జైశ్రీరామ్.
కవుతా (ఊకదంపుడు) రామకృష్ణ మా గృహమునకు న్యస్తాక్షరి నేర్చుకుందామని వచ్చి మూడు ఛందోభాషణలు, సమస్యాపూరణ, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరీ, ఆశువు,న్యస్తాక్షరి అప్రస్తుతము, సమర్ధవంతంగా చేసిన సందర్భంగా నేను వానికి చేసిన సత్కారం.
కవుతా రామకృష్ణ యాదృచ్ఛిక సాధనావధానములోని ధారణాంశములు
నిషిద్ధాక్షరి రాధాకృష్ణులు ఆధారముగా జీవత్మ పరమాత్మ ఐక్యత
(పథమాక్షరం శ్రీవినావర్ణ నిషిద్ధం. చివరి రెండు పాదములు స్వేచ్ఛ)
శ్రీవిద్యాచిహ్నవిధిన్
జీవిపథగతిన్ యశదరుచిన్ నేర్పన్ రా
జీవాక్షుండును రాధయు
భావింప నభేదము గని, ప్రాపించిరటన్
సమస్య:
భామకు మీసము మొలిచెను బాపురే కనితే
ఏమందులు దాఁ గొనెనో
కోమలత నెగడఁగఁగోరి కోమలి యకటా!
మోమున సత్కళ దప్పెను
భామకు మీసము మొలిచెను బాపురె కనితే
దత్తపది:
హరి,పర,కర, హర పదములతో మరికాసేపటిలో జరుగనున్న పుస్తకావిష్కరణ
హరిజుని భార్యయె మురియగ,
ధర బుధపరమై వెలుంగఁ, దత్త్వము గఱపన్
గరమీ పుస్తకము దనరు
హరదేవుడు దయఁ గవీంద్రు ననయము గావన్
వర్ణన :
శ్రీలక్ష్మీదేవి, తేటగీతి లో
పద్మమున నిల్చి సాగరభవయె శోభ
లీనుచును దయాభరితమౌ దృక్కులొలుక
శ్రీహరికృపాసహితముగఁ జెంగలించె
మీగృహంబున నిరతము మిమ్ముఁ గావ!
న్యస్తాక్షరి
1వ పాదము 4వ అక్షరము "రా"
2వ పాదము 11వ అక్షరము "మ"
3వ పాదము 7వ అక్షరము "కృ"
4వ పాదము 19వ అక్షరము "ష్ణ"
ఉత్పలమాలలో నూతన సంవత్సరాగమనము
చిత్తము రాజిలన్ వరలె శ్రీకరమౌ నవవర్ష మిత్తరిన్
సత్తువ మీకొసంగగను, క్షామము బాపగ నుర్వియంతటన్
దత్తుడు చూడగా కృపను ధ్వాంతము మాసియె శోభలీనగన్
రిత్తపు మాటలై చనక ప్రేమగఁ దీర్చుత మీదుతృష్ణలన్
-------------------
ఒక ఛందోభాషణము
ప్రా: నీపేరేమిటి చెప్పుమా
రా: బుధులు క్షోణిన్ రాముడంచందురే
ప్రా: ప్రాపౌపుత్త్రకుడుండెనా?
రా: కలడు రూపంబౌచు నాతోడుతన్
ప్రా: మీపద్మాక్షియు క్షేమమా?
రా: తనరు తాన్ మీనాక్షి సేవోన్నతిన్;
మీపేరేమియొ?
ప్రా:రామకృష్ణుడను
రా:స్వామీ మీకు చేతున్ నతుల్
నీపేరేమిటి చెప్పుమా? బుధులు క్షోణిన్ రాముడంచందురే
ప్రాపౌ పుత్త్రకు డుండెనా? కలడు దీపంబౌచు నాతోడుతన్
మీపద్మాక్షియు క్షేమమా? తనరు తాన్ మీనాక్షి సేవోన్నతిన్,
మీపేరేమియొ? రామకృష్ణుడను; స్వామీ మీకు చేతున్ నతుల్.
జైహింద్.
1 comments:
గురువుగారూ, మీ వాత్సల్యమునకు ప్రోత్సాహమునకు అనేకానేక కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు.
-రామకృష్ణ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.