గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2013, బుధవారం

శ్రీ భాస్కరానంద నాథ ఇలా తెలియ జేస్తున్నారు.

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా!
శ్రీ భాస్కరానందనాథ సమాజ శ్రేయస్కాములై ఈ క్రింది విషయాలను సూచించారు.
నమ్మినవారికి అమ్మ అండ దండలు మెండుగా ఉండునని భావిస్తూ ఆ వివరణ మీ ముందుంచుచుంటిని.
15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి
జగన్మాత ఆవిర్భవించిన రోజు. మహత్తరమైన రోజు. రాక్షసులను సంహరించడానికి  తానూ అగ్నిగుండం లో నుంచి అవతరించినది.
ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై వుండే రోజు. అందరూ చక్కగా శ్రీ లలితా సహస్రనామములు చదువుకొని, ఆ తల్లికి పంచ పూజలు చేసి, ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలసినదిగా మనవి.
ఈ రోజు అమ్మ బాల రూపములో వుంటుంది, బాలలను పూజించండి.
 25-02-2013  - మాఘ పౌర్ణమి 
ఈ రోజు అమ్మ తన పరిపూర్ణ స్వరూపమతో, చతుషష్టి కళలతో లలితా త్రిపుర సుందరిగా, శ్రీ రాజ రాజేశ్వరిగా, శ్రీమత్సింహాసనేశ్వరీ గా పున్నమి వెలుగులో, చంద్ర బింబములో కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు
సంసిద్దురాలై వుంటుంది. ఈ రోజు అమ్మ పెద్ద ముత్తైదు రూపములో వుంటుంది, కావున ఈ రోజు ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువును పూజించండి. ఎవరు కనిపించినా వెంటనే పసుపు, కుంకుమలను, వస్త్రములను  సమర్పించండి. పౌర్ణమి నాడు అమ్మ విశేష కృపతో, ప్రేమతో  నిండి వుంటుంది, అడిగిన వారికీ అడిగినట్లుగా అన్నీ తీరుస్తుంది. ఈ రోజు అమ్మ నవ్వును చంద్ర బిమ్బములో చూచిన వాడు ధన్యుడు.
ఈ రోజు అందరూ ఆ తల్లికి పంచ పూజలు చేసి, ఐదు సార్లు లలిత సహస్రనామ పారాయణ చేయవలెను. అలా చేసిన వారికి,
యత్రాస్తి భోగోన చ  తత్ర మోక్షః 
యత్రాస్తి మోక్షో న చ తత్ర భోగః 
శ్రీ సుందరీ సేవన తత్పరాణాం
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ 
నిష్కామముగా పారాయణ చేసిన వారికి బ్రహ్మ జ్ఞానము, ధనార్ధికి ధనము, కీర్తిని కోరువారికి కీర్తిని, విద్యను కోరువారికి విద్య, భోగము కోరుకోనువారికి భోగము, మోక్షము కోరుకోనువారికి మోక్షము సిద్ధించును.
అందరూ ఆ తల్లి యొక్క పరి పూర్ణ అనుగ్రహమును పొందెదరు గాక. మాయను తొలగించి బ్రహ్మ విద్యను ప్రసాదించే తల్లి ఈ తల్లి.
అమ్మ ఉపాసన మొదలు పెట్టాలను కొనే వారికి మంచి సుదినము ఈ రోజు. ఆ చిత్కళ దొరికేరోజు ఈ రోజు. అమ్మ కాళ్ళు పట్టుకోండి, మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు.
జగత్తు అంతా అమ్మ మయం . అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
చూచారు కదండి.
నమస్తే.
జైహింద్.
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

శ్రీమాత! శ్రీసదాశివ పతివ్రత! మదిన్
ధ్యానింతు నీదు తత్త్వ ప్రశస్తి
శ్రీమన్మహారాజ్ఞి! సింహాసనేశ్వరీ!
అర్చింతు నీదు పాదాబ్జములను
దేవకార్య సముద్యతా! వహ్నికుండజా!
నీ వైభవమ్మును నే దలంతు
బాలభాను సహస్ర భాసమానా! నీకు
వందనమ్ము లొనర్తు భక్తిమీర
అంబ! గంగా! భవాని! గాయత్రి! కాళి!
లక్ష్మి! రాజరాజేశ్వరీ! లలిత! వాణి!
శ్యామలా! బాల! యని నీదు నామములను
నిత్య పారాయణ మొనర్తు నెమ్మనమున

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

పండిత శ్రీ నేమాని గురువర్యుల వాక్సుధారసధారలు అమ్మకు నిత్య సంసేవనములు.గురువులకు ధన్యవాదములు.
పండిత శ్రీ నేమాని గురువర్యుల వాక్సుధారసధారలు అమ్మకు నిత్య సంసేవనములు. శ్రీ గురువులకు శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి ప్రణామములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మ మనోజ్ఞ తత్వము మహాత్ములు సన్యసిరావుగారికిన్
క్రమ్మె మనంబునంతటను. కావున నిత్య ప్రసన్నచిత్తులై
యమ్మకు తృప్తి గొల్పరె మహాద్భుతసత్కవితామృతంబుతో.
నమ్మనుజేశ్వరున్ గొలుతునంచితరీతి మహోత్పలమ్ముతో.
శ్రీ నేమాని కవివరులకు కృతజ్ఞతలు.
వారి కవితామృతమును చవిచూచి, ప్రశంసించిన శ్రీ శుబ్రహ్మణ్యశర్మగారికి ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అమ్మ కటాక్ష వీక్షణ ముల నీడన సుఖ శాంతులతో నిండి ఉండా లని నమస్కృతులతో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.