గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2026, శనివారం

శ్రీ కొప్పరపు సోదర కవులు (శ్రీ వేంకట సుబ్బరాయ కవి, శ్రీ వేంకటరమణ కవి) రచించిన ‘సాధ్వీ మాహాత్మ్యము( లవ కుశ కావ్యం)’ లో 45 వ పద్య సమగ్ర వివరణ: -ఆచార్య తాడేపల్లి పతంజలి

జైశ్రీరామ్.

వ్యంగ్యంగా లవుని ప్రస్తావన కలిగిన పద్యం

శ్రీ కొప్పరపు సోదర కవులు (శ్రీ వేంకట సుబ్బరాయ కవి, శ్రీ వేంకటరమణ కవి) రచించిన  ‘సాధ్వీ మాహాత్మ్యము( లవ కుశ కావ్యం)’ లో  45 వ పద్య సమగ్ర వివరణ: 03. 10. 2026

                                                     -ఆచార్య తాడేపల్లి పతంజలి


తే॥గీ॥ ఊరికి బరగణాకునయ్యురుతరమతి

 శాలిపెత్తన దారయి చౌదరికుల

 మునను వాసిగణించె నంభోనిధులను

 క్షీర వారాశి వడువునఁ జిన్ననాఁడె  45

పదవిభాగము

ఊరికిన్ — పరగణాకున్ — ఆ ఉరుతర మతిశాలి — పెత్తనదారు అయి — చౌదరి కులమునను — వాసి గణించెన్ — అంభోనిధులను — క్షీరవారాశి వడువునన్ — చిన్ననాఁడె.

అవతారిక (సందర్భం)

జాగర్లమూడి వంశంలో ఉద్భవించిన కథానాయకుడు ‘చౌదరయ్య’ గారి బాల్య ప్రాభవాన్ని, ఆయన అసాధారణ పరిపాలనా దక్షతను, నాయకత్వ గుణాన్ని కవులు వర్ణిస్తున్నారు. మహా మేధావియైన ఆ చౌదరయ్య పిన్నవయస్సులోనే తన సొంత గ్రామానికే కాక, యావత్ పరగణాకు (అనేక గ్రామాల సముదాయానికి) ప్రధాన సర్వాధికారియై, సమస్త సముద్రాలలో క్షీరసాగరం ఎలా అగ్రగణ్యమో అలా తన చౌదరి వంశంలోనే అగ్రస్థానాన్ని అధిరోహించాడని కీర్తించే సందర్భమిది.

ప్రతిపదార్థం 

ఆ ఉరుతర మతిశాలి = మిక్కిలి విశాలమైన, లోతైన బుద్ధికుశలత (ప్రజ్ఞాపాటవాలు) కలిగిన ఆ చౌదరయ్య; చిన్ననాడె = పిన్నవయసులోనే (బాల్య/యౌవన దశలోనే); ఊరికిన్ = తాను నివసించే కారంచేడు గ్రామానికిని; పరగణాకున్ = ఆ చుట్టుపక్కల అనేక గ్రామాలతో కూడిన పరిపాలనా విభాగమైన సమగ్ర పరగణాకును; పెత్తనదారు అయి = సర్వాధికారాలు కలిగిన ముఖ్య పాలకుడై / పెద్దరికం వహించే నాయకుడై; అంభోనిధులను = సప్త సముద్రములలోను; క్షీరవారాశి వడువునన్ = పరమ పవిత్రమైన పాలకడలి (పాలసముద్రము) ప్రశంసలందుకున్న రీతిగా; చౌదరి కులమునను = సమస్త చౌదరి వంశ ప్రముఖుల యందును; వాసి గణించెన్ = మిక్కిలి ప్రసిద్ధిని, గొప్ప గౌరవ కీర్తులను సంపాదించెను.

తాత్పర్యము

అపారమైన బుద్ధివైభవం కలిగిన ఆ చౌదరయ్య చిన్న వయసులోనే తన గ్రామానికే కాకుండా మొత్తం పరగణాకే పెద్దరికం వహించే ప్రధాన అధికార బాధ్యతలను చేపట్టాడు. భూమండలంలోని సప్త సముద్రాలలో అమృతానికి, లక్ష్మీదేవికి నిలయమైన క్షీరసాగరం ఎంతటి శ్రేష్ఠమైనదో, అంతటి అగ్రగణ్యుడై తన చౌదరి వంశీయులందరిలోనూ పిన్ననాడే అసాధారణమైన కీర్తిప్రతిష్ఠలను చూరగొన్నాడు.

విశేషాలు 

1. పరగణా: ఇది మధ్యయుగాల నాటి మొఘల్, కుతుబ్‌షాహీ మరియు ఆంగ్లేయుల ప్రారంభ పాలనా కాలంలో ప్రసిద్ధమైన ప్రాదేశిక పరిపాలనా విభాగం. అనేక గ్రామాల (దాదాపు 50 నుండి 100 గ్రామాలు) సమూహాన్ని ‘పరగణా’ అనేవారు. (జిల్లాలోని ఉపవిభాగము, తాలూకా కన్న పెద్ద భాగము అని మరొక అర్థం)

2. చౌదరయ్య కేవలం ఒక ఊరి నాయకుడు మాత్రమే కాక, మొత్తం పరగణా స్థాయి వ్యవహారాలను, శాంతిభద్రతలను, న్యాయపాలనను సమర్థవంతంగా చక్కదిద్దే సమగ్ర నాయకుడని చెప్పడం ఆయన సామాజిక ప్రాబల్యానికి నిదర్శనం.

3. శ్రీహరి నిఘంటువు పెత్తనదారుకు  ఇచ్చిన రెండు అర్థాలూ చౌదరయ్య గారి పాత్రకు ప్రత్యక్షంగా వర్తిస్తాయి:

 “అర్థం 1:  పెత్తనము చేయువాఁడు, ఆధిపత్యము చేయువాఁడు”

కొప్పరపు కవులు పద్యంలో కేవలం ‘ఊరికి’ మాత్రమే కాక, ఏకంగా ‘పరగణాకు’ పెత్తనదారు అని స్పష్టం చేశారు.

ఆ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాల సముదాయానికి న్యాయ నిర్ణేతగా, పెద్దమనుషుల పంచాయతీల్లో సమస్యలను క్షణంలో పరిష్కరించే అత్యున్నత సామాజిక ఆధిపత్యం (గ్రామపెద్దరికం) వహించిన నాయకుడని ఈ అర్థం సమర్థిస్తుంది.

4. అర్థం 2: “కొద్ది ముదరా తీసికొని రైతుల దగ్గఱ శిస్తులు రాబట్టు పెద్ద”

ఇది ఆనాటి రెవెన్యూ పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన అత్యంత కీలకమైన చారిత్రక నిర్వచనం.

మొఘల్, కుతుబ్‌షాహీ మరియు కంపెనీ పాలనా కాలంలో పరగణా స్థాయిలో ప్రభుత్వానికి, రైతులకు మధ్యవర్తిగా ఉంటూ రైతుల నుండి శిస్తు వసూలు చేసి, అందులో కొంత భాగం (‘ముదరా’ / కమీషన్ లేదా నాల్గవ వంతు ‘చౌత్’) తీసుకునే ప్రధాన అధికారిని ‘పెత్తందారు’ లేదా ‘చౌదరి’ అనేవారు.

పూర్వ పద్యంలో కవులు ప్రతిపాదించిన ‘చౌదరి’ అనే అధికార పదవికి, ఈ పద్యంలోని ‘పెత్తనదారు’ అనునది పరస్పర పూరకమైన సమానార్థక రెవెన్యూ పదమని ఈ వివరణతో నిరూపితమవుతోంది.

5. కొప్పరపు కవులు కృష్ణా-గుంటూరు (కోస్తా) ప్రాంతపు కారంచేడు నేపథ్యాన్ని వర్ణించినప్పటికీ, తెలుగు నేల అంతటా ప్రాచుర్యంలో ఉన్న ‘పెత్తందారు’ అనే పదాన్ని ప్రయోగించడం ద్వారా — చౌదరయ్య గారు కేవలం పేరుకే కాక, అపారమైన వ్యవసాయ భూములు కలిగిన మోతుబరి/భూస్వామి అనీ, సర్వాధికారాలు కలిగిన పెద్ద అనీ ఏకకాలంలో వ్యక్తమవుతోంది.

6. ఈ నిఘంటు ప్రమాణాల ద్వారా జాగర్లమూడి చౌదరయ్య గారు:

గ్రామానికి, పరగణాకు శిస్తులు క్రమబద్ధీకరించే అధికారిక పెద్ద (రెవెన్యూ అధికారి),

సమస్యలను పరిష్కరించి తీర్పులు చెప్పే గ్రామ పంచాయతీ అధిపతి (సామాజిక నాయకుడు),

విస్తారమైన భూవసతి కలిగిన ఉన్నత కుటుంబీకుడు (భూస్వామి)

అని సకల కోణాలలోనూ భాషా-చారిత్రక పరంగా సుస్పష్టమవుతోంది.

7. పద్యంలో కవులు ప్రయోగించిన ఉపమానం అత్యంత ఔచిత్యవంతమైనది:

ఉపమేయం: చౌదరి కులంలో చౌదరయ్య.

ఉపమానం: అంభోనిధులలో (సముద్రాలలో) క్షీరవారాశి (పాలసముద్రం).

సమన్వయం: లవణ, ఇక్షు, సురా, సర్పి, దధి, క్షీర, శుద్ధోదకములను సప్త సముద్రాలలో క్షీరసాగరం ఒక్కటే పరమ పవిత్రమైనది, అమృతాన్ని, లక్ష్మీదేవిని లోకానికి అనుగ్రహించిన అమృత నిలయం. అలాగే కారంచేడులో ఎందరో ప్రముఖులైన చౌదరులు ఉన్నప్పటికీ, వారందరిలోకీ చౌదరయ్య శాంత గుణంతో, లోకోపకార బుద్ధితో, సంపదలతో క్షీరసాగరం వలె తేజరిల్లాడని కవులు అద్భుతంగా ఉపమించారు.

8. రఘువంశంలో రాముడు, ఉత్తరరామచరిత్రలో లవుడు పిన్నవయసులోనే అసాధారణ తేజస్సును ప్రదర్శించినట్లుగానే, చౌదరయ్య కూడా ‘ఉరుతర మతిశాలి’యై అతి చిన్న వయసులోనే గ్రామాధికారాన్ని, పరగణా బాధ్యతలను స్వీకరించి సర్వమాన్యుడైనాడని కొప్పరపు కవులు నాయకోచిత లక్షణాన్ని ప్రతిష్ఠించారు. సాధ్వీ మాహాత్మ్య కావ్యం లవ కుశులకు సంబంధించిన కథ. లవుని ప్రస్తావన వ్యంగ్యంగా ఇక్కడ చేయబడింది.

9. లవుడిని చూస్తూ ఉత్తర రామ చరిత్ర నాటకములో ని రాముడు ఇలా అంటాడు. “ కౌమారేకే ౽ పి గిరివద్గురుతాం దధానః ( బాల్యమందును కొండవలె గొప్పతనమును ధరించిన వాడు  06 వ అంకము  302 వపుట ఉత్తర రామ చరిత నాటకము) ఇదే విధముగా ఈ కావ్యములో రాబోయే లవ పాత్రను చౌదరయ్య  వర్ణనలో” చిన్నతనము నాడే ఉరుతర మతిశాలి “ అని  వ్యంగ్యంగా  కొప్పరపు కవులు తెలియ చేసారు.ఇది మహా కావ్య రచనా సంవిధానము. జయహో.

స్వస్తి.

ఆచార్య తాడేపల్లి పతంజలి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.