జైశ్రీరామ్.
"విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవాయనమః"
అని రుద్రనమకంలో చెప్పబడింది.
దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు
1. విశ్వేశ్వరుడు,
2.మహాదేవుడు,
3. త్ర్యంబకుడు,
4.త్రిపురాంతకుడు,
5.త్రికాగ్నికాలుడు,
6.కాలాగ్నిరుద్రుడు,
7.నీలకంఠుడు,
8.మృత్యుంజయుడు,
9.సర్వేశ్వరుడు,
10. సదాశివుడు,
11. శ్రీమన్మహాదేవుడు.
౧ తే.గీ. వినుత విశ్వేశ్వరా! నీదు విభవమెన్న
విశ్వవిజ్ఞానవేత్తకే వీలుపడును,
మానవుఁడనైన నేనెట్లు మన్ననమున
చెప్పఁనౌనయ? నీవె నన్ జేదుకొమ్ము.
౨ తే.గీ. ఓ మహాదేవ! సన్నామ! యో మహేశ!
నిన్ను సేవింప నీవౌచు నేనునొప్పి
నప్పుడే సాధ్యమౌనేమొ? యాదిశక్తి
కృపను పొంది నే సేవింతు నుపమ రహిత!
౩తే.గీ. ఓ త్రయంబకా! నీ శక్తి నొప్పుదీవె,
సాటినీకేది? జననియే సాటి నీకు,
నన్ను మన్నించి, నిన్ సదా మన్ననమున
జపము చేయంగఁ జేయుమా, జయనిధాన!
౪తే.గీ. వినుత త్రిపురాంతకా! నాదు వినుతి వినుము,
జ్ఞాన సంపత్ప్రభనుఁ గొల్పి కాంక్షతీర
నీదు రూపంబు మదిలోన మోదమునను
కాంచునట్టులఁ జేయుము, కాలకంఠ!
౫తే.గీ. హర! త్రికాగ్ని కాల! ధర మో హము ను వీడి
నీదు దివ్యాగ్ని తేజంబు నేను గనుచు
నిన్ను నభిషేకమునుఁ జేయనిమ్ము దయను,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౬తే.గీ. జయము! కాలాగ్ని రుద్రా! ప్రశాంతతనిడి
నీదు మహనీయ రూపంబు నేర్పు మీర
నాదు మదినెన్ని నిరతంబు మోదమలర
సేవలన్ జేసి తనియనీ, చిత్స్వరూప!
౭తే.గీ. నీలకంఠా! యుమానాథ! నిర్వికార!
నిత్యకల్యాణ కారకా! నీ మహత్వ
మెన్నుచున్ దృప్తి పొందనీ యీశ్వరుండ!
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౮తే.గీ. దేవ! మృత్యుంజయ! జయము, దేవదేవ!
మృత్యుమార్గంబు నెడఁబాపి సత్యపథము
నందు నన్నిల్పి, నీ కృపనందనిమ్ము,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౯తే.గీ. దివ్య సర్వేశ్వరా! జ్ఞానదీప్తి నీవె,
సర్వమీసృష్టి నీదౌను నిర్వికార!
మంచినే పెంచి మాలోన మానవతను
దైవశక్తిగా మార్చుమా! తత్త్వమరయ.
౧౦తే.గీ. ఓ సదాశివా! లోక సద్భాసమాన
పూర్ణరూపంబునీది, నిను పూర్తిగాను
చూచు చిచ్ఛక్తి నాకిమ్ము శుభగుణాఢ్య!
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౧౧తే.గీ. వినుత శ్రీమన్మహాదేవ! విశ్వనాథ!
ముక్తిమార్గము చేరంగ భక్తి నిమ్ము,
భక్తి నీ పాదములపైన వరలనిమ్ము,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
🙏🏼🙏🏼🙏🏼
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.