గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఫిబ్రవరి 2013, శనివారం

శ్రీ అనంత కృష్ణ గారికి చంపక - కంద - గీత - గర్భ సీసము.

జైశ్రీరామ్.
సుగుణాకరులారా! ఈ రోజు ఎంతో ఆనందప్రదమైనది. అనంత భక్తిభావ సంపన్నులైన శ్రీ అనంత కృష్ణ (ఉన్నత న్యాయస్థానము న్యాయవాది)కవి  నాపై అవ్యాజానురాగముతో మా గృహమునకు విచ్చేసిరి.
వారి భక్తి మనోజ్ఞమైన శతకద్వయము(వరసిద్ధి వినాయక శతకము, ౨.లలిత శతకము)ను నాకు ప్రసాదించి, ఆయా శతకములందలి వారి మనోగత భావములను వివరించి మహదానందమును కలిగించిరి. వారి ప్రేమానురాగాలకు ప్రతిస్పందిచి పలుకుటకు నాకు మాటలు కరువైనవి ఐనను, కృతజ్ఞతా పూర్వకముగా వారినుద్దేశించి నా మనోగతమును ఈ విధముగ వ్యక్తపరచితిని.
సుహృన్మణి అనంత కృష్ణ గారూ! నమస్సులు.
మీ హృదయాకాశసముద్భవానంత సత్కవితామృతఝరి నను అమందానందతుందులిత హృదయునిగా చేసినది.
చంపక - కంద - గీత - గర్భ సీసము:-
వర గుణ గణ్యుడా! పరమ భావన మీ ధనవ్రాతమందువా!  నవ్య తేజ! 
సరస కవీశ మీ శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటినే! సదయ హృదయ!
ధర జన సేవ్యమై పరగు ధారణ చూపెడు ప్రాభవంబురా! సుప్రసిద్ధ!
మరువనురానినున్ నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవగా! రవిప్రకాశ.
వరలు సిద్ధి వినాయకు భక్తి గొలిచి,
లలిత పదములు మదిగని కొలిచి, గురువు
మహిత చంద్ర కళాధరు మన్ననమున
జ్ఞాన తేజంబునన్ వెల్గు కవివి నీవు.
చ:- వర గుణ గణ్యుడా! పరమ భావన మీ ధనవ్రాతమందువా! 
సరస కవీశ మీ శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటినే! 
ధర జన సేవ్యమై పరగు ధారణ చూపెడు ప్రాభవంబురా! 
మరువనురానినున్ నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవగా! 
క:- గుణ గణ్యుడా! పరమ భా
వన మీ ధనవ్రాతమందువా! సరస కవీ
జన సేవ్యమై పరగు ధా
రణ చూపెడు ప్రాభవంబురా! మరువనురా!
గీ:- పరమ భావన మీ ధనవ్రాతమందు! 
శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటి! 
పరగు ధారణ చూపెడు ప్రాభవంబు! 
నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవ!
ఈ సహృదయుని శతకములందలి పద్యమాణిక్యములను అవకాశమున్నపుడెల్ల పరికింప గలము.
వారి రాకకు మరొక్కమారు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను.
జైహింద్
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

పరమాదరమున సేవిం
తురు నిత్యము కవుల పండితులను కదా! శ్రీ
కర చింతాన్వయ చంద్రా!
సరసగుణా! నీకు నాశిషములను గూర్తున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నమస్సులు.
జ్ఞానులు పండితోత్తములు, క్రాంతి పథమ్మును నాకు చూపగా,
శ్రీ నవనీత వాగ్ఝరుల సేవ్య కవిత్వ విశిష్ట తత్వ సు
జ్ఞాన ధనంబు నీయగ, వికాశ మనంబున వచ్చు చుండ, యా
ధీనిధులైన వారిని మదిన్ గని గుల్చుట భాగ్యమే కదా!
అటువంటి మహద్భాగ్యము ఆదైవ కృప లేనిదే లభించదు కదా! మీ ఆశీఃపరంపరా ప్రభావమున నాకట్టి భాగ్యము లభించుచుండుటచే ఆ పరమాత్మనే అతిథ్థ్యభ్యాగతులందు గనుచు సేవించ గల్గుట నా యదృష్టము. నమస్తే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖుల ,పండితోత్తముల , కవన మాధుర్యములను నలుగురికీ పంచి సేవించగల ధన్యులు . సోదరులు చింతావారు ప్రసంస నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.