సాహితీ ప్రియ బంధువులారా!
మీ అందరి అభిమానాన్ని పొంద గలిగిన నా జీవితం నేటికి షష్టి పూర్తి చేసుకొన్నది.
అనేక సందర్భాలలో నా ఆనందానికి కారకులైన మీ అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
ఈ సందర్భంగా శ్రీ నేమాని సన్యాసి రావు గారు అమూల్యమైన పంచరత్నాలతో శుభాశీస్సులు తెలియ జేసారు. అవి మీ ముందుంచుతున్నాను.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
ప్రియ సాహితీ మిత్రులు
చింతా రామ కృష్ణా రావు గారి షష్టి పూర్తి సందర్భంగా వారికి అందించుచున్న
అభినందన పూర్వక శుభాశీస్సులు.
సమర్పణ:- పండిత నేమాని.
శ్రీ చింతాన్వయ రత్న భూషణవరా! శ్రీ రామకృష్ణా! సుధీ!
శ్రీ చంద్రాతపతుల్య కీర్తివిభవా! స్నిగ్ధాంతరంగాంబుజా!
శ్రీ చాంపేయ సుమాభ కాంతికలితా! ప్రేమాంచితాశీస్సుధల్
నా చిత్తంబున గూర్చి మీ కవ పయిన్ వర్షించుచుంటిన్ సఖా! 1.
సరస కవిత్వ తత్త్వ విలసత్ ప్రతిభా విభవాఢ్యుడంచితా
దరమతి సద్గురుండనుచు ధాత్రి చెలంగితివీవు ధర్మ త
త్పరుడు సుధీ నిధానుడని తావక శీలము నెంచగా ధరన్
పరగుము హాయిగా యని సువర్ణ మయాశిషమిత్తు సోదరా! 2.
జనని వేంకట రత్నమ్మ సర్వ శుభద
తండ్రి సన్యాసి రామరావ్ తజ్ఞవరుడు
సతి విజయలక్ష్మి అనుకూలవతియు మరియు
సంతతి మహోన్నతాదర్శ శాలురగుచు 3.
అరువది యేడులు నిండెను
ధరపై నీ జీవితమున తద్దయు సుఖ సం
భరితముగ నితోధికముగ
చిరకాలము తనరు జీవితము మీకు సఖా! 4.
మీ కవ సుఖ శాంతులతో
శ్రీకరముగ తనరుగాక చిరకాలమిలన్
మీ కులము పెంపుగాంచుత
ఓ కళ్యాణ గుణ వైభవోజ్వలమూర్తీ! 5.
మంగళం. మహత్. శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
విశాఖపట్టణం,
ఖర నామ సంవత్సర ఆశ్వియుజ శుద్ధ షష్ఠీ జ్యేష్ఠా నక్షత్ర యుక్త గురు వారము,
(తేదీ. 02-10-2011).
సుధా మధుర హృదయులైన పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు అవధాని గారు నాపై అవ్యాజానురాగామృతం వర్షింప జేస్తూ, పంచరత్నాలతో తమ శుభాశీస్సులను అందించారు.
వారి ప్రేమాభిమానాలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేసుకొంటున్నాను.
ఇంకా లహరి బ్లాగు ద్వారా సహృదయులనేకమంది తమ అభినందనలను తెలియజేసారు.
1) prasad said...
A good gift to any one is a big hug with a smile that has 100000 KVA lighting.........
Convey my wishes also to your grand pa.
2)
prasad said...నేను వేసిన టప్పటి అడుగులను
ఎప్పటికప్పుడు సరిదిద్దిన మా తాత
ఈ షష్టి పూర్తి కి నేనిచ్చే చిన్న Gift అని give him a hug
3) ఆ.సౌమ్య said...
తాతగారి పుట్టినరోజుని ఘనంగా జరపాలన్న నీ ఆలోచన బావుందమ్మా! నువ్వు కొత్త పద్యాలు రాయక్కర్లేదు. ఉన్నవే ఆరోజు భావయుక్తంగా చదివి వినిపించు మీ తాతగారికి...చాలా సంతోషిస్తారు.
4) రాజేశ్వరి నేదునూరి said...
చిరంజీవి వైష్ణవిని దీవించి ! " తాతగారి షష్టి పూర్తి సందర్భం గా నువ్వు చక్కగా ఆయన ఒడిలో కూర్చుని , తీయని కబుర్లు , అంత కంటే తీయని ముద్దులు ఇస్తే చాలు .
" చిరంజీవి రామ కృష్ణా రావూ గారి దంపతులని " ధన కనక వస్తు వాహనములతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో , మనవలు , ముని మనవలతో , నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లాలని వారి కీర్తి ప్రతిష్టలు శతాబ్దాల దిగంతాల వరకు వెల్లి విరియాలని మనసారా దీవిస్తూ అక్క .
5) రాఘవ said...
మా తెలుగు గురువుగారికి
ఈ తీరుగ తెలుగులోన హృద్యమవంగన్
జోతలు తెలిపెద "ఓ మా
తాతయ్యా షష్ఠపూర్తి దండంబులివే" :)
6) prasad said...
మీ తాతగారికి నానుంచీ షష్టి పూర్తి శుభాకాంక్షలు.
లహరి బ్లాగు ద్వారా తమ శుభాకాంక్షలను అందించిన వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను. ఆంద్రామృతం ద్వారా శుభాకాంక్షలను తెలియ జేసిన శ్రీ కంది శంకరయ్య గారికి. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారికీ ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
5 comments:
ఆర్యా ! షష్టి పూర్తి మహోత్సవమును జరుపుకొనుచున్న మీకు శతాధిక వత్సరములు ఆయురారోగ్యములతో సంతోషముగా సాహిత్య సేవ చేయుచూ తెలుగువారందరికీ "ఆంధ్రామృతాన్ని" అందించి ధన్యులవగల శక్తిని ప్రసాదించాలని 'ముగురమ్మల మూలపుటమ్మను' ప్రార్థిం చుచున్నాను. నమస్కారములతో...
శ్రీమాత! శ్రీవిద్య! శ్రీమన్మహారాజ్ఞి!
సింహాసనేశ్వరి! సింహవాహ!
శ్రీరాజరాజేశ్వరి! త్రిపురసుందరి!
చిద్వహ్నిసంభూత! శ్రీమహేశి!
శ్రీలలితాంబిక! శ్రీసదాశివకాంత!
సద్గతిప్రద! సుధాసారకలిత!
శ్రీచక్రరాజవాసిని! చంద్రశేఖరి!
సర్వశక్తినిధాన! చారురూప!
సర్వలోక వశంకరి! స్వర్ణగర్భ!
సర్వవేదాంతసంవేద్య! జ్ఞానదాత్రి!
సర్వవర్ణోపశోభితా! స్వప్రకాశ!
సర్వమంగళాదేవి! నిన్ సంస్తుతింతు
పండిత నేమాని
శ్రీమాత! శ్రీవిద్య! శ్రీమన్మహారాజ్ఞి!
సింహాసనేశ్వరి! సింహవాహ!
శ్రీరాజరాజేశ్వరి! త్రిపురసుందరి!
చిద్వహ్నిసంభూత! శ్రీమహేశి!
శ్రీలలితాంబిక! శ్రీసదాశివకాంత!
సద్గతిప్రద! సుధాసారకలిత!
శ్రీచక్రరాజవాసిని! చంద్రశేఖరి!
సర్వశక్తినిధాన! చారురూప!
సర్వలోక వశంకరి! స్వర్ణగర్భ!
సర్వవేదాంతసంవేద్య! జ్ఞానదాత్రి!
సర్వవర్ణోపశోభితా! స్వప్రకాశ!
సర్వమంగళాదేవి! నిన్ సంస్తుతింతు
పండిత నేమాని
వందనమ్ము సరస్వతీ
శ్రీసరోరుహ గర్భసంభవు జిహ్వ లాలిత రత్న సిం
హాసనమ్ముగ నొప్పు దేవత! హంసవాహన! భారతీ!
భాసమాన దయామయీ! వరివస్య జేయుదు భక్తితో
వాసవాది సురాళి వందిత! వందనమ్ము సరస్వతీ!
సకల వేద పురాణ శాస్త్ర రస ప్రసార విలాసినీ!
సుకవి సంస్తుత భవ్య లక్షణ శోభితా! భువనేశ్వరీ!
శుక విరాజిత పాణిపల్లవ! శుద్ధ మానస మందిరా!
ప్రకట వాగ్విభవ ప్రదాయిని! వందనమ్ము సరస్వతీ!
మల్లెలంచలు కప్పురంబుల మంచి చాయల నొప్పుచున్
చల్లనౌ కను జూపులొప్పగ జల్లుచున్ కృప మాయెడన్
తల్లి మమ్ముల బ్రోచుచుందువు తమ్మిచూలికి నుల్లమున్
బల్లవింపగ జేయు కోమలి! వందనమ్ము సరస్వతీ!
సరస మంజుల సత్ఫలప్రద సత్య సూక్తుల సాదృతిన్
నిరతమున్ బలికింప జేయుము నెమ్మి మా రసనమ్ముచే
పరమ పావన భావనా! శ్రుతి వందితాద్భుత వైభవా!
పరమ విద్య ననుగ్రహింపుము వందనమ్ము సరస్వతీ!
వీణె మీటుచు వేదనాదము విశ్వమంతట నింపునో
వాణి పల్లవపాణి మంజులవాణి పద్మజురాణి గీ
ర్వాణి బంభరవేణి నీ పద పద్మ సన్నిధి వ్రాలి నే
పాణి యుగ్మము మోడ్చి మ్రొక్కెద వందనమ్ము సరస్వతీ!
శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి షష్టి పూర్తి సందర్భమున హృదయ పూర్వక అభినందనలు !
భగవంతుడు కృపతో తమకు దీర్ఘతరమగు ఆయువు సంపూర్ణ ఆరోగ్యము సకల శుభములు సుఖసౌఖ్యములు సంతోషము కలిగించు గాక! మీ కుటుంబ సభ్యులకు కూడా సకల శుభములు కలుగు గాక !
గురువుగారూ,
హృదయ పూర్వక అభినందనలు.
ఆలస్యముగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
భవదీయుడు
ఊకదంపుడు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.