గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, అక్టోబర్ 2026, సోమవారం

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ!..... శ్రీ పాలకుర్తి రామ్మూర్తి.

 జైశ్రీరామ్.

శ్లో.  యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగః

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ!

ఎక్కడ భోగాపేక్ష ఉంటుందో అక్కడ మోక్షం లభించదు. అలాగే ఎక్కడైతే మోక్షకాంక్ష ఉంటుందో అక్కడ భోగాసక్తి ఉండదు. కాని ఎవరైతే శ్రీ లలితా మహాత్రిపురసుందరి జననిని సేవిస్తారో వారికి భోగములు, మోక్షమూ సులభంగా కరతలామలకములౌతాయి, అంటారు.

లలితాదేవి దేవతల కార్యాన్ని సుసంపన్నం చేయడం లక్ష్యంగా చిదగ్నికుండంలో ఆవిర్భవించింది. దైవ కార్యము ఏమిటి? భండాసురుని సంహరించడం. భండాసురుడు ఎవరు? మన్మథుని శివుడు భస్మం చేసిన సమయంలో ఆ భస్మాన్ని చిత్రకర్మ అనేవాడు ఒక బొమ్మగా తయారుచేయడం, దానికి ప్రాణప్రతిష్ట జరిగి భండుడు అవతరించడం, అతని చర్యలు రాక్షసంగా మారడంతో.. అతనిని భండాసురునిగా వ్యవహరించడం జరిగింది.

ఆ భండాసురునికి విశుక్రుడు, విషంగుడు అనే వారు తోడయ్యారు. వారికి అదనంగా ఇంద్రశత్రువు, అమిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రధన్వుడు, విజయుడు, శ్రుతిపారగుడు అనబడే ఎనిమిది మంది రాక్షసులు ముఖ్యమైన అనుచరులుగా వచ్చి చేరారు. వీరంగా జగత్తుకు కంటకులుగా మారడం వల్ల వారిని సంహరించేందుకై "చిదగ్నికుండం"లో ఆవిష్కృతమయింది, లలితాదేవి.

అలా అవతరించిన లలితాంబిక, వివిధ దైవీశక్తులను సమీకృతం చేసి భండాసురుని సంహరించింది. దీనిని లలితాసహస్రనామాలు 64 వ నామం నుండి 84 వ నామంవరకు వర్ణించాయి. 

భండాసురుడు అంటే.. భండాసురుని వ్యక్తిగా చూడవద్దు. మానవునిలో సహజమైన జ్ఞానాన్ని కప్పివేసే అంతరంగంలోని అహంకారానికి ప్రతీకగా చూడాలి.. కామదహనం పిమ్మట ఆ భస్మం నుండి జనించిన వాడు భండాసురుడు. అంటే కామం నశించినా దాని భస్మం పూర్తిగా ప్రక్షాళన కాలేదు. లేదా అంతరంగ శుద్ధికాలేదు అన్నది భావన. అహంకారం, స్వార్థం, మమకారం, జడత్వం వీటితో ఆత్మజ్ఞానాన్ని కప్పివేసుకున్న అజ్ఞానానికి ప్రతీక భండాసురుడు. నిజానికి అహంకారం చైతన్యవంతమైతే దుష్టప్రవృత్తికి మార్గంచూపుతుంది. లలితాదేవి ప్రకటించిన యుద్ధం బాహ్యయుద్ధం కాదు. అజ్ఞానంపై జ్ఞానాన్ని, అహంకారంపై చైతన్యాన్ని, జడత్వంపై సృజనశక్తిని పంపించి  అహంకారాన్ని సమూలంగా తొలగించింది అని భావించాలి.

అహంకారం నుండి ప్రకటితమయ్యేది దుష్టబుద్ధి.. దానినే విశుక్రుడు అన్నారు. దుష్టబుద్ధి ఇతరులకు హానిచేసి ఆనందించాలని భావిస్తుంది. ఆ భావనా జనితమైనవాడే.. విషంగుడు. వారి వద్ద ఉండేది విఘ్నయంత్రము.. ప్రతి ఉత్తమ కార్యానికి విఘ్నకారణాలను సృజించాలనే బుద్ధితో ప్రణాళికలు రచించడం.. నిజానికి యంత్రము అంటే మనము దానికి ఇచ్చినది ఏదైనా దానిని పెంచి మనకు అందించేది. చెడుభావనతో దానిని నింపిన సమయంలో అది విఘ్నయంత్రంగా లోకానికి అపకారం చేయడానికి ఉపక్రమిస్తుంది. 

ఇక భండుని కుమారులు.. మన అంతరంగంలోని దుర్మార్గపు చర్యలు, భండుని సేన.. దుష్టుల యొక్క సేనావాహిని, శూన్యకపురము అంటే అశుభాలకు నెలవైనది.. చివరకు ఏమీ మిగలకుండా చేసేదిగా భావించవచ్చు. 

మానసికంగా భండాసురుడు అహంకార రూపంలోనూ, నేను నాది అనే మమకారాల రూపంలోనూ అధికార వ్యామోహ రూపంలోనూ, ఆధిక్యతను చాటుకునే రూపంలోనూ మనలోనే ఉన్నాడు.. 

దీనిని సామాజిక కోణంలో పరిశీలిస్తే... భండాసురుడు అధికార దుర్వినియోగానికి, స్వార్థపూరిత చింతనకు, అన్యాయానికి, వివక్షలకు, విలువల క్షీణతకు, సృజనశీలతను అణిచివేసే శక్తులకు ప్రతీకగా చూడవచ్చు. లలితాదేవి యొక్క సేనావాహిని ఈ అధార్మిక శక్తులను అణిచివేసింది. అనడంలో కేవలం ఆయుధాలు ధరించిన దేవతలు భండాసురుని శక్తులను సంహరించాయి అనుకోవడం సరికాదు. లలితాదేవి శక్తులను సానుకూల శక్తులకు ప్రతీకలుగా చూడాలి. జ్ఞానం వల్ల వివేకం, విచక్షణలు వెలుగుచూస్తాయి. ధార్మికప్రవర్తన వల్ల నైతికత నిలుస్తుంది. ప్రేమవల్ల మానవీయత వికసిస్తుంది. ధైర్య సాహసాల వల్ల అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి ఉత్తేజితమౌతుంది. సృజనశీలత వల్ల సమాజం నూతనంగా ఆవిష్కృతమౌతుంది.

వ్యక్తి స్థాయిలో చూస్తే భండాసుర వధ అనేది అహంకార నిర్మూలనంగా తీసుకోవాలి. సామాజిక స్థాయిలో భండాసుర వధను అన్యాయ వ్యవస్థలపై ధర్మచైతన్య విజయంగా భావించాలి. ఆధ్యాత్మిక స్థాయిలో భండాసుర వధను అజ్ఞానం తొలగి చైతన్యం వికసించడంగా భావించాలి.

ఇక్కడొక ప్రశ్న ఎదురవవచ్చు.. జగత్తంతా ఉన్నది ఒకే ఒక చైతన్యం.. అదీ అమ్మవారే కదా. అప్పుడు భండాసురునిలోనూ ఉన్నది అమ్మవారే కదా.. అప్పుడు ఆమె ఎవరితో యుద్ధం చేస్తుంది? 

అద్వైత దృష్టితో పరిశీలిస్తే.. ఆమె ఎవరితోనూ యుద్ధం చేయలేదు. తనలోనే ఏర్పడిన అవిద్య అనబడే ఆవరణాన్ని తనలోనే ఉన్నట్టి జ్ఞానమనే శక్తితో తొలగించింది లేదా అణచివేసింది. ఇక్కడ మరొక అంశాన్ని గుర్తించాలి. సకారాత్మకశక్తులు, నకారాత్మకశక్తులు రెండూ ఉంటేనే సమగ్రత. ఒకటి ఉండి మరొకటి లేని స్థితి ఉండదు. కాకపోతే ఏది చైతన్యవంతంగా ఉన్నది ఏది జడతను ఆదరిస్తున్నది అనేదే ముఖ్యమైనది. శక్తి ఒక్కటే రూపాలు లేదా ధర్మాలు అనేకం మాత్రమే. 

దేవీ ఉపాసనలో పరాశక్తి సర్వవ్యాపిని. భండాసురుడిలో ఉన్న చైతన్యం కూడా ఆమెదే. అతనిలోని శక్తి కూడా ఆమెదే. అతన్ని సంహరించే లలితా శక్తి కూడా ఆమెదే.  నిజానికిది రెండు శక్తుల మధ్య యుద్ధం కాదు. అజ్ఞానంతో ఆవరించబడిన చైతన్యం.. అదే చైతన్యంలోని జ్ఞానశక్తి చేత తన ఆవరణాన్ని తొలగించుకోవడం.  దీపం చీకటితో యుద్ధం చేయదు. దీపం వెలిగినప్పుడు చీకటి స్వయంగా తొలగిపోతుంది. అలాగే జ్ఞానం అజ్ఞానంతో యుద్ధం చేయదు.. జ్ఞానం వ్యక్తమైనప్పుడు అజ్ఞానం నిలవదు.

మరొక ప్రశ్న.. “వధ” ఎందుకు? ఇక్కడే పురాణ భాషకు, తాత్త్విక భాషకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. పురాణం “వధ” అంటుంది. తాత్త్వికత దానినే "అవిద్యా నివృత్తి"గా చెపుతుంది. ఈ ప్రక్రియలో భండాసురుని వ్యక్తిత్వాన్ని ఆవరించిన అహంకారం, మమకారం, అవిద్య, వికారాలు తొలగిపోయాయి. అంతేకానీ వాటికి ఆధారమైన చైతన్యం నశించదు.

లలితాత్రిపురసుందరి భండాసురుడిని నాశనం చేయలేదు.. అతనిలోని అసురత్వాన్ని తొలగించింది.

సామాజిక కోణంలో వ్యక్తిపై ద్వేషం కాదు. అతడి దుష్ప్రవృత్తిపై ప్రతిఘటన కావాలి. మనిషి నిర్మూలనం కాదు.. మనిషిలోని అజ్ఞాన నిర్మూలనం జరగాలి. 

పాలకుర్తి రామమూర్తి..

ఇంత చక్కని విషయాన్ని అందించిన శ్రీ పాలకుర్తి రామమూర్తిగారికి ధన్యవాదములు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.