గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, అక్టోబర్ 2011, బుధవారం

ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి.

ప్రియ భారతీయ సోదర సోదరీమణులారా!
విజయ వాడలో ఒక పాశ్చాత్య మహిళ వివస్త్రగా రాజ మార్గంలో హెల్ప్ హెల్ప్ అంటూ దీనాతి దీనంగా యాచిస్తూ పరుగు పెడుతూ ఉంటే అక్కడ సంచరిస్తున్న  ఏ ఒక్కరికీ ఆమెపై కనికారం కలగ లేదు. సరి కదా మనమున్నది సభ్య సమాజంలోనేనన్న మాట మరచి పోయి, దుర్గమ్మ కొలువైయున్న విజయవాడలోనే దుర్గకు మారు రూపమైన ఈ పాశ్చాత్య మహిళ ఆక్రందనకు ఏమాత్రం స్పందించ లేకపోవడం చాలా దురదృష్టకరం.
మనం గడుపుతున్న హడావిడి జీవితంలో ఎవరి బాధ్యతలు వారికి ఉండ వచ్చును. ఎవరి తొందర వారి కుండవచ్చును. అంత మాత్రం చేత పని తొందరగా చెయ్యాలని వేసుకొనే జోడు వేసుకోవడం అలక్ష్యం చేస్తున్నారా?
ఈ దీనురాలి విషయంలో ఒక్క చిన్న వస్త్రాన్ని అందజేసి ఆమె మానాన్ని కాపాడడానికి ఏ ఒక్కరికైనా సమయం  చిక్కలేదా?
ఎక్కడి నుంచో దూర దేశం నుంచి మన దేశం వచ్చి మన దుర్గమ్మను కనులారా చూడాలనే తపనతో మన ప్రాతం వచ్చిన ఒక మహిళ  అలా వివస్త్రగా రోడ్డున పడడం వెనుక ఉన్న కారణం ఏమిటి? ఆమె పిచ్చిది కాదు. హెల్ప్ హెల్ప్ అంటూ ఆక్రందిస్తోంది కదా? అంతటి దురవస్థ ఆమెకెలా కలిగింది? ఏ దుర్మార్గుల దౌష్ట్యానికో ఆమె బలి కాకపోయి ఉంటే ఇటువంటి దుస్థితి ఆమెకు వచ్చే పని లేదు కదా?
భరత మాత తన ఒడిలో ఆనందం పంచుకోడానికి వచ్చిన పాశ్చాత్య వనితకు తన బిడ్డలే రక్షణ కల్పించలేనందుకు సిగ్గుతో ప్రపంచ  దేశాలలో తల వంచుకుంటోంది.
మనిషిగా పుట్టిన మనం కొంచెమైనా ఆలోచనా శక్తి కలిగి ఉన్నట్లైతే జీవచ్ఛవాల లాగా ఉండకుండా ఒక సామాజికుడుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే ధ్యాసని విడువ కూడదు.
ఇదే మన తల్లో, మన చెల్లో, లేదా మన భారతీయ మహిళో విదేశాలలో ఇలాంటి స్థితే  ఎదుర్కొంటే మనమనస్సు ఎంతగా పరితపిస్తుందో ఆలోచించుకోవాలి.
సామాజిక జీవనం గడిపేవారిలో మానవత్వం పరిమళించాలి.
అలా కానినాడు మనకంటే ఆ వన్య మృగాలే నయం.
ఎందుకిలా మారిపోతున్నాం మనం?
ఎక్కడుంది లోపం?
ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి.
ఏం చేద్దాం?
ఇది ఇలాగే సాగిపోనిద్దామా?
మనకెందుకులే అని వదిలేద్దామా? మనదాకా వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుందామా?
అసలు గాంధీగారి మూడు కోతుల కథకు వక్ర భాష్యం చెప్పుకొని, చెడు చూడకు, చెడు వినకు, చెడు కనకు అన్నరు కదా? అలాగే చూడకుండా దూరంగా ఉందాం అని నిర్ణయించుకుందామా?
ఒక్కసారి ఆలోచించి, ఏం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో, మన భావాన్ని సమాజంలోకి ఎలా వ్యాపింప చేయాలో సూచించండి.
ఇతనికేం పనిలేనట్టుంది అని నన్ను తిట్టడం మాత్రం చేయరని భావిస్తున్నాను.
పాపము శమించును గాక.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

3 comments:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

భయమండి భయం.. ఆదుకోవడానికి పోతే రౌడీలు ఎక్కడొచ్చి చంపేస్తారో నని.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు. మీరు చక్కని విషయమును సున్నితముగా ప్రస్తావించారు. 'గురు 'వృత్తిలో ఉన్నవారు మీరు యీ విధముగా స్పందించడము నాకు బాగా నచ్చింది. ఓ అబల పట్ల అసభ్యముగా ప్రవర్తించిన దుండగులను మందలించ బోతే ఆ దుండగులు శ్రీ వాజపేయి వారి మేనల్లుడుని రైలు బండి లోంచి క్రిందకు తొసేసారు. వాజపేయి మేనల్లుడు అప్పుడు మరణించాడు. ఓ యిద్దరు రౌడీలను ఆపడానికి ఆ బండిలో యింకెవరూ ముందుకు రాలేదు. మన జాతి అంత నిస్సత్తువ యైనదా అని అనుమానము కలుగుతొంది. వందలు మంది నడిచే బాటలో ఎండ దెబ్బకు పడిపోతే సహాయానికి ఎవరూ రారు. ఘోరాలు జరిగిపోతే ఎవరూ పట్టించుకోరు. సమ్మెలు బందులు జరుపడానికి బస్సులు తగల బెట్టడానికి విద్యార్ధులు ఉద్యోగులు ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ప్రజా జీవితము స్థంభింప జేస్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఓ నలభై సంవత్సరాలకు యిప్పటికీ మన సంఘములో మానవత్వపు విలువలు, పరులకు సహాయ పడాలనే సంస్కృతి ,ఎదుట వారి హక్కులు పరిరక్షించాలనే భావన ఏమీ పెరుగ లేదు. పాఠశాలలో విలువలను పాఠ్యాంశముగా బోధించ వలసిన అవసరము కనిపిస్తున్నది.

భక్తి పరముగా చక్కని కవిత్వము చెప్పడమే గాక మీరు మీ బ్లాగులో చక్కని విషయమును చర్చకి తీసికొని వచ్చినందులకు మీకు అభినందనలు .

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! గన్నవరపు వారు చెప్పినట్లు బందు లంటే, సమ్మెలంటే తండోపతండాలుగా గుమికోడే జనం, సాటి మనిషి ఇబ్బందులలో వుంటే ముఖం చాటేస్తాడు.రాబందుల లాంటి వారిని బంధించటానికి ఇబ్బంది పడుతుంటాడు.విలువల వలువలు లేని వానిగా తయారౌతున్నాడు.
హేభగవాన్!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.