గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2013, బుధవారం

శ్రీ శివాష్టోత్తర శత పంచ చామరావళి (శివ శతకము)

4 comments

జైశ్రీరామ్.
శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి.
(శివ శతకము)
రచన - చింతా రామ కృష్ణా రావు
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
-:  అంకితము :-
శ్రీకరంబైనట్టి చింతాన్వయంబున జనియించినాడ సుజనుల నడుమ.
వేంకటరత్నము వేంకట సన్యాసి రామరావుల పుత్రు. రామ కృష్ణ
రావుగా వర్థిల్లి, రాఘవాచార్యుల  ప్రథమ శిష్యుండనై వ్రాసినాఁడ
నుత శివాష్టోత్తర శత పంచచామరావళి పేరఁ బరగు శివ శతకమును
శివుని కృపఁ జేసి. దీనిని సవినయముగ
ఆది దంపతులై మనకమరియున్న
యా భవానికి భవునకు నంకితముగ
నందఁ జేసితి, నే, ముక్తి నంద గోరి.

1. శివా! భవా! నమో೭స్తుతే! విశేష భక్త వత్సలా!   
భవాని వామ భాగమందు భవ్యయై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీ దరిన్.  
నివాసముండుమా మదిన్. వినీల కంధరా! శివా!

2. నమో೭స్తు తే. సదా శివా! సనాతనా! నమో೭స్తు తే.   
నిమేషమందె నీల కంఠ! నీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుఁగా, ప్రభావపూర్ణ తేజమై,  
నమస్కరింతునయ్య నీకు. నన్నుఁ గాంచుమా! శివా!

3. శశాంక శేఖరా! హరా! విశాల నేత్ర! సుందరా!  
ప్రశాంత చిద్విరాజమాన భవ్య  భక్త వత్సలా!
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా  
నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే! శివా!

4. ఉపాసనా ప్రభావ మెన్న నో హరా! పొసంగునే? 
కృపా నిధీ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం 
బపూర్వమై, యమేయమైన హాయి గొల్పుఁగా! శివా!

5. సమస్త దోష హారి వంచు జాగరంబుఁ  జేసి, నిన్ 
ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటిఁ గాంచితే?
క్షమింపుమా దురాత్ములన్, విశాల నేత్ర! శంకరా!  
నమామి భక్త వత్సలా! ప్రణామమందుమా! శివా!

6. సరోరుహాననా! నినున్ ప్రసన్నతం గనుంగొనన్ 
ధరాతలంబునన్ బుధుల్ ప్రతాపమొందు చుందురే!
దురాత్ములైన గాని నిన్నుఁ దోయిలించి మ్రొక్కినన్ 
కరావలంబమిచ్చి దీక్ష కాచు చుందువే! శివా!

7. ప్రదీప్త దీప మొక్కటైన భక్తి నీదు సన్నిధిన్  
ముదంబుతో వెలుంగఁ జేసి పూజ చేయు వారికిన్
సదా సుయోగ భాగ్యమిచ్చి, సత్ కృపన్ గ్రహింతువే!  
మదీయ చిత్త సంస్థితా! సుమంగళాకరా! శివా!

8. దురంత దుష్కృతంబులేను దుర్మదాంధ వర్తినై 
నిరంతరంబు చేసితో! వినీతునై చెలంగితో.
కరంబు నిచ్చి గాచితీవు గౌరవంబు దక్కెరా!  
వరంబు నాకు నీ యుదార భావ మీశ్వరా! శివా!

9. ప్రదోష కాలమందు నిన్ను భక్తి తోడఁ గాంచితిన్.  
ముదావహంబుగా భవాని పూజ లందుచున్ భవా!
సుధా సుదృక్పరంపరన్ సుశోభఁ గూర్చి, యంబకున్ 
విధేయతా స్వభావ మీవు వెల్వరించితే! శివా!

10. స్వధర్మ రక్షణంబు లోన సాధుపుంగవాళి నీ  
విధేయులై మనోజ్ఞ భావ వీక్షణాళి నొందగా
మదిన్ దలంచి చూచుచుంద్రు, మాంద్యభావ శూన్యతన్, 
ప్రదీప్త దివ్య తేజమిచ్చి రక్ష సేయుమో శివా!

11. ప్రపూజ్య దివ్య భక్తి భావ పారవశ్యమందు నే  
ప్రపూజ్యుఁడా! ముదంబు తోడ పాప భావ నాశమున్,
తపో విధాన భాగ్యమున్,  ప్రధాన భక్తి తత్వమున్, 
నెపంబు నెంచకిమ్మటంచు నిన్నుఁ గోరనా? శివా!

12. వరంబయెన్ నమశ్శివాయ పంచ వర్ణ మంత్ర మీ 
ధరన్. దురంత దుఃఖ దూరతన్, కృతార్థతన్, భవత్
కరావలంబమున్, పరంబు కల్గఁ జేయు. భక్తులన్ 
నిరంతరంబు కాచు చుండు, నిర్వికారుఁడా! శివా!

13. మనోజ్ఞుఁడా! నమో೭స్తుతే. ఉమాపతీ! నమో೭స్తుతే. 
యనాధుఁడా! నమో೭స్తుతే.మహాత్ముఁడా!నమో೭స్తుతే.
వినీతుఁడా! నమో೭స్తుతే. సువేద్యుఁడా! నమో೭స్తుతే.  
పునీతుఁడా! నమో೭స్తుతే. సుపూజ్యుఁడా! మహా శివా!

14. నిరామయుండ! నిర్గుణుండ! నిర్వికార! ఈశ్వరా!    
ధరాతలంబు నేలు చుండె దౌష్ట్యముల్. గ్రహించితే?
కరావలంబ మీవె యిచ్చి కావకున్న మాకికన్  
చరింప సాధ్యమా! మహేశ! సత్ స్వరూపుఁడా! శివా!

15. నరాధముల్, నరాంతకుల్, వినాశకారకుల్ భువిన్  
పరాపకార మూర్ఖులున్, స్వభావ సిద్ధ దుష్టులున్,
చరించు చుండ్రి స్వేచ్ఛగా. విచార మగ్న చిత్తులై  
నరోత్తముల్ కృశించు చుండ్రి. న్యాయమేదిరా? శివా!

16. స్వభావ సిద్ధ భక్తి భావ సాధు మానవాళికిన్  
శుభాకరా! ప్రపూజ్య! నీదు సూక్ష్మ దివ్య బోధనల్
ప్రభాసమాన! స్పష్టమయ్య. భాగ్యమీవ వారికిన్.  
విభుండ వీవ కాతువంచు విశ్వసింతురో శివా!

17. గణాధిపుండు మీ విశిష్టగౌరవంబునెన్నుచున్,  
ప్రణామముల్ ప్రదక్షిణల్ ప్రభావమున్ గ్రహించి తా
ననేక మాచరించెగా! గణాధిపత్యమందెగా!  
సనాతనా! నినున్ గనన్ బ్రశాంతి కల్గునో శివా!

18. హిమాద్రి పుత్రి నీ విచిత్ర హృద్య సుస్వరూపమున్ 
ప్రమోదమందెఁ గాంచి, యేమి భాగ్య మబ్బె నామెకున్?
ప్రమాణ మీవ సృష్టికంచు భవ్య భావనన్ వివా  
హ మాడె నిన్నుఁ బ్రేమతో, మహాత్ముఁడా! మహాశివా!

19. హిమాచలాద్రి పుత్రి యుత్సహించి నీపయిన్ మహా  
ప్రమోద మానసంబుతోడ భక్తి భావ యుక్తయై
యమేయ దీక్షఁ బూన, నీవు నామెనంది యుండగా  
యమోఘమంచు దివ్యులెల్ల హర్షమందిరో శివా!

20. నమామి తే! మనోహరా! అనాధనాధ! సుందరా!  
నమామి తే! ప్రభాన్వితా! అనంత రూప! తే నమ:!
నమామి తే! వినీల కంఠ! నాగ భూషణా! నమ:!  
నమామి తే! జగత్పితా! ప్రణామమందుమా! శివా!

21. ఉమాపతీ! కృపాంబుధీ! సమున్నతత్వమంది నిన్ 
బ్రమోద మానసుండనై సభక్తిఁ గొల్చి, భ్రాంతులన్,
సమస్త లంపటంబులన్, విషాద పూర్ణ జన్మమున్,  
బ్రమాదమున్ బరిత్యజింతు. ప్రాపుఁ గొల్పుమా! శివా!

22. ఉమాహరుల్ స్వరూపమందు నొక్కటై రహించగా  
రమేశుఁడున్ విరించియున్ సరస్వతీ రమా సతుల్
ప్రమోద మంది గాంచిరే వరంబుగా! మనంబునన్  
నిమేషమైన నిన్ను నిల్పు నేర్పు నీయుమా !  శివా!

23.  సముజ్జ్వలత్ప్రశస్త లింగ సత్కృపా కటాక్షముల్  
నమస్కరించు నట్టి వారు, నవ్య దివ్య భావులున్
ప్రమోద దివ్య చిత్తులున్, ప్రభాత సేవ భక్తులున్,  
నిమేష కాలమందు పొందు, నిత్యుఁడా! మహా శివా!

24. మృకండు పుత్ర రక్షకా! వరేణ్యులన్నఁ బ్రీతితో  
ప్రకాశమాన గౌరవంబు, ప్రాభవంబుఁ గొల్పుదే?
దుకూల, సర్వ భోగ భాగ్య దుండ వౌదువయ్య! త్ర్యం 
బకా! మహాత్మ! నన్ను కావుమా! మహేశ్వరా! శివా!

25. జలాభిషేకమొప్పఁ జేయ, చాల సంతసింతువే!  
కులాలుడైనఁ గాని వానిఁ కూర్మితో గ్రహింతువే!
విలాసవంతులైన గాని, పేదలైన గాని నీ  
తలంపునందునొక్కటే. నితాంత భాగ్యదా! శివా!

26. ప్రపంచ భూత సాక్ష్య దివ్య పంచ వక్త్ర శోభివే,  
విపంచి నాదమాధురిన్ సువేద్యమౌదువే హరా!
కృపాకటాక్ష వీక్షణల్ ధరిత్రిపైన నింపితే!  
ప్రపూజ్య ఓం నమశ్శివాయ భవ్య మంత్రమై. శివా!

27.  వినాశమన్నదెన్న లేని విశ్వ సాక్షివే ! హరా !   
మనోజ్ఞ సృష్టి చేసి, దాని మట్టిఁ జేయ న్యాయమా ?
ప్రణామముల్ ప్రపంచ దివ్య భవ్య భాగ్య రక్షకా!  
ననున్ గనంగదోయి సాంబ! నా మనోజ్ఞుఁడా! శివా!

28.  నిరంతరాయ దృష్టి నీది. నిర్వికల్పుఁడా! భవా!  
భరింపరాని దుష్ట భావ పాపు లేల పుట్టిరో!
విరించి చేయు సృష్టిఁ గాంచి వేగమే గ్రహించి, యీ  
భరంబుఁ బాపి కావుమయ్య భారతాంబ నో శివా!

29. కవీశ్వరుల్ గ్రహించునట్లు కానిపించుమా హరా!  
నివేదనంబు లందుమా! వినీతులన్ గ్రహింపుమా!
సువేద్యమై, మనోజ్ఞమైన సుందరాకృతిన్ కృపన్  
కవిత్వ తత్వ రూప మొంది కాంచఁ జేయుమా! శివా!

30. గుణత్రయంబు నీవయై, ప్రకోప దుష్ట సంహతిన్  
వినాశమొందఁ జేయవేమి? విశ్వ రూపుఁడా! హరా!
వినీతులెల్ల బాధలొంద ప్రీతి తోడఁ గాంతువా? 
అనాది దుష్ట తత్వమెన్ని యార్పుమా! మహా శివా!

31. సుమంగళాకరా! నినున్ బ్రశోధనంబు చేయుచో 
యమంగళంబులన్ని బాయు నాత్మ తేజ దర్శనం
బమోఘమై లభించునయ్య! హర్షణీయమై. సదా  
సమాధి సుస్థితిన్ వెలుంగ సాధ్యమౌనుగా! శివా!

32. ప్రభాత వేళ స్నాన సంధ్య ప్రార్థనల్ చరించుచున్,  
విభో! త్వదీయ లింగ మూర్తి వేల్పుగా గణించి, మా
యభీప్సితంబు లెల్లఁ ద్రోచి, యద్భుతాభిషేకముల్  
శుభాకరా! గ్రహింపుమన్నశోభఁ గూర్తువే!  శివా!

33. నిదానమే ప్రధానమంచు నిన్ను నమ్మి యున్నచో,  
విధాత వ్రాయు వ్రాత నైన విశ్వసింపనేలరా!
సుధా ప్రపూర్ణ జీవితంబు శోభిలన్ యమర్తువే !  
మదిన్ విశాల భావమున్న మమ్ముఁ గాతువే ! శివా !

34. విరించి సృష్టి లోనఁ గల్గు వింతలెల్ల కంటివా?  
ధరాతలంబునందునుండు ధర్మమే నశించదా!
నరాధముల్ పొనర్చు దౌష్ట్య నర్తనంబు కానరా!  
కరావలంబమిచ్చి మమ్ము కావుమా! మహా శివా!

35. త్రినాధ పూర్ణ దివ్య రూప! దేవ దేవ! శంకరా!  
త్రినేత్రుఁడా! మనోజ్ఞ భావ దీప్తిఁ గొల్పి కావరా!
అనాధనాధుఁడా! కనన్ మహా విశిష్ట దైవ మీ 
వనంగ నుండుమా యెదన్, శుభాస్పదంబుగా, శివా!

36. రమా వినోది యైన విష్ణు రక్షణంబు చూచితిన్! 
యమోఘ వాణినేలు బ్రహ్మ యాత్మ శక్తి చూచితిన్!
ప్రమోద మానసుండవై వరంబు లిచ్చుటందు నీ  
సమానులన్ గనంగ లేను. శంకరా! మహాశివా!

37. స్వభావ సిద్ధ సత్స్వభావ భాగ్య మీవ కొల్పినన్  
విభో! దురంత దౌష్ట్యముల్ నవీనులందు కల్గునా?
శుభప్రదంబు నీకు, మాకు, చూచి మంచి కొల్పుమా!  
ప్రభో! శుభంకరా! మహేశ! భక్త బాంధవా! శివా!

38. నిశాచరుల్ నరాధముల్ వినీతి దూరులీ భువిన్ 
నశింపఁ జేయుచుండ్రి. వారి నాశనంబు చేయుమా.
నిశీధిలోన నంగనల్ పునీత మార్గమందునన్  
వశింపగల్గఁ జేయుమా! భవా! గ్రహింపుమా! శివా!

39. నవీన మార్గ మంచు నేడు నాట్య శాలలందునన్  
వివస్త్రలై కృశాంగులే సవిస్తరంబుఁగా తమన్
ప్రవేశపెట్టుకొందు రేల? పాప చింత లేదొకో? 
భవా! త్వదీయ దివ్య దృష్టిఁ బాపుమిట్టి వో శివా! ?

40. ఉమా ధవా! ప్రమోదమా? సమున్నతిన్ దురాత్మకుల్, 
ప్రమాదమందు సజ్జనుల్ ప్రభావమేది యుండెరా!
సమస్త మీవ చూచు చుండి సజ్జనాళిఁ బ్రోవుమా!  
ప్రమోద మంద సజ్జనాళి భక్తిఁ గొల్తురో శివా!

41. ప్రశాంత చిత్తమందు నిన్ను భక్తిఁ గొల్వఁ గోరగా 
నశాంతి చుట్టి ముట్టు నన్ను నాత్మ తేజ మీవయై
విశేష దివ్య దర్శనంబు ప్రీతి తోడఁ గొల్పుమా!  
అశేష భవ్య భక్తకోటి యాశ తీర్చుమా శివా!

42. మనోజ్ఞుఁడా! అశేష సృష్టి మానసంబు నందునే  
వినోద మంద తల్చ నీవు విశ్వమే జనించెనా!
అనాధ నాధ! నీదు లీల హాయిఁ గొల్పు నీకు. నీ  
వినోదమెల్ల శిక్ష మాకు విశ్వనాథుఁడా! శివా!

43. నమోనమశ్శివాయ యంచు నాల్కపల్కినంతనే  
ప్రమోదమంది రక్ష సేయ వచ్చితీరుదీవు. నీ
సమాను లెవ్వరయ్య కావ? సర్వ భూత సంస్థితా!  
నమో నమో నమో೭స్తు తే ! ప్రణామ మందుమా! శివా!

44. ప్రమాద సూచి నీవు గాంచి భక్త కోటి కెల్లెడన్ 
ప్రమేయముండు, లేక పోవు, రక్షఁ గొల్ప చూతువే!
ప్రమాణమౌచు నిల్తువే! శుభంబుఁ గల్గఁ జేతువే! 
సమాను లెవ్వరయ్య నీకు? సన్నుతాత్ముఁడా! శివా!

45. పవిత్ర భక్తి భారతీయ భావ జాలమందునన్  
ప్రవర్ధిలున్ శివాంశఁ జూచి, భక్తి తోడ నెల్లెడన్
శివా! హరా! యటంచు బిల్చు క్షేమమందఁ జేయగన్! 
భవానితోడఁ గావుమయ్య! భారతీయులన్ శివా!

46. చరాచరంబు లందుఁ జిక్కి సంచలించు నామదిన్  
నిరాశఁ జిక్కకుండ కావ నీకె సాధ్యమౌనుగా.
దురాశ కల్గ నీక కాచు ధూర్జటీ! ఉపేక్షయా?  
పరాచికంబు లేల కావ? భక్త బాంధవా! శివా!

47. మదేభ సర్ప శ్రీ లవేమి మంత్రముల్ పఠించెరా?  
ముదావహంబయెన్ మనోజ్ఞ పూజలీవు పొందుటన్.
సదా విశాల భావ పూర్ణ సత్ ప్రశస్త భక్తులన్  
మదిన్ గ్రహించి కాతు వీవు. మా మహేశుఁడా! శివా!

48. ధరాతలంబునందు నీ ప్రధాన భక్త బృందముల్ 
చరించు ధర్మ బద్ధులై ప్రశస్తి నీకుఁ గొల్పుచున్.
పరాత్పరా! గ్రహించరా! స్వభావ సిద్ధ సద్గుణుల్  
దురాగతంబు లోర్తురే! గతుల్ మరల్చరా! శివా!

49. అమోఘ భవ్య పాద పద్మమాశ్రయించు వారికిన్  
నమస్కరించు వారికిన్, వినమ్రులైన వారికిన్,
శమ క్షమాది సద్గుణ ప్రశస్తి కొల్పు శంకరా!  
నమస్కరింతునయ్య నీకు. నన్నుఁ గాంచుమా! శివా!

50. అయోమయాంధకార మీవు హాయిగా సృజించి, యే 
ప్రయోజనంబు కోరినావు? బ్రహ్మ సాక్షిగా హరా!
ప్రయాస కాక యేమి దక్కె? ప్రస్ఫుటంబుగా భవ  
ద్దయాప్రభావ కాంతి, మార్గ దర్శకంబురా! శివా! 

51. విశిష్ట సృష్టి బ్రహ్మచేయ, విష్ణు సంస్థితంబయెన్. 
విశాల విశ్వ సంలయంబు వేల్పు వీవ చేయగా?
ప్రశాంతమైన ధ్యానివై  ప్రభావ మొందినావుగా!  
నశింపఁ జేయు వృత్తి యెట్లు నచ్చెరా? మహా శివా!

52. మహాశివా! మహాశివా! ప్రమాణ మీవ మాకు. నీ 
మహోదయంబు సృష్టికే సమస్త సత్ఫలంబయా!
మహాత్ములెన్నినిన్నుఁ గాంచు,మమ్ముఁ గాతువీవనున్.
మహాద్భుతంబుచూపుదీవుమమ్ముఁగావుచున్ శివా!

53. శనీశ్వరుండు లోక మందు సంచరింప వీలుగా  
మనుష్యులందు భక్తిఁ గొల్పి మాన్యుడా శనీశ్వరుం
డనంగ దాగినావు కాని, యడ్డగింప నేర్వవే?  
యనాధ వోలె తొఱ్ఱలోన నంబుజాక్షుఁడా! శివా!

54. సుధర్మ మాచరింపగా నశుద్ధులన్ వధింపనా?  
స్వధర్మ మాచరించుచున్ ప్రభావమేది యుండనా?
సుధర్మమా? స్వధర్మమా? త్రిశూల పాణి తెల్పుమా!  
ప్రధాన ధర్మమాచరింతు. భవ్యమేదిరా? శివా!

55. పరాత్పరుండ వీవటంచు భక్తితో భజింపగా  
నిరాశఁ గొల్పుదేల నీవు? నీవు గల్గి యుండగా
ధరాతలంబునందు దుష్ట దంభులన్ గణింపనా? 
నరాధమాళి యేచుచుండె. నన్నుగావరా! శివా!

56. పరాక్రమాదులెల్ల నీవు పన్ను నట్టి యుక్తులే. 
దురంత దుర్దశల్ వరింప, త్రోవ కాన రాదుగా?
పరాక్రమంబదేమి చేయు? భక్తి నిన్ స్మరించినన్  
దురంత దుర్దశల్ తొలంచి త్రోవ చూపుదే! శివా!

57. కవిత్వ తత్వ దర్శనంబు కావ్య కర్తఁ జేయునా?  
భవాని సత్కృపాబ్ధి మున్గు భక్తుడన్న ప్రీతితో
కవిత్వ శక్తి నిచ్చి, వాణి కావ్య రూప మొందునే! 
భవుండ! భాగ్యశాలివే భవాని కల్గుటన్ శివా!

58. సుధార్ణవంబు నందు ముంచు సోమశేఖరా! నినున్.  
మదాంధకార మగ్నులైన మానవాళి కాంతురే,
మదోన్మదుల్ మదంబడంచి, మంచి నుంచి గాంచుమా!  
వ్యధార్తపాళి బాధ తీర్చి భక్తిఁ గొల్పుమా! శివా!

59. నమస్కరించి నంతలోన నమ్ము చుందువే మమున్! 
సమస్త సృష్టిఁ జేయునట్టి  శంకరా! యెఱుంగవే?
ప్రమాద మెంచవేలనయ్య? భక్తులన్న మాటలే  
ప్రమోద మీకుఁ గొల్పగా స్వభావమెంచవా? శివా!

60. జయంబు నిచ్చు వానిగా, యసాధ్య సాధ్యుగా తమన్  
భయంబు వీడి పల్కుచుంద్రు. భక్త వత్సలా సదా
జయంబు నీవు కల్గఁ జేయఁ సత్యమౌను. కానిచో  
భయంబు కల్గు నిశ్చయంబు పాపికిన్. సదాశివా!

61. విశాల విశ్వ సృష్టి బ్రహ్మ పేరఁ జేతువా హరా!  
ప్రశాంత పోషణంబు విష్ణు భావ మొప్పఁ జేతువా !
నశింపఁ జేయు వాఁడవా! వినాశనంబు నీ పనా? 
ప్రశాంత భావ! భక్త పోష ! భావ్యమా! మహా శివా!

62. అపర్ణగా ప్రశస్తి పొంది యాది శక్తి నిన్నుతా  
నపేక్షతోడ పొందెనయ్య! హాయి యేమి కొల్పితో!
ప్రపూజలన్ మనోజ్ఞ భావ ప్రాప్తి నీకు గొల్పె నా  
యపర్ణ కోరు మాదు రక్ష, హాయి, కూర్చుమా! శివా!

63. గణాధిదేవతాదులున్ ప్రగాఢ భక్తి యుక్తులై  
ప్రణామ మాచరించుచున్ సపర్య చేయ వత్తురే!
మునీశ్వరుల్ ముదంబు తోడ పూజ చేయ వత్తురే!  
మనంబు నీకు లేదొకో? సమాధి నుంటివా! శివా!

64. సమీప్సితార్థ మొందఁ జేయ చాలు దీవె యందురే! 
సమీపమందె యుండి నీవు చక్కఁ జూతు వందురే!
ప్రమోదమీకు కల్గఁ జేయ బాధలం గణింపరే!  
ప్రమాదమెంచి కావుమయ్య! భక్తి మూఢులన్. శివా!

65. అపూర్వ దైవ మీవెగా! మహత్ప్రసిద్ధి నీదెగా!  
సపర్య లందఁ జేయుచున్న సాధ్వి యా యపర్ణగా?
అపూర్వమైన భక్తి బంధ మందియున్న మిమ్ములన్  
తపించి పొందు భక్తులెల్ల తాపసాళియే! శివా!

66. వ్యధార్త జీవ కోటికిన్ సహాయ కారివౌచు నీ 
ప్రధాన దైవ ధర్మమున్ స్వభక్తపాళిఁ గాంచగా
విధేయతన్ వహించి చేతువే, ముదావహంబుగా. 
స్వధర్మ మాచరింప సత్ స్వభావ మిమ్మురా! శివా!

67. నరేంద్రులున్ సురేంద్రులున్ మనంగ నీవె కారణం 
బురా! మహేశ్వరా! నితాంత పుణ్య సత్ఫలంబుగా
స్మరింపఁ గల్గు మాకు నిన్ను. శంకరా! శుభంకరా!  
ధరాతలంబునందు మాకు దైవ మీవెరా! శివా!

68. అనంత విశ్వమంతటన్ శివాజ్ఞ లేక ఏదియున్  
మనంగ లేదు, కుట్ట లేదు మంట పుట్ట చీమయున్.
వినాశమున్ వివేకమున్ నవీన సద్విభావమున్ 
మనోజ్ఞుఁడా! త్వదీయ శక్తి. మమ్ముఁ గాచుమా! శివా!

69. ప్రభావ మీవ కొల్పగా నభంబు తాకనౌనుగా! 
నభంబు తాక గల్గినన్ వినాశ మొందు మానవుల్
ప్రభావమేది. నీ కృపా ప్రవాహ మేది యున్నచో? 
విభో! త్వదీయ శక్తి, యుక్తి, విజ్ఞు లెన్నురా! శివా!

70. మరంద మెంత పుష్పమందు? మాన్య! నీదు సృష్టిలో 
మరంద మక్షికం బదెంత? మాధురీ విమోహతన్
మరంద మెంత సేకరించు? మందుకైనఁ దక్కునా?  
మరంద మందు మానవాళి. మాయ నీదిరా! శివా!

71. వృథా ప్రయాస నీదిరా! భవిష్య వాణి తెల్పెరా!  
సుధీర ! నీ ప్రయత్నతన్ వసుంధర ప్రణాశమున్
బుధాళి తోడనున్న గాని పొందకుండ చేయలే  
వు. ధర్మ హీనతన్ గదా భవుండ యిట్లగున్? శివా!

72. ప్రకాశ మార్గ మీవు చూప భాగ్య శాలు రందుగా! 
ప్రకోప శత్రు షట్క శక్తి భక్తులన్ మరల్చుగా!
వికారమంది నిన్ను వీడ, వేల్పు వయ్యు కావ సా  
వకాశ మేది చూతువయ్య భక్త పాళి నో శివా!

73. ప్రపంచమందు నిండి యుండె పంచబాణు శక్తి. ఓ 
సు పూజ్యుఁడా! గ్రహించి, వానిఁ జూచు బూది చేసినన్,
నెపంబె దక్కె నీకుఁ గాని, నేర్పునన్ మనంబులన్ 
తపింపఁ జేయుచుండె. మారు తాప మార్పరా! శివా!

74. సభాసదుల్ మనంబు పొంగ సన్మనోజ్ఞ బోధనల్  
ప్రభావ మంత చూపి పల్కు పండితాళిఁ గంటి నే.
ప్రభావ మెల్ల వారికున్న భక్తి యొక్కటే కదా!  
ప్రబోధ శక్తి మాయమౌను భక్తి లేనిచో, శివా!

75. నిరామయా! నిరంజనా! వినీల కంఠుఁడా! శివా!  
ధరా తలంబునందు నా స్వధర్మ బద్ధతన్ భవా!
నిరంతరంబు కల్గి యుండ నీక చేయ సాధ్యమౌన్.  
పరీక్ష చేయుటాపుమయ్య! భక్తుఁ గావుమా! శివా!

76. ప్రభాత దివ్య భాసమాన భాగ్య మీవె కల్పితే!  
నభంబునందు చుక్కలన్ యనంత! నీవె కొల్పితే!
నభోంతరాళ మధ్య శోభ నమ్మి చూడఁ గొల్పితే!  
స్వభావ సిద్ధ సృష్టి కర్తవా! పరాత్పరా! శివా!

77. నభంబునందు చుక్కలున్ వినమ్రతన్ నినున్ గనున్ 
ప్రభో! నమశ్శివాయ యంచు భక్తితో వచించుచున్.
ప్రభాత సూర్య కాంతి నీ ప్రభావమెన్ని వెల్గెడున్.  
విభుండ వంచుఁ గాంచు నెల్ల విశ్వమున్ నినున్ శివా!

78. భగీరథుండు స్వర్నదిన్ భవా! శివా! గ్రహింపవా!  
ప్రగాఢ భక్తిఁ గొల్తునంచు భక్తితోడ వేడగా
మృగాంక శేఖరా! వహించి మేలుగా శిరంబునన్  
బిగించి యుంచి దించితీవు, భీతిఁ బాపుచున్ శివా!

79. జరా రుజల్ ధరా స్థలిన్ ప్రజాత మైన వారికిన్  
వరంబుగా కలుంగ, నీదు పావనాంఘ్రి యుగ్మమున్
స్థిరంబుగా భజించినన్ సుచేతనంబుఁ గొల్పుచున్ 
కరంబు నందఁ జేసి నీవు కాతువే! మహా శివా!

80. సమాజ సేవ చేయు వారు స్వార్థమున్ త్యజింపరే!  
నమస్కరింప బూనినన్ మనంబు నిష్కళంకమై
ప్రమోదమందఁ జేయరే! స్వభావ సిద్ధ సద్గుణుల్  
సమస్త మీశ్వరార్పణంబు సల్పునెప్పుడున్ శివా!

81. ప్రమాదమైన మంచు కొండ పై తపంబదేమిటో!  
ప్రమోదమంది భక్త కోటి భక్తిఁ గొల్చుటేమిటో!
నమో೭స్తుతే మహాశివా! అనాధ నాధుఁడా! హరా!  
సమీప మందు నుండ రాదొ? సమ్మతిన్ సదా శివా!

82. జనాను కూలమైన చోట చక్కనుండుమా హరా!  
నినుం భువిన్  స్వభక్త పాళి నిండుగా కనంగనౌన్.
ప్రణామ మాచరించనౌన్. కరంబు సేవ చేయనౌన్! 
మనో వికారముల్ త్యజించి మంచిఁ గాంచనౌన్. శివా!

83. శ్రమైక జీవనుల్, నినున్ ప్రశాంత చిత్తులై కనున్.  
మమేకమై భజించు నెట్టి మర్మమే యెఱుంగరే!
అమోఘమైన భక్తితత్వ మబ్బె వారి కెట్లు? ఓం 
నమశ్శివాయ మంత్రమే పునాది భక్తికిన్, శివా!

84. స్మశాన భూములందు నీవు సంచరింతు వందురే!  
విశిష్టమా స్మశాన భూతి? ప్రీతిఁ దాల్తువందురే!
నశింప చేయువృత్తి నీవు నచ్చి, చేతువందురే!  
ప్రశస్తమేది? కాని దేది? భాగ్యమేదిరా? శివా!

85. త్రిశూలముల్ శరీరమందుఁ బ్రీతిఁ గ్రుచ్చు కొందురే! 
విశేష పూజ లంద నిన్నుఁ బ్రీతిఁ వేడు కొందురే!
ఆశేష భక్త కోటి నీకు హారతిచ్చి, కాంతురే.  
విశేష మేమి కల్గియున్న వేల్పు వీవురా? శివా!

86. పురాణ గాధలందు నిన్ను పూర్తిగా పఠించితిన్.
వరాల వర్ష మందఁ జేయు భక్త బాంధవా హరా!
నరాధముండె యైన గాని నమ్మి నిన్ను కొల్చినన్ 
భరింతు వీవు వాని తప్పు భక్త పెన్నిధీ! శివా!

87. నిరంతరంబు నీప్రశస్తి, నీ మహత్యమున్ భవా!  
చరాచరంబులందు నీ ప్రచారమున్, స్థితిత్వమున్,
సురాసురాళి కెల్ల నీదు శోభఁ జూపి గాచుటీ  
ధరాతలాన కీర్తిఁ గాంచె, దర్శనీయుఁడా! శివా!

88. భరింపరాని బాధ కల్గ భవ్య! నిన్ను తిట్టుదే. 
నిరంతరాయ సౌఖ్యమబ్బ  నిన్ను నే స్మరింపనే!
వరంబుగా స్థిరంబుగా నివాసముండి నా యెదన్  
భరించు నీకు రక్ష సేయ భావ్యమే కదా! శివా!

89. జగజ్జయంబు చేసినట్టి జాణ లేరిరా! హరా! 
ప్రగాఢ ప్రేమ జీవు లేరి? భాగ్య శాలు రేరిరా!
జగంబులో సజీవ సత్య సాక్షి లేదు చూడరా!  
దిగంత వ్యాప్త! నీవె సత్య తేజ మెన్నగా. శివా!

90. సముద్ధరింతుమంచు దేశ, సంఘ సేవ చేసినన్,  
సమున్నతత్వమొందినన్, ప్రశాంతతన్ వహించినన్
నమామి తే మహేశ్వరా! యనంగ లేని జీవులీ  
సమాజమందు వ్యర్థ జీవ సన్నిభుల్. మహా శివా!

91. హిమాద్రిపై సమాధి లోన హృన్మనోజ్ఞ మూర్తివై,  
ప్రమాణమై రహించుచున్, కృపా కటాక్ష వీక్షణల్
ప్రమోదమంద భక్త పాళిపైనఁ జూపుదే హరా!  
నమామి తే మహేశ్వరా! ప్రణామ మందుమా ! శివా!

92. అహంబు చావ లేదురా! మహానుభావ! నా హరా !  
ఇహంబునందు దుష్కృతుల్ మహేశ్వరా! గణించినన్
సహాయ మీవు చేయ లేవు. సౌమ్యభావ పూర్ణమౌ  
మహామతిన్ ననున్ మరల్చి మాన్యుఁ జేసితే! శివా!

93. నితాంత శాంతిమంతుఁడా! వినీల కంఠ! శంభుఁడా!  
కృతాపరాధినైన నన్నుఁ గేలి చేయ బోకురా!
శతాంశమైన నీ ప్రసక్తి సల్పి యుండి యుండనా? 
మతిన్ గణించి కావుమయ్య! మాననీయుఁడా! శివా!

94. సభా సదుల్ ప్రశంస చేయ చాల పొంగి పొవుచున్ 
స్వభావ సిద్ధ దుష్ట షట్క సంగతిన్ జరించితిన్.
విభుండ వీవ గౌరవంబు వెల్లి గొల్పు సంగతిన్  
ప్రభో! స్మరింపఁ జాలనైతి. రక్ష సేయరా! శివా!

95. నయాను కూల వర్తినై యనంతమైన బాధలన్ 
జయించి వచ్చి యుంటినయ్య! సర్వ దు:ఖ హారుఁడా!
ప్రియంబునన్, నినున్ స్మరించి, తృప్తినొందఁ జేయుమా!
జయింతు నా యమున్ భవద్వశంబు నుండి, నే, శివా!

96. ప్రమాణ మంతరాత్మరా! స్వబంధు వెన్న నీవెరా!  
నమస్కరించి గొల్తురా! గుణంబు మంచిదీయరా!
ప్రమాద మొందనీకురా!  శివా! నశింపనీకురా!  
ప్రమోద మొందఁ జేయ రార ! భక్తుఁ గావరా! శివా!

97. భవాని నాకు తల్లిరా! ప్రభావ మొందఁ జేసెరా!  
నివాసముండి నాయెదన్ బునీతుఁ జేసెరా హరా!
సవిస్తరంబుగా త్వదీయ సద్గుణాళి చూపెరా!  
భవాని పంచ చామరాళి వ్రాయఁ జేసెరా! శివా!

98. గుణంబులుండు, నుండకుండు, ఘోరమైన దోషముల్ 
గణింప నున్న నుండ వచ్చు, కాంక్ష తోడనిన్నునే
గణించి పంచ చామరాళి కమ్మగా రచించితిన్.  
గణించి నన్ను, సత్వమిచ్చి, కాచుమా! సదా శివా!

99. ప్రశస్తి గాంచి పాఠకాళి భక్తితో పఠించినన్, 
స్వశక్తి వృద్ధిఁ జేయునంచు వ్రాసి, వాసి గొల్పినన్,
దిశాంతమంద దీని కీర్తి దీక్షతో వచించినన్,  
ప్రశాంతి పంచచామరస్థ! పాదుకొల్పరా! శివా!

100. వయస్సు మళ్ళిపోవుచుండ భక్తి సన్నగిల్లురా!  
భయంబు బాధ పెట్టుచుండ భ్రాంతు లెట్లు పోవురా!
నయానుకూల వర్తనంబు నాఁ డదెట్లు కల్గురా!  
ప్రియంబుతోడఁ గానిపించి ప్రీతి గొల్పరా! శివా!

101. దయార్ద్ర చిత్తుడీశ్వరుండు, తప్పులన్ క్షమించుచున్ 
నయానుకూల వర్తనంబు నాకుఁ గొల్పు నిత్యమున్.
భయంబు పార ద్రోలి, భక్తి భావ మిచ్చు నంచు నా 
శ్రయించి యున్న నన్నుఁ గాంచి, రక్ష సేయరా! శివా!

102. భవాని మాత నీ ప్రశస్త భాగ్య రేఖరా! హరా! 
నవీన తేజ మిచ్చు నా వినాయకుండు తోడురా!
భవుండ! షణ్ముఖుండు సత్ ప్రభావ మొందఁ జేసెరా!  
నివేశమై హిమాద్రి నీకు నిష్ఠ కొల్పెరా! శివా!

103. మహామునుల్ నిరంతరంబు మౌనదీక్షఁ బూని, నీ  
మహోన్నత ప్రబోధఁ గాంచి మాయనే త్యజించిరే.
మహేశ్వరా! దయార్ద్రచిత్త! మమ్ముఁ బ్రోవ నీకృపా  
మహత్వ దృష్టిఁ జూడుమా! ప్రమాద మాపుమా! శివా!

104. సుపూజ్యులైన పండితుల్ విశుద్ధ రమ్య చిత్తులై  
ప్ర పూజ్యమైన పంచ చామరమ్ములన్ పఠించ, నీ
వపూర్వమైన భక్తిఁ గొల్పి, హాయి నొందఁ జేయుమా!   
విపర్యయంబు లేక గాచి, ప్రీతి గొల్పుమా శివా!

105. వినీతులైన కల్వపూడి వీర రాఘవార్యులీ   
యనాధనైన నన్ గ్రహించి యాంధ్ర భాష నేర్పి, స
జ్జనానుకూల భక్తి భావజాల మందఁ జేసి రా 
మనీషుఁ భక్తి గొల్చెదన్, నమస్కరించుచున్ శివా!

106. కళా విలాస మెన్న లేను. కావ్య దృష్టి లేదుగా!  
స్వలాభ కాంక్ష లేదు. నీదు భక్త కోటి మెచ్చగా,
ప్రలోభ దూరులై నినున్ ప్రభావ మొప్పఁ గొల్వగా 
తలంచి వ్రాసితిన్ త్వదీయ ధర్మ తేజమున్. శివా!

107. మహన్నకారరూప ! ఓం నమశ్శివాయ ! ఓం హరా !
మహన్మకార రూప ! ఓం నమశ్శివాయ! శంకరా !
మహచ్ఛికార రూప ! ఓం నమశ్శివాయ! ఈశ్వరా !
మహద్వకార రూప ! ఓం నమశ్శివాయ! సుందరా!
మహద్యకార రూప ! ఓం నమశ్శివాయ! మా శివా !

108. సుమంగళీ ప్రపూజ్య పాద శోభితాయ మంగళం.  
సమస్త జీవ శక్తి రూప శాశ్వతాయ మంగళం.
అమంగళాంతకాయ సద్గుణాశ్రయాయ మంగళం.  
సమస్త మంగళం భవాయ. సర్వ మంగళం శివా !

పూజ్య కాణ్వ శాఖోద్భవ శ్రీ చింతా వంశ సంభవ జానకీ రామ మూర్తి దంపతుల పౌత్రుఁడను, వేంకట రత్నం సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్రుఁడను అగు రామ కృష్ణా రావు నామధేయుండనైన నాచేత విరచింపఁబడి పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు అంకితము గావింపఁబడిన
 శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి పేరంబరగు శివ శతకము
సమాప్తము.
స్వస్తి.
జైశ్రీరాం.
జైహింద్.

4, మార్చి 2013, సోమవారం

శ్రీ వల్లభవఝల వారి కలువబంధ శాంతి వృత్తము, నాగమల్లి బంధశ్యేనీ,శాంతి గర్భ సుగంధి వృత్తము.

1 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియులారా! శ్రీ వల్లభ వఝల వారి చిత్ర కవితలు తిలకించండి.
ఆర్యా! వల్లభవఝలవారూ! మీ నిరంతర కృషిని నేను మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.

ఆ పరమాత్మ కటాక్షం పొందుతున్న మహానుభావులెందరెందరిని మనం గుర్తించ కలం?

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
ఆ పరమాత్మ దయ పొంద గలగాలే కాని మానవుఁడు ఏ కళలోనైనా ఎంత నైపుణ్యమైనా ప్రదర్శించ గలుతాడనడానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ చలనచిత్రంలోనిచిత్రలేఖనా ప్రదర్శనము.
ఏ పుట్టలో ఏపాముంటుందో? ఎవరిలో ఎంతటి నిపుణత దాగి ఉంటుందో తెలుసుకోవడం ఎవరికి సాధ్యం?
ప్రయత్నంచేయకుండా ఎవ్వరూ గొప్పవారు కాలేరు.ఇటువంటివి చూస్తున్నప్పుడు సాధనమున అన్నీ సాధ్యమేనని తెలుసుకోగలుగుతున్నాము.
జైహింద్.

3, మార్చి 2013, ఆదివారం

సరిగ, పదస, సదప, గరిస అనే దత్త పదములతో రామాయణ పరముగా పూరింప మనవి

2 comments

జైశ్రీరామ్.
సుజనులారా! ఈ సరిగ, పదస, సదప, గరిస అనే  దత్త పదులతో రామాయణ పరముగా మీకు నచ్చిన ఛందమున పద్యమును వ్రాయ గలరని ఆశించుచున్నాను.
నా పూరణమును వ్యాఖ్యలో చూప గలను.
జైహింద్.

1, మార్చి 2013, శుక్రవారం

శ్రీ వల్లభవఝల వారి శ్రీబంధ అతి వినయ వృత్తమును, దీప శిఖా బంధ శాంతి వృత్తము

1 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియులారా! శ్రీ వల్లభవఝల వారి శ్రీబంధ అతి వినయ వృత్తమును, దీప శిఖా  బంధ  శాంతి వృత్తము లను తిలకించండి.
జైహింద్.

28, ఫిబ్రవరి 2013, గురువారం

శ్రీ వల్లభ వఝలవారి చక్రకేళీ బంధ సుగంధి వృత్తము, ఇక్షు బంధ రవి ప్రియ వృత్తము

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝలవారి చిత్రకవితా స్రవంతిలో మనం తేలియాడుతున్నాం కదా?
ఇప్పుడు మనం వారు కూర్చిన చక్రకేళీ బంధ సుగంధి వృత్తమును, ఇక్షు బంధ రవి ప్రియ వృత్తమును చూద్దాము.
బంధ కవితాధురీణులగు శ్రీ వల్లభవఝలవారికి అభినందనలు.
జైహింద్.


26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఢమరు -కమండల మాలికా బంధ కందములు, (భిక్షా)సుగంధ పాత్రికా బంధ చంపకము.బిల్వదళ బంధ గీతము. రచన-శ్రీ వల్లభవఝల.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల వారి ఢమరు -కమండల బంధ కందములు.తిలకించండి.

శ్రీ వల్లభవఝలవారూ! మీ అసాధారణ కృషిని ఎంతగా ప్రశంసించినా తక్కువేనండి. అభినందనలు.
నమస్తే.
జైహింద్.

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మధురోక్తుల మాతృ భాష

4 comments

జైశ్రీరామ్.
ప్రపంచ మాతృ భాషా దినోత్సవము సందర్భముగా తెలుగు సాహిత్య కళా పీఠం నిర్వహించిన 
కవి సమ్మేళనము సందర్భముగా సమర్పితము.
మధురోక్తుల మాతృ భాష
ర చ న :-  చిం తా  రా మ  కృ ష్ణా  రా వు.  సె ల్ 9247238537.,  chinta.vijaya123@gmail.com
శా:- శ్రీమద్విశ్వ మనోజ్ఞ రూప రచనా జిజ్ఞాస సంశోభితుల్,
ప్రేమోద్దీపన వాఙ్నిధానులును, సుప్రీతాత్ములున్, సాహితీ
స్తోమోజ్జ్వాలన దీక్షితుల్, వినుత సచ్ఛుద్ధాంతరంగుల్, సభన్
క్షేమంబున్ విరచింప నుండి రిచటన్. కీర్తింతు నే వారలన్. 1.
a.కంద b.గీత గర్భ ఉత్పలమాల:-
శ్రీ కమనీయ భావన సుసేవ్య మహాత్ముల వాక్ సుధారలౌ
శ్రీ కవితల్ సుధా మధుర చిత్ర ప్రబంధ రమా నిధానముల్.
నా కమలాప్తులౌ ఘనుల, నాద మునీంద్రుల, గౌరవింతు ధా
రా కవితన్. ప్రథాన సమ రాట్కవి చంద్రుల కంజలింతు నే. 2.
a.ఉత్పల గర్భస్థ కందము:- 
కమనీయ భావన సుసే  -  వ్య మహాత్ముల వాక్ సుధార లౌ శ్రీ కవితల్.
కమలాప్తులౌ ఘనుల, నా  -  ద మునీంద్రుల, గౌరవింతు ధారా కవితన్.
b.ఉత్పల గర్భస్థ గీతము:- 
వన సుసేవ్య మహాత్ముల వాక్ సుధార   -  మధుర చిత్ర ప్రబంధ రమా నిధాన.
ఘనుల, నాద మునీంద్రుల, గౌరవింతు  -  నసమ రాట్కవి చంద్రుల కంజలింతు.
శా:- కంఠంబెత్తుచు పాడు పద్య కవితా కంఠస్థ సాహస్రుఁడౌ
కంఠీ రావ మనోజ్ఞ మూర్తి మన  చిక్కా రామ దాసే, మహా
కంఠేకాలుఁడు. విన్న వీని ఘనమౌ గాత్రంబు నీ తెల్గులో
గంఠేరుండును భాగ్యవంతుఁడగు. శంఖం బందునా కంఠమున్.. 3.
a.అవసాన గీతాంతర్గత కంద యుత b.చంపక - c1&c2.ద్వివిధ కంద ద్వయ - d.గీత గర్భ, 
సీసము:-
క్షితి తెలుగున్ శుభా కృతిని శ్రీనిడు శార  -  ద క్షేమ దాయియే తలచి చూడ.
స్తుత మతి యైన యీ సుజన శోధిత భాష  -  యె స్తుత్య వారి ధీ యిలను సుగుణ
యుత. వెలుగే కదా అతిశ యోజ్వలి తాంధ్ర  -  ము ధ్యాన యుక్త వాగ్ భూరి సుఖద.
ధృతి నుతయే సుమా! వ్రత సు ధీరత నేర్వ  -  ర ! భ్రాంతి గ్రోల రారా తెలుంగ !
గీ:- తెలుగు మధు సేవనా పర తెలుగు కవులు 
కావ్య జగతి తేలుదురటగా? తెలియుడు
సుమధుర తెలుగీ యిలలోన ప్రముద కరమ  
గు నినుని విధమున నలర మనుదు మిమ్ము.  4.
a. సీసావసాన గీత గర్భస్థ కందము:-
తెలుగు మధు సేవనా పర  -  తెలుగు కవులు కావ్య జగతి తేలుదురటగా?
తెలియుడు సుమధుర తెలు గీ  -  యిలలోన ప్రముద కరమగు నినుని విధమునన్.
b. సీస గర్భస్థ చంపకమాల :-
క్షితి తెలుగున్ శుభా కృతిని శ్రీనిడు శారద క్షేమ దాయియే
స్తుత మతి యైన యీ సుజన శోధిత భాషయె స్తుత్య వారి, ధీ
యుత వెలుగే కదా అతిశ యోజ్వలి తాంధ్రము ధ్యాన యుక్త వాగ్
ధృతి నుతయే సుమా! వ్రత సు ధీరత నేర్వర ! భ్రాంతి గ్రోల రా!
c1. సీస గర్భస్థ ద్వివిధ గతి కందము :- 
తెలుగున్ శుభా కృతిని శ్రీ  -  నిడు శారద క్షేమ దాయియే స్తుత మతియై
వెలుగే కదా అతిశ యో  -  జ్వలి తాంధ్రము ధ్యాన యుక్త వాగ్ధృతి నుతయే.
c2. సీస గర్భస్థ ద్వివిధ గతి కందము :- 
మతి యైన యీ సుజన శో  -  ధిత భాషయె స్తుత్య వారి. ధీ యుత. వెలుగే .
నుతయే సుమా! వ్రత సు ధీ  -  రత నేర్వర ! భ్రాంతి గ్రోల రా! క్షితి తెలుగున్ !
d.సీస గర్భస్థ గీతము :- కృతిని శ్రీనిడు శారద క్షేమదాయి. - సుజన శోధిత భాషయె స్తుత్య వారి.
అతిశ యోజ్వలి తాంధ్రము ధ్యాన యుక్త.  -  వ్రత సు ధీరత నేర్వర ! భ్రాంతి గ్రోల. 
సర్వలఘు సీసము:-
తెలుగుననె వెలుగునది, తెలియఁ దగు తొలి పలుకు – పలుకు పలుకుల వెలుగు చిలుకు తెలుగు.
తొలి జనని పలుకునది, పలుకఁగను తెలుపునది - సులభముగ తెలియునది తొలిగ తెలుగు.
కొలువులను వెలుగునది, తెలుగు కవి పలుకునది - పులకలను గొలుపునది తెలుగు వెలుగు.
పలుకులను లలిత గతి  తెలుగు సుధ లొలుకునది - తెలియనిది దెలుపునది తెలుగు పలుకు.
గీ:- తెలుగు వెలుగు జిలుగు పలుకుల కననగు.  
తెలుగు పలుకు మధువు లొలుకు నిలను.
తెలుగు తనము ఘనము తెలియుము, తెలుపుము.  
తెలుగు తనము ధరణి వెలుగ వలయు.  5.
కం:- పంచేంద్రియముల రూపున  -  సంచిత ఫల మనుభవింప జన్మించగ బో
ధించెడి, పలికెడి భాషగ  -  నుంచెను తెలుగును మురారి. యుత్తమ మనుచున్.  6.
ఆ:- పుణ్య మూర్తి తల్లి పురిటి నొప్పుల నోర్చి - జన్మ నీయ మనకు చచ్చి బ్రతుకు.
అట్టి తల్లి భాష కిట్టదా మనలకు ?- పట్టు పట్టి నేర్చు పనియు లేదె ! 7.
ఆ:- మాతృ మూర్తి మిన్న. మాతృ భాషయు మిన్న.  -  మతృ దేశ మెన్న మనకు మిన్న.
మాతృ మూర్తి వీడి, మాతృ భాషను వీడి, - పరుల నాశ్రయించు బ్రతు కదేల? 8.
గీ:- మాతృ దేశము విలువను మరువబోకు.  -  మాతృ దేవిని కనుమయ్య మన్ననమున.
మాతృ భాషను విడువక మాట లాడు.  -  మాతృ మూర్తుల మన్నించి మహిమ గొనుమ. 9.
గీ:- ధీర సాహస్ర పద్య కంఠీరవుండ ! - సఖ్య శ్రీ చిక్క రామ దాసాఖ్య ఘనుఁడ !
తెలుగు సాహిత్య శ్రీ కళా దీప్త పీఠ - మాన్యతాధార! మీకు సన్మంగళములు.  10.   
స్వస్తి
జైహింద్.                

మాతృభాషా వైభవం సాహితీ కార్యక్రమం.

1 comments

జైశ్రీరామ్.
సాహితీ సంపన్నులారా! ప్రపంచ మాతృభాషా దినోత్సవము సందర్భమును పురస్కరించుకొని  ఈ రోజు చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభలో సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులు శ్రీ చిక్కా రామ దాసు ఆధ్వర్యవమున నడచుచున్న తెలుగు సాహిత్య కళా పీఠము వారు మాతృభాషా వైభవము పేర సాహితీ సభ నిర్వహించిరి.
ఈ కార్యక్రమమునకు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిష్ట్రార్ ప్రస్తుతం అధికార భాషా సంఘం సభ్యులు అయిన ఆచార్య గౌరీశంకర్ గారు అధ్యక్షత వహించారు.
కేంద్రీయ విశ్వ విద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య శరజ్జ్యోత్స్నారాణిముఖ్య అతిథిగా, డా.తిరునగరి, శ్రీ సాధన నరసింహాచార్యులు, శ్రీ సుర్వి గణేష్ గౌడ్, ప్రసిద్ధ కవి, వాగ్గేయ కారుడు శ్రీ గోరటి వెంకన్ననృత్య కళా శిరోమణి శ్రీమతిసరితా దిలీప్,త్యాగరాయ గాన సభ అధ్యక్షులు శ్రీకళా వేంకట దీక్షితులు, శ్రీ రాధాశ్రీ, పాల్గొన్నారు.
తెలుగు భాషా ప్రాశస్త్యమును గూర్చి నేను, నాతో పాటుగా శ్రీ తల్లోజు యాదవాచార్యులు, శ్రీ వేముల ప్రభాకర్, శ్రీ రాపోలు వేంకటేశం, శ్రీ బాలవర్ధి రాజు, శ్రీ పెసరు లింగారెడ్డి, శ్రీ వేముల సత్యనారాయణ, శ్రీ చిన్నం అంజయ్య, శ్రీ సుందర రామ కృష్ణ,  శ్రీమతి పాణ్యం మీనాకుమారి, శ్రీమతి బి.నె౩ఎలిమ, శ్రీమతి జ్యోషి అరుణశ్రీ, మున్నగు వారు చేసిన పద్య పఠనం సభాసదుల మన్ననలను పొందాయి. ఈ కార్యక్రమమునకు సంబంధించిన ఛాయాచిత్రములు తిలకించ వచ్చును.
జ్యోతిప్రజ్వలన.
తెలుగు సాహిత్య కళా పీఠం అధ్యక్షులు పలుకుచున్న స్వాగతం.
అధ్యక్షోపన్యాసము చేయుచున్నఅధికార భాషా సంఘ సభ్యులు ఆచార్య టి.గౌరీశంకర్.
శ్రీ సుందర రామ కృష్ణ పద్య పఠనము.
నేను చేయుచున్న పద్య పఠనము.
ఆచార్య గౌరీశంకర్ గారు నన్ను సత్కతిస్తున్న సన్నివేశము.
4నందీపురస్కారములందుకొన్న నృత్యకళాశిరోమణి శ్రీమతిసరితాదిలీప్ ఉపన్యాసము.
ఆర్యులారా! చూచారు కదా! మన మాతృభాషాభిమానాన్ని పెంచే ప్రయత్నంలో శ్రీ చిక్కా రామదాసుగారు ఎందరెందరినో ఆదరాభిమానాలతో ఆహ్వానించి, సముచిత సత్కారం చేసి, వారి ద్వారా తెలుగు భాషాభిమానులకానందం పంచారు. అట్టి ప్రయత్నం సత్ఫలాలనిస్తుందని ఆశిద్దాం.ఆ సభలో నేను చేసిన కవితా గానాన్ని అతి త్వరలో మీముందుంచగలనని సవినయముగా మనవిచేసుకొనుచున్నాను. శుభమస్తు.
జైహింద్. 

23, ఫిబ్రవరి 2013, శనివారం

తే.24-02-2013 న"త్యాగరాయ గాన సభలో" కవి సమ్మేళనం.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తే.24-02-2013న అనగా రేపే
త్యాగరాయ గాన సభలో
ఉదయం. 10. గంటలకు 
కవిసమ్మేళనం జరుగబోతోంది.
సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామ దాసు అధ్యక్షతన నిర్వహిఒంప బడుచున్న
‘తెలుగు సాహిత్య కళా పీఠం’ఆధ్వర్యవములో
ఆహ్వానితులైన కవులచే, కవయిత్రులచే
మాతృభాషా మాధుర్యమును గూర్చిన కవితలు పఠింపబడును.
ఈ సందర్భముగా ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ వెంకన్నను ఘనంగా సత్కతింపనున్నారు.
తెలుగు భాషాభివృద్ధికై ఈ పీఠము చక్కని కృషి చేయుచున్నదనుటకు ఈ కార్యక్రమమే నిదర్శనము.
ఈ కార్యక్రమమునకు
అందరూ ఆహ్వానితులే.
జైహింద్.

శ్రీ వల్లభవఝలవారి ఉలూఖ బంధ ద్విపద కందము

1 comments

జైశ్రీరామ్.
మిత్రులారా! శ్రీ వల్లభవఝలవారి ఉలూఖ బంధ ద్విపద కందము తిలకించండి.
శ్రీ వల్లభ వఝల వారికి అభినందనలు.
జైహింద్.

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయినవారికి,క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి.

1 comments

సోదరీ సోదరులారా!
హైదరాబాదులో మనందరితో పాటు సహ జీవనం చేస్తూ 
ఆత్మీయతలను పంచుకొంటూ కూడా 
దురదృష్ట వశాత్తు 
టెఱ్ఱరిష్టుల చేతిలో కీలుబొమ్మలైపోయినవారి 
దురాగతానికి బలైపోయిన 
మన తోటివారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను. 
క్షతగాత్రులు ఆ పరమాత్మ దయకు పాతృలై వేగముగా కోలుకోవాలని ఆశిస్తూ 
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాను.
ఓం అసతోమా సద్గమయ! 
తమసోమా జ్యోతిర్ గమయ. 
మృత్యోర్మా అమృతం గమయ. 
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.

21, ఫిబ్రవరి 2013, గురువారం

నమస్కార బంధ శార్దూలము. రచన శ్రీ వలభవఝల.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి విరచిత నమస్కార బంధ శార్దూలము తిలకించండి.
జైహింద్.

ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
మిత్రులారా! ప్రపంచ మాత్రు భాషా దినోత్సవము సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
ముఖ్యముగా తెలుగును మాతృ భాషగా కలవారికి అభినందనలు.
తెలుగు పలుకులందుగల జిగి బిగి నెఱిగి అందలి నిగనిగలను వెలువరింప చేసి, అత్యుద్భుతమైనది తెలుగు భాషే అని నిరూపించడానికి తెలుగువారంతా సమైక్యం కావాలి. వైవిధ్యాలు విడనాడాలి. భాషాభిమానం పెల్లుబకాలి. మాతేఉ భాషలోనే భాషణ చేయాలి.భాషలోని మాధ్ర్యాన్ని చవి చూడడంతో పాటు ప్రపంచానికి చాటాలి.
ఇంతటి బాధ్యత మనపై ఉంది. మరువకండి. మనం ఉన్నది నిజమైతే, అంటే మన అస్తిత్వం నిజమైతే  దానికి మూలమైన తెలుగు మాతృ భూమియొక్క ఔన్నత్యము, తెలుగు మాతృభాష యొక్క అసాధారణ ప్రతిభ ముందుగా మనం మననం చేసుకోవాలి. తదనంతరం మన మహత్తర గ్రంథరాజములందున్న కవితామృతఝరిలో తోటి వారిని ఓలలాడించాలి. అది చెయ్యాలంటే ముందుగా మనకు మనం మన మాతృభాష అయిన తెలుగుపై పట్టు సాధించాలి. అందుకొఱకు నిరంతరం అకుంఠిత దీక్షతో కృషి చెయ్యాలి. అప్పుడే మన అస్తిత్వానికొక అర్థం ఉంటుంది. మన ప్రతిభా పాటవాలు ప్రపంచానికి తెలుస్తాయి.
మీరేమంటారు?
జైహింద్.

సదసద్వివేకజ్ఞులైన మీ అందరికీ భీష్మ ఏకాదశి సందర్భముగా శుభాకాంక్షలు

1 comments

జైశ్రీరామ్.
నేడు పరమ పవిత్రమైన భీష్మ ఏకాదశీ పర్వ దినము. ఈ సందర్భముగా మానవాళికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలందజేయుచున్నాను.
శ్రీ పండిత నేమాని వారు గీతాబోధపై  వ్రాసిన ఒక పద్యమును చూడండి:
శ్రీ కృష్ణ పరమాత్మ క్రీడికి తోడుగా
....సారథియై నిల్చి సమర భూమి
అర్జునుండు వివేక మంతరింప విషాద
....మొంది సంశయముతో నున్నవేళ
కర్తవ్య బోధను గావించి దుఃఖమ్ము
....పోగొట్టి మెండుగా ప్రోత్సహించి
ఉపనిషత్సమమైన యోగ శాస్త్రమ్మును
....బ్రహ్మ విద్యను దెల్పె పరమ గుహ్య
మైన గీత నా రీతిగా జ్ఞాన బోధ
సకల లోకములకు జేసె సద్గురుడయి
యా జగద్గురువర్యు పాదాబ్జములకు
వందన శతమ్ము గూర్తును భక్తి మెఱయ‘
జైహింద్.

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మంత్రోపాసన – నాదోపాసన. శ్రీ భాస్కరానంద నాథ వివరణ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!  మంత్రోపాసన – నాదోపాసన అనే విషయమును శ్రీ భాస్కరానంద నాథులవారు వివరించిన విషయం మనం తెలుసుకొందాం.
మంత్రోపాసన – నాదోపాసన
శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాదం ఎక్కడి నుంచి ఉత్పన్నమౌతుంది? మంత్రానికి మూలం ఏమిటి?
మంత్రానికి మూలం బీజం, ఆ బీజానికి మూలం నాదం, ఆ నాదానికి మూలం బిందువు.  అన్నింటికీ మూలం బిందువు.
బిందువు లో నుంచే సృష్టి అంతా జరిగినది. బిందువు వికసనం వలన ఇది అంతా జరిగినది అని మనకు తెలుసు. బిందువు ఎందుకు వికసనం జరిగినది? దాని లోపలి శక్తి తాడనము చేత. కాబట్టి బిందువు లోపలే శక్తి వున్నది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే బిందువు పరమాత్మ, దానిలోపలి శక్తి ప్రకృతి.
అయ్య, అమ్మ ఇద్దరూ ఒక్కటే. ఒకరి లోపల ఒకరు వున్నారు. శక్తి లేనిదే అయ్య కదలడానికి అశక్తుడు అని మనకు తెలుసు. ఇదే మాటను శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పి వున్నారు.
ఇప్పడు మనము తెలుసు కోవలసినది అసలు ఈ శక్తి ఎవరు? ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? అని.
ఝుమ్మంది నాదం .. అని మనకు తెలుసు. నాదం లో నుంచి ఝు౦ అనే శబ్దం వస్తుంది. ఏమిటి ఈ  ఝు౦ అనే నాదం అని పరిశీలిస్తే ఇదే శక్తి. బిందువు లో నుంచి ఝు౦ అనే నాదం వస్తుంది, అదే శక్తి. అదే అమ్మ. అదే భ్రమరాంభిక. అదే ఆది శక్తి.  శబ్దం లో నుంచి నిశ్శబ్దం, దానిలో నుంచి శబ్దం. నిశ్శబ్దం లో నుంచి శబ్దం ఎలా?  అదే ఝు౦ అనే నాదం.
ఈం, ఈమ్ , అమ్ , మ్.  వీటిల్ని పరిశీలించండి.    “మ్” ... అనేది శక్తి. అదే ఉమా.
అదే మూల ప్రకృతి.
నాదంలో నుంచి వచ్చేది అదే ... “మ్”.
హార్మోనియం పెట్టెలో నుంచి వచ్చేది అదే ధ్వని. వీణ మీటితే అదే ధ్వని, నాద స్వరములో అదే ధ్వని,
గంట లో నుంచి వచ్చేది అదే ... “మ్”.
ఇతర గ్రహాలలో విన వచ్చేది అదే. నిశ్శబ్దం లో నుంచి వచ్చేది అదే. చంద్ర మండలములో ““మ్”. అనే ధ్వని వినిపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. విద్యుచ్చక్తి లో అదే ధ్వని. శక్తి ఎక్కడ వుందో అక్కడ అదే ధ్వని.
High Induction transformer / HT voltage లో అదే ధ్వని. ......  “మ్”.
ల౦, హం, య౦, రం, వం, సం, గం... లో నుంచి వచ్చేది అదే శబ్దం ......  “మ్”.
శ్రీరాముని తారక మంత్రమైన బీజాక్షరం “రాం, రామ్” లో నుంచి అదే శబ్దం ......  “మ్”.
రామం, విష్ణుం, శివం, కేశవం, దామోదరం ..... లో నుంచి అదే శబ్దం ......  “మ్”.
విష్ణు సహస్ర నామం లోని “విష్ణుం” అదే.
హ్రీం లోని “ఈ” కారము అదే. ... “మ్”.
అదే శ్రీమాత.
హిరణ్య వర్ణాం హరిణీం ,........... హిరణ్మయీం... అదే శబ్దం ......  “మ్”.
ఏ మంత్ర మైనా అదే "ఈమ్" అనే శబ్దం రావాలి. అదే ప్రాణ శక్తి, అదే జీవ శక్తి. అదే చలనము. మంత్రానికి మూల శక్తి అదే.
అదే ఆదిశక్తి.   "ఈం" అనేది మూల ప్రకృతి, అదే నాదం.
ఓం కారములోని జీవ శక్తి అదే. "మ్.
దానిని మీద ధ్యాస వుంచండి, సమాధి లోకి వెళ్లి పోతారు. మనము చేయవలసిన సాధన అదే. అందరం కలిసి చేద్దాము.
ఝు౦ కారం వినడమే. శ్రీశైలం లో వినబడేది అదే. కైవల్యం అదే. అదే కైవల్యం. అదే కైవల్యం. నిశ్శబ్దం లోకి వెళ్ళగలిగిన వాడు ఈ శబ్దం వినగలడు ,             అది వినగలిగిన వాడు ధన్యుడు.
అదే సమాధి స్థితి. దానిలో లీనం అయిపోవడమే.
శ్రీ భాస్కరానంద నాథ వివరణ. చూచారు కదా! మరొక పర్యాయం మరొక మంచి విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
జైహింద్.

శ్రీ వల్లభవఝల విరచించిన అభయ హస్త బంధసీసము

0 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియులారా! శ్రీ వల్లభవఝల విరచించిన అభయ హస్త బంధసీసమును తిలకించండి.
శ్రీ వల్లభవఝల వారి నిరంతర కృషికి అభినందనలు తెలియ జేస్తున్నాను.
జైహింద్.

18, ఫిబ్రవరి 2013, సోమవారం

శ్రీ వల్లభ వఝల కృత ‘పిడికిలి బంధ కందము - నారికేళ బంధ ఆటవెలది’

1 comments

జైశ్రీరామ్.
ప్రియ ఆంధ్రామృతాస్వాదనా తత్పరులారా!
మన ఆంధ్రభాషలో పద్యరచనలో చిత్ర బంధ, గర్భ కవిత్వములు భాషకే భూషణములనిన అతిశయోక్తి కానేరదు. అట్టి కవితాసక్తిని పెంపొందించుకొని రచనలు సలుపుచూ పాఠకులమదికెక్కుచున్న మహనీయులెందరో ఉన్నారు. అట్టి వారిలో శ్రీ వల్లభ వఝల నరసింహమూర్తి కవిమిత్రులు ముఖ్యులని చెప్పుకొనవలయును. ఎందుచేతననగా వారి కంట బడిన ఎటువంటి చిత్ర కవిత్వమయినా సరే మరుక్షణంలో వారి కలము నుండి నూతనోత్తేజముతో జాలువారుతుంది. అట్టి కవివరులు వ్రాసిన
పిడికిలి బంధ కందము - నారికేళ బంధ ఆటవెలది చూడండి.
ఇంత చక్కటి ప్రయత్నంతో కృతకృత్యులగుచున్న శ్రీ వల్లభవఝలవారిని మనసారా అభినందిస్తున్నాను.
మీరు కూడా ఎందుకు ఇలా వాసే ప్రయత్నం చేయ కూడదు? ఒక్కసారి ఆలోచించండి.
జైహింద్.

జ్ఞానమార్గంలో పదేళ్ళలోకి అడుగు పెట్టిన శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరవు గారికి అభినందనలు.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ మిత్రులారా!
ఈ రోజు ‘తెలుగు అధ్యాత్మరామయణ’ కర్త పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు అరువది తొమ్మిది సంవత్సరములు పూర్తి చేసుకొని 70వ సంవత్సరము లోనికి అడుగిడుచున్నారు. 
జ్ఞాన తేజముతో పదేళ్ళు పూర్తి చేసిన శ్రీ నేమానివారిని మనసారా అభినందిద్దాము.
ఆర్యా! పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారూ! అభినందనలు.
జ్ఞానజ్యోతిప్రపూర్ణ పూర్ణ హృదయా! కల్యాణ భావోజ్వలా!
ప్రాణోద్భాసిత దివ్య తేజ విలసత్ ప్రఖ్యాత దైవంబ! మీ
కీనాడర్వది తొమ్మిదేండ్లు గడిచెన్ హృద్యంబుగా డబ్బదిన్
మేనందాల్చిన మీకు మేలు కలుగున్. మీ భావనల్ పండుతన్.
మీకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
భువన విజయ ప్రదర్శనానంతరము ప్రదర్శించిన బాల బాలికలకు, నిర్వాహకులకు మీ రు ప్రసాదదించిన అధ్యాత్మ రామాయణ గ్రంథములను మీ పేరున బహూకరింప గలనని తెలియ జేయుచున్నాను.
జైహింద్.


17, ఫిబ్రవరి 2013, ఆదివారం

నేడు రథ సప్తమి సూర్య జయంతి సందర్భముగా అందరికీ ఆరోగ్యాభివృద్ధి కలుగునుగాక.

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
నేడు రథ సప్తమి. సూర్యభగవానుని జన్మదినముగా పురాణాలు చెప్పుచున్నవి.
సూర్యభగవానుని అనుగ్రహము పొందు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు సమకూరునని పెద్దల మాట.
ఈ ప్రకృతి అంతా సూర్యభగవానునిపై ఆధారపడి నడుచుచున్నది. అట్టి సూర్యభగవానుని అనుగ్రహము మీ అందరికీ లభించవలెనని, మీరంతా శారీరక, మానసిక ఆరోగ్యవంతులై  సద్వృద్ధికి మూలమవవలెనని, మనసారా కోరుకొనుచుంటిని.
ఈ సందర్భముగా కళింగాంధ్ర లో సూర్య జయంతి శీర్షికతో వెలువడిన  వ్యాసమును ఈ క్రింది
http://kalingaandhra.blogspot.in/2013/02/blog-post_16.html?m=1
ద్వారా చూడతగినది.
సప్తాశ్వంబులు లాగు నట్టి రథమున్, జక్రం బుతానొక్కటే,
ప్రాప్తంబైన ననూరు డాకసమునన్ వర్తించు సారధ్యమున్
సుప్తంబందున నున్న జీవతతికిన్ సూర్యుండు మేల్కొల్పగా
సప్తోద్భాసిత వర్ణ భాస రథియై సంచారమున్ సల్పెడున్.
అట్టి సూర్యుని సత్కృప నలరుడయ్య.
ఆయురారోగ్యములతోడ నసదృశమగు
గుణము ధాన్యము సంపత్తి ధనము లొంది
సుఖములందుచు భూమిపై శోభిలుడయ!
శ్రీ నేమాని వారు ఇలా అభినందన పూర్వకముగా వ్రాస్తున్నారు.
సూర్య స్తోత్రము:
Greetings to all.
ఆదిదేవాయ లోకాప్తాయ సూర్యాయ
దినకరాయ ఖగాయ తేనమోస్తు
వేదస్వరూపాయ బిసరుహమిత్రాయ
త్రిభువన సాక్షిణే తేనమోస్తు 
ఏకచక్ర రథాయ లోకైకరక్షాయ
త్రివిధ తాపహరాయ తేనమోస్తు
బ్రహ్మవిష్ణీశ్వరత్రయ తత్త్వవిభవాయ
దేవసంస్తుత్యాయ తేనమోస్తు
పద్మినీ వల్లభాయ శోభాకరాయ
వైనతేయ ప్రచోదిత వాహనాయ
అరుణ కిరణాయ తిమిర సంఘాపహాయ
శ్రితజన హితాయ ప్రహితాయ తేనమోస్తు
Nemani Ramajogi Sanyasi Rao
నమస్తే.
జైహింద్.

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

‘మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ. నన్ను నమ్ముమా’ మీ పూరణము మనోరంజకమగును గాక.

4 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులార! అభివాదములు.
‘మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ. నన్ను నమ్ముమా!
ఈ సమస్యా పూరణమున మీరు కనబరొచే నిపుణత రచయితలకు మార్గదర్శము కాగలదని ఆశించుచుంటిని.   ద్వ్యక్షర గతితో  మీ పూరణము సాగినచో మిక్కిలి మనోరంజకముగా నుండ గలదని అశించు చున్నాను. నేనును పూరింప ప్రయత్నించాను.
చూడండి.

మామన మేన మామె. నను మన్నన నెన్ను మనన్ మనమ్ము. మా
మామ ననూన మన్ననను మన్మనమున్ మును మున్నె మొన్ననే
నేమమునెన్ను నన్ను మననీనని మామ మనమ్మునెన్నె. మా
మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

15 ఫిబ్రవరి 2013 4:36 PM
 రాజేశ్వరి నేదునూరి అన్నారు...
ఏమని జెప్పుదున్ వినగ నీకభి మానము పెంపు జేయగా
నామది నిండుగా దెలిపి నౌరుగ మెప్పును పొంద గోరితిన్
నీమము వీడి నెమ్మికను నేరము లెంచక సంత సంబునన్
మామమ నమ్మునున్న ననుమానము మానుము నన్ను నమ్ముమా !
మీ పూరణముల కొఱకు ఎదురుచూస్తున్నాను.


జైహింద్.

14, ఫిబ్రవరి 2013, గురువారం

బకింగ్హాంపేలెస్లో వేద మంత్రములను సాధన చేయుచున్న బ్రిటిష్ బాలబాలికలు.

3 comments

జైశ్రీరామ్.
ప్రియ మిత్రులారా! వైదిక సాంప్రదాయముపైన వేద మంత్రాదులపైన ఆసక్తి కనపరచుచు సాధన చేయుచున్న బ్రిటిష్ బాల బాలికలను చూడండి. అట్టి సత్ సంస్కృతికి మూలమైన భారత దేశములో పుట్టిన మనము ఏమి చేయ లేకపోతున్నామో ఏమి చెయ్య వలసి ఉందో ఒక్కమారు మనసుపెట్టి ఆలోచించి అవశ్యాచరణీయమును ఆచరించడానికి ఉద్యుక్తులు అవవలసిన అవసరమెంతైనా ఉంది.
విన్నారు కదా? మన భారతీయులలో ఎందరున్నారు ఇలా శిక్షణనిస్తున్నవారు కాని, శిక్షణ పొందుచున్నవారు కాని. ఒక్కమారు ఆలోచించుకోవాలి
జైహింద్.

13, ఫిబ్రవరి 2013, బుధవారం

శ్రీ వల్లభ వఝల కృత గజ బంధము.

1 comments

జైశ్రీరామ్.
సాహితీప్రియులారా! శ్రీ వల్లభ వఝలకృత గజబంధ ఆటవెలదిని తిలకించండి.
శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తికవి వరుల కృషి కడుంగడు ప్రశంసనీయము. 
వారికి హృదయ పూర్వక అభినందనలు.
జైహింద్.

శ్రీ భాస్కరానంద నాథ ఇలా తెలియ జేస్తున్నారు.

4 comments

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా!
శ్రీ భాస్కరానందనాథ సమాజ శ్రేయస్కాములై ఈ క్రింది విషయాలను సూచించారు.
నమ్మినవారికి అమ్మ అండ దండలు మెండుగా ఉండునని భావిస్తూ ఆ వివరణ మీ ముందుంచుచుంటిని.
15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి
జగన్మాత ఆవిర్భవించిన రోజు. మహత్తరమైన రోజు. రాక్షసులను సంహరించడానికి  తానూ అగ్నిగుండం లో నుంచి అవతరించినది.
ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై వుండే రోజు. అందరూ చక్కగా శ్రీ లలితా సహస్రనామములు చదువుకొని, ఆ తల్లికి పంచ పూజలు చేసి, ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలసినదిగా మనవి.
ఈ రోజు అమ్మ బాల రూపములో వుంటుంది, బాలలను పూజించండి.
 25-02-2013  - మాఘ పౌర్ణమి 
ఈ రోజు అమ్మ తన పరిపూర్ణ స్వరూపమతో, చతుషష్టి కళలతో లలితా త్రిపుర సుందరిగా, శ్రీ రాజ రాజేశ్వరిగా, శ్రీమత్సింహాసనేశ్వరీ గా పున్నమి వెలుగులో, చంద్ర బింబములో కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు
సంసిద్దురాలై వుంటుంది. ఈ రోజు అమ్మ పెద్ద ముత్తైదు రూపములో వుంటుంది, కావున ఈ రోజు ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువును పూజించండి. ఎవరు కనిపించినా వెంటనే పసుపు, కుంకుమలను, వస్త్రములను  సమర్పించండి. పౌర్ణమి నాడు అమ్మ విశేష కృపతో, ప్రేమతో  నిండి వుంటుంది, అడిగిన వారికీ అడిగినట్లుగా అన్నీ తీరుస్తుంది. ఈ రోజు అమ్మ నవ్వును చంద్ర బిమ్బములో చూచిన వాడు ధన్యుడు.
ఈ రోజు అందరూ ఆ తల్లికి పంచ పూజలు చేసి, ఐదు సార్లు లలిత సహస్రనామ పారాయణ చేయవలెను. అలా చేసిన వారికి,
యత్రాస్తి భోగోన చ  తత్ర మోక్షః 
యత్రాస్తి మోక్షో న చ తత్ర భోగః 
శ్రీ సుందరీ సేవన తత్పరాణాం
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ 
నిష్కామముగా పారాయణ చేసిన వారికి బ్రహ్మ జ్ఞానము, ధనార్ధికి ధనము, కీర్తిని కోరువారికి కీర్తిని, విద్యను కోరువారికి విద్య, భోగము కోరుకోనువారికి భోగము, మోక్షము కోరుకోనువారికి మోక్షము సిద్ధించును.
అందరూ ఆ తల్లి యొక్క పరి పూర్ణ అనుగ్రహమును పొందెదరు గాక. మాయను తొలగించి బ్రహ్మ విద్యను ప్రసాదించే తల్లి ఈ తల్లి.
అమ్మ ఉపాసన మొదలు పెట్టాలను కొనే వారికి మంచి సుదినము ఈ రోజు. ఆ చిత్కళ దొరికేరోజు ఈ రోజు. అమ్మ కాళ్ళు పట్టుకోండి, మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు.
జగత్తు అంతా అమ్మ మయం . అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
చూచారు కదండి.
నమస్తే.
జైహింద్.

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఈ సమస్యను పూరించే సమర్థులు మీరు కాక మరెవరు?

9 comments

జైశ్రీరామ్.
ప్రియ ఆంధ్రామృతాభిమానులారా!
ఈ క్రింది సమస్యను మీరైతే సున్నాయాసంగా పూరించ గలరని నమ్ముతున్నాను. వ్రాసి పంపండి.
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!
నా పూరణమును వ్యాఖ్యలో పరికించండి.
జైహింద్.

11, ఫిబ్రవరి 2013, సోమవారం

శ్రీ వల్లభవఝలవారి ధనుర్ బంధ, అష్టదళపద్మాష్టదిగ్బంధ రచనలు.

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! నమస్సులు.
శ్రీ వల్లభ వఝలవారి నిరుపమాన బంధకవితలు తిలకించండి.
శ్రీ వల్లభవఝలవారికి ధన్యవాదములు.
జైహింద్

9, ఫిబ్రవరి 2013, శనివారం

శ్రీ అనంత కృష్ణ గారికి చంపక - కంద - గీత - గర్భ సీసము.

3 comments

జైశ్రీరామ్.
సుగుణాకరులారా! ఈ రోజు ఎంతో ఆనందప్రదమైనది. అనంత భక్తిభావ సంపన్నులైన శ్రీ అనంత కృష్ణ (ఉన్నత న్యాయస్థానము న్యాయవాది)కవి  నాపై అవ్యాజానురాగముతో మా గృహమునకు విచ్చేసిరి.
వారి భక్తి మనోజ్ఞమైన శతకద్వయము(వరసిద్ధి వినాయక శతకము, ౨.లలిత శతకము)ను నాకు ప్రసాదించి, ఆయా శతకములందలి వారి మనోగత భావములను వివరించి మహదానందమును కలిగించిరి. వారి ప్రేమానురాగాలకు ప్రతిస్పందిచి పలుకుటకు నాకు మాటలు కరువైనవి ఐనను, కృతజ్ఞతా పూర్వకముగా వారినుద్దేశించి నా మనోగతమును ఈ విధముగ వ్యక్తపరచితిని.
సుహృన్మణి అనంత కృష్ణ గారూ! నమస్సులు.
మీ హృదయాకాశసముద్భవానంత సత్కవితామృతఝరి నను అమందానందతుందులిత హృదయునిగా చేసినది.
చంపక - కంద - గీత - గర్భ సీసము:-
వర గుణ గణ్యుడా! పరమ భావన మీ ధనవ్రాతమందువా!  నవ్య తేజ! 
సరస కవీశ మీ శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటినే! సదయ హృదయ!
ధర జన సేవ్యమై పరగు ధారణ చూపెడు ప్రాభవంబురా! సుప్రసిద్ధ!
మరువనురానినున్ నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవగా! రవిప్రకాశ.
వరలు సిద్ధి వినాయకు భక్తి గొలిచి,
లలిత పదములు మదిగని కొలిచి, గురువు
మహిత చంద్ర కళాధరు మన్ననమున
జ్ఞాన తేజంబునన్ వెల్గు కవివి నీవు.
చ:- వర గుణ గణ్యుడా! పరమ భావన మీ ధనవ్రాతమందువా! 
సరస కవీశ మీ శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటినే! 
ధర జన సేవ్యమై పరగు ధారణ చూపెడు ప్రాభవంబురా! 
మరువనురానినున్ నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవగా! 
క:- గుణ గణ్యుడా! పరమ భా
వన మీ ధనవ్రాతమందువా! సరస కవీ
జన సేవ్యమై పరగు ధా
రణ చూపెడు ప్రాభవంబురా! మరువనురా!
గీ:- పరమ భావన మీ ధనవ్రాతమందు! 
శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటి! 
పరగు ధారణ చూపెడు ప్రాభవంబు! 
నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవ!
ఈ సహృదయుని శతకములందలి పద్యమాణిక్యములను అవకాశమున్నపుడెల్ల పరికింప గలము.
వారి రాకకు మరొక్కమారు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను.
జైహింద్

‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’ కందంలో పూరించగలరు.

14 comments

జైశ్రీరామ్.
ప్రియ పాఠకపుంగవులారా!
పద్యరచనాసక్తి పరిఢవిల్లుతున్న వీ హృదయాలను చూస్తుంటే ముచ్చటగా ఉంది.
ఈ పర్యాము ఒక చిన్న నూతన గతిలో రచనలు పూరణలు చేసే  మార్గమున సమస్యాపూరణ చేసే ప్రయత్నం చేద్దామా?
ఈ క్రింది సమస్య తేటగీతిలో ఉంది. ఈ సమస్యను తేటగీతిలో కాకుండా కందంలో పూరించాలి.
చూడండి సమస్యను.
‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’
ఈ సమస్యకు నా పూరణమును వ్యాఖ్యలో చూడనగును.
జైహింద్.

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సమస్య నాది. పూరణ మీది. ‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’

8 comments

జైశ్రీరామ్.
నిరుపమాన సాహిత్యాభిమానులారా!
ఈ క్రింది సమస్యకు చక్కని పూరణమును మీరైతే సునాయాసంగా అందజేయ గలరనే నా విశ్వాసం వ్యర్తము కాదు. ప్రయత్నించగలరు.
‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’ 
నా పూరణను వ్యాఖ్యలో చూడనగును.
జైహింద్.


5, ఫిబ్రవరి 2013, మంగళవారం

‘కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా’ ఈ సమస్యను మీరైతే సముచితంగా పూరిస్తారు.

7 comments

జై శ్రీరామ్.
సాహితీ బంధువులారా!
ఈ క్రింది సమస్యాపూరణము మీరైరే సముచితముగా చేయగలరని నా విశ్వాసము.
కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా.
ఈ సమస్యకు నా పూరణమును వ్యాఖ్యానంలో చూడ గలరు.
జైహింద్.

శ్రీ వల్లభవఝల అప్పల నరసింహం విరచిత బంధ కవితలు.

2 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝలవారి చిత్రబంధ కవితలు మిమ్ముల నలరింపక మానవు. తిలకించండి.
ఇంతటి నిపుణతను కనపరచుతూ బంధకవితలను వెలయించుచున్న శ్రీ వల్లభ వఝల వారికి అభినందనలు.
జైహింద్

4, ఫిబ్రవరి 2013, సోమవారం

అశ్వత్థ వృక్ష(రావి చెట్టు) ప్రదక్షిణ విధి, ఆవశ్యకత - వ్రాసినది శ్రీ జనార్థన శర్మ

3 comments

జైశ్రీరామ్.
మిత్రులారా! ఏ పుట్టలో ఏ పాముంటుందో, ఏ విషయ సంగ్రహణం వల్ల ఏ సత్ఫలముంటుందో అంత సులభంగా అర్థం కాదు మనకు.శ్రీ జనార్థన శర్మగారు వ్రాయగా  శ్రీ రాజశేఖరుని విజయ శర్మ అంద జేసిన అశ్వత్థవృక్ష ప్రదక్షిణావశ్యకత, ప్రదక్షిణ విధానము వివరములు.
అశ్వత్థ ప్రదక్షిణ విధి
శనివారమునాడు శ్రీ శనైశ్చర దేవతా పీడా పరిహారమునకై అశ్వథ్థ ప్రదక్షిణము చెప్పబడినది.
అశ్వథ్థ వృక్షమును ఒక్క శనివారమునాడు మాత్రమే ముట్టుకోవచ్చును.
అశ్వథ్థ ప్రదక్షిణ , త్రిమూర్తుల సేవలలో ఒకటి.
ఉదకశాంతి మంత్రములలో వచ్చు " నమో అస్తు సర్పేభ్యో యేకే చ పృథివీ మను .... " అను మంత్రము లోని ’సర్పము ’ అను శబ్దమునకు ’ సూర్య కిరణము ’ అని కూడా అర్థమున్నది. ( ఈ మంత్రము రాహు గ్రహ ప్రత్యధిదేవత మూల మంత్రము కూడా )
అశ్వత్థ వృక్షము(రావి చెట్టు) ఆకులనుండీ ప్రసరించే సూర్య కిరణాలు గర్భవతుల పై పడినచో ఆ పుట్టబోయే వారికి ’ కాల సర్ప దోషము ’ కలగదు. వారి జాతకములో కాల సర్పదోషము ఉండదు. అందుకే , గర్భవతులు రావి చెట్టు ప్రదక్షిణము చేయవలెనని విధించినారు.
ప్రదక్షిణ చేయునపుడు చెప్పవలసిన
శ్లోకము:- మూలతో బ్రహ్మ రూపాయ - మధ్యతో విష్ణు రూపిణే
అగ్రతో రుద్రరూపాయ - వృక్షరాజాయ తే నమః.
పై శ్లోకము చెప్పుచూ యథాశక్తి  7 - 12 - 24 - 48 - 108   సార్లు ప్రదక్షిణలు చేసి అనంతరము కింది శ్లోకము చెప్పుచూ ప్రదక్షిణ సంఖ్యానుసారముగా అశ్వథ్థ వృక్షమునకు నమస్కరించవలెను.
శ్లో:- అశ్వత్థ హుతభుక్ వ్యాసో గోవిందస్య సదాశ్రయః 
అశేషం హర మే శోకం వృక్షరాజ నమోஉస్తుతే.
నమస్తే.
జైహింద్.

2, ఫిబ్రవరి 2013, శనివారం

దత్త పది:- మోదము - రోదము - వేదము - జూదము . భారతం లోని కథ. స్వేఛా ఛందములో వ్రాయ గలరు.

6 comments

జైశ్రీరామ్.
దత్త పది:-
మోదము - రోదము - వేదము - జూదము . 
భారతం లోని కథను స్వేఛా ఛందములో వ్రాయ గలందులకు మనవి.
నా పూరణను వ్యాఖ్యలో చూడ గలరు.
జైహింద్.

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

జయతు జయతు దేవో దేవకీ నందనోஉయం

6 comments

జైశ్రీరామ్.
శ్లో:-
జయతు జయతు దేవో దేవకీనందనోஉయం 
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:!
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో 
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్ద:!!  
గీ:-
దేవకీ నందనా! కృష్ణ దేవ! జయము.
వృష్ణి వంశ ప్రదీప! శ్రీ కృష్ణ జయము.
కోమలాంగాశిత బాల గోప జయము.
పృథ్వి దుర్భార దూర శ్రీ కృష్ణ జయము.
భావము:-
దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగు గాక! మేఘశ్యామలుడు, కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!
జైహింద్.

(దత్త పది)"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధాన పరచండి.

12 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
దత్త పది:-
"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ పూరించి వ్యాఖ్యగా పంప గలరని ఆశింతును.
నా పూరణను వ్యాఖ్యలో చూడగలరు.
జైహింద్.