గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2025, బుధవారం

తెలంగాణ సాహిత్య సమాలోచన. దోమకొండ కోటలో తే. 12 - 01 - 2025 న.

 జైశ్రీరామ్.




ఓం శ్రీమాత్రే నమః.

తెలంగాణ ప్రాచీన శతక సాహిత్యం.

ఆంధ్ర వాఙ్మయమున కావ్య ప్రక్రియలలో శతకమొకటి.

ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది.

తెలుగులో 12వ శతాబ్దంలో శతకమావిర్భవించినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది. తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు.

కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.

శతకం లక్షణాలు

శతేన ప్రోక్తం శతకం  వందకాని అంతకు మించి కాని పద్యములు లేదా శ్లోకములుంవలెను. శతకములో ప్రతి పద్యానికీ చివరలో మకుటము ఉండవలెను. విశ్వదాభిరామ వినురవేమ, సుమతీవేంకటేశ్వరా, దాశరథీకరుణాపయోనిధీ వంటివి.

తెలంగాణ ప్రాచీన శతకములు.

మల్లికార్జున పండితారాధ్యుడు రచించిన శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు మొదటిదిగా చెప్పవచ్చును.

1) పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము.

2) భద్రభూపాలుడు(బద్దెన) (13)- ”సుమతిశతకము,

3) కంచర్ల గోపన్న(17) -  దాశరథీ శతకము,

4) కాకుత్థ్సం శేషప్పకవి (18) - నరసింహ శతకము,  శ్రీనృకేసరి శతకము, నరహరి శతకము,

ఇతని మనుమడు

5) కాకుత్థ్సం నరసింహదాసు (18)- కృష్ణ శతకము,

6) బమ్మెర పోతన (15)- నారాయణ శతకము,

7) శివదేవయ్య ప్రతాపరుద్రుని మంత్రి (14) - శివదేవ ధీమణీ శతకము,

8) శరభాంకుఁడు.  రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానకవి (1296-1323)  - శరభాంక లింగమ శతక కర్త,

9) త్రిపురాంతక కవి - అంబికా శతకము,

10) వెన్నెల కంటి చంద్రశేఖర కవి - హరిశ్చంద్ర శతకము,

11) పరశురామ రామ్మూర్తి పంతులు - పరశురామ శతకము,

12) ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు - ముకుంద శతకము,

వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో (వాటిలో అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ట్య, నిర్వచన కావ్యాలు ఉన్నవి) 60 విలక్షణమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు నూరుకు మించే ఉన్నాయి.

13) సముద్రాల లక్ష్మీనరసింహాచార్యులు - లక్ష్మీ నృసింహ శతకము,

 

1) పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము.

పాల్కురికి సోమనాథుడుమల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు. "శివకవి త్రయం"గా ప్రసిద్ధులు.

శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వైష్ణవ దంపతులకు పాల్కురికి గ్రామంలో జన్మించాడు.  తెలుఁగు, సంస్కృత, కన్నడ, ద్రవిడ భాషలలో పండితుఁడు.  వీరశైవం లోకి ప్రవేశించి దీక్ష ధరించెను.

1. అనుభవసారము 2. బసవ పురాణము 3. వృషాధిపశతకము 4. అక్షరాంక గద్య 5. అక్షరాంక పద్యములు  6. పంచప్రకారగద్య 7. శరణుబసవ గద్య (కన్నడం, తెలుగు) 8. అష్టోత్తర శతనామ గద్య (సంస్కృతం) 9. సద్గురు రగడ (తెలుగు, కన్నడం) 10. గంగోత్పత్తి రగడ (అలభ్యం) 11. బసవోదాహరణము (తెలుగు, సంస్కృతము) 12.చతుర్వేదసారము (బసవలింగ శతకము) 13.  సోమనాధ భాష్యము (సంస్కృతం) 14. రుద్రభాష్యము (అలభ్యము) 15. వృషభాష్టకము (సంస్కృతం) 16. చెన్నమల్లు సీసములు 17. సోమనాధ స్తవము 18. మల్లమదేవి పురాణము (అలభ్యం) 19. పండితారాధ్య చరిత్ర మొదలైనవి.

 

ఉ.  శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వల కీర్తి! సత్క్రియో

ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా

భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే

వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా! 1

 

ఉ.  అక్షయభక్తిపక్ష! బసవాక్షర పాఠక కల్పవృక్ష! రు

ద్రాక్ష విభూతిపక్ష! ఫలితార్థ ముముక్ష! శివప్రయుక్త ఫా

లాక్ష! కృపాసమంచిత కటాక్ష! శుభాశుభ పాశమోక్ష! త

త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!       7

 

ఉ.  "హృన్నళినే స్మరామి భవదీయ పదద్వితయం భవాటన

స్విన్న తను శ్రమాపహ మశేష జగత్ప్రణుతం మదీశ ని

ష్పన్న దయానిధే" యనుచు 'సంస్కృతభాష' నుతింతు నిన్ను వి

ద్వన్నుత నామధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!     59

 

చ.  "పరమనె యన్నె యాండవనె పన్నగతానె యనాథ నాధనే

పెరియనెపే నివుందనవె పేరు డయాననె పేరు జెప్పనే

తరి మురియాయనే" యనుచు 'ద్రావిడభాష' నుతింతు మన్మనో

వరకరుణా విధేయ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!      60

 

చ.  "హసుళెయరన్న రక్షిసు వుహారయలెన్న వనీవనెందు

న్నిసువుడు నిమ్మడింగెరగ నిమ్మ ప్రసాదిత నిమ్మదాత్మ వే

కసిగతి" యంచు భక్తి నినుఁ 'గన్నడభాష' నుతింతు షడ్గుణ

శ్వసన పురాతనాత్మ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!     61

 

చ.  "అనయముఁ జేతులందు భవదంఘ్రి సరోజయుగం నమామి నె

మ్మనమున సంస్మరామి యను మాటల నిన్‌ వరివస్క రోమ్య హ"

మ్మనుచు 'మణిప్రవాళము'న నంకన సేయుదు భక్తలోక హృ

ద్వనజ విహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!    63

 

చ.  బలుపొడ తోలు చీరయును పాపసరుల్‌ గిలుపాడు కన్ను వె

న్నెల తలఁ జేఁదు కుత్తుకయు నిండినవేలుపుటేఱు పల్గు పూ

సలు గలఱేని లెంకవని 'జానుఁదెనుంగు'న విన్నవించెదన్‌

వలపు మదిన్‌ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా!    67

------------------

2) భద్రభూపాలుడు(బద్దెన)(1300) నీతి ప్రబోధకమైన సుమతిశతకాన్ని, నీతి శాస్త్ర ముక్తావళిని రచించాడు. కమలాసన బిరుదాంకితుడైన ఈ కవి గణపతి చక్రవర్తి సామంతులలో ఒకడు.

క.  శ్రీ రాముని దయ చేతను - నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు - నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ!         1

 

క.  అక్కఱకు రాని చుట్టము - మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా

నెక్కినఁ బాఱని గుఱ్ఱము - గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !   2

 

క.  ఉపకారికి నుపకారము - విపరీతము గాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము - నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ!        16

 

క.  ఎప్పటి కెయ్యది ప్రస్తుత - మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌

నొప్పింపక తానొవ్వక - తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!         18

 

క.  ఎప్పుడు సంపద కలిగిన - నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌

దెప్పలుగఁ జెఱువు నిండినఁ - గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!      20

 

క.  కనకపు సింహాసనమున - శునకముఁ గూర్చుండఁబెట్టి శుభ లగ్నమునం

దొనరఁగఁ బట్టము గట్టిన - వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!      26

 

క.  కొఱగాని కొడుకు పుట్టినఁ - గొఱగామియె కాదు తండ్రి గుణములఁ జెఱచున్‌

జెఱకు తుద వెన్ను పుట్టినఁ - జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ!  41

 

క.  తన కోపమె తన శత్రువు - తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ

దన సంతోషమె స్వర్గము - తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!            49

---------------------------------

3) కంచర్ల గోపన్న దాశరథీ శతకాన్ని రచించాడు. భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ. ఈయన శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా గా సుప్రసిద్ధుడైనాడు.

 

ఉ.  శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం

గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు

ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!   1

 

ఉ.  రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స

త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా

తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!         4

 

ఉ.  ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్‌

గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్‌

గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే

తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!         16

 

ఉ.  శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా

చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము

న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో

ద్ధారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ!        20

 

ఉ.  భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో

దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌

రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా

డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే

దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!      34

-------------------------------------

 

4) కాకుత్థ్సం శేషప్పకవి (18)రచించిన - నరసింహ శతకము,  శ్రీనృకేసరి శతకము, నరహరి శతకము, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన నరసింహ శతకం రాసిన కవి ఇతనే.

 

సీ.  శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త!

ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ       

తే.  చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ!

భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! 1.

 

సీ.  పద్మలోచన! సీసపద్యముల్‌ నీమీఁదఁ - జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు - పంచకావ్య శ్లోకపఠన లేదు

అమరకాండత్రయంబరసి చూడఁగలేదు - శాస్త్రీయ గ్రంథముల్‌ చదువలేదు

నీ కటాక్షంబుననే రచించెదఁ గాని - ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ

తే.  దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె - చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?

భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! 2

 

సీ.  నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్‌ బాపవచ్చు

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు        

తే.  భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు 3

 

సీ.  ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ - బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి - ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను - నిన్నుఁ గాననివారి నే స్మరింప

మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి - చెంతఁ జేరఁగఁబోను శేషశయన!      

తే.  పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల - దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన 4

 

సీ.  శ్రవణ రంధ్రముల నీసత్కథల్‌ పొగడంగ - లేశ మానందంబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁబూజసేయఁగఁ జూచి - భావమం దుత్సాహపడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్‌ పొగడంగఁ - దత్పరత్వములేక తలఁగువాఁడు

తనచిత్తమందు నీ ధ్యానమెన్నఁడు లేక - కాలమంతయు వృథాగడుపువాఁడు       

తే.  వసుధలోనెల్ల వ్యర్థుండువాఁడె యగును - మఱియుఁ జెడుఁగాక యెప్పుడు మమతనొంది 8

 

సీఅధిక విద్యావంతు లప్రయోజకులైరి - పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి

సత్యవంతుల మాట జన విరోధంబయ్యె - వదరుబోతుల మాట వాసికెక్కె

ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి - పరమలోభులు ధనప్రాప్తులైరి

పుణ్యవంతులు రోగభూత పీడితులైరి - దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి

తే.గీపక్షివాహన మా వంటి భిక్షుకులకు - శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు

భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !!  26

-------------------------------------

5) కాకుత్థ్సం నరసింహదాసు. కాకుత్థ్సం శేషప్పకవి మనుమడే. ఇతడు రచించినది కృష్ణ శతకం”.

 

క.  శ్రీ రుక్మిణీశ కేశవ - నారద సంగీతలోల నగధర శౌరీ

ద్వారకనిలయ జనార్దన - కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా.       1

 

క.  నీవే తల్లివి తండ్రివి - నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము - నీవే నా పతియు గతియు నిజముగఁ గృష్ణా.      2

 

క.  నారాయణ పరమేశ్వర - ధారాధర నీలదేహ దానవవైరీ

క్షీరాబ్ధిశయన యదుకుల - వీరా ననుగావు కరుణ వెలయగఁ గృష్ణా.       3

 

క.  హరి యను రెండక్షరములు - హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీ నామమహత్త్వము - హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా.   4

 

క.  దుర్జనులగు నృపసంఘము - నిర్జింపఁగఁ దలచి నీవు నిఖిలాధారా

దుర్జనులను వధియింపను - నర్జును రధచోదకుండ వైతివి కృష్ణా.                  28

 

6) బమ్మెర పోతన - నారాయణ శతకము, నేటి జనగామ జిల్లా లో ని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసన దంపతులకు జన్మించాడు.  శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి సోమనాథుడు”. వీరభద్ర విజయం, భోగినీ దండకం, శ్రీమదాంధ్రభాగవతం, నారాయణ శతకం

శా.  నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరి\న్‌

ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబున\న్‌

నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గిన\న్‌

వానిన్‌ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా!    3

 

శా.  నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా

నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా

నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా

నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా!            8

 

మ.  ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై

సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై

వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా!  10     

 

11 - 20..దశావతారాలు వర్ణించాడు.

 

7) శివదేవయ్య (13) కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల ఆస్థానంలో మహామంత్రిగా ఉన్నాడు.- శివదేవ ధీమణీ శతకము, ఇతనికి సంస్కృతాంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. గోళకీ మఠాధిపతి అయిన విశ్వేశ్వర శంభువు ఇతని గురువు. మనుమసిద్ధికి తిరిగి రాజ్యాధికారం కట్టబెట్టడంలో ఇతడు తిక్కనకు మిక్కిలి సహకరించాడు.

 

చం.  అరయగ పిన్ననాట సిరియాళుడనై, యెలప్రాయమందు సుం

దరుడను నంబియై, పదను తప్పిన గుండయగారి చందమై

ధర చరియింపగల్గిన తథాస్తు! వృథా పరిపాక రూప దు

ష్కర జననం బిదేమిటికి గాలుపనే శివదేవ ధీమణీ.

---------------------------

8) శరభాంకుఁడు.  పార్వతీదేవి, శివ లింగయ్యల కుమారుడు. రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానకవి (1296-1323)  - శరభాంక లింగమ శతక కర్త, శరభాంకుడు అష్టసిద్దుల్లో ఆరితేరిన కవి. అంతేకాక వాటిని అప్పుడప్పుడూ ప్రయోగించి ప్రసిద్ధిగాంచాడు. వేములవాడ భీమకవిలా శివానుగ్రహమున ఆడినది ఆటగా పాడినది పాటగ అన్నట్లు చేయగలడు.

 

ఉ॥ శ్రీరమనాథుమ్రొక్కి జయశిద్దుల సన్నుతిజేసి భానుచం

ద్రారుణ వహ్ని నేత్రునకు నంజలి జేసి తమిన్నుతించి స

త్కార మొనర్పనొక్క శతకంబు రచించెద చిత్తగింపు మీ

సారమనేక దివ్యముని సన్నుతయో శరభాంక లింగమా!!

-----------------------------------

9) రావిపాటి త్రిపురాంతక కవి ఈ కవి 1) కళికోత్కళికలు, సమవృత్తాలతో సలక్షణమైన త్రిపురాంతకోదాహరణము 2) 'అంబికా!'అన్న మకుటాన్ని కలిగిన చంపకోత్పలమాలలతో అంబికా శతకము 3) 'చంద్రా! రోహిణీవల్లభా!' అన్న మకుటంతో శార్దూల-మత్తేభవిక్రీడితాత్మకమైన చంద్ర తారావళి అన్న మూడు లఘుకృతులనురచించెను.

 

ఉ.  లాఁచి పరాంగనల్ వరవిలాసమనోహరవిభ్రమంబులన్

జూచినఁ జూడఁ డుత్తముఁడు; చూచినఁ జూచును మధ్యముండు; దాఁ

జూచినఁ జూడకుండినను జూచుఁ గనిష్ఠుఁడు; నన్ను వీరిలోఁ

జూచినఁ జూడకుండు ఘనుఁ జూచిన చూపునఁ జూడు మంబికా!

 

ఉ.  వ్రాలిన కన్ను, ముంగురులు, వాతెఱ కెంపు మెఱుంగుఁ, జంటిపైఁ

గ్రాలెడు తారహారములుఁ, గంకణచారుకరంబు, డాపలం

దూలుచు నున్న పయ్యెదయుఁ, దోఁచిన కన్నులు మోడ్చి, మోడ్చి నీ

పాలగు నీశుమేను సగపాలు మనంబునఁ జేర్తు నంబికా!

 

ఉ. 'ఆదిమశక్తి యీ తరుణి, యాద్యకుటుంబిని యీ కుమారి, ము

త్తైదువ యీ తలోదరి, చిదాత్మక యీ సతి, విశ్వమాత యీ

పైదలి, సర్వలోకగురు భామిని యీ చపలాక్షియంచు బ్ర

హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి ని న్నెఱిఁగింతు  రంబికా!

 

త్రిపురాంతకుడు త్రైలోక్యాధీశ్వరి త్రిపురాంబికను సన్నుతిస్తూ అంబికా!' “అంబికా!' అని నోరారా నూఱుమార్లు సంబోధించటమే గాక ఈ శతకస్తోత్రంలో అడుగడుగున శ్రీవిద్యాదర్పణమైన పావన శ్రీ లలితా సహస్రనామ స్త్రోత్రాన్ని అంతర్భవింపజేసినట్లు పద్యశిల్పాన్ని బట్టి గోచరిస్తున్నది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.