గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2011, సోమవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(వర్ణన1)

శారద పూజ నేడు.  గుణ సాంద్ర మహాకవి వర్యులార! ఆ
శారద మీ ముఖాబ్జములఁ జక్కగ నర్తన చేయుగాక! భా
షా రమణీయ శోభిత ప్రశస్త కవిత్వ మహత్వమిచ్చి, యీ
భారతి ముద్దు బిడ్డలుగ వర్ధిల జేయును గాక సత్ కృపన్!
ఆర్యులారా!
శ్రీ కట్టమూరి అవధాన పరంపరలో ఒకానొక వర్ణనను మీ ముందుంచుచున్నాను.
విషయం:- బాలా త్రిపుర సుందరీ వర్ణనము. 
ఈ విషయమై మీరు ఆ జగదంబను చక్కగా మీ హృదయములో కొలువైయున్న సుందర రూపమును మీకు నచ్చిన ఛందస్సులో వర్ణించుట ద్వారా పాఠకులకు, కవనాసక్తి, కవితా పఠనాసక్తి,
పరి పూర్ణ భక్తి కలుగ జేయుదురని ఆకాంక్షిస్తున్నాను.
కవిగారి యొక్క, నాయొక్క పూరణములను వ్యాఖ్యలలో చూడనగును.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

7 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బాలా త్రిపుర సుందరీ వర్ణనము.

శ్రీ బాలామణి! వరగౌ
రీ! బాలా త్రిపుర సుందరీ! నినుఁ బొగడం
గా బంధంబులు తొలగును.
మా బంధువు నీవ యగుచు, మము గాచెదవే!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ కట్టమూరి కవి చేసిన బాలా త్రిపుర సుందరీ వర్ణనము.

అఖిల జగము లేల ఐంకార యుక్తయై
అనల మధ్యము నిల్చెనాది శక్తి.
శ్రీచక్రమున నిల్చు హ్రీంకార రూపియై
భక్త జనుల బ్రోచు భక్త వల్లి.
ఒద్దికగా నొప్పు ఓంకార పంజర
శుకముగా నిల్చు విశుద్ధ తత్వ
ఉపనీషతులనెడి ఉద్యానమందున
సంచరించెడి మహా సత్వ రూప.
నిగమముల పుట్ట శాస్త్రాల నిష్ట అలపు
రాణ పంక్తిలో దిట్టయై రాణకెక్కు
అంబ బాలా త్రిపుర సుందరగుచువెలిగె.
అఖిల జగముల కాచుట ఆమె హేల.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

శారద వై భువింజనుల చక్కగ మమ్ముల నేలు దేవి! నే
కోరెదనమ్మనీకరుణ కూరిమివిద్యల నెల్ల మోక్షమే
చేరగ, నీదుపాదముల చిన్మయ రూపిణి! యంబికాసతీ!
పారె గదమ్మ నీ కనుల బాలల పైన కటాక్ష దృక్కులే!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువు గారు,
షష్టిపూర్తి సందర్భంగా ఆలస్యంగా వందనములను, అభినందనలను తెలుపుకుంటున్నాను.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గురువర్యులు శ్రీ చింతా రామక్రిష్ణారావు గారికి వందనములు. షష్టిపూర్తి మహోత్సవ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.

Pandita Nemani చెప్పారు...

పరమేశ్వరీ స్తవము (దండకము)

శ్రీమన్మహేశార్ధగాత్రీ! హిమాద్రీశపుత్రీ! త్రిలోకాధినేత్రీ! సదా భక్త సంప్రార్థితార్థ ప్రదాత్రీ! చిదానందరూపా! జగజ్జాలదీపా! తమోఘ్నప్రదీపా! సువర్ణస్వరూపా! సదా దేవబృందంబు సేవించు నీ దివ్య పాదాంబుజాతంబులన్ నేను ధ్యానింతు నేకాగ్రచిత్తాన నో వేదమాతా! భవాంభోధిపోతా! త్రిలోకైకమాతా! సదా లోక కళ్యాణమున్ గూర్చు నీ మందహాసంబు, నీ చిద్విలాసంబు, నీ ప్రేమ తత్త్వంబు, పీయూషసారంబు, నానందసంవర్ధకంబై విరాజిల్లు నో తల్లి! దీవ్యత్ కృపాకల్పవల్లీ!

మహాదేవుడున్ నీవు నెల్లప్పుడున్ వాక్కునున్ భావమున్ రీతి నన్యోన్య సంపృక్త గాత్రంబుతో నొప్పు మీ లీల లోకత్రయీ భావ్యమై, సర్వ సంసేవ్యమై, నవ్యమై, దివ్యమై, భవ్య యోగానుసంధాయకంబై విరాజిల్లుచుండున్ జగద్గీతకీర్తీ! సదానందమూర్తీ! మహాభక్తి భావంబుతో నిన్ను సేవించి, నీ నిండు వాత్సల్యమున్ గాంచు పుణ్యాత్ములన్ బ్రోచి, సౌఖ్యంబు చేకూర్చి, శోకంబు పోదీర్చి, నీ పాద పద్మంబులన్ జేర్చు నో యమ్మ! మా చింతలన్ దీర్చుమా, శాంతి సౌఖ్యములన్ గూర్చుమా, నిత్య కళ్యాణ యోగంబు సిద్ధింపగా చేయుమా, శంభు ప్రాణేశ్వరీ!, రాజ రాజేశ్వరీ!, సర్వలోకేశ్వరీ! ప్రేమరూపా!, నమస్తే, నమస్తే, నమస్తే, నమః.

పండిత నేమాని

Pandita Nemani చెప్పారు...

బాలా స్తవము:

బాలాదిత్య సహస్ర కాంతికలితా! పద్మాటవీ సంస్థితా!
బాలా! పాలిత భక్తజాల! త్రిజగత్ భద్రానుసంధాయినీ!
సాలంకార మనోహరాంగి! నిను సంప్రార్థింతు విశ్వేశ్వరీ!
పాలింపందగు మమ్ము నో భగవతీ! బాలేందు చూడామణీ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.