గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సమస్య నాది. పూరణ మీది. ‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’

జైశ్రీరామ్.
నిరుపమాన సాహిత్యాభిమానులారా!
ఈ క్రింది సమస్యకు చక్కని పూరణమును మీరైతే సునాయాసంగా అందజేయ గలరనే నా విశ్వాసం వ్యర్తము కాదు. ప్రయత్నించగలరు.
‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’ 
నా పూరణను వ్యాఖ్యలో చూడనగును.
జైహింద్.


Print this post

8 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చ:-
మదిని మనోజ్ఞ భావనలు మాధవు సన్నిధి చేర గోరి .తా
మదిని కలంచు లౌకికము మాయము చేయగ వేడె దైవమున్.
చెదరగ జేసె నైహికము చిన్మయ రూపము గాంచ జేయగా.
చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగులో వ్యాఖ్యలకు మీ స్పందన వెనువెంటనే ఉంచిన ఎడల సాహితీప్రియులకు మోదము కాగలదని నా భావన.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔను నిజమేసుమండీ! అజ్ఞాత గారూ! మీరు చెప్పే వరకు నాకు ఆ దృష్టే లేకపోవడం బాధాకరం. సరే చక్కని సూచన చేసిన మీకు నా ధన్యవాదములు. ఇటుపైన మీ సూచనను తప్పక పాటించే ప్రయత్నం చేస్తానండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కుదురుగ దైవ చింతనము కోరి భజించుట మోక్ష మంచు తా
మదిని మనో వికారముల మైకము నొందక జాగ రూకుడై
మదనుని మోహ పాశమున మాయను గ్రమ్మి మనోజ్ఞ చిత్తుడై
చెదరిన జీవి యయ్యె వెత జెందెను దైవ కృపాభి షిక్తుడై !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

విధికి తలొగ్గి , ధర్మజుడు వేసరి తమ్ములు తాను యోగ్యతా
పథమును దప్పి , కూటికయి బ్రాహ్మణ వేషము దాల్చి వీర్యముల్
చెదిరిన జీవియయ్యె , వెత జెందెను - దైవకృపాభిషిక్తుడై
తుదకు సుయోధనున్ గెలిచి దోర్బలమొప్ప గడించె రాజ్యమున్ .
-----సుజన-సృజన

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ వేంకట రావు గారూ! చాలా చక్కని భావనా పటిమను సూచిస్రోంది మీ పూరణము.
మొదటి పాదంలో తమ్ములు తాను అనుట కంటే తమ్ములతోడ అని అంటే చెదరిన జీవియయ్యె, వెత చెందెను వంటి ఏకవచన సూచక క్రియా ప్రయోగరమ్యంగా ఉంటుందనిపిస్తోందండి నాకు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కయ్యా! వృత్తరచనలో కూడా అద్భుతంగా పట్టు సాధ్స్తున్న మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

అదలుచు పల్కె కౌశికుడయారె! ధరాతలమందు కాంతుమా!
వదలక సత్యమే పలుకు పాలకునిన్ పలుకంగ జేసెదన్
వదలక వానిచే ననృత వాక్యమనంగ నయోధ్య రేడటన్
చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.