సాహితీ ప్రియ మిత్రులారా!
ఈ రోజు కట్టమూరివారు ఎదుర్కొనిన వర్ణనను మనమూ ప్రయత్నిద్దాము.
వర్ణనము.
విషయము:-
ఈనాడు ప్రబలుతున్న ఉగ్రవాదమును నివారణావశ్యకతను గూర్చి యువతకు సందేశము.
అవధానిగారి పూరణమును నా పూరణమును వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులనలరింపగలరు. మీ రచన ఒక ఖండ కావ్యముగా ప్రసిద్ధమగునట్లు ఆశారదాంబ కటాక్షించు గాక.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
ఈ రోజు కట్టమూరివారు ఎదుర్కొనిన వర్ణనను మనమూ ప్రయత్నిద్దాము.
వర్ణనము.
విషయము:-
ఈనాడు ప్రబలుతున్న ఉగ్రవాదమును నివారణావశ్యకతను గూర్చి యువతకు సందేశము.
అవధానిగారి పూరణమును నా పూరణమును వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులనలరింపగలరు. మీ రచన ఒక ఖండ కావ్యముగా ప్రసిద్ధమగునట్లు ఆశారదాంబ కటాక్షించు గాక.
జైశ్రీరాం.
జైహింద్.
10 comments:
చిక్కుముడుల పెక్కు సిద్ధాంతముల, మత
మౌఢ్యమందు జిక్కి మానవతకు
మచ్చు దెచ్చు నట్టి మారణహోమపు
టుగ్రవాదము నిక నోపవలదు.
నిజమిది మేలుకొమ్మికను నీతినిఁ దప్పని భారతీయుఁడా!
ప్రజలను కమ్ముకున్నదిట ప్రాణముఁ దీసెడి దుగ్రవాదమీ
సుజనులఁగావగా ,యువత జోరుగ సాగగ, శాంతినిల్పుటన్-
విజయముఁ బొందగావలెను వీరుడ! నీవిక లేచి రావలెన్.
శ్రీ కట్తమూరి చంద్రశేఖరావధాని గారి వర్ణనము.
కుల తత్వములతోడ కుమ్ములాటలు పుట్టి
దేశంబు లోనను దీప్తి తరిగె.
మతమౌఢ్య భూతంబు మంటలందున బడి
మలమల మాడిరే మనుజులెల్ల,
ఉగ్రవాదమ్ములే ఉగ్ర రూపంబులై
కత్తులన్ దూయుచు కదలుచుండె.
జాతి సమైక్యత జడత వహించుచు
జనముల బాధించు సమయమాయె.
కుఱ్ఱవారలెల్ల కొంకక వీరులై
చీడ పోవునట్టి జాడ చూచి,
మార్గ దర్శులగుచు మంచి మార్గము పట్టి
నడవ వలయు జనత జడత విడిచి.
మందు పాత రందు మంచిని పాతి నీ
బెల్టు బాంబు నందు బిగియ గట్టి
శాంతి జంపి నీవు సాధించునది సున్న
మేలు కొనుడు జనుల మేలు గనుడు.
శ్రీగురుభ్యోనమ:
ఉగ్రవాదమ్ము ప్రబలెను యుర్వి పైన
భావి పౌరుడ గుర్తించు బాధ్యతలను
ఉగ్ర నరసింహమై నీవు యాగ్రహించు
రుద్ర రూపమ్ము దాల్చుచు రూపుమాపు
గురువుగారూ యడాగమము యింకా పూర్తిగా అర్థంకాలేదు.
తప్పులను సవరించ ప్రార్థన.
వరలిన ఉగ్రవాదమను ప్రజ్వలనాగ్ని, వ్యవస్థ సర్వమున్
నిరుపమ దుర్గతిన్ గనలు. నిర్ భర దుఃఖము గల్గఁ జేయు. ధీ
వరుల ప్రయత్న సత్ఫల మవారిత రీతి నశించు. కావునన్
మరువక ఉగ్రవాదమును మాయము చేయగ బూనుఁ డుద్ధతిన్.
ఆర్యా! శంకరయ్యగారూ! మీ పూరణ చక్కగా ఉంది.అభినందనలు. మానవతకు మచ్చు దెచ్చు అని వ్రాసారు. మచ్చదెచ్చు అనుకుంటాను. టైపాటై ఉంటుందనుకొంటున్నాను.
మందాకిని గారూ. మీ వర్ణన బాగుంది. అభినందనలు. ప్రాణము తీసెడి దుగ్రవాదము అనడం కంటే ప్రాణము తీసెడి యుగ్రవాదము అంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తోంది.
హనుమచ్ఛాస్త్రి గారూ! చాలా సున్నితంగా సునాయాసంగా చేసిన మీ వర్ణన ప్రశంసనీయం. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ! పద ప్రయోగాలలో గుణదోషాలు కాస్తసేపు ప్రక్కను పెట్టి మీరు వ్రాసిన పద్యం చూస్తే ముఖ్యంగా 3.4. పాదాలు అత్యద్భుత భావనా రమణీయం. వర్ణన అనే పదానికి సరిపోయి ఉన్నాయి.
అభినందనలు.
మీకు యడాగమం సరిగా అర్థం కాలేదన్నారు.
అది సునాయాసంగా మీకు అర్థమౌతుంది.
ఐతే ముందుగా మనం గమనించ వలసినది ఉత్వ సంధి. సంధిర్నాzచోzచ్యనుతః. అన్న చింతామణి సూత్రం ప్రకారం ఉత్తునకు(ఉకారమునకు) సంధి నిత్యము. అంటే ఉకారాంత పదాల తరువాత అచ్చు ప్రయోగించినటైతే అది తప్పక ఉకారంతో సంధి అయి తీరాలి. సంధి జరగ కూడని చోట వచ్చే అచ్చుకు మాత్రమే యడాగమం వస్తుంది.
ప్రబలెను ఉర్విపైన అన్నది తీసుకుంటే.
ప్రబలెను+ఉర్విపైన=ప్రబలెనుర్విపైన అని అయి తీరాలి.
ప్రబలెను యుర్విపైన అని ప్రయోగం చేయకూడదు అంటారు వ్యాకర్తలు.
ప్రబలి+ఉర్విపైన అని అంటే మాత్రం సంధి రాదు కాబట్టి, ప్రబలి తరువాత ఉ అనే అచ్చుకు యడాగమం వచ్చి యు గా వస్తుంది ప్రబలియుర్విపైన అని ప్రయోగింప బడుతుంది.
గురువుగారూ వందనములు.
"ఉగ్రవాదమ్ము చెలరేగె నుర్వి పైన" అంటె సరిపోతొదనుకుంటాను.
అయ్యా! మా అధ్యాత్మ రామాయణములోని ఈ పద్యమును తిలకించండి.
అంబురుహాంబక! రామా!
అంబురుహాంబక మనోహరాద్భుత గాత్రా!
అంబురుహాంబక వినుతా!
అంబురుహాంబక హితా! నవాంబురుహాస్యా!
వివరణ:
అంబురుహాంబక (1) తామరపూవుల వంటి కన్నులు కలవాడా!
అంబురుహాంబక(2) తామరపూవులు బాణములుగా కలవాడు (మన్మథుడు)
అంబురుహాంబక (3) అగ్ని కన్నుగా గలవాడు (శివుడు)
నవంబురుహాస్యా! (4) క్రొత్త తామరపూవు వంటి మొగము గలవాడా
అనుకరణ: వసుచరిత్రము
నమస్కారములు.
అందరి వర్ణనలు అందం గా అలరించు చున్నవి. పండితులు శ్రీ నేమాని వారి రామాయణ పద్య వివరణ మరింత శోభితమై అలరారు చున్నది. ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.