గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మధురోక్తుల మాతృ భాష

జైశ్రీరామ్.
ప్రపంచ మాతృ భాషా దినోత్సవము సందర్భముగా తెలుగు సాహిత్య కళా పీఠం నిర్వహించిన 
కవి సమ్మేళనము సందర్భముగా సమర్పితము.
మధురోక్తుల మాతృ భాష
:-  చిం తా  రా  కృ ష్ణా  రా వు.  సె ల్ 9247238537.,  chinta.vijaya123@gmail.com
శా:- శ్రీమద్విశ్వ మనోజ్ఞ రూప రచనా జిజ్ఞాస సంశోభితుల్,
ప్రేమోద్దీపన వాఙ్నిధానులును, సుప్రీతాత్ములున్, సాహితీ
స్తోమోజ్జ్వాలన దీక్షితుల్, వినుత సచ్ఛుద్ధాంతరంగుల్, సభన్
క్షేమంబున్ విరచింప నుండి రిచటన్. కీర్తింతు నే వారలన్. 1.
a.కంద b.గీత గర్భ ఉత్పలమాల:-
శ్రీ కమనీయ భావన సుసేవ్య మహాత్ముల వాక్ సుధారలౌ
శ్రీ కవితల్ సుధా మధుర చిత్ర ప్రబంధ రమా నిధానముల్.
నా కమలాప్తులౌ ఘనులనాద మునీంద్రులగౌరవింతు ధా
రా కవితన్. ప్రథాన సమ రాట్కవి చంద్రుల కంజలింతు నే. 2.
a.ఉత్పల గర్భస్థ కందము:- 
కమనీయ భావన సుసే  -  వ్య మహాత్ముల వాక్ సుధార లౌ శ్రీ కవితల్.
కమలాప్తులౌ ఘనులనా  -  ద మునీంద్రులగౌరవింతు ధారా కవితన్.
b.ఉత్పల గర్భస్థ గీతము:- 
వన సుసేవ్య మహాత్ముల వాక్ సుధార   -  మధుర చిత్ర ప్రబంధ రమా నిధాన.
ఘనులనాద మునీంద్రులగౌరవింతు  -  నసమ రాట్కవి చంద్రుల కంజలింతు.
శా:- కంఠంబెత్తుచు పాడు పద్య కవితా కంఠస్థ సాహస్రుఁడౌ
కంఠీ రావ మనోజ్ఞ మూర్తి మన  చిక్కా రామ దాసే, మహా
కంఠేకాలుఁడు. విన్న వీని ఘనమౌ గాత్రంబు నీ తెల్గులో
గంఠేరుండును భాగ్యవంతుఁడగు. శంఖం బందునా కంఠమున్.. 3.
a.అవసాన గీతాంతర్గత కంద యుత b.చంపక - c1&c2.ద్వివిధ కంద ద్వయ d.గీత గర్భ, 
సీసము:-
క్షితి తెలుగున్ శుభా కృతిని శ్రీనిడు శార  -  ద క్షేమ దాయియే తలచి చూడ.
స్తుత మతి యైన యీ సుజన శోధిత భాష  -  యె స్తుత్య వారి ధీ యిలను సుగుణ
యుత. వెలుగే కదా అతిశ యోజ్వలి తాంధ్ర  -  ము ధ్యాన యుక్త వాగ్ భూరి సుఖద.
ధృతి నుతయే సుమా! వ్రత సు ధీరత నేర్వ  -  ర ! భ్రాంతి గ్రోల రారా తెలుంగ !
గీ:- తెలుగు మధు సేవనా పర తెలుగు కవులు 
కావ్య జగతి తేలుదురటగాతెలియుడు
సుమధుర తెలుగీ యిలలోన ప్రముద కరమ  
గు నినుని విధమున నలర మనుదు మిమ్ము.  4.
a. సీసావసాన గీత గర్భస్థ కందము:-
తెలుగు మధు సేవనా పర  -  తెలుగు కవులు కావ్య జగతి తేలుదురటగా?
తెలియుడు సుమధుర తెలు గీ  -  యిలలోన ప్రముద కరమగు నినుని విధమునన్.
b. సీస గర్భస్థ చంపకమాల :-
క్షితి తెలుగున్ శుభా కృతిని శ్రీనిడు శారద క్షేమ దాయియే
స్తుత మతి యైన యీ సుజన శోధిత భాషయె స్తుత్య వారిధీ
యుత వెలుగే కదా అతిశ యోజ్వలి తాంధ్రము ధ్యాన యుక్త వాగ్
ధృతి నుతయే సుమా! వ్రత సు ధీరత నేర్వర ! భ్రాంతి గ్రోల రా!
c1. సీస గర్భస్థ ద్వివిధ గతి కందము :- 
తెలుగున్ శుభా కృతిని శ్రీ  -  నిడు శారద క్షేమ దాయియే స్తుత మతియై
వెలుగే కదా అతిశ యో  -  జ్వలి తాంధ్రము ధ్యాన యుక్త వాగ్ధృతి నుతయే.
c2. సీస గర్భస్థ ద్వివిధ గతి కందము :- 
మతి యైన యీ సుజన శో  -  ధిత భాషయె స్తుత్య వారి. ధీ యుత. వెలుగే .
నుతయే సుమా! వ్రత సు ధీ  -  రత నేర్వర ! భ్రాంతి గ్రోల రా! క్షితి తెలుగున్ !
d.సీస గర్భస్థ గీతము :- కృతిని శ్రీనిడు శారద క్షేమదాయి. - సుజన శోధిత భాషయె స్తుత్య వారి.
అతిశ యోజ్వలి తాంధ్రము ధ్యాన యుక్త.  -  వ్రత సు ధీరత నేర్వర ! భ్రాంతి గ్రోల. 
సర్వలఘు సీసము:-
తెలుగుననె వెలుగునదితెలియఁ దగు తొలి పలుకు – పలుకు పలుకుల వెలుగు చిలుకు తెలుగు.
తొలి జనని పలుకునదిపలుకఁగను తెలుపునది - సులభముగ తెలియునది తొలిగ తెలుగు.
కొలువులను వెలుగునదితెలుగు కవి పలుకునది - పులకలను గొలుపునది తెలుగు వెలుగు.
పలుకులను లలిత గతి  తెలుగు సుధ లొలుకునది - తెలియనిది దెలుపునది తెలుగు పలుకు.
గీ:- తెలుగు వెలుగు జిలుగు పలుకుల కననగు.  
తెలుగు పలుకు మధువు లొలుకు నిలను.
తెలుగు తనము ఘనము తెలియుముతెలుపుము.  
తెలుగు తనము ధరణి వెలుగ వలయు.  5.
కం:- పంచేంద్రియముల రూపున  -  సంచిత ఫల మనుభవింప జన్మించగ బో
ధించెడి, పలికెడి భాషగ  -  నుంచెను తెలుగును మురారి. యుత్తమ మనుచున్.  6.
:- పుణ్య మూర్తి తల్లి పురిటి నొప్పుల నోర్చి - జన్మ నీయ మనకు చచ్చి బ్రతుకు.
అట్టి తల్లి భాష కిట్టదా మనలకు ?- పట్టు పట్టి నేర్చు పనియు లేదె ! 7.
:- మాతృ మూర్తి మిన్నమాతృ భాషయు మిన్న.  -  మతృ దేశ మెన్న మనకు మిన్న.
మాతృ మూర్తి వీడి, మాతృ భాషను వీడి, - పరుల నాశ్రయించు బ్రతు కదేల? 8.
గీ:- మాతృ దేశము విలువను మరువబోకు.  -  మాతృ దేవిని కనుమయ్య మన్ననమున.
మాతృ భాషను విడువక మాట లాడు.  -  మాతృ మూర్తుల మన్నించి మహిమ గొనుమ. 9.
గీ:- ధీర సాహస్ర పద్య కంఠీరవుండ ! - సఖ్య శ్రీ చిక్క రామ దాసాఖ్య ఘనుఁడ !
తెలుగు సాహిత్య శ్రీ కళా దీప్త పీఠ - మాన్యతాధార! మీకు సన్మంగళములు.  10.   
స్వస్తి
జైహింద్.                
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

Sree Ramakrishna Rao garu!
CONGRATULATIONS.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Sree Kodavanti Subrahmanyam
గారి స్పందన.

తెలుగువారమండి
ప. తెలుగువారమండీ మనము తెలుగు వారమండీ
తెలుగుదనముతో తేజరిల్లిన తెలుగు వారమండీ
1. తెనెలూరెడి తెలుగు తియ్యని తెలుగు
స్వర్ణ కాంతులు జల్లు స్వచ్ఛమైన తెలుగు
సప్త స్వరములతో మధురమైన తెలుగు
మృదు మధుర భాషణల ముచ్చటైన తెలుగు
వీనుల విందై విఖ్యాతినొందిన తెలుగు
2. కూచిమంచి (తిమ్మ)కవి రామాయణము తెలుగు
నన్నయ తిక్కనల భారతము తెలుగు
పోతనామాత్యుని భాగవతము తెలుగు
దిగ్గజమ్ముల దివ్య కావ్యములు తెలుగు
అది ఇది అన్నియు యెన్నెన్నియో తెలుగు
3. దేశ భాషలలో లెస్సయైన తెలుగు
దేశదేశముల పరిఢవిల్లిన తెలుగు
దశదిశల వ్యాపించి దద్దరిల్లిన తెలుగు
తెలుగు వెలుగే వెలుగు దివ్యకాంతుల తెలుగు
వేవేల జన్మలకు వెలుగు వెలుగు తెలుగు.

మిస్సన్న చెప్పారు...

మధురోక్తుల మాతృ భాష
బుధులకు హితమై రహించె పుడమిని తెలుగై
దధి ఘృత నవనీతము లవి
యధిక మ్మేరీతి తెలుగు నందలి రుచికిన్?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కవి సమ్మేళన చిత్ర కవితలను మా కందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.