గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, అక్టోబర్ 2026, సోమవారం

శ్రీమద్భాగవతం లో పోతన గారు "సీతారామాకల్యాణం" వర్ణన. ... డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు.

 జైశ్రీరామ్.

కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ

            పద ఫాల భుజ రద పాణి నేత్ర 


గాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ 

            జంఘోరు కుచ మధ్య జఘన కంఠ 


ముకుర చందన బింబ శుక గజ శ్రీకార

             గండ గంధోష్ఠ వాగ్గమన కర్ణ 


జంప కేందు స్వర్ణ శఫర ధనుర్నీల 

             నాసికాస్యాంగదృగ్భ్రూ శిరోజ


నళి సుధావర్త కుంతల హాస నాభి 

కలిత జనకావనీపాల కన్యకా ల 

లామ బరిణయ మయ్యె లలాటనేత్ర 

కార్ముక ధ్వంస ముంకువ గాగ నతడు.    ----    భాగవతం 2-158

పై పద్యం శ్రీమద్భాగవతం లో పోతన గారు "సీతారామాకల్యాణం" వర్ణించిన సందర్భం లోనిది.

తన తరువాతి ప్రబంధ కవులకు పద్య రచనలో క్రొత్తబాటలు పరచిన ఒజ్జబంతి ఈ పద్యం.

మొదట పద్యశిల్ప చాతుర్యం చూద్దాం. సీసం నాలుగు పాదాలలో (ప్రతీ పాదం లోనూ) - ప్రథమార్థాలలో ఆరు ఉపమానాలు, ద్వితీయార్థాలలో ఆరు ఉపమేయాలు చెప్పారు. క్రమంగా అన్వయం చేసుకోవాలి. 

ఈ నాలుగు పాదాలలోనూ సీతమ్మ అవయవ వర్ణన ఉంది .

ఎత్తు గీతి లో మళ్ళీ మూడు ఉపమానాలు మూడు ఉపమేయాలు చెప్పారు. 

మిగిలిన గీతిలో రామయ్య పైన వర్ణించిన సీతమ్మను విల్లు విరిచి పెండ్లి చేసుకున్న వైనం చెప్పారు.

భావం లోకి ప్రవేశిద్దాం. 

అన్వయ క్రమం.

1. కిసలయము (చివుళ్ళు) - పద  (పాదములు) 

   ఖండేందు (అర్థ చంద్రుడు) - ఫాల (నుదురు)

   బిస (తామర తూండ్లు) - భుజములు 

   కుంద  (మొల్లలు) - రద (దంతములు) 

   పద్మములు   - పాణి (హస్తములు)

   అబ్జములు (కలువలు) - నేత్ర (కనులు)

2. కాహళ (బాకాలు) - జంఘ ( పిక్కలు )

     కరభ  (ఏనుగులు) - ఊరు (తొడలు)

    చక్ర  (చక్రవాకములు) - కుచ  (స్తనములు)

    వియత్ (ఆకాశము)  - మధ్య (నడుము)

    పులిన ( ఇసుక తిన్నెలు) - జఘన (పిరుదులు)

    శంఖ  -  కంఠ (మెడ)

3. ముకుర (అద్దములు) - గండ  (చెక్కిళ్ళు)

    చందన - గంధ (శరీర పరిమళము)

    బింబ (దొండపండు) - ఓష్ఠ (పెదవులు)

    శుక (చిలుక) - వాక్ (పలుకు)

    గజ (ఏనుగు) - గమన (నడక)

    శ్రీకారము - కర్ణ  (చెవులు)

4. చంపక (సంపంగి ) - నాశిక  (ముక్కు)

     ఇందు (చంద్రుడు) -  ఆస్య (మోము)

    స్వర్ణ  (బంగారం) - అంగ (శరీరము)

    శఫర ( చేపలు ) - దృక్ (చూపులు)

    ధనుస్సు ( విల్లు ) - భ్రూ (కనుబొమలు)

    నీల (నీలాములు) - శిరోజ  (తలవెంట్రుకలు)

ఎత్తుగీతి 

 1. అళి (తుమ్మెదలు) - కుంతల (ముంగురులు)

     సుధ (అమృతము) - హాస (నవ్వు)

     ఆవర్తము (సుడి) - నాభి (బొడ్డు)

2-4 ఇన్ని గుణములు కలిగిన జనక రాజు గారి పుత్రిక (జనక అవనీపాల కన్యక) ను శివుని విల్లు విరిచి (లాలాట నేత్ర కార్ముక ధ్వంసము) దానిని కన్యాశుల్కము గా చెల్లించి (ఉంకువ గాగ) రాముడు (అతడు) పరిణయమాడెను.

విశేషాలు :

పై ఉపమానాలు అన్నీ పరిశీలిస్తే సీతమ్మను ఆదిపరాశక్తి యైన అమ్మవారిగా వర్ణిస్తున్నారని తెలుస్తూనే ఉంది.

 దేవతాస్త్రీ లను వర్ణించే టప్పుడు పాదాది కేశ పర్యంతము వర్ణించడం సంప్రదాయం.

సీస పద్యం నాలుగు పాదాలలో పాద కిసలయాల నుంచి ప్రారంభించి నీల శిరోజాల వరకూ వర్ణించి ఈ నియమం పాటించారు.

మళ్ళీ ఎత్తు గీతి లో మూడు అదనపు ఉపమానాలతో కుంతలముల నుండి నాభి వరకూ వ్యతిరిక్త క్రమం లో వర్ణించారు. బహుశా సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని కేశాది పాద పర్యంతము చేసిన వర్ణన గుర్తు వచ్చి యుంటుంది.

 సీసములో కేవలము దేవతా స్త్రీ గా వర్ణించిన పోతనగారు తృప్తి గొనక శంకరాచార్యుల పంథాలో మరల కొంత పై నుండి అర్థ భాగము వర్ణించి ఆమె శక్తి స్వరూపమని  సూచించి తృప్తి నందినారని నా ఊహ.

ఇక రామయ్య శివధనుర్భంగమును ఉంకువ (ఓలి, కన్యక కొరకు మామ గారికి ఇచ్చే ఎదురు కట్నము) గా చెల్లించి పెండ్లి చేసుకున్నాడట! ఈ ఓలి శబ్దానికి సందర్భానుసారంగా సంపూర్ణము అని అర్థం చెల్లుతుందిట.

సీతారామ కల్యాణం సంపూర్ణం.

డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.