గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2011, శనివారం

సార్వవిభక్తిక సీసము:

పండిత నేమాని వారి అధ్యాత్మ రామాయణము నుండి.
సార్వవిభక్తిక సీసము: 
జ్యేష్ఠుండు, రఘుకుల శ్రేష్ఠుండు, రాముండు
రాజాధిరాజ విరాజితుండు
రామునే తలచెద, రామునే కొలిచెద
రామునే మ్రొక్కెద స్వామి యనుచు
రాముని చేతనే రాజిల్లు నిరతమ్ము 
ఘనముగా మా వంశ గౌరవమ్ము
రాముని కొరకు నే బ్రార్ధించి సాదర
వందనమ్ము లొనర్చుచుందు నెపుడు
రాము గంటెను వేరొక్క ప్రభువు లేడు
రామునకు జేయు సేవ మాత్రమ్మె చాలు
నందులో నేను ధన్యత్వమొందు వాడ
నో భరద్వాజ! సురభూజ! యోగిరాజ!
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

సీ.
సామాన్యుఁడా? కాఁడు; నేమాని వంశీయుఁ
........ డౌ రామజోగి సన్యాసి రావు
అతని పాండిత్యమ్ము నాతని సుకవితా
........ రామణీయక మెన్నరా దెవరికి
అతనిచేత మధురమైనట్టి యధ్యాత్మ
........ రామాయణం బది వ్రాయఁబడియె
అతని సూచనలకై యతని పూరణముల
........ కై ప్రతీక్షించెద ననుదినమ్ము
తే.గీ.
అతనికంటె సుహృత్తుల నరయనైతి
నతని కిదె సేతు వందనశతము లిప్పు
డతనిలో మంచితనమున కంతు గాన
నో సుధీ! రామకృష్ణ! యత్యుక్తి గాదు.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

భరతునిచే భరద్వాజ మునివర్యునితో చెప్పించిన పద్యము శ్రీ నేమాని వారి రామభక్తికి ప్రతీకయితే శ్రీ కంది శంకరయ్య గారు నేమాని వారిపై చెప్పిన పద్యము వారి వాణీ లాలనకు చిహ్నము !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.