గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, అక్టోబర్ 2026, సోమవారం

రేనాటి సూరీడు ... శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు మహోదయులు..

 జైశ్రీరామ్.


శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు.

రేనాటి సూరీడు. చారిత్రకప్రబంధము.  నా భావన.

రేనాటిసూరీడు చారిత్రక ప్రబంధము గూర్చి సాహసించి నాలుగు మాటలు వ్రాయుటకు ముందు నా అనుంగు సహోదరులు చింతావారికి, నాకు గల స్నేహానురాగాల అనుబంధపుమూలముల గురించి చెప్పితీరవలసినదే. మాన్యులు ద్విసహస్రావధాని శ్రీయుతులు మాడుగుల నాగఫణిశర్మగారి యవధాన పృచ్ఛకబృందములోతొలుత మేమిరువురము సభ్యులమై, తదుపరి పంచసహస్రావధానములో 15రోజుల పరిచయముతో ‘‘ఇంతింతై ’’ అనునట్లు అనురాగమును పెంచుకొంటిమి. నేను వారికన్న వయసా కొంత పెద్దవాడిని కనుక వారిచే అన్నగారని పిలిపించుకొను నర్హత సంపాదించితిని. సాహితీ పరముగా జూచిన వారే నాకన్నగారు. వారి చిత్ర ,గర్భ కవితా గంగా ప్రవాహమును గూర్చి ఎంత వ్రాసినను తక్కువే. చింతావారి రచనలు ఏ రూపముతో నున్నా నిశ్చింతగా చదువుకొన వచ్చును. ఒక్కరోజు లోనే శతకమును వ్రాసిన వాసి వారిది. పద్యమును హృద్యముగా, అనవద్యముగా గంభీరముగా పాఠకుల మస్తిష్కములోనికి జొనుపుట వీరికి అలవోకగా నబ్బిన క్రీడ. ఇక వీరు లేని యవధానసభ లేనేలేదు. 

‘‘రేనాటి సూరీడు’’ పంచ ఆశ్వాసముల పద్యకావ్యము. ఇందు ముఖ్యముగా నరసింహారెడ్డి సార్ధకనామధేయుడైనాడు. తన సూర్య ప్రతాపానలజ్వాలలు తుచ్ఛఆంగ్లేయ మూకలపై చూపించి భరతమాత ముద్దుబిడ్డగా గర్వించాడు. 

కవివర్యులు ప్రథమముగా శ్రీ నృసింహ ప్రార్ధన చేయుటలో నెంతో ఔన్నత్యం కనబడుతుంది. ప్రేమ, క్రూరత్వం సమపాళ్లలో ఉండి ఎప్పుడెక్కడేది చూపించాలో స్వామివలె తెలిసినవాడు నాయకుడు.

 ‘‘ శ్రీమన్మంగళ .......భారతీయతనిలన్ బెంపొందగా జేయుతన్.’’ 

ఈ కావ్యమును మన ధేశము కొఱకు ప్రాణములర్పించిన మహా త్యాగమయ వీరులకంకిత మిచ్చుట కవిగారి సందర్భశుద్ధికి, దేశభక్తి కి తార్కాణము. రేనాటి పౌరుషము చిన్న ఎత్తు గీతిలో...

‘‘ వినుత రేనాడులో పుట్టి వెలుగువారు., చచ్చుటో చంపుటో  రేనాడు వీరనాడు. ...ప్రథమ. ఆ. 44. వివిధరకముల ఛందస్సుల నుపయోగించుటో వీరు సిద్ధహస్తులు.

[7:57 pm, 19/10/2026] Ponnekanti Suryanarayanarao Hyd: ద్వితీయాశ్వాసము;‌‌‌‌‌ సంక్లిష్ట ప్రాసల నలవోకగా ప్రయోగించుట వీరికొక క్రీడ. ‘‘ సృష్టి వింతగ జూడగ.....తుష్టిని ....ఆహరింపగన్. ..9.

తెల్ల దొరల పెత్తనములో పాలెగాండ్ర వ్యవస్త ఎన్ని అవస్తల పాలైనదో కన్నులకు కట్టినట్టు వర్ణించారు.

 గీ. పాలెగాండ్ర వ్యవస్తను పాతిపెట్టి., ....44.

పన్నులు కట్టలేని వారి దుస్తితిని గూర్చి ఈ పద్యంలో చూడండి,

 ‘‘ వి...చ్ఛిన్న శరీర భాగముల చిందెడి రక్తము పైన కారముల్ ... క్రన్నన జల్లుచుండ.   60. 

కవిగారి రచనలో జాతీయములకు కొదవే లేదు. 

‘‘ ఎవ్వని బాబు సొమ్మనుచు .....’’67. 

దుర్గాదేవిని ధ్యానించగా శత్రుసంహారమునకు ఖడ్గమునిచ్చుట మనకు ఛత్రపతి శివాజీ మహారాజును గుర్తుచేయక మానదు, ధర్మ రక్షణలో పరాక్రమములో...

‘‘ చం. జతనము సాగె ......, క్షితిపయి ధర్మ రక్షణ చేసెడి వేళను. 92

. 

తృతీయాశ్వాసము...

నరసింహారెడ్డి వాడ్సనుని దండింపబూను సందర్భములో భయమునెలా ఆవిష్కరించారో చూడండి. 

‘‘ చం. పలుమరు చూచె వెన్కకును వచ్చుచు నుండెనో రెడ్డి? యంచు తాన్.  77. 

జగన్నాధుని ధర్మయుద్ధమునకు సాయముగోరు సమయమున రెడ్డి తన భక్తిని చూపిన విధము మనోహరము. 

‘‘ హేమ హిమాన్వితా .......ఉపాయము నెన్నజేయుమా!...87.


చతుర్ధాశ్వాసము...

ఎల్లమ్మ జాతరలో తప్పించుకొనిన సమయాన మనోహరభావన చూడండి

‘‘ గీ. నందె ,,, దైవంబు తోడున్న మందమతియు , 

      నాపదలనుండి రక్షణ నందగలడు. ..5.

రెడ్డి సహచరులతో నజ్ఞాతముగా నున్న సమయాన చక్కని భావన.

‘‘ నరసింహుండును మిత్రులున్ ....మేధాశక్తితో నిత్తరిన్. 19.


పంచమాశ్వాసము. 

రెడ్డి పరాక్రమమునకు ధర్మనిష్టకు మరొక మచ్చుతనుక. 

‘‘ గీ.   తనను బంధింప నొక్కడున్ .....    రెడ్డి ప్రజ్ఞ నెరిగి. ..3. 

రెడ్డి యొక్క దేశభక్తి , త్యాగనిరతికి మంచి యుదాహరణము. 

‘‘ గీ.  రెడ్డి ముఖమున చింతయే లేదు చూడ. నెదరు తిరుగుటయు లేదు. బెదురు లేదు. 33. 

నరసింహారెడ్డికి సంబంధించిన మానవత,దేశభక్తి, త్యాగశీలత, ఒకటేమి సమస్త సద్గుణములు తమకు తాముగా వరించినవి. కథ చారిత్రకమైనను ఏక ధారగా వివిధ ఛందోరీతులతో రసాత్మకమై గుణాత్మకమై గణనీయముగా నలరారినది. కవి ప్రతిభ ప్రతిపద్యము నందు వెల్లివిరియుచున్నది. తప్పక పాఠకలోకము చదివి తీరవలసిన కావ్యము. చిత్రకవితా సార్వభౌములు భగవానుని దయవలన ఆయురారోగ్యములు కలిగి  మరెన్నో కావ్యములు ఆవిష్కృతము చేయాలని కోరుతు .... ఈ భావపరంపరలోని గుణదోషములలో గుణములు మా గురువర్యులవి, దోషములు నావి.  

                                              మీ సహోదరుడు.

  మల్కాజ్గిరి                   పొన్నెకంటి సూర్యనారాయణరావు

  భాగ్యనగరం.                    విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు. 

                                       ది. 19. 10. 2026.

నా కావ్యమును ఆద్యంతము ఓపికగా పఠించి వారి అమూల్యమైన సమీక్షను అందించిన శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు అన్నగారికి  ధన్యవాద పూర్వక నమస్సులు.


జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.