గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, అక్టోబర్ 2011, సోమవారం

శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధాని షష్టి పూర్తి సందర్భంగా..శ్రీ నేమాని వారి పంచ రత్నాలు.

శ్రీరస్తు                             శుభమస్తు                 అవిఘ్నమస్తు.
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి షష్టి పూర్తి సందర్భముగా 
అందజేయుచున్న 
పంచ రత్నములు.
సమర్పణ:-పండిత నేమాని రామజోగి సన్యాసిరావు.

శ్రీ కట్టమూరి కుల ర 
త్నాకర చంద్రా! కవీంద్ర! ఆనందనిధీ!
ఈ కళ్యాణ సమోత్సవ
మే కూర్చుత మీ కవకు నమేయ సుఖమ్మున్

వరమతి కట్టమూరి కుల భాగ్యమవై తనరారుచుండి సద్
గురువర భవ్యయోగమున క్షోణి విశేష యశమ్ము గాంచి భా
సురకవివై వధానివయి శోభిలు నో సరసాంతరంగ శ్రీ
కరముగ నీదు జీవితము గాంచుత సర్వశుభాధియోగముల్

తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి కొండల రావు
ప్రేమతోడ పెంచి పెద్దజేయ
విద్యలను గడించి విజ్ఞానధనివయి
యలరుచుంటి సద్గుణాఢ్యుడవయి

రాజరాజేశ్వరి నిరంతరమ్ము సదను
కూలవతియయి ప్రేమతో గొలుచుచుండ
సుతలు ననురాగమును జూప, సుఖమునొంది
తనరుగాక నీ జీవితము చిరముగ

అరువదియేండ్లు నిండెడు ముదావహ పర్వమునాడు మెండు సం
బరమున గూర్తు దీవనలు భాసుర మానస సారసుండవై
ధర శతవర్షముల్ గనుము సర్వ శుభమ్ములు భోగభాగ్యముల్
పరగుచు నీదు జీవితము వర్ధిలు సుస్థితి చంద్రశేఖరా!

మంగళం                                                        మహత్.   
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 
ఆంధ్రామృతంలో నిన్నటి టపాను కూడా దీనికి సంబంధించినదే. చూడండి.
ప్రవాసాంధ్రుల ఆంధ్రాభిమానం ప్రవాస రాజ్యంలో కనబడుతుంది చూడండి.
'ప్రవాసరాజ్యం'  www.pravasarajyam.com 
జైశ్రీరాం.
జైహింద్.  
Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి
షష్టి పూర్తి సందర్భముగా
సమర్పించిన
సన్మాన పంచ రత్నములు.

శ్రీశ భారతీశ శీతాద్రిజేశ సా
మ్ముఖ్య మంది కట్టమూరి చంద్ర
శేఖరావధాని! చిరకాల మారోగ్య
శుభ సుఖములతోడ శోభఁ గనుము.

అష్టావధాన విద్యను
కష్ట మ్మిసుమంత లేక కడు సులభముగా
నిష్టాగోష్ఠిగఁ జేయు వి
శిష్టంబగు ప్రతిభ నీది; చేసెద నుతులన్.

అస్త్రముల దూసిరట ఘన
శాస్త్రజ్ఞులు పృచ్ఛకుల్ ప్రచండముగా నీ
శస్త్రముల వంటి పూరణ
లే స్త్రైణమ్మై సొగసులనే కురిపించెన్.

విరులు సమస్యాపూరణ
లరయ లతలు దత్తపదులు ననఁగ నిషిద్ధా
క్షరు లాకులు వర్ణనములు
మురిపించునులే యుపవనముగ నీ రచనల్.

సృష్ట్యారంభక కరుణా
దృష్ట్యంచల లబ్ధ విభవ దీవ్యద్యశ సం
తుష్ట్యాద్యఖిల శుభంబుల
షష్ట్యబ్ది మహోత్సవమున సఫలతఁ గనుమా!

సమర్పణ:- కంది శంకరయ్య

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
అవధాన సరస్వతులు , దేవి వర పుత్రులు శ్రీ పండిత నేమాని వారి " పంచ రత్నములు " శ్రీ కట్ట మూరి చంద్ర శేఖర అవధాని గారిని " పంచ ముఖ సరస్వతులుగా వే వే ల చేతులై దీవించినవి . మీ అందరి పాండిత్యపు కీర్తి కాంతులు దశ దిశలా వెలుగులు విర జిమ్మాలని కోరుతూ . ఆంద్రామృతాన్ని అభినం దిస్తూ ధన్యత నొందిన నేను .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.