గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, అక్టోబర్ 2011, మంగళవారం

శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధాని షష్టి పూర్తి సందర్భంగా..శ్రీ కంది శంకరయ్య గారి పంచ రత్నాలు.

శ్రీరస్తు                             శుభమస్తు                 అవిఘ్నమస్తు.
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి షష్టి పూర్తి సందర్భముగా 
అందజేయుచున్న 
పంచ రత్నములు.
సమర్పణ:-శ్రీ కంది శంకరయ్య

శ్రీశ భారతీశ శీతాద్రిజేశ సా
మ్ముఖ్య మంది కట్టమూరి చంద్ర
శేఖరావధాని! చిరకాల మారోగ్య
శుభ సుఖములతోడ శోభఁ గనుము.

అష్టావధాన విద్యను
కష్ట మ్మిసుమంత లేక కడు సులభముగా
నిష్టాగోష్ఠిగఁ జేయు వి
శిష్టంబగు ప్రతిభ నీది; చేసెద నుతులన్.

అస్త్రముల దూసిరట ఘన
శాస్త్రజ్ఞులు పృచ్ఛకుల్ ప్రచండముగా నీ
శస్త్రముల వంటి పూరణ
లే స్త్రైణమ్మై సొగసులనే కురిపించెన్.

విరులు సమస్యాపూరణ
లరయ లతలు దత్తపదులు ననఁగ నిషిద్ధా
క్షరు లాకులు వర్ణనములు 
మురిపించునులే యుపవనముగ నీ రచనల్. 

సృష్ట్యారంభక కరుణా
దృష్ట్యంచల లబ్ధ విభవ దీవ్యద్యశ సం
తుష్ట్యాద్యఖిల శుభంబుల
షష్ట్యబ్ది మహోత్సవమున సఫలతఁ గనుమా!


మంగళం                                                                        మహత్.   

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 

ఆంధ్రామృతంలో నిన్నటి, మొన్నటి టపాలు కూడా దీనికి సంబంధించినవే. చూడండి. 
ప్రవాసాంధ్రుల ఆంధ్రాభిమానం ప్రవాస రాజ్యంలో కనబడుతుంది చూడండి.
'ప్రవాసరాజ్యం'  www.pravasarajyam.com 
జైశ్రీరాం.
జైహింద్.


Print this post

4 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శంకరార్యా ! పంచ " రత్నములే " పంచారు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతులు . శ్రీ కట్ట మూరి చంద్ర శేఖరం అవధాని గారి షష్టి పూర్తి సందర్భముగా సరస్వతీ పుత్రులు శ్రీ కంది శంకరయ్య గారి పంచ రత్నములు మణి మాలలై వారి గళము నలంకరిం చినవి. ఆ దేవి కటాక్ష వీక్షణములు ఈ పండితుల పై ఎల్ల వేళలా ప్రసరించాలని , వారి కీర్తి ప్రతిష్టలు యుగయుగాలుగా ప్రతిద్వనిం చాలని మనసారా ఆశీర్వదిస్తూ " అభినందన మందారాలు .ఈ అవకాశాన్ని కలిగించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీకవి వర్యునికి శ్రీ గురువర్యుల చక్కని ప్రశంసావళి !

Pandita Nemani చెప్పారు...

కొన్ని సూచనలు:
కొందరి రచనలను చూచి ఈ క్రింది సూచనలను చేస్తున్నాను:

(1) శక్తివంతుడు(తప్పు) : శక్తిమంతుడు (ఒప్పు)
ఇకార ఉకారముల మీద "మంతుడు" అనే వాడాలి.
ఉదా: ధీమంతుడు, శ్రీమంతుడు, బుద్ధిమంతుడు,
హనుమంతుడు, ఆయుష్మంతుదు, రోచిష్మంతుడు

(2) దేశముకు(తప్పు), దేశమునకు (ఒప్పు)
ఉకార ఋకారముల తరువాత "నకు" అని చేర్చాలి.
ఉదా: రాజునకు, పితృనకు, పుత్రునకు,

ఔత్సాహికులైన రచయితలు ఈ సూచనలను గ్రహించగలరు.


పండిత నేమాని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.