావ్యరమాప్రియ విశ్వ తేజ
స్తుత ప్రకాశ రసార్ణవ శోభ పూర్ణ
కృతి విభాతి రహించెను, కీర్తి గొల్పి
ప్రకృత చిద్వర భావన భాగ్యమైతి.
🙏🏼
ఇంకా చాలా కందాలున్నాయి చంపకంలో.

అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.🙏🏼
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.