గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, అక్టోబర్ 2011, మంగళవారం

పండిత నేమాని కృత పరమేశ్వరీ స్తవము (దండకము).

జగన్మాత పరమేశ్వరి.
పరమేశ్వరీ స్తవము (దండకము)
శ్రీమన్మహేశార్ధగాత్రీ! హిమాద్రీశపుత్రీ! త్రిలోకాధినేత్రీ! సదా భక్త సంప్రార్థితార్థ ప్రదాత్రీ! చిదానందరూపా! జగజ్జాలదీపా! తమోఘ్నప్రదీపా! సువర్ణస్వరూపా! సదా దేవబృందంబు సేవించు నీ దివ్య పాదాంబుజాతంబులన్ నేను ధ్యానింతు నేకాగ్రచిత్తాన నో వేదమాతా! భవాంభోధిపోతా! త్రిలోకైకమాతా! సదా లోక కళ్యాణమున్ గూర్చు నీ మందహాసంబు, నీ చిద్విలాసంబు, నీ ప్రేమ తత్త్వంబు, పీయూషసారంబు, నానందసంవర్ధకంబై విరాజిల్లు నో తల్లి! దీవ్యత్ కృపాకల్పవల్లీ!

మహాదేవుడున్ నీవు నెల్లప్పుడున్ వాక్కునున్ భావమున్ రీతి నన్యోన్య సంపృక్త గాత్రంబుతో నొప్పు మీ లీల లోకత్రయీ భావ్యమై, సర్వ సంసేవ్యమై, నవ్యమై, దివ్యమై, భవ్య యోగానుసంధాయకంబై విరాజిల్లుచుండున్ జగద్గీతకీర్తీ! సదానందమూర్తీ! మహాభక్తి భావంబుతో నిన్ను సేవించి, నీ నిండు వాత్సల్యమున్ గాంచు పుణ్యాత్ములన్ బ్రోచి, సౌఖ్యంబు చేకూర్చి, శోకంబు పోదీర్చి, నీ పాద పద్మంబులన్ జేర్చు నో యమ్మ! మా చింతలన్ దీర్చుమా, శాంతి సౌఖ్యములన్ గూర్చుమా, నిత్య కళ్యాణ యోగంబు సిద్ధింపగా చేయుమా, శంభు ప్రాణేశ్వరీ!, రాజ రాజేశ్వరీ!, సర్వలోకేశ్వరీ! ప్రేమరూపా!, నమస్తే, నమస్తే, నమస్తే, నమః.

రచన:- పండిత నేమాని.
జైశ్రీరాం.
జైహింద్. 
Print this post

4 comments:

కంది శంకరయ్య చెప్పారు...

ఛందాలలో నాకెంతో ఇష్టమైనది ‘దండకం’. మనోహరమైన లయతో, శబ్దాడంబరంతో మనోల్లాసాన్ని కలిగించే ‘పరమేశ్వరీ స్తవము’ రచించిన నేమాని వారికి ధన్యవాదాలు. వారి దండకాన్ని ప్రకటించే అదృష్టాన్ని దక్కించుకున్న ‘ఆంధ్రామృతం’ బ్లాగును, చింతా వారిని అభినందిస్తున్నాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

దండకము చాలా ప్రశస్తంగా ఉన్నది గురువుగారు,
పోత అనే పదానికి పడవ అనే అర్థం ఏదైనా ఉన్నదాండీ! నిఘంటువు చూశాను. దొరకలేదు.

Pandita Nemani చెప్పారు...

మందాకినీ గారికి శుభాశీస్సులు.
పోత అనే సంస్కృత పదమునకు తత్సమము పోతము అవుతుంది. శబ్దరత్నాకరములో ఈ పదమునకు పడవ అనే అర్థము ఇచ్చేరు.
శంకరాచార్యులవారు "భవాబ్ధిపోత" అని శ్రీ లక్ష్మినరసింహ కరావలంబ స్తోత్రములో వాడేరు - ఇక్కడ కూడ "పడవ" అనే అర్థము.
పండిత నేమాని

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారు,
నమస్కారములు.
ఇప్పుడు తెలిసినది. ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.