గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2011, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు. శతకోటి దీప కాంతులతో మీ హృదయం జ్యోతిర్మయం కావాలి.

సాహితీ ప్రియ మిత్రులారా! మీకు దీపావళి శుభాకాంక్షలు.
అజ్ఞానాంధము బాపగ 
సుజ్ఞాన జ్యోతులమరు సుజనుల మదిలో.
విజ్ఞాన దీపపుంజము
సుజ్ఞేయముగా వెలుంగు సుగుణోద్భవమై.  
లక్ష్మీ కాంతులు మీ గృహంబునమరున్.లక్ష్మీ కటాక్షంబుతో
సూక్ష్మ జ్ఞాన వివేక వృద్ధియగుచున్ శోభించు మీ మేధ. భా
తిక్ష్మా భారతి మీ పవిత్ర చరితన్ దివ్యత్వమున్ బొందు.మీ
రీక్ష్మా పూజ్యులుగా గణింపఁ బడగా ప్రీతిన్ బ్రవర్తిల్లుతన్.
ఆయురారోగ్య సౌభాగ్య శ్రేయములును,
పుత్ర పౌత్ర ప్రపౌత్ర సన్మిత్ర వృద్ధి, 
సకల సద్గుణ వృద్ధియు, సత్ప్రవృత్తి,
ప్రాప్తమగుగాక మీకు సద్భాగ్యవంత! 
   జైశ్రీరాం. జైహింద్.
 
Print this post

6 comments:

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
అమావాస్య చీకట్లను వెలుగులతో పారద్రోలి
వెన్నెల మాసంలో వెలుగులనే పంచుచూ
అజ్ఞానపు తిమిరంబుల పారద్రోలు తేజములై
విజ్ఞానపు కిరణమ్ములు ప్రసరిస్తూ వస్తున్నవి.

పిల్లల ముఖములలో చిరునవ్వులు పూయించే
దీపావళి వచ్చింది
పెద్దల వదనంబులలో ఆనందం కలిగించే
దీపావళి వచ్చింది.

గురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు అందరకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శుభాశీస్సులు.
దుష్కర ప్రాసలు పట్టుకొంటే భావమునకు కళ్ళెము పడుతుంది. గమనమునకు కష్టము అవుతుంది. శంకరాచార్యులు వారు కూడా తమ కావ్యాలని గూర్చి ఇలా చెప్పేరు:

సర్వాలంకార యుక్తాం, సరళ పదయుతాం, సాధు వృత్తాం, సువర్ణాం
సద్భిద్ సంస్తూయమానాం, సరసగుణ యుతాం, లక్షితాం లక్షణాఢ్యాం
ఉద్యద్ భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థ రేఖాం
కళ్యాణీం దేవ! గౌరీ ప్రియ! మమ కవితా కన్యాకాం త్వం గృహాణ

అందుచేత నా సూచన ఏమిటంటే సరళ పదాలు, సరస గమనము, మంచి అలంకారములతో ఉంటే ఎంత చిన్న పద్యమైనా బాగుంటుంది.
ప్రాసల కోసం, చిత్ర కవిత్వం కోసం తంటాలు పడవద్దు.

మీ కృషికి అభినందనలు. మీ అందరికి శుభ దీపావళి పర్వమునకై హార్దికమైన ఆశీస్సులు.
నేమాని సన్యాసి రావు

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువర్యులు మన్నించాలి. పైన నేను వ్రాసిన విషయము ఛందో బద్ధమైనదికాదు. కేవలం అభిప్రాయం వ్యక్తపరిచే ఒక చిన్న కవిత మాత్రమే.అందరికీ మరి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
మీ ‘గ్రీటింగ్ చిత్రాన్ని’ నా బ్లాగులో (మీ అనుమతి లేకుండా) వినియోగించుకున్నాను. ధన్యవాదాలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! మీకు, కవిమిత్రులకు, ఆంధ్రామృత వీక్షకులన్దరకు దీపావళి శుభాకాంక్షలు.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ చింతా రామకృష్ణారావుగారికి, శ్రీ పండిత నేమాని గారికి, మరియు ఇతర కవిమిత్రులకు, మరియు బ్లాగువీక్షకులకందరికిని దీపావళీ పర్వదిన శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.