గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2011, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు. శతకోటి దీప కాంతులతో మీ హృదయం జ్యోతిర్మయం కావాలి.

6 comments

సాహితీ ప్రియ మిత్రులారా! మీకు దీపావళి శుభాకాంక్షలు.
అజ్ఞానాంధము బాపగ 
సుజ్ఞాన జ్యోతులమరు సుజనుల మదిలో.
విజ్ఞాన దీపపుంజము
సుజ్ఞేయముగా వెలుంగు సుగుణోద్భవమై.  
లక్ష్మీ కాంతులు మీ గృహంబునమరున్.లక్ష్మీ కటాక్షంబుతో
సూక్ష్మ జ్ఞాన వివేక వృద్ధియగుచున్ శోభించు మీ మేధ. భా
తిక్ష్మా భారతి మీ పవిత్ర చరితన్ దివ్యత్వమున్ బొందు.మీ
రీక్ష్మా పూజ్యులుగా గణింపఁ బడగా ప్రీతిన్ బ్రవర్తిల్లుతన్.
ఆయురారోగ్య సౌభాగ్య శ్రేయములును,
పుత్ర పౌత్ర ప్రపౌత్ర సన్మిత్ర వృద్ధి, 
సకల సద్గుణ వృద్ధియు, సత్ప్రవృత్తి,
ప్రాప్తమగుగాక మీకు సద్భాగ్యవంత! 
   జైశ్రీరాం. జైహింద్.
 

21, అక్టోబర్ 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(వర్ణన2)

10 comments

సాహితీ ప్రియ మిత్రులారా!
ఈ రోజు కట్టమూరివారు ఎదుర్కొనిన వర్ణనను మనమూ ప్రయత్నిద్దాము.
వర్ణనము.
విషయము:- 
ఈనాడు ప్రబలుతున్న ఉగ్రవాదమును నివారణావశ్యకతను గూర్చి  యువతకు సందేశము.
అవధానిగారి పూరణమును నా పూరణమును వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులనలరింపగలరు. మీ రచన ఒక ఖండ కావ్యముగా ప్రసిద్ధమగునట్లు ఆశారదాంబ కటాక్షించు గాక.
జైశ్రీరాం.
జైహింద్.

16, అక్టోబర్ 2011, ఆదివారం

నమస్కారము యొక్క కథా కమామిషు.

7 comments

సాహితీ బంధువులారా! 
మనం సాధారణంగా ఉదయం లేచిన మొదలు దేవునితో పాటు మన సాటివారికి అనేక మందికి నమస్కరిస్తూ ఉంటాము.
ఐతే ఈ నమస్కారం కూడా చేయి కొంచెము పైకెత్తి చేయటం, రెండు చేతులు ఏదో మ్రొక్కుబడికి కలిపి చేయటం, అరచేతులు రెండూ తాకేలాగ నొక్కి పట్టి అంగుళులు పదీ కలిపి చేయటం మొదలుగా అనేక విధాలుగా చేస్తుంటాము.
ఐతే ఈ నమస్కారం వెనుక గల భావన గ్రహించి చేసే నమస్కారమే పరమాత్మ విషయంలో మనం చేస్తున్నట్టనిపిస్తుంది.
మీ రూ గమనించండి. 
శ్లో:- 
మత్తస్త్వముత్కృష్టః. త్వత్తోzహమపకృష్టః.
ఇత్యాకారకాంగుళి సంపుటీకరణం నమస్కారః.
గీ:-
నీవు ఘనుఁడవు నాకంటె నేలపైన ,
నేను తక్కువ నీకంటె నిజమటంచు
మదిని తలపోసి, యహమును మదిని వీడ, 
ప్రబలు యంగుళి సంపుటి వందనమగు.  
భావము:- 
రెండు చేతుల వ్రేళ్ళు జోడించి, నాకంటే నీవు గొప్ప వాఁడవు. నీకంటే న్ను తక్కువ వాఁడను.అని మనస్స్ భావించి చేయు క్రియ నమస్కారమని తెలియు చున్నది. అనగా అహంకారమును వీడి మనస్సును అడంచుటయే నమస్కారమన్న మాట. 
శివునెదిరింప వచ్చిన రావణుఁడు కలైసాము క్రిందఁ బడి, అతనిచే అడంపఁబడి,  కిచకిచలాడుచు, పరమాత్మవైన ఓ పరమేశ్వరా! ఈ కాన వచ్చు చేతనాచేతన వస్తు జాలమంతయు నీవే. అహంకారముచే నీవింతవాఁడవని తెలియక ఎదిరింప వచ్చితిని. క్షమింపుమని,నమస్తే రుద్ర అను వేద మంత్రముతోఁ బూజించెను. అదియే నమకము.
జైశ్రీరాం.
జైహింద్.

15, అక్టోబర్ 2011, శనివారం

సార్వవిభక్తిక సీసము:

2 comments

పండిత నేమాని వారి అధ్యాత్మ రామాయణము నుండి.
సార్వవిభక్తిక సీసము: 
జ్యేష్ఠుండు, రఘుకుల శ్రేష్ఠుండు, రాముండు
రాజాధిరాజ విరాజితుండు
రామునే తలచెద, రామునే కొలిచెద
రామునే మ్రొక్కెద స్వామి యనుచు
రాముని చేతనే రాజిల్లు నిరతమ్ము 
ఘనముగా మా వంశ గౌరవమ్ము
రాముని కొరకు నే బ్రార్ధించి సాదర
వందనమ్ము లొనర్చుచుందు నెపుడు
రాము గంటెను వేరొక్క ప్రభువు లేడు
రామునకు జేయు సేవ మాత్రమ్మె చాలు
నందులో నేను ధన్యత్వమొందు వాడ
నో భరద్వాజ! సురభూజ! యోగిరాజ!
జైశ్రీరాం.
జైహింద్.

13, అక్టోబర్ 2011, గురువారం

శ్రీ నేమానివారి సూచనలు.

2 comments

ప్రియ మిత్రులారా! తెలుగు పద ప్రయోగాలలో సాధారణంగా మనకు తెలియకుండానే అసాధువులు కూడా దొర్లిపోతుంటాయి.
అలాంటి ప్రయోగాల్లో కొన్ని  అసాధు ప్రయోగాలను శ్రీ పండిత నేమానివారు  ఈ విధంగా చూపిస్తున్నారు.  చూడండి.
మిత్రులారా!
కొందరి రచనలను చూచి ఈ క్రింది సూచనలను చేస్తున్నాను:
(1) శక్తివంతుడు(తప్పు) : శక్తిమంతుడు (ఒప్పు)
ఇకార ఉకారముల మీద "మంతుడు" అనే వాడాలి.
ఉదా: ధీమంతుడు, శ్రీమంతుడు, బుద్ధిమంతుడు, 
హనుమంతుడు, ఆయుష్మంతుదు, రోచిష్మంతుడు
(2) దేశముకు(తప్పు), దేశమునకు (ఒప్పు)
ఉకార ఋకారముల తరువాత "నకు" అని చేర్చాలి.
ఉదా: రాజునకు, పితృనకు, పుత్రునకు, 
ఔత్సాహికులైన రచయితలు ఈ సూచనలను గ్రహించగలరు.
ఇట్లు
పండిత నేమాని.
అవి తప్పక మనం గ్రహించాలనే భావనతో మీముందుంచాను.
జైశ్రీరాం.
జైహింద్.  

11, అక్టోబర్ 2011, మంగళవారం

శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధాని షష్టి పూర్తి సందర్భంగా..శ్రీ కంది శంకరయ్య గారి పంచ రత్నాలు.

4 comments

శ్రీరస్తు                             శుభమస్తు                 అవిఘ్నమస్తు.
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి షష్టి పూర్తి సందర్భముగా 
అందజేయుచున్న 
పంచ రత్నములు.
సమర్పణ:-శ్రీ కంది శంకరయ్య

శ్రీశ భారతీశ శీతాద్రిజేశ సా
మ్ముఖ్య మంది కట్టమూరి చంద్ర
శేఖరావధాని! చిరకాల మారోగ్య
శుభ సుఖములతోడ శోభఁ గనుము.

అష్టావధాన విద్యను
కష్ట మ్మిసుమంత లేక కడు సులభముగా
నిష్టాగోష్ఠిగఁ జేయు వి
శిష్టంబగు ప్రతిభ నీది; చేసెద నుతులన్.

అస్త్రముల దూసిరట ఘన
శాస్త్రజ్ఞులు పృచ్ఛకుల్ ప్రచండముగా నీ
శస్త్రముల వంటి పూరణ
లే స్త్రైణమ్మై సొగసులనే కురిపించెన్.

విరులు సమస్యాపూరణ
లరయ లతలు దత్తపదులు ననఁగ నిషిద్ధా
క్షరు లాకులు వర్ణనములు 
మురిపించునులే యుపవనముగ నీ రచనల్. 

సృష్ట్యారంభక కరుణా
దృష్ట్యంచల లబ్ధ విభవ దీవ్యద్యశ సం
తుష్ట్యాద్యఖిల శుభంబుల
షష్ట్యబ్ది మహోత్సవమున సఫలతఁ గనుమా!


మంగళం                                                                        మహత్.   

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 

ఆంధ్రామృతంలో నిన్నటి, మొన్నటి టపాలు కూడా దీనికి సంబంధించినవే. చూడండి. 
ప్రవాసాంధ్రుల ఆంధ్రాభిమానం ప్రవాస రాజ్యంలో కనబడుతుంది చూడండి.
'ప్రవాసరాజ్యం'  www.pravasarajyam.com 
జైశ్రీరాం.
జైహింద్.


10, అక్టోబర్ 2011, సోమవారం

శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధాని షష్టి పూర్తి సందర్భంగా..శ్రీ నేమాని వారి పంచ రత్నాలు.

2 comments

శ్రీరస్తు                             శుభమస్తు                 అవిఘ్నమస్తు.
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి షష్టి పూర్తి సందర్భముగా 
అందజేయుచున్న 
పంచ రత్నములు.
సమర్పణ:-పండిత నేమాని రామజోగి సన్యాసిరావు.

శ్రీ కట్టమూరి కుల ర 
త్నాకర చంద్రా! కవీంద్ర! ఆనందనిధీ!
ఈ కళ్యాణ సమోత్సవ
మే కూర్చుత మీ కవకు నమేయ సుఖమ్మున్

వరమతి కట్టమూరి కుల భాగ్యమవై తనరారుచుండి సద్
గురువర భవ్యయోగమున క్షోణి విశేష యశమ్ము గాంచి భా
సురకవివై వధానివయి శోభిలు నో సరసాంతరంగ శ్రీ
కరముగ నీదు జీవితము గాంచుత సర్వశుభాధియోగముల్

తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి కొండల రావు
ప్రేమతోడ పెంచి పెద్దజేయ
విద్యలను గడించి విజ్ఞానధనివయి
యలరుచుంటి సద్గుణాఢ్యుడవయి

రాజరాజేశ్వరి నిరంతరమ్ము సదను
కూలవతియయి ప్రేమతో గొలుచుచుండ
సుతలు ననురాగమును జూప, సుఖమునొంది
తనరుగాక నీ జీవితము చిరముగ

అరువదియేండ్లు నిండెడు ముదావహ పర్వమునాడు మెండు సం
బరమున గూర్తు దీవనలు భాసుర మానస సారసుండవై
ధర శతవర్షముల్ గనుము సర్వ శుభమ్ములు భోగభాగ్యముల్
పరగుచు నీదు జీవితము వర్ధిలు సుస్థితి చంద్రశేఖరా!

మంగళం                                                        మహత్.   
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 
ఆంధ్రామృతంలో నిన్నటి టపాను కూడా దీనికి సంబంధించినదే. చూడండి.
ప్రవాసాంధ్రుల ఆంధ్రాభిమానం ప్రవాస రాజ్యంలో కనబడుతుంది చూడండి.
'ప్రవాసరాజ్యం'  www.pravasarajyam.com 
జైశ్రీరాం.
జైహింద్.  

7, అక్టోబర్ 2011, శుక్రవారం

శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధాని షష్టి పూర్తి సందర్భంగా...

7 comments

శ్రీకర సాహితీ ప్రియమిత్రులారా! 
మన ప్రియతమ కట్టమూరి చంద్రశేఖరం అవధాని వారికి షష్టి పూర్తి  అగుచున్న సందర్భంగా వారికి శాస్త్రోక్తముగా జరుగు గున్న ఆయుష్ హోమాది కార్యక్రమముల వివరములు వారు పంపిన ఆహ్వానం ద్వారా తెలియు చున్నది.
ఈ శుభ సందర్భంలో మన  అవధాని గారికి ఆంధ్రామృతం ద్వారా పాఠకుల తరపున అభినందనలు తెలియ జేస్తున్నాను.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
శ్రీరస్తు                            శుభమస్తు                 అవిఘ్నమస్తు.
బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖరావధాని గారు షష్ట్యబ్ది లో ప్రవేశించిన సందర్భముగా సమర్పించుచున్న 
అభినందన మందార మాల   
సమర్పణ:- చింతా రామ కృష్ణా రావు.

శా:- శ్రీ కల్యాణ మనోజ్ఞ భావ నిలయా! శ్రీ జ్ఞాన తేజో నిధీ!
        లోకుల్ మెచ్చెడి చంద్ర శేఖర కవీ! శ్లోకాస్పదా! మిత్రమా!
        నీకున్ షష్టి "సుపాండితీ గరిమచే" నిండారగా చేరె. సీ
        తా కల్యాణియు రామచంద్రుఁడు నినున్ ధాత్రిన్  సదా కాచుతన్. 1
ఉ:-  శ్రీ రఘురామ భక్త! శశి శేఖర! మేలుగ కాంచినారు, నిన్,
        ధీరుని, సత్కవీశ్వరుని, దివ్య వధాన మహన్నిధానమున్ 
        కోరిక తీర పుత్రునిగ  కొండల రావును సుబ్బ లక్ష్మియున్.
       మేరు సుధీర! నీ కవిత మెచ్చెద రెన్నుచు సత్కవీశులున్. 2 
ఉ:- సుందర భావ బంధుర సుశోభిత సత్కవితా మతల్లికా
       చందన నందనంబది ప్రశాంత కులంబగు కట్టమూరి! యా
       నందనమందుఁ బుట్టిన సనాతన సద్గుణరాశివీవు. ని
       న్నందరు మెచ్చుటొప్పును. మహా కవి శేఖర! చంద్ర శేఖరా! 3
చ:- స్తుతమతి! సుప్రసిద్ధ గుణ శోభల వెల్గెడి సత్కవీశ్వరా!
       అతులిత సద్వధానము లనంత మహత్కవితాభిరామ   సం
       స్తుతములు  కాగ చేసితివి.  తోయజ సంభవు రాణి బంధువా!   
       శ్రితజన హృద్విహార! శశిశేఖర! సత్కవితా ప్రభాకరా! 4.
చ:- చదువుల తల్లి బంధువయి చక్కగ సంస్కృతమాంధ్ర భాషయున్ 
       చదివి, మహత్కవిత్వ ఫలసాయము లందగ చేసితీవు. నీ 
       మధుర వచో విలాసములు మాన్యతఁ గొల్పగ నీకు, నీవు సద్
       బుధవరులెల్ల మెచ్చు గతి పూజ్యుఁడ! సత్ కవివై రహించితే! 5.
చ:- సురవరులెన్ననౌ కవిత సుందరి జన్మకు కారకుండ! ధ 
       ర్మరతుఁడవై మహత్ కవన మర్మమెఱింగి  ప్రగాఢమైన శ్రీ
       కర  వర భావనా  రుచిర  కావ్య రహస్య నిరూపివైతి వ
       బ్బుర మదియే కదా! దివిజ పూజ్యుఁడ! నిన్ వినుతింపలేనుగా! 6.
క:-  వరులెన్ననౌ కవిత సుం
       దరి జన్మకు కారకుండ! ధర్మరతుఁడవై
       వర భావనా రుచిర  కా
       వ్య  రహస్య నిరూపివైతి వబ్బుర మదియే!
గీ:-  కవిత సుందరి జన్మకు కారకుండ!
       కవన మర్మమెఱింగి  ప్రగాఢమైన 
       రుచిర  కావ్య రహస్య నిరూపివైతి! 
       దివిజ  పూజ్యుఁడ! నిన్ వినుతింప లేను!
శ్రీ చక్ర బంధ తేటగీతి
వరలఁ జేతువు శ్రీకర భక్తి  శోభ 
      లక్ష్యమున గల శ్రీ శుభలక్షణాల 
      యుక్తి నెఱిగిన శ్రీ వర భక్తి భాగ్య!
      వరలఁ జేయుమ! భక్తుల భాగ్యమీవ. 7
నక్షత్ర బంధ కందము:- ( సుకవి వర - శ్రీ శశి ధర )
సుజన వశ! శశి శిఖరుఁడా!
      విజయాంబుధ! సుందర! సదభిరమణుఁడా!శ్రీ
      నిజ శత భూమిక చూచి, శ
      శిజయధరుఁడన వలయునుర.శ్రిత శ్రీ గుణుఁడా! 8.
చ"తురంగ"గతి బంధ కందము:- (సుమధుర - కవితలు - పలికెడి - సుజనుఁడ)
ప్రణవ విలసిత! బుధసుత! శ
     మనుఁడ ! మధుమయుఁడ! సుజన సుమధురమ! వసుధన్.
జెనక యితడి కెవరన, విని,
     కనలి, కవులు తడఁబడ, పరగ నెఱిఁగితివిలన్. 9.
గోపుర బంధము:- ( శ్రీ కరుఁడ! సుకవవీ)  
శ్రీమాన్  కమలా ధరునిని  
     ప్రేమన్ గడ  దేర్చుహరిని .ప్రియ  సుఫలదునిన్    
     ధీమతిని, సుకవి విలసిత
     కామ పితన్ యీ కవీశుఁ గావం గొలుతున్! 10. 
ఛురికా బంధ కందము
జ్ఞాన మనమున మహా ఘన!
     ధ్యాన మున విశేష శక్తి నార్జించితివే!
     వేనకు వేలుగ శిష్యుల 
          ధ్యాన ముదావహులఁ జేసి, హర్షించితివే!  11.
ద్విపద-మత్తకోకిల-కంద-గీత గర్భ సీసము:- 
     సావధానము తోడ సాధన సల్పిన
     ట్టిమహాత్ముఁడా నీకు సములు కలరె? 
     భావ బంధురమైన పద్యము పల్కి తీ
     రుదు వక్కటా! మహద్బుధ వరేణ్య!
     చేవ చూపెద వీవు క్షేమము సేయగా 
     గుణ సుందరా! నిన్నుఁ గొలువ నగునె?
     శ్రీవివర్ధన! చంద్ర శేఖర! జ్ఞేయ మీ
     వని యెంతు నే నిన్ను సునిశిత మతి!.
గీ:- సుకవులు మహాత్ముఁడంచును ప్రకటితముగ 
      నీ సుచరిత పల్కగ విననే! సుకవివి !
      సహృదయుఁడవు. నిన్సకలార్థ చయము వలచు 
      సుచరితుఁడ! కనగ ననఘ! చోద్యము కద? 12.
క:- సుకవులు మహాత్ముఁడంచును 
       ప్రకటితముగ నీ సుచరిత పల్కగ విననే! 
      సుకవివి! సహృదయుఁడవు. ని
      న్సకలార్థ చయము వలచు సుచరితుఁడ! కనగన్!
ద్విపద:-
     సావధానము తోడ సాధన సల్పి
     భావ బంధురమైన పద్యము పల్కి
     చేవ చూపెద వీవు క్షేమము సేయ
     శ్రీవివర్ధన! చంద్ర శేఖర జ్ఞేయ!
మత్తకోకిల:-
     సావధానము తోడ సాధన సల్పినట్టిమహాత్ముఁడా!
     భావ బంధురమైన పద్యము పల్కి తీరుదు వక్కటా! 
     చేవ చూపెద వీవు క్షేమము సేయగా గుణ సుందరా!
     శ్రీవివర్ధన! చంద్ర శేఖర జ్ఞేయ మీవని యెంతు నే! 
చంపక-కంద-తేటగీతి-ఆటవెలది- గర్భ సీసము:- 
       వర శశి శేఖరా!పరమ భక్త శిఖామ
       ణి! బ్రహ్మ తేజ! కానెదఁ గొలుపర
       వర కవితన్ సదా కరుణ భావ భవోద్భ
       వ  క్రాంతి దర్శివై వరలనిమ్ము!  
       వర దశ కోల్పడెన్. వరలు భావ శరధృ
       తి   వ్రాసి, గొల్పు, ప్రాగ్దేశిక! గురు  
       తర కవివై! సమాసగుణ దార్ఢ్య కవిత్వ
       ము శ్రావ్య మౌనుగా! బుధ జన నుత!               
       గీ :-  
       సతము సభల నడుమ సహజత నిలుపుచు 
       రుచిర కవిత లమర రుచుల చెలఁగగను.
       పలుకు పలుకుదువట! ప్రవరుల మదిఁగొన
       పలుకులమ్మ చేతి చిలుక పలుకునటుల . 13.
సీస గర్భస్థ చంపకమాల:- 
       వర శశి శేఖరా!పరమ భక్త శిఖామణి! బ్రహ్మ తేజ! కా
       వర కవితన్ సదా కరుణ భావ భవోద్భవ  క్రాంతి దర్శివై!  
       వర దశ కోల్పడెన్. వరలు భావ శరధృతి   వ్రాసి గొల్పు, ప్రా 
       తర కవివై! సమాస గుణ దార్ఢ్య కవిత్వము శ్రావ్యమౌనుగా!
సీస గర్భస్థ కందము:-
       శశి శేఖరా!పరమ భ 
       క్త శిఖామణి! బ్రహ్మ తేజ! కావర కవితన్.
       దశ కోల్పడెన్. వరలు భా
       వ శరధృతి వ్రాసి గొల్పు, ప్రాతర కవివై! 
సీస గర్భస్థ గీతము:- 
       పరమ భక్త శిఖామణి! బ్రహ్మ తేజ!
       కరుణ భావ భవోద్భవ క్రాంతి దర్శి!  
       వరలు భావ శరధృతి వ్రాసి గొల్పు,
       సగుణదార్ఢ్య కవిత్వము శ్రావ్యమౌను. 
 సీసాంతమునగల  గీత గర్భస్థ ఆటవెలది. :-  
       సతము సభల నడుమ సహజత నిలుపుచు 
       రుచిర కవిత లమర రుచుల చెలఁగ.
       పలుకు పలుకుదువట! ప్రవరుల మదిఁగొన
       పలుకులమ్మ చేతి చిలుక పలుకు. 
తరళము:-  
       తెలుగు పండిత వృత్తి చేకొని దీక్షతో నట  చెప్పుచున్ 
       సులభ రీతిని పద్యముల్ విన సొంపు వ్రాయుట నేర్పితే! 
       కలలు గన్న కవీశ్వరాకృతిగా ముదంబున నిల్చి మీ
       కలల రూపగు పిల్లలన్ గనికార మొప్పగ చూచితే! 14.
సీ:- పూజ్యుఁడ! లలిత సుబోధినీ వ్యాకర 
       ణంబువ్రాసితి జగదంబ కృపను!
       కవిరాజు రచియించి కవిరాజువైతి! వి 
       లాసగణపతి ని వ్రాసితీవు!
       అందంబుగా కడు సుందర గీతామృ
       తము వ్రాసి పాడితి! ధన్యమూర్తి.
       అటనట నెరపిన  యవధాన పర్వము
       నందఁ జేసితివిమా కందముగను. 
గీ:- వర ప్రబంధమండలి వ్రాసి ప్రబలితివిగ! 
       కష్ట కాలమునందును కష్టపడక 
       ఆత్మ ధైర్యము కోల్పోక యమర కవిత
       లల్లి వ్రాయుట యది నీకె చెల్లెనయ్య. 15.
ఉ:- మంగళ భావ శోభితుఁడ!మంగళ సద్రచనాభిరామ! సన్ 
      మంగళ సద్వధానివర! మంగళ రూప విరాజమానుఁడా!
      మంగళ కావ్య శోధకుఁడ! మంగళ సద్గురుదేవ!  నీకు సన్
      మంగళ భాగ్యకారులగు మంగళ గౌరియు సాంబమూర్తియున్. 16. 
మంగళం                                                               మహత్ 
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ  
అభినందనలతో
సజ్జన విధేయుఁడు
చింతా రామ కృష్ణా రావు.
Hyderabad,
Dt. 09.10. 2011.
email id:-chinta.vijaya123@gmail.com
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఆర్యులారా! విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్న నానుడి ఎంత యదార్థము!
అవధానిగారి సమస్యా పూరణలను, దత్తపది పూరణలను, మీరు గుర్తించి యున్నందున మీకూ ఆసక్తి కలిగియున్నచో మీ యొక్క అభినందనలను కూడా ఆంధ్రామృతం ద్వారా అవధాని గారికి తెలియజేయ గలరని ఆశిస్తున్నను.
జైశ్రీరాం. 
జైహింద్. 

6, అక్టోబర్ 2011, గురువారం

సహృదయ సత్ ప్రియులారా! మీకు విజయ దశమి శుభాకాంక్షలు.

2 comments

జగజ్జనని 
సహృదయ సత్ ప్రియులారా! మీకు విజయ దశమి శుభాకాంక్షలు.
మన అందరికీ  శుభము కూర్చుమని ఆ శారదా మాతను వేడుకొందాము.

అమ్మా! దీనజనావళిన్ గనెడి సౌహార్ద్రోజ్వలా! శారదా!
మమ్మున్ బ్రోచెడి కన్న తల్లి! కనుమా!మమ్మున్ సదాప్రేమతో.
సమ్మోదాత్మను వర్తిలంగ, కొలుపన్ సత్కార్యముల్, నిత్యమున్
మిమ్మున్ గొల్చుచునుండునట్లు. ఘను సంప్రీతిన్ సదా గొల్పుమా. 
జైశ్రీరాం.
జైహింద్.

5, అక్టోబర్ 2011, బుధవారం

ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి.

3 comments

ప్రియ భారతీయ సోదర సోదరీమణులారా!
విజయ వాడలో ఒక పాశ్చాత్య మహిళ వివస్త్రగా రాజ మార్గంలో హెల్ప్ హెల్ప్ అంటూ దీనాతి దీనంగా యాచిస్తూ పరుగు పెడుతూ ఉంటే అక్కడ సంచరిస్తున్న  ఏ ఒక్కరికీ ఆమెపై కనికారం కలగ లేదు. సరి కదా మనమున్నది సభ్య సమాజంలోనేనన్న మాట మరచి పోయి, దుర్గమ్మ కొలువైయున్న విజయవాడలోనే దుర్గకు మారు రూపమైన ఈ పాశ్చాత్య మహిళ ఆక్రందనకు ఏమాత్రం స్పందించ లేకపోవడం చాలా దురదృష్టకరం.
మనం గడుపుతున్న హడావిడి జీవితంలో ఎవరి బాధ్యతలు వారికి ఉండ వచ్చును. ఎవరి తొందర వారి కుండవచ్చును. అంత మాత్రం చేత పని తొందరగా చెయ్యాలని వేసుకొనే జోడు వేసుకోవడం అలక్ష్యం చేస్తున్నారా?
ఈ దీనురాలి విషయంలో ఒక్క చిన్న వస్త్రాన్ని అందజేసి ఆమె మానాన్ని కాపాడడానికి ఏ ఒక్కరికైనా సమయం  చిక్కలేదా?
ఎక్కడి నుంచో దూర దేశం నుంచి మన దేశం వచ్చి మన దుర్గమ్మను కనులారా చూడాలనే తపనతో మన ప్రాతం వచ్చిన ఒక మహిళ  అలా వివస్త్రగా రోడ్డున పడడం వెనుక ఉన్న కారణం ఏమిటి? ఆమె పిచ్చిది కాదు. హెల్ప్ హెల్ప్ అంటూ ఆక్రందిస్తోంది కదా? అంతటి దురవస్థ ఆమెకెలా కలిగింది? ఏ దుర్మార్గుల దౌష్ట్యానికో ఆమె బలి కాకపోయి ఉంటే ఇటువంటి దుస్థితి ఆమెకు వచ్చే పని లేదు కదా?
భరత మాత తన ఒడిలో ఆనందం పంచుకోడానికి వచ్చిన పాశ్చాత్య వనితకు తన బిడ్డలే రక్షణ కల్పించలేనందుకు సిగ్గుతో ప్రపంచ  దేశాలలో తల వంచుకుంటోంది.
మనిషిగా పుట్టిన మనం కొంచెమైనా ఆలోచనా శక్తి కలిగి ఉన్నట్లైతే జీవచ్ఛవాల లాగా ఉండకుండా ఒక సామాజికుడుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే ధ్యాసని విడువ కూడదు.
ఇదే మన తల్లో, మన చెల్లో, లేదా మన భారతీయ మహిళో విదేశాలలో ఇలాంటి స్థితే  ఎదుర్కొంటే మనమనస్సు ఎంతగా పరితపిస్తుందో ఆలోచించుకోవాలి.
సామాజిక జీవనం గడిపేవారిలో మానవత్వం పరిమళించాలి.
అలా కానినాడు మనకంటే ఆ వన్య మృగాలే నయం.
ఎందుకిలా మారిపోతున్నాం మనం?
ఎక్కడుంది లోపం?
ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి.
ఏం చేద్దాం?
ఇది ఇలాగే సాగిపోనిద్దామా?
మనకెందుకులే అని వదిలేద్దామా? మనదాకా వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుందామా?
అసలు గాంధీగారి మూడు కోతుల కథకు వక్ర భాష్యం చెప్పుకొని, చెడు చూడకు, చెడు వినకు, చెడు కనకు అన్నరు కదా? అలాగే చూడకుండా దూరంగా ఉందాం అని నిర్ణయించుకుందామా?
ఒక్కసారి ఆలోచించి, ఏం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో, మన భావాన్ని సమాజంలోకి ఎలా వ్యాపింప చేయాలో సూచించండి.
ఇతనికేం పనిలేనట్టుంది అని నన్ను తిట్టడం మాత్రం చేయరని భావిస్తున్నాను.
పాపము శమించును గాక.
జై శ్రీరాం.
జైహింద్.

4, అక్టోబర్ 2011, మంగళవారం

పండిత నేమాని కృత పరమేశ్వరీ స్తవము (దండకము).

4 comments

జగన్మాత పరమేశ్వరి.
పరమేశ్వరీ స్తవము (దండకము)
శ్రీమన్మహేశార్ధగాత్రీ! హిమాద్రీశపుత్రీ! త్రిలోకాధినేత్రీ! సదా భక్త సంప్రార్థితార్థ ప్రదాత్రీ! చిదానందరూపా! జగజ్జాలదీపా! తమోఘ్నప్రదీపా! సువర్ణస్వరూపా! సదా దేవబృందంబు సేవించు నీ దివ్య పాదాంబుజాతంబులన్ నేను ధ్యానింతు నేకాగ్రచిత్తాన నో వేదమాతా! భవాంభోధిపోతా! త్రిలోకైకమాతా! సదా లోక కళ్యాణమున్ గూర్చు నీ మందహాసంబు, నీ చిద్విలాసంబు, నీ ప్రేమ తత్త్వంబు, పీయూషసారంబు, నానందసంవర్ధకంబై విరాజిల్లు నో తల్లి! దీవ్యత్ కృపాకల్పవల్లీ!

మహాదేవుడున్ నీవు నెల్లప్పుడున్ వాక్కునున్ భావమున్ రీతి నన్యోన్య సంపృక్త గాత్రంబుతో నొప్పు మీ లీల లోకత్రయీ భావ్యమై, సర్వ సంసేవ్యమై, నవ్యమై, దివ్యమై, భవ్య యోగానుసంధాయకంబై విరాజిల్లుచుండున్ జగద్గీతకీర్తీ! సదానందమూర్తీ! మహాభక్తి భావంబుతో నిన్ను సేవించి, నీ నిండు వాత్సల్యమున్ గాంచు పుణ్యాత్ములన్ బ్రోచి, సౌఖ్యంబు చేకూర్చి, శోకంబు పోదీర్చి, నీ పాద పద్మంబులన్ జేర్చు నో యమ్మ! మా చింతలన్ దీర్చుమా, శాంతి సౌఖ్యములన్ గూర్చుమా, నిత్య కళ్యాణ యోగంబు సిద్ధింపగా చేయుమా, శంభు ప్రాణేశ్వరీ!, రాజ రాజేశ్వరీ!, సర్వలోకేశ్వరీ! ప్రేమరూపా!, నమస్తే, నమస్తే, నమస్తే, నమః.

రచన:- పండిత నేమాని.
జైశ్రీరాం.
జైహింద్. 

3, అక్టోబర్ 2011, సోమవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(వర్ణన1)

7 comments

శారద పూజ నేడు.  గుణ సాంద్ర మహాకవి వర్యులార! ఆ
శారద మీ ముఖాబ్జములఁ జక్కగ నర్తన చేయుగాక! భా
షా రమణీయ శోభిత ప్రశస్త కవిత్వ మహత్వమిచ్చి, యీ
భారతి ముద్దు బిడ్డలుగ వర్ధిల జేయును గాక సత్ కృపన్!
ఆర్యులారా!
శ్రీ కట్టమూరి అవధాన పరంపరలో ఒకానొక వర్ణనను మీ ముందుంచుచున్నాను.
విషయం:- బాలా త్రిపుర సుందరీ వర్ణనము. 
ఈ విషయమై మీరు ఆ జగదంబను చక్కగా మీ హృదయములో కొలువైయున్న సుందర రూపమును మీకు నచ్చిన ఛందస్సులో వర్ణించుట ద్వారా పాఠకులకు, కవనాసక్తి, కవితా పఠనాసక్తి,
పరి పూర్ణ భక్తి కలుగ జేయుదురని ఆకాంక్షిస్తున్నాను.
కవిగారి యొక్క, నాయొక్క పూరణములను వ్యాఖ్యలలో చూడనగును.
జైశ్రీరాం.
జైహింద్.

2, అక్టోబర్ 2011, ఆదివారం

నా షష్టిపూర్తి సందర్భముగా పండిత నేమాని వారి అభినందనలు.

5 comments

సాహితీ ప్రియ బంధువులారా!
మీ అందరి అభిమానాన్ని పొంద గలిగిన నా జీవితం నేటికి షష్టి  పూర్తి చేసుకొన్నది.
అనేక సందర్భాలలో నా ఆనందానికి కారకులైన మీ అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
ఈ సందర్భంగా శ్రీ నేమాని సన్యాసి రావు గారు అమూల్యమైన పంచరత్నాలతో శుభాశీస్సులు తెలియ జేసారు. అవి మీ ముందుంచుతున్నాను.


శ్రీరస్తు                                      శుభమస్తు                           అవిఘ్నమస్తు.
ప్రియ సాహితీ మిత్రులు 
చింతా రామ కృష్ణా రావు గారి షష్టి పూర్తి సందర్భంగా వారికి   అందించుచున్న
అభినందన పూర్వక శుభాశీస్సులు.
సమర్పణ:- పండిత నేమాని.
శ్రీ చింతాన్వయ రత్న భూషణవరా! శ్రీ రామకృష్ణా! సుధీ! 
శ్రీ చంద్రాతపతుల్య కీర్తివిభవా! స్నిగ్ధాంతరంగాంబుజా!
శ్రీ చాంపేయ సుమాభ కాంతికలితా! ప్రేమాంచితాశీస్సుధల్
నా చిత్తంబున గూర్చి మీ కవ పయిన్ వర్షించుచుంటిన్ సఖా! 1.
సరస కవిత్వ తత్త్వ విలసత్ ప్రతిభా విభవాఢ్యుడంచితా
దరమతి సద్గురుండనుచు ధాత్రి చెలంగితివీవు ధర్మ త
త్పరుడు సుధీ నిధానుడని తావక శీలము నెంచగా ధరన్
పరగుము హాయిగా యని సువర్ణ మయాశిషమిత్తు సోదరా! 2.
జనని వేంకట రత్నమ్మ సర్వ శుభద
తండ్రి సన్యాసి రామరావ్ తజ్ఞవరుడు
సతి విజయలక్ష్మి అనుకూలవతియు మరియు
సంతతి మహోన్నతాదర్శ శాలురగుచు 3.
అరువది యేడులు నిండెను
ధరపై నీ జీవితమున తద్దయు సుఖ సం
భరితముగ నితోధికముగ
చిరకాలము తనరు జీవితము మీకు సఖా! 4.
మీ కవ సుఖ శాంతులతో
శ్రీకరముగ తనరుగాక చిరకాలమిలన్
మీ కులము పెంపుగాంచుత
ఓ కళ్యాణ గుణ వైభవోజ్వలమూర్తీ! 5.
మంగళం.                 మహత్.              శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
విశాఖపట్టణం,
ఖర నామ సంవత్సర ఆశ్వియుజ శుద్ధ షష్ఠీ జ్యేష్ఠా నక్షత్ర యుక్త గురు వారము,
(తేదీ. 02-10-2011).

సుధా మధుర హృదయులైన పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు అవధాని గారు నాపై అవ్యాజానురాగామృతం వర్షింప జేస్తూ, పంచరత్నాలతో తమ శుభాశీస్సులను అందించారు.
వారి ప్రేమాభిమానాలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేసుకొంటున్నాను.
ఇంకా లహరి బ్లాగు ద్వారా సహృదయులనేకమంది తమ అభినందనలను తెలియజేసారు.
1) prasad said...
A good gift to any one is a big hug with a smile that has 100000 KVA lighting.........
Convey my wishes also to your grand pa.

2) 
prasad said...
నేను వేసిన టప్పటి అడుగులను 
ఎప్పటికప్పుడు సరిదిద్దిన మా తాత 
ఈ షష్టి పూర్తి కి నేనిచ్చే చిన్న Gift అని give him a hug
3) ఆ.సౌమ్య said...
తాతగారి పుట్టినరోజుని ఘనంగా జరపాలన్న నీ ఆలోచన బావుందమ్మా! నువ్వు కొత్త పద్యాలు రాయక్కర్లేదు. ఉన్నవే ఆరోజు భావయుక్తంగా చదివి వినిపించు మీ తాతగారికి...చాలా సంతోషిస్తారు.
4) రాజేశ్వరి నేదునూరి said...
చిరంజీవి వైష్ణవిని దీవించి ! " తాతగారి షష్టి పూర్తి సందర్భం గా నువ్వు చక్కగా ఆయన ఒడిలో కూర్చుని , తీయని కబుర్లు , అంత కంటే తీయని ముద్దులు ఇస్తే చాలు . 
" చిరంజీవి రామ కృష్ణా రావూ గారి దంపతులని " ధన కనక వస్తు వాహనములతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో , మనవలు , ముని మనవలతో , నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లాలని వారి కీర్తి ప్రతిష్టలు శతాబ్దాల దిగంతాల వరకు వెల్లి విరియాలని మనసారా దీవిస్తూ అక్క .
5) రాఘవ said...
మా తెలుగు గురువుగారికి
ఈ తీరుగ తెలుగులోన హృద్యమవంగన్
జోతలు తెలిపెద "ఓ మా
తాతయ్యా షష్ఠపూర్తి దండంబులివే" :)
6) prasad said...
మీ తాతగారికి నానుంచీ షష్టి పూర్తి శుభాకాంక్షలు.
లహరి బ్లాగు ద్వారా తమ శుభాకాంక్షలను అందించిన  వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను. ఆంద్రామృతం ద్వారా శుభాకాంక్షలను తెలియ జేసిన శ్రీ కంది శంకరయ్య గారికి. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారికీ ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.
జైశ్రీరాం. 
జైహింద్. 







1, అక్టోబర్ 2011, శనివారం

పద్య రచనాభిలాషులకు నేమాని వారి సూచన.

10 comments


పద్య రచనాభిలాషులారా!తవ, మమ, అనే సంస్కృత పదాలను తెలుగులో ఉపయోగించేటప్పుడు గమనించ వలసిన విషయం శ్రీ నేమాని వారు ఈ క్రింది విధంగా సూచించారు.
చూడండి.
అందరకూ కొన్నిసూచనలు:
అయ్యా! శుభాశీస్సులు.
తవ, మమ, మొదలగు సంస్కృత పదములను తెలుగులో యథా తథముగా వాడరాదు అని నాకు
జ్ఞాపకము.  
తావక (త్వత్, త్వదీయ, భవత్, భవదీయ), మామక(మత్, మదీయ) అని
వాడవచ్చును. 

ఇట్లు  పండిత నేమాని. 
ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం.
జైశ్రీరాం.
జైహింద్.