గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2024, సోమవారం

శ్రీలలితా చంద్రమౌళీశ్వర శతకము. (ఒక్కరోజులో వ్రాసిన శతకము.) రచన : చింతా రామకృష్ణారామకృష్ణారావు

 

 

శ్రీలలితా చంద్రమౌళీశ్వర శతకము

రచన  :  చింతా రామకృష్ణారావు


శ్రితమందార! నమస్కరింతు లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!.

పండితాభిప్రాయములు.

 

శతావధాని  డా.జి.యం.రామశర్మ. M.A., M.Phil., P.Hd.

హైదరాబాదు, చరవాణి సంఖ్య. 9908846177.    

 

శివ సంకల్పమస్తు.

సిద్ధిపేట శివారులోని మిట్టపల్లి ప్రాంతంలో ధార్మిక సాహిత్యాభినివేశి శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి

నిర్విరామకృషి ఫలితంగా వెలసిన శ్రీ లలితా చంద్ర మౌళీశ్వరక్షేత్రం నిత్య శివార్చనలతో భక్తుల

మనస్సులకు దగ్గరవుతూ వర్ధిల్లడం పరమానంద సంభరితం. క్శేత్రానికి సంబంధించి సాహిత్య

సమర్చనలో భాగంగా హృద్యపద్యకవి శ్రీ చింతా రామకృష్ణారావుగారు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా అనే

మకుటంతో మత్తేభ శార్దూలాలను మేళవించి శతకాన్ని రచించడంసుధ్యుపాశ్యమైన విశేషం.

ఆశుకవితలో ఆరితేరిన శ్రీ చింతావారు శివపరమై చింతనతో ఒకే రోజులో ఏక ధాటిగా శతకాన్ని

పూర్తి చేయడం వారి కవితా సమున్మేష ప్రతిభాప్రభకు చక్కటి నిదర్శనం.

     సరళ సుందరమైన శైలీవిన్యాసం కలిగిన శతక పద్యాలలో భక్తిభావన ప్రస్ఫుటంగా

పరిమళిస్తున్నది. శతకంలోని ౬౪వ పద్యంలో

కలలోనైనను నిన్నె గాంచఁగ మదిన్ గాంక్షించు భక్తుండ. నే

నిలలో నీస్మరణంబుఁ జేయుదు హరా!. యీర్ష్యాదులన్ బాయగాఁ,

గలిమాయన్ బడకుండఁ గాచుదువుగా కల్యాణ సంపత్ప్రదా!

శిలలన్, జీవుల, వెల్గువాఁడ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!

అంతూ శివ సాక్షాత్కారాన్ని కాంక్షిస్తూ

ఇలలో నీ స్మరణంబు చేయుదు హరా! యీర్ష్యాదులన్ బాయఁగా అంటూ ఈర్ష్యాది చింతా రహిత

చిత్తాన్ని కోరుకొన్న శ్రీ చింతావారి నిరంతర భక్తి చింతనులు.

     భక్తి శతకాలలో అధిక్షేపం ఒక చమత్కారమైన అలంకారశోభనాపాదిస్తుంది. శతకంలో  శివా!

నీవు మన్మధుణ్ణి భస్మం చేసావు.కాని మళ్ళీ బ్రతికింపజేసి లోకులమైన మాపై ఉసిగొల్పావు. అది

మొదలు మన్మధుఁడు అశరీరుఁడై కూడా అతి వీరుఁడై మాపై కామబాణ ప్రభలు గుప్పే విధంగా

చేసిన కారకుఁడివి నీవే. అంటూ ఇదేమి ధర్మం మహానుభావా! అంటూ శివుణ్ణి నిలఁదీసే ఒక అధిక్షేప

వాగ్వీచికను

...... పద్యంలో

కామున్ భస్మము జేసి లోకులపయిన్ కామప్రభల్.....అనే వాక్యంలో పొదిగారు కవి.

ఇటువంటి మంచి శతకాన్ని సమంచిత భక్తితో అనుసంధించిన శ్రీ చింతా రామకృష్ణారావు గారికి

మనసా అభినందన చంద్రికలను సారిస్తూ ...........స్వస్తి.

జీ.యం.రామశర్మ. తే. 10 . 12 . 2019.

శ్రీ చంద్రమౌళీశ్వర శతకము.

నా నుడి.

శ్రీ పోచిరాజు కామేశ్వర రావు,M.Tech. (Machine Design).

రాయపూర్, ఛత్తీస్ఘఢ్

సర్పకుండల సర్వజ్ఞం సుప్రతీకం సుదర్శనమ్|                                                                                            సువర్ణాక్షం స్వయంభూతం ప్రణమామి విషాంతకమ్ ||

     భక్తిరసాత్మకముగాఁబన్నగభూషణుని సమక్షమున నూహించుకొని సురగురుమిత్రబావావేశమునఁ బ్రత్యక్షముగ సంభాషణ నైపుణ్యమున దేవ దేశ భాషా పద సమ్మిశ్రమమున సనాత నాధునాతన కథన చాతుర్యముతోలలితా శ్రీ చంద్ర మౌళీశ్వరాయను మకుటముతో నాద్యంతము సమాన శైలి విరాజిల్ల నొక్క శతక రాజమును శ్రీ చింతా రామకృష్ణారావు గా రేక దినావసానమున నాంధ్ర భాషౌరస పుత్రులకుఁ, దదభిమానులకు నానంద దాయకముగా సమర్పించిరి. భస్మరాగాంగుఁడు, కపాలమాలి, ప్రేతవనవాస విలాసభాషితుఁ, డసమాక్షుఁడు, గజవస్త్రధారి, హిరణ్యకవచుని ననురాగ ముప్పొంగ మృదుమధురముగ లలితునిగా నభివర్ణించి నిజ భక్తి పారవశ్యమును జాటుకున్నారు.             

     స్వీయ నిర్దిష్ట కాల పరిమితి చోదిత వ్యథా కలితాంతరంగుఁడయ్యు సుశబ్దార్థభావాతిశయ మింతగా బాసించుచున్న వీతక్లేశ సమయాభావమున రచన కొనసాగించిన నెంత మనోహరముగ నుండు నన్నది యూహాతీతమే!

     స్వయముగఁబునఃపరిశీలన సామర్థ్య మున్నను నాపైఁ గల యభిమానముతో నన్ను నీ శతకమును సమీక్షించి సూచనల నిమ్మనుట వారి యౌదార్యమును జాటుచున్నది.

     మకుటము యతిస్థానాంతర్భాగ మగుటఁ దురీయ పాదాద్యక్షర గ్రహణము చాకచక్యముగ నొనరించుటలోఁ గవి ప్రజ్ఞా పాటవము తేటతెల్ల మగు చున్నది. పద్యము లన్నింటిలోను నది స్వాభావికముగఁగనిపించు చున్నది. 

భిన్నత్వంబున నేకతన్ గను టనన్ విశ్వంబు నందెల్ల నీ

వున్నావంచు గ్రహింపుమం చనుటయా?..“ 18 పద్యమున నద్వైతము సూచింపఁబడుచున్నది.

కామున్ భస్మము చేసి లోకులపయిన్ గామప్రభల్ పెంచితే  83 పద్యము కాముఁడు పోయినను గామము పోలేదని వివరించుట గమనార్హము. 

క్షుత్తాపంబును బాపు హాలికులకుంగూడేల లేకుండెనోనూఱవ పద్యపు టీ  పాదము నేటి సామాజిక స్థితికి దర్పణము వంటిది.

     కవి పుంగవునిశ్రీమన్నారాయణాశతకముకూడ భక్తిరసప్రధానమై విరాజిల్లుచున్నది. అట్లే యిక్కవి వరుని ఘంటము నుండి మఱిన్ని విశేష కావ్యములు రూపు దిద్దుకొన వలెనని యాశించుచు నా శుభాశీస్సుల నందఁజేయు చున్నాను.                                        

                                                                కైలాసాగమ నిత్య నర్తన లసత్కాత్యాయనీ కేళి లీ

                                                                లాలో లాది వినోద తోషిత మనోల్లాసప్రభా విగ్రహా!

                                                                కాలాలోకన దగ్ధ మన్మథ! పురాకా రాసురఘ్నా! శివా!

                                                                ప్రాలేయాంశు విరాజమాన వర మూర్ధా! శంకరా! కావవే    

పోచిరాజు కామేశ్వర రావు,ఎం.టెచ్. (ంఅచినె డెసిగ్న్).

రాయపూర్, ఛత్తీస్ఘఢ్.

14/12/2019.  

 

 

 

 

బ్రహ్మశ్రీ,చింతా రామ కృష్ణ రావు గారు రచించిన"-శ్రీ లలితా చంద్ర మౌళీశ్వర"-శతకము నామూలాగ్రము పఠించి,సమర్పించు,సాదరాభిమాన. పూర్వక గర్భ కవితామందారము.

 

6 జూన్, 2020, శని 7:31 PM

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

రచన:-వల్లభవవఝ అప్పల నరసింహ మూర్తి.
                         
జుత్తాడ.
        
విశ్రాంతోపాధ్యాయుడు.
         
చోడవరము(మం).
         
విశాఖ పట్టణము (జి),
         
ఆంధ్ర ప్రదేశ్.

        అభినందన మందారము.
        *********************
మత్త రజినీ ద్వయ,ముకుంద,రసారవింద,ఉల్లాసినీ ద్వయ,రారయా!ద్వయ,!రజినీకర ప్రియ,కర్మణీగర్భ"-అనంత"- వృత్తము.

         "-అనంత"-వృత్తము.
ఉత్కృతిఛందము.........లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సా రసా!రసార విందమా!సౌరుచుల్!చంద్ర మౌళనన్!సారి సారి గొల్తు
                                                                                   లెల్లరున్!
పారమార్ధ మెంచి కూర్చితే!పౌరులం దీర్చి ముక్తినిన్!పారద్రోల దుష్కృతం
                                                                                    బులున్!
తారకుండవైతి!సత్కవీ!ధారలన్,శయ్య,పాకతన్!దారి జూపు ధార్మి
                                                                               కత్వతన్!
మేర లేని సాగరున్బలెన్?మీర రెవ్వారు మీ కనన్?మీరు మీరె!కాచు
                                                                         సాంబుడున్!

-------------పైకృతికర్త విరచిత శతక"-మామూలాగ్రము,మచిశయ్యతో,
కదళీ పాకముతో,మంచిధారా యుతమై,మేరలేని సాగరమున్బలెన్=
అంతులేని సాగరమువలె,అపార పారావారమనునట్లుగా,మీరరెవ్వారు
మీకనన్=మిమ్ము నతిశయించువారు లే రనునట్ల,మీరు మీరె=మీకుసాటి
మీరే!వేరొకరు కారు.సౌ రుచుల్=మంచి కాంతులు----------
             ===================

1.గర్భగత"-మత్తరజినీ ద్వయ వృత్తములు.
బృహతీఛందము....గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.సా రసా రసారవిందమా!                   2.సారి సారి గొల్తు లెల్లరున్!
  పారమార్ధ చింత గూర్చితే!                      పారద్రోల దుష్కృతంబులున్!
  తారకుండ వైతి సత్కవీ!                        దారి జూపు ధార్మి కత్వతన్!
మేర లేని సాగరున్బలెన్?                       మీరు మీరె?కాచు సాంబుడున్!

2.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము...లగ.గణములు.వృ.సం.83.
ప్రాసనియమము కలదు.
సౌరుచుల్!చంద్ర మౌళనన్!
పౌరులం దీర్చి ముక్తినిన్!
ధారలన్,శయ్య,పాకతన్!
మీర రెవ్వారు?మీకనన్!

3.గర్భగత"-రసారవింద"-వృత్తము.
అత్యష్టీఛందము......లగ.గణములు.యతి.10,.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సా రసా రసార విందమా!సౌ రుచుల్!చంద్ర మౌళనన్?
పారమార్ధ చింత గూర్చితే?పౌరులం దీర్చి ముక్తినిన్!
తారకుండ వైతి!సత్కవీ!ధారలన్,శయ్య ,పాకతన్!
మేర లేని సాగరున్బలెన్?మీర రెవ్వారు?మీకనన్!

4.గర్భగత"-ఉల్లాసినీ ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము......లగ.గణములు.యతి.9,.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.సౌ రుచుల్!చంద్ర మౌళనన్?సారి సారి గొల్తు లెల్లరున్!
   పౌరులం దీర్చి ముక్తినిన్!పారద్రోల దుష్కృతంబులున్!
   ధారలన్,శయ్య పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!
   మీర రెవ్వారు?మీకనన్!మీరు మీరె!కాచు సాంబుడున్!

2.సౌ రుచుల్!చంద్ర మౌళనన్.సారసా రసార విందమా!
   పౌరులం దీర్చి ముక్తినిన్!పారమార్ధ చింత కూర్చితే!
   ధారలన్,శయ్య ,పాకతన్!తారకుండ వైతి!సత్కవీ!
   మీర రెవ్వారు?మీకనన్!మేర లేని!సాగరున్బలెన్?

5.గర్భగత"-రా రయా"ద్వయ వృత్తములు.
ఉత్కృతి ఛందము.........లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సౌరుచుల్ చంద్ర మౌళనన్?సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార
                                                                                విందమా!
పౌరులం దీర్చి ముక్తినిన్!పార ద్రోల దుష్కృతంబులున్!పారమార్ధ చింత
                                                                             గూర్చితే?
ధారలన్!శయ్య పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!తారకుండ వైతి!
                                                                            సత్కవీ!
మీర రెవ్వారు?మీకికన్!మీరు మీరె! కాచు సాంబుడున్!మేర లేని!
                                                                  సాగరున్బలెన్?
2.
సౌరుచుల్!చంద్ర మౌళనన్?సారసా రసార విందమాాసారి సారి గొల్తు
                                                                             రెల్లరున్!
పౌరులం దీర్చి ముక్తినిన్!పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృ
                                                                         తంబులున్!
ధారలన్,శయ్య పాకతన్!తారకుండ వైతి!సత్కవీ!దారి జూపు ధార్మి
                                                                        కత్వతన్?
మీర రెవ్వారు?మీ కనన్!మేర లేని సాగరున్బలెన్?మీరు మీరె!కాచు
                                                                  సాంబుడున్!

6.గర్భగత"-రజినీకర ప్రియ"-వృత్తము.
ధృతిఛందము.......గణములు.యతి.10,.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార విందమా!
పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృతంబులున్!
దారి జూపు ధార్మి కత్వతన్?తారకుండ వైతి!సత్కవీ!
మీరు మీరె!కాచు సాంబుడున్!మేర లేని సాగరుంబలెన్?

7.గర్భగత"-కర్మణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.........లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార విందమా!సౌరుచుల్!చంద్ర
                                                                             మౌళనన్?
పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృతంబులున్?పౌరులం దీర్చి
                                                                           ముక్తినిన్!
దారి జూపు ధార్మి కత్వతన్?తారకుండ వైతి!సత్కవీ!ధారలన్,శయ్య
                                                                         పాక తన్!
మీరు మీరె!కాచు సాంబుడున్!మేర లేని సాగరు న్బలెన్?మీర రెవ్వారు?
                                                                      మీకనన్!

                                               విద్వజ్జన విధేయుడు.
జుత్తాడ.                                వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
తేదీ:-8-6-2020.

 

శ్రీ చంద్రమౌళీశర శతకము

రచన  :  చింతా రామకృష్ణారావు.

శా. శ్రీమన్మంగళ నామ! భక్త సులభా! శ్రీ పార్వతీ వల్లభా!

క్షేమంబున్, శుభ సంహతిన్, గొలుపు నీ చిద్రూపమున్ గాంచనీ.

శ్రీమన్మంజుల భాషణా! ధిషణులన్ జిద్వర్తివై యుండి, సత్

ప్రేమన్ గావుము లోకపాల! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                        1

 

శా. కన్నుల్ మూడు ఘనంబుగా గలిగి లోకంబందుఁ బ్రఖ్యాతితో

మిన్నన్ వెల్గుచునుంటివీవు. కనవేమీ మమ్ము? ముక్కంటి! నీ

కన్నన్ మిన్నఁగఁ గాంచువారెవరయా? కామేశ్వరీ వల్లభా!

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                        2

 

శా. నిన్నే నమ్ముదురెన్ని దానవులు రాణింపున్ గనన్  గోరుచున్.

నిన్నే దేవతలున్ భజించెదరు. ప్రశ్నింతున్ నినున్ జెప్పుమా.

యెన్నంజాలవొ రాక్షసాధములనీ వేతీరు మన్నింతువో?

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                         3

 

శా. కన్నప్పన్ గరుణించితీవు ఘనమా? కన్నుల్ సమర్పించె తా

నన్నన్నా! వరమంచు నెంచితివొ? యాహ్లాదంబొ, తా నట్టు లీ

యన్నీకున్గనులన్ బెకల్చి? యరె! నీ యాకాంక్షలిట్లుండునా?

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితా్శ్రీచంద్రమౌళీశ్వరా!                          4

 

 

శా. కన్నా! సజ్జల మార్జనంబునకె నీ గాత్రంబహో! పొంగు నా

పన్న త్రాతవటంచు మానసమునన్ భావించినంతన్ గృపన్

మన్నున్ మిన్నునునేకమైనఁ గనవే మన్నించి కాపాడుటన్.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                          5

 

శా. పున్నెంబున్ననె నీదు పాద యుగళిన్ బోధన్ మదిన్ గాంచనౌన్.

బున్నెంబున్ననె నీదు పూజలకునై ముందుండఁగా సాధ్యమౌన్

బున్నెంబున్ననె మా మొరల్ వినఁబడున్ బూజ్యుండ నీకున్. భళీ!.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!              6

 

శా. మన్నింపంబడు పార్వతీ సతియె నీ మాహాత్మ్యమున్ గాంచి యా

పన్నుల్ నిన్ను స్మరించు వేళఁ గృపతోఁ బ్రఖ్యాతిగాఁ గావఁ దా

నెన్ను న్నిత్యము. నీ దరిన్ నిలిచి మన్నించున్ మమున్ దేవరా!

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                7

 

శా. జన్నంబుల్ పచరించు పండితతతిన్, జ్ఞానంబుచే శూన్యులై

కన్నుల్ గానని దుష్టపాళి, నిల సాకంగా నిజంబెంచ, నీ

కన్నన్గల్గుదు రెవ్వరయ్య? కరుణాగారంబు నీవే హరా!

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                  8

 

శా. పున్నామాదు లవేల మాకుఁ గలుఁగున్? మోక్షప్రదుండా! నినున్

మున్నే మేము స్మరించుచుండ సతమున్. భూలోక వాసుల్ మదిన్

నిన్నే నమ్ముదురయ్య నీ కెఱుకయే. నిత్యుండ! సత్యంబిదే.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                    9

 

శా. సన్నామా! శివ శంకరా! హరహరా! సద్భాగ్య సంపత్కరా!

నన్నుసత్కృపఁ గాంచి, సత్ శతకమున్ నాచేత వ్రాయింతువా?

నిన్నే నమ్మిన భక్తియుక్తుల కథల్ నేర్పార వ్రాయించుమా!

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                   10

 

శా. పిన్నన్ నే నిను నెన్ననేరను. భవద్విఖ్యాతినే గాంచ లే

కున్నానయ్య! పురాణముల్ చదివినన్ గోప్యంబుగా నున్న ని

న్నెన్నన్ నే నెటు నేర్తునయ్య! కన నాశింతున్ భవా! నీ ప్రభన్.

జెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                                  11

 

శా. కన్నుల్ నిన్ గను శక్తిఁ గల్గియును, లోకంబందు నీ తేజమే

యున్నన్ గాని, సమస్త జీవముల నయ్యో! గాంచఁగా నేర్వ లే

కున్నా నీ దురవస్త వీడుటెటు? లోహో! నీ కృపన్ గానకే.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                                  12

 

శా. కన్నీటిన్ గురిపించి నీకు నభిషేకంబున్ జరించంగ లే

కున్నం గాని కృపా కటాక్షము లనేకుల్ పొందినారీశ్వరా!

నిన్నున్ జిత్తమునందు నుంచినను నా నీ భేదమున్ జూడవే.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                                  13

 

శా. వెన్నన్ బాలును మీగడన్ బెరుగు నా వెన్నున్ గొనన్ గోరుటా?

నిన్నుం జూచిన బూడిదన్, జలమునున్ నిత్యంబుగానిచ్చుటా?

యెన్నా ళ్ళీవిధ మీవు తృప్తిఁ గనుదో? యీశా! మహాత్ముండవే.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!        14

 

శా. పిన్నల్ నిన్ గనఁ జాలుటేమి? జగతిన్ విశ్వేశ్వరా! వింతగా

నిన్ను న్నిత్యము గొల్చుపెద్ద లెపుడున్ నీ రూపమున్ గాన లే

కున్నారేలను? జెప్పవయ్య కృపతో నుద్బోధఁ గావింపుమా.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!          15

 

శా. నిన్నన్, మొన్నను, నేడు, రేపు, సతమున్ నీ భక్తు లిద్ధాత్రిపై

నున్నా రైనను ముక్తి మార్గ మరెరే యుత్సాహులై దెల్ప లే

కున్నారెవ్వరు! నీవె మాకు గురువై యుద్బోధఁ గావించుమా.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!        16

 

శా. సున్నా పూర్ణ మటంచు, నీవె యనుచున్, శోధించి, శోధించి,, మా

కెన్నన్ దెల్పినవయ్య వేదము లికన్ హేపార్వతీ వల్లభా!

సున్నాలోఁ బరిపూర్ణతన్ గనుటనే సూచించెనో వేదముల్?

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!            17

 

శా. భిన్నత్వంబున నేకతన్ గను టనన్ విశ్వంబు నన్నింట నీ

వున్నావంచు గ్రహింపమం చనుటయా? యూహించఁగా లేక, నే

నున్నా నియ్యెడ. నీవె తెల్పుమిక లోకోద్ధారకా! ప్రేమతోఁ.

జెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!            18

 

శా. క్రన్నన్ రాతిని నిన్నుఁ గాంచు విలసద్గణ్యాత్ములిద్ధాత్రిపై

నున్నారందురు. రాతిలోఁ గనుచు ని న్నోదేవ! క్రోధాత్ములై

యున్నారేలను? బేదలందుఁ గన రేలో నిన్? మహోద్ధాముఁడా!

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!            19

 

శా. పెన్నాగంబది కంఠహారమొకొ?  నీ విజ్ఞానమీపాటిదా

యన్నన్ నీ మది క్రోధతప్తమవదా?  హారంబు కాకున్న నీ

సన్నల్ చాయలు మా కెఱుంగ నగునా? సంజ్ఞల్ ప్రబొధింపుమా.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!          20

 

. మదనానంద సుపూజ్య సత్యపుర ధామా! మిట్టపల్లిన్ బ్ర జల్

ముదమారన్ బలు వర్షముల్ ఘనముగా పూజాదికంబుల్ సదా

మది నుప్పొంగుచుఁ జేయ, భక్తతతికిన్ మాహాత్మ్యమున్ జూపుచున్

హృదులన్ వాసము చేయుదీవు! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!              21

 

. ముదమారన్ నినుఁ దండ్రిగాఁ దలచు సత్ పూజ్యుల్ ప్రభాసింతురో

సదయా! నీదు హృదిన్. సదా శుభములన్ శాసించ యోగ్యుల్ కదా.

కదలన్ గల్గిన దేవతాళి పృథివిన్ గాంక్షింతు వారిన్ గనన్

హృదయోద్భాసిత దేవదేవ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!              22

 

. మదిలో నీపదపల్లవంబుఁ గను సమ్మాన్యుల్ వ్యధల్ పొందుటన్,

పదిమందిన్ భయపెట్టు దుష్ట తతికిన్ భాగ్యంబులుప్పొంగుటన్,

హృదయం బందున గాంచవా? భవహరా! యీపాపమెవ్వారికో?

హృదయోద్భాసిత దేవదేవ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!               23

 

. వ్యధలన్ దాళఁగలేను. గావుమిక నిన్ బ్రార్థింతు విశ్వేశ్వరా!

మదినే క్రమ్ముచు సత్య దర్శనము నేమాత్రంబుఁ గానీయవే.

పదిలంబెట్టులగున్ మనంబునకికన్ భవ్యుండ! కాపాడుమా.

హృదయోద్భాసిత దేవదేవ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!               24

 

. మృదుభావాంచిత భద్రమూర్తివి. గుణశ్రీభాస! నీశోభలే

కదలన్ గల్గెడి దేవులౌ మనుజులన్ గానంబడున్, నీవు నా

యెదలో నిల్చి కనంగఁ జేయుము హరా! హృష్టాత్ముఁగాఁ జేయుమో

హృదయోద్భాసిత దేవదేవ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!             25

 

. క్షుధనేలన్ సృజియించితీవు? జనులున్ క్షుద్బాధచే పాపముల్

సదసద్ జ్ఞానము వీడి చేయుదురయో సాక్షీ! శివా! చూతువే.

యెదలన్ మంచిని గొల్పియున్ మరలనీ విట్లేలఁ గావించితో?

హృదయోద్భాసుఁడ! దేవదేవ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!              26

 

. అరిషడ్వర్గపు సృష్టిఁ జేసి యిట మమ్మాడింతువేలన్? హరా!

తరణోపాయము జూపుమీవె కరుణన్ ధాత్రీజనుల్ వర్ధిలన్

పరమానందపథమ్మునే గనుటకై ప్రఖ్యాతిగా నీవికన్

స్థిరు, నిన్ గాంచు గుణమ్మునిమ్ము లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!             27

 

శా. పుత్రార్థంబు సతిన్భరించునపుడే మోక్షంబు దూరంబగున్.

పాత్రాపాత్రములెన్ననైతి. నుతులన్ బాపాత్ములన్ గొల్చితిన్.

బుత్రున్, భార్యను పెంచ సొమ్ముకొఱకై. ముక్తిప్రదా! పాపినై.

చిత్రంబియ్యది. కావవేమి? లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!               28

 

శా. ధాత్రిన్ సజ్జన సంగతిన్ శుభములన్ దత్వజ్ఞులై గాంచుచున్

పుత్రేచ్ఛన్ మమకార బంధన గతిన్ బుణ్యాత్ములున్ దుష్టులై

మిత్రామిత్ర వివేక శూన్యులగుచున్ మిధ్యన్ బ్రవర్తింతురే!

చిత్రంబియ్యది. కావవేమి? లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!               29

 

శా. భ్రాతృప్రేమ యథార్థమంచు నిజమున్ వర్జించి వర్తించితిన్.

మిత్రుల్ జెప్పిన నమ్మనైతి. నిక స్వామీ నీవె దిక్కంటి. నీ

వే త్రోవన్ నడిపింతువో నడుపుమం చేఁ గోరు చుంటింగదా!

చిత్రం బియ్యది. దేవదేవ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                      30

 

శా. ధీరోదాత్తుఁడవీవొకండవె కనన్. దేదీప్యమానోజ్వలా!

వీరావేశమునొందుదీవె దురితున్ వీక్షించుచున్నప్పుడా

వీరావేశము వీడి శాంతిఁ గనుదే విఖ్యాతులన్ సౌమ్యులన్

జేరన్ వచ్చినవారినెల్ల. లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                31

 

శా. శ్రీరామా యన బూతుమాట యనుటే చిత్రంబుగానుండె నో

ధీరా! లోకము పోకడన్ గనవొ?  శాంతిన్ వీడి శిక్షింపవో?

స్మేరంబెట్టులు వచ్చుచుండెను హరా! శిక్షింపుమా దుష్టులన్

జేరన్ వచ్చిన గాని నీవు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                    32

 

శా. మారామేలను చేయు దీవు? శుభులన్ మన్నించి రక్షింపఁగా.

ఘోరంబియ్యది. నీవె దిక్కనుచు నిన్ గూర్మిన్ గనం గోరినన్

ధీరాత్ముల్ వశియించుటెట్లగునయా దీపించు నిన్వీడి. నిన్

జేరన్ వచ్చినవారిఁ గాచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                      33 

 

శా. ప్రేరేపించెదవీవె మానసమునన్ విఖ్యాతిగానుండి నన్

వీరావేశముతోడ దౌష్ట్యములనే బ్రీతిన్ గనన్ జేయుచున్

బోరామిన్ దురపిల్లుచుండఁ గను టోపూజ్యుండ! భావ్యంబొ? నిన్

జేరన్ వచ్చితిఁ గావుమయ్య. లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!               34

 

శా. పోరాముల్ కలిగించుచుంటివికదా పుణ్యాత్మునన్నీమహత్

పారావారమునందు ముంచి, మమతల్ వర్జింపఁగాఁ జేయవే?

ధీరోదాత్త గుణంబు లిచ్చితివిగా. తేజంబునే గొల్పు నిన్

జేరన్ వచ్చితిఁ గావుమయ్య. లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                  35

 

శా. శ్రీన్నిత్యం బెదఁ దాల్చునట్టి హరి నిన్ జిత్తంబునన్ నిల్పి, నీ

యౌన్నత్యంబును చాటుచుండెనటగా! యానందమున్ బొందుచున్.

నిన్నే మేమును గొల్తుమయ్య కనుమా! నిష్ఠన్ మమున్ గావుమా.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!             36

 

. నరమేధమ్మును చేయు మూర్ఖులను బ్రాణంబుల్ విడం జేయుమా.

సరసత్వంబున మెల్గు పూజ్యులనధీశా! కాచి రక్షించుమా

కరుణన్ మమ్ములనెన్ని లోకమున సద్గణ్యంబుగానొప్పు సు

స్థిర మార్గంబున నిల్పుమయ్య. లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                37

 

శా. నీ యానందములోక మంగళమెగా? నిత్యంబు నిన్ గొల్త్రు సు

శ్రేయంబున్ గన భక్తులెల్లఁ, గనుమా చిద్రూప సర్వేశ్వరా!

మా యానందమె నీకునున్ వలయుచో మా పద్ధతిన్ గాంచి,సు

శ్రేయోమార్గము జూపుమయ్య. లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                38

 

శా. భావోద్రేకముతోడ నిన్ గొలుచుచున్ బద్యంబులన్ వ్రాయుచో

శ్రీవాణీ కృపఁ జేసి, ధార సుగతిన్ జిత్రంబుగాఁ బొంగుచున్,

జీవాత్మే పరమాత్మఁ జేరుచును సచ్ఛిచ్ఛోభ లొల్కించు, నో

జీవాధార! దయాంతరంగ లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                  39

 

. శ్రవణానందపుఁ బంచచామరములన్ సద్భావనన్ భక్తితో

భవబంధంబులు పారఁగా, శతకమున్ బ్రఖ్యాతిగా వ్రాసితిన్.

భవుఁడా! నీ కృపనొక్కరోజుననె. దేవా! దీనినా తీరునే.

శివనామంబె రచింపఁ జేసె. లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                   40

 

. పవమానాత్మజుఁడీవె యంచు సుజనుల్ ప్రఖ్యాతిగా కొల్చుటన్

జవసత్వంబులు వృద్ధియౌటెఱిఁగితిన్ . సన్మార్గ సద్వర్తియై

జవసత్వంబులు వృద్ధిఁ జేయు హరియే. సాధింపఁగాఁ జేయు నీ

శివ తత్వంబె శుభాళిఁ గూర్చు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                  41

 

. క్షితినెవ్వారలమోఘ భక్తులయి భాసించంగ వాంఛింతు రా

నుతిమంతుల్ జరియించు చోటు లవి మౌనుల్ గోరు క్షేత్రంబు లు

ద్ధతు లవ్వారల నెన్ని కొల్చుట తగున్, ధాత్రీ సురల్ వార లో

జిత చిత్తోద్భవ! నీలకంఠ! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                     42

 

. మతిమంతుల్ మహనీయ భావ సుగతిన్ మంత్రార్థ సంసిద్ధులై

గతియై నిల్తురు సృష్టికే. శుభదులా కారుణ్యమూర్తుల్ హరా!

క్షితినవ్వారలఁ గావుమీవె సతమున్ శ్రేయంబులన్ గూర్చుచున్,

శ్రిత రక్షాపర! శూలపాణి! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                         43

 

. వ్రతముల్ చేయఁగ నేల నిన్నుఁ గొలువన్ భక్తిప్రపత్తిన్ సదా.

క్షితి వర్తించుట నేర్చినన్ సుజన సత్ సేవా మహా భాగ్యులై

నుతులంగొంచుఁ జరించు వారలకు, జ్ఞానుల్ వారలే శంకరా!

శ్రిత రక్షాపర! శూలపాణి! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                         44

 

. కరుణం గాంచు పరాత్పరా! వరగుణా! కారుణ్యపూర్ణా! యటం

చరిషడ్వర్గ జితుల్ నినున్ గొలువఁగా, యారాధ్యదైవంబవై

కరుణన్ గాచెడి నిన్ను నెన్ననగునా? జ్ఞానప్రదా! శంకరా!

శిరమున్ గంగను దాల్చి వెల్గు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                      45

 

శా. నాలో నిన్ గను శక్తి నిమ్ము గుణ సన్మాన్యా! మదిన్ వెల్గుచున్,

లోలో వెల్గెడు నీదు దీప్తినిల నే శ్లోకుండనైతిన్ మహ

చ్ఛీలావిష్కరణంబు నీవు కొలుపన్ జిన్మూర్తినాన్ నిల్చెదన్.

శ్రీలాలిత్యమునన్ వెలుంగు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                          46

 

శా. చిత్తాంభోజము నీకు పీఠముగ నే సిద్ధిప్రదా! చేసెదన్.

హృత్తాపంబు శమించ నీ విచటనే హృష్టాత్మతో నుండుమా.

మత్తున్ బాపుమ. మానసాబ్జమున సంభాసించుమా శ్రీప్రదా!

చిత్తంబందు వెలుంగునట్టి లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!.                            47

 

శా. రావే యీశ్వర! లోకరక్షణపరా! రాజీవనేత్రా! హరా!

నీవే సద్గుణజాలమున్ మనుఁజులన్ నేర్పార చొప్పించరా.

పోవంజేయుచు దుర్గుణాలమును నిన్ బూజింపఁగా చేయరా.

జీవేశా! కరుణాలవాల! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                          48

 

శా. బుద్ధిన్, సిద్ధిని గొల్పు నీ గణపతిన్ బూజించువా రీభువిన్

శ్రద్ధన్ బొందఁగ నీ కుమారుని మదిన్ సాధించువారల్, సదా

శ్రద్ధన్ నిన్ భజియించ నేర్చిన తరిన్ సాధింతురీ సర్వమున్.

సిద్ధుల్ నిన్ గనఁ బొంగిపోవు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!.                         49

 

శా. ఏమీ నీ దరహాస చంద్రికలె మమ్మిన్నాళ్ళుగా ప్రోచెనా?

యేమీ నీ శుభనామ మంత్ర మదియే యీలోకమున్ గాచెనా?

మేమున్ నిన్ మది నిల్పి యుంచుదుమయా మిథ్యన్ విడన్ జేయుమా..

శ్రీమత్ పండరి కృష్ణఁ గాచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                              50

 

శా. శ్రీమాతృప్రభ వెల్గునట్టి శివుఁడా! శ్రేయస్కరా! శంకరా!

శ్రీమంతుల్ నినుఁ గొల్చుటే ఘనమొకో? ప్రీతిన్ నినున్ బేదలున్

నీమంబొప్పఁగ పూజ చేయుదురయా. నీవారలే. కావుమా.

శ్రీమత్ పండరి కృష్ణఁ గాచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!                              51

 

.. నుతులం దేల్చుదురయ్య నిన్ను సుకవుల్. నోరార కీర్తింత్రు.

న్నుత పాత్రుల్. మదిలోన నిల్పుమయ నన్నున్, వారలన్, శంకరా!

క్షితి నీకన్నను మాకు లేరితరులా చిన్మార్గమున్ జూపఁగా.

శ్రితమందార! దయాంబురాశి! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                         52

 

శా. ఎంచంబోకు మదీయ భక్తిని శివా! యిద్ధాత్రిపై నున్న యే

కించిత్తైన నిజంబుకాదుగ విలోకించంగ. నిన్నాత్మలో

నుంచంగల్గినవారు ధన్యులిలలోనొప్పారుచున్ నిల్త్రు. భా

సించన్ నే నిను గొల్తునయ్య. లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                          53

 

శా. లేరే నీసరి ప్రోచువారలిలలో లీలావినోదంబు నీ

కీ రీతిన్ బొనరించుచుంట జగతిన్ హృద్యంబుగా. భక్తితో

నోరారన్ బరమేశ్వరా యనుచు నిన్నున్ నిత్యమున్ గొల్చుచున్

జేరన్ వచ్చినవారిఁ గాచు లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                              54

 

శా. సన్మానంబులనేకముల్ కలిగినన్ శంభూ! మదిన్ నీవెగా

సన్మానంబులనందుకొందువు. నిజేచ్ఛన్ శ్రీహరా! శంకరా!

నన్ మోహంబున ముంచఁబోవు కరుణన్. మచ్చిత్త సంభాసివై.

చిన్మార్గంబును జూపునట్టి లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                      55

 

శా. శ్రేయోదాయకమైన విద్య లిల నాశించున్ బుధుండెప్పుడున్.

శ్రేయంబెయ్యది? . నిన్ను చూచుటెకదా చిత్తమ్ములో నిల్పుచున్.

మాయామోహములన్ ద్యజించనగు ప్రేమన్ నీవు కాపాడుటన్.

జ్ఞేయంబై యలరారునట్టి లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                        56

 

. పరమానందముతోడ నిత్య మెదలో భాసించు నిన్ గాంచుచున్

నిరపేక్షన్ నుతియించుచున్ మెలఁగినన్ నిద్రాణ సచ్ఛక్తులా

దరమందన్ బ్రభవించునయ్య. భళిరా! దాక్షాయిణీ సన్నుతా!

చిరకీర్తిన్ గలిగించునట్టి లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                           57

 

శా. నీ చారిత్ర్యము నెన్ని చెప్పఁగ సురానీకంబె జంకున్ గదా.

నా చేతన్ బలికింప నెన్నితివిగా. నా భాగ్య మీవై శివా!

ప్రోచన్ నీకె సుసాధ్యమెన్నఁగ, నినున్ బూజింప మాకే యగున్.

శ్రీచక్ర స్తిత సద్విభాస లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                            58

 

శా. ధీమంతుల్ నినుఁ గాంతురెల్లెడల నీ తేజంబునే యెన్నుచున్.

శ్రీమంతుల్ ధన ధాన్య సంపదలతో శ్రేయార్థులై కొల్త్రు నిన్.

మే మేపాటి యటంచునెంచకు మమున్ మీ దాసులై యుండుటన్.

శ్రీమంతా! శ్రిత పారిజాత! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                          59

 

. కలికాలంబిది. కామితార్థులయి ముక్కంటీ నినున్ గొల్తు రే

శిలకైనన్ బడి మ్రొక్కుచుండుదు రహో! చిత్రంబిదే. కంటివా

తెలివిన్ జూపుదురెన్ని నిన్నుఁ గనుమా దివ్యప్రభావా! హరా!

చెలిమిన్ బ్రోచెడి దేవదేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                           60

 

శా. మత్తేభాజినవస్త్రధారివటగా? మాలోననే యుండి మా

చిత్తంబుల్ సుగుణాలయంబులుగ సచ్చిద్భాస! చేయన్ ఘనం

బత్తున్ నీ ప్రభ మా మనంబులకు నోయానందమూర్తీ! భవా!

చిత్త భ్రాంతిని బాపునట్టి లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                               61

 

శా. సత్తున్ జిత్తును నీ స్వరూపములె మోక్షంబన్న నిన్ జేరుటే.

మత్తున్ వీడిన మేము నిన్నుఁ గననౌన్. మచ్చిత్ప్రభాసా! హరా!

సత్తున్ నిత్యము నిన్నుఁ జేరు వరకున్ సాగించు మాలోన నో

చిత్తేజంబయి వెల్గుచున్న లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                              62

 

శా. సేవా దృక్పథమున్నవారలఁ గనన్, జిత్రంబు, నీవేనురా.

భావావేశుల భాషణంబునను సంభాసింతు వీవేనురా.

నీవే మాకగుపించుచుందువు కదా.నిత్యుండవై వెల్గుచున్.

జీవాత్మావృత దేవ దేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                63

 

. కలలోనైనను నిన్నె గాంచఁగ మదిన్ గాంక్షించు భక్తుండ. నే

నిలలో నీస్మరణంబుఁ జేయుదు హరా!. యీర్ష్యాదులన్ బాయగాఁ,

గలిమాయన్ బడకుండఁ గాచుదువుగా కల్యాణ సంపత్ప్రదా!

శిలలన్, జీవుల, వెల్గువాఁడ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                            64

 

శా. మోదంబున్ గనఁ జేయు వాఁడవటగా? పుణ్యాత్ములన్ గాంచవా?

మోదంబెప్పుడు కూర్చితీవు? దురితుల్ పుణ్యాత్ములన్ జంపుచున్,

ఖేదంబున్ గలిగించుచుండిరిట దుష్కృత్యంబులన్ గానవా?.

సేదన్ దీర్చెడి దేవదేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                65

 

. జయశీలంబది నీ కృపన్ గలుఁగునే. సద్వాసనల్ కల్గినన్,

నయమార్గంబన నీ దయా ఫలితమే జ్ఞానప్రబోధంబునన్,

బ్రియ వాఙ్మాధురి మూలమిన్నిటికి భావింపంగ, సర్వేశ! సు.

శ్రియముల్ గూర్చెడి వాఁడావీవె లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                        66

 

శా. మత్తున్ బాపెడివాఁడవీవె కనగా మాన్యాళికిన్ దేవరా!

చిత్తంబందు వసించువాఁడవట రాశీ భూత సంస్కారమై.

క్షుత్తాపంబు హరించువాఁడవటగా కూడున్ బ్రసాదించి .

చ్చిత్తంబందు వసించు దేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                            67

 

శా. అజ్ఞానాంధము బాపుదీవె కనఁగా నార్యామహాసాథ్వితో.

విజ్ఞానంబును బొందఁ జేయుదువు సంప్రీతిన్ నినున్ గొల్చినన్,

సుజ్ఞేయంబగుదెట్లునీవు? మదిలో శోభిల్లువాఁడా! హరా!

జిజ్ఞాసన్ ప్రభవింపఁజేయు లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                            68

 

. కృతకంబైన సమస్త పూజలు విలోకించన్. మదిన్ నిల్పి

మ్మతితో నీశ్వర నీకు పూజ సలుపన్ మన్నించుదున్ శంకరా!

క్షితిలోఁ బార్వతితోడఁ గంటఁ బడుమా కీర్తింతు మిమ్మున్ హరా!

జితచిత్తోద్భవ! సన్నివాస! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                     69

 

. ధృత సంస్కార! త్రిశూల భాస! వర ధాత్రిన్ సృష్టినే గాచుచున్,

మతిమంతుల్, గుణ భాసులున్, వనితలున్, మాన్యాళియున్ దృప్తిగా

క్షితి వర్ధిల్లఁగ జూచువాఁడవు. మహత్ కీర్తిప్రదా సంస్తుతుల్.

కృతమందే ప్రభవించినట్టి లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                          70

 

శా. కామాదుల్ జనపాళికెన్న వరమా? జ్ఞానంబె శ్రేయంబ? సు

క్షేమంబెయ్యెది కొల్పు జాతికి  భువిన్? జిత్తంబులోనన్ నినున్

గామాదుల్ విడి కొల్చుటో, వరలుటో కామాదులన్ నమ్మి? సత్

క్షేమంబున్ వరలింపఁ జేయు  లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                    71

 

శా. ఏమేమీ! నిను గన్నవారలెవరో? యీమాత్రమున్ జెప్పలే

వా? మీ సంస్కృతి మూలమెక్కడిదొ? దేవా! దీన రక్షార్థమై

భూమిన్ నిల్పఁగ వచ్చియుంటివొ? హరా! పూజ్యుండ! సంతోషమే.

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                        72

 

శా. ప్రేమన్ జూపుటలోన నీకు సతికిన్ భేదంబదెంతో? హరా!

శ్రీమాతృప్రియ నామ మెన్నఁ బ్రజకున్ శ్రేయస్కరంబై, నినున్

బ్రేమన్ జూడఁగఁ జేయునయ్య. మహిమోపేతంబహో! యీశ్వరా!

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                        73

 

శా. నీమంబొప్పఁగ లింగ పూజను శివా! నిత్యంబుఁ జేయింతువే!

కామాదుల్ విడఁ జేయవేమి? భయమా? కారుణ్యమే లేదొకో?

శ్రీమత్ పార్వతి పాద సంస్మరణచేఁ జిందింతువా పాపముల్?

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                     74

 

శా. మార్గంబున నన్నుఁ బ్రోతువొ? శుభంబేత్రోవఁ గల్పింతువో?

శ్రీమాత్రర్చనకేది మార్గమొ? నినున్ జేరంగ నేమార్గమో?

కామాదుల్ విడ మార్గ మేదగునొ? నీ కారుణ్యమే జూపెడున్.

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                              75

 

శా. శ్రీమత్ పార్వతి పాద పూజ వలనన్ జేరంగనౌనా నినున్?

మా మార్గంబది సందియంబె, కనఁగా మాయన్ బడన్ జేయు. మా

ప్రేమ భ్రాంతులు మాయ చేతనె కదా. వీక్షించి పోకార్పుమా.

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                   76

 

శా. శ్రీమద్భక్త జనాళి పాద రజమే చేయున్ నినున్ జేరఁగా.

ధీమంతుల్ ప్రజలందుఁ గాంచుదురు నిన్. దీనాళి సత్ సేవలన్

క్షేమంబందఁగఁ జేసి నీదు కృపచే సిద్ధాత్ములై వెల్గరే!

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                   77

 

శా. మీ మా భేదము లేదు నీకు బ్రతుకున్ మేలున్ గనన్ జేయఁగన్.

మా మీ భేదము లేదు మాకు వరముల్ మాకిచ్చువారిన్ గనన్.

మా మార్గంబది పాపమే కదటయా? మమ్మేలు సద్భాస! సు

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                78.

 

శా. ప్రేమన్ జూపుటలోనఁ బార్వతికి నీవే సాటి విశ్వేశ్వరా!

శ్రీమాతా! పరమేశ్వరా! యను మమున్ జేకొండు మీరల్ గృపన్.

శ్రీమాత్రర్చన చేయు మమ్ముఁ గని మా చిత్తంబులందుండుమా.

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                79

 

శా. గ్రామాలన్ నిను నిల్పి, గోపురములన్ గట్టించి పూజించువా

రేమాత్రంబును చెడ్డమార్గముననో యీశా నీవు పోనీకుమా.

యీమాత్రంబును గాయలేవొ కృపతోనిష్టంబుతో దేవ! సు

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                       80

 

శా. నామీదన్ దయ కల్గెనేని సతమున్ నాయందె నీవుండుమా.

నీ మీదన్ వర భక్తి కల్గునటులన్ నిత్యంబు చూపించు నా

శ్రీమార్గంబును వీడనీయకుమ రాశీభూత చేతోనిధీ!

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                       81

 

శా. సోమున్ దాల్చితివీవు. ధన్యుఁడతఁడే.సోమేశ్వరా! నిన్ను తా

నేమాత్రంబు జపించెనో తెలుపుమా యిచ్ఛన్ నినున్ గోరెదన్.

ధీమంతుల్ నినుఁ జేరుచుండి రకటా! దీపింప నేనె ట్లటుల్?

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                  82

 

శా. రామాలంకృత వామభాగ! భవుఁడా! రాణించితీవందుచేఁ.

గామున్ భస్మము చేసి లోకులపయిన్ గామప్రభల్ పెంచితే?

ఏమీ ధర్మము? నీకుఁ దోపదొ? హరా! యీమాత్రమున్ గాంచవా?

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                     83

 

శా. ధీమంతా! భవ నాశకా! పురహరా! తేజోనిధీ! కావరా!

యేమాత్రంబు నుపేక్ష సేయక ననున్ హృద్యంబుగా సాకుమా.

ప్రేమాదుల్, వర భోగముల్ తనుపునే? విశ్వేశ! నన్నున్? సదా

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                        84

 

శా. నామాతీత! గుణాఢ్యుఁడా!! హరహరా! నాలోని తేజంబ! నీ

నామంబెవ్వరదెట్లెఱుంగుదురయా? నా ప్రాణమీవేనయా.

నా మార్గంబది. నిన్నుఁ జేరుటకు. సుజ్ఞానంబునే గొల్పుమా.

క్షేమంబున్ వరలింపఁ జేయు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                                 85

 

. మతముల్  మార్చెడి మానవున్ గనుమ. సేమంబే సదా కోరుటన్

గతులన్ దప్పుచునుండెరా. కనవొ? నీ కారుణ్యమున్ జూపి

ద్గతిఁ గల్పింపర జీవితాన సుఖముల్ కల్పించి పోషించరా.

జితచిత్తోద్భవ! సన్నివాస! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                      86

 

. క్షితి నెవ్వారలు స్వార్థమున్ విడిచి, సంక్షేమంబునే కోరు వా

రతులానందమరందమాధురులచే యాత్మన్ బ్రకాశింతురే.

నుతులన్ దృప్తుగఁ నిన్నుఁజేయునతఁడెన్నున్ దివ్య సంపత్ప్రభన్.

జిత చిత్తోద్భవ! సన్నివాస! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                               87

 

. శ్రిత మందార! హరోంహరా! యనుచు నిన్ సేవించువారిన్ గనన్

క్షితి నీవే కనిపించుచుందువయ కాశీవాస! భక్తాళిలో.

నుతియింపంగను నేరనయ్యనిను. నిన్నున్ గాంతునుప్పొంగుచున్.

జితచిత్తోద్భవ! సన్నివాస! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                88

 

. బ్రతుకే భారము కాగ మానవులు శోభల్ గాంచఁగా నేర్తురే

యతులుండంచును నిన్నుఁ గాంచి? హర! స్నేహాయత్త చిత్తుండవై! 

బ్రతుకన్ మార్గమునెన్నిచూపుమయ. సంభావించుచున్ వారలన్.

జితచిత్తోద్భవ! సన్నివాస! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                    89

 

. స్తుతియింతున్ నిను నీ కుటుంబమును సుస్తోమప్రియా!  వందితా!

గతి నీవౌచు కుటుంబమున్ గనుమయా. కాపాడుమా శంకరా! 

ధృతినే గొల్పుమ. దేవ దానవ నుతా దివ్య ప్రభాపూర్ణుఁడా!

జితచిత్తోద్భవ! సన్నివాస! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                           90

 

. ఋజు మార్గంబున సంచరింతును శివా! తృప్తిన్ గనన్ గోరుచున్.

ప్రజకున్ మేలొనరించు పద్యరచనన్ శ్రావ్యంబుగా పాడెదన్.

నిజశక్తిన్ మునుముందుకున్ నడచెదన్ నీవిచ్చు భక్తిన్ హరా!

సృజనన్ గొల్పెడి దేవ దేవ!లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                           91

 

. భజియింతున్ హర! నిత్యకృత్యముల నిన్ భావించుచున్ సర్వదా.

ఋజుమార్గంబు జరించు వారిఁ గనుచున్ దృప్తిన్ గనన్ గోరుచున్

సృజియింతున్ గవనామృతంబు కవిగా సేవింతు భక్తాళినే.

సృజనన్ గొల్పెడి దేవ దేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                     92

 

. కలలోనైనను గాంచఁగాఁ దగనొకో కల్యాణ రూపా నినున్?

బలుమారిద్ధరఁ బ్రార్థనల్ సలిపితిన్ భావింపలేవా హరా?

సులభుండీవని యందురందరు హరా! శోభిల్లవా నా మదిన్?

శిలగాఁ గన్బడు దేవ దేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                             93

 

. పలుమారీవె యనుంగు తమ్ముఁడగుచున్ భక్తిన్ బ్రదర్శింతువే!

తెలియన్ జాలని వెల్లఁ దెల్పుదువె. లేదే నీకహంకారమే.

తెలియన్ నేర్వక నిన్ను గాంచను గదా దీపించుచున్నన్ హరా!

శిలగాఁ గన్బడు దేవ దేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                  94

 

శా చింతా వంశజ రామకృష్ణుఁడ. సదా చింతల్ ననున్ వ్రేచు టొ

క్కింతైనన్ గనకుందువా? కనినచో హృద్యంబుకాన్ బాపవా?

యంతా నీ దయ దేవ దేవ! కని, మోహాదుల్ విడన్ జేయుమా.

చింతల్ తీర్చెడి భవ్య భావ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                             95

 

శా. శాంతిన్, సౌఖ్యము, సత్య చింతనమునన్ చక్కంగ నన్ దేల్చుమా.

భ్రాంతుల్ బాపుమ. భద్ర తేజమిడుమా. భక్తిన్ సదా నిల్పుమా

యెంతైనన్ నిను గొల్చువాఁడను సుమా. సృష్టించితీవే ననున్.

జింతల్ తీర్చెడి భవ్య భావ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                               96

 

శా. వింతల్ పెక్కులు గొల్పువాఁడవు హరా! విశ్వంబునందున్ సదా.

సాంతం బెవ్వఁ డెఱుంగఁ గల్గు నిను? నాశాంతంబు భాసింతువే.

స్వాంతంబందు స్మరించుటొక్కటె తగున్ సత్వస్వరూపా! నినున్.

చింతల్ తీర్చెడి భవ్య భావ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                             97

 

శా. భ్రాంతిన్నేను జరించుచుంటిని మహాభాగా! నినున్ వీడుచున్.

బంతంబున్ విడనాడి నన్నుఁ గనుమా. పద్యంబులన్ వ్రాయుచో

స్వాంతంబున్ వసియించు నీవె రచనన్ వర్థిల్లఁగాఁ జేసితే!

చింతల్ తీర్చెడి భవ్య భావ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                           98

 

. నుత మందాకిని నీతలన్ నిలిచినన్ నొప్పించదా పార్వతీ

సతి నిన్నెప్పుడదెంత భాగ్యమొ కదా!  సత్వప్రభామూర్తియై.

నుతియింతున్ మిమునందరిన్ గరుణతో నొప్పింపకన్, నన్నికన్

గృతకృత్యుండుగఁ జేయుమయ్య. లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                                 99

 

శా. క్షుత్తాపంబును బాపు హాలికులకున్ గూడేల లేకుండెనో?

మృత్తున్ నమ్మిన వారలన్ గనుమయా ప్రీతిన్. దురాచారులన్

మత్తున్ గన్నులఁ గాననట్టి జనులన్ మర్దించు సత్పూజ్యుఁడా!

చిత్తేజంబయి వెల్గుచున్న లలితా శ్రీ చంద్రమౌళేశ్వరా!.                        100

 

. ధరనెవ్వారలు భక్తియుక్తులగుచున్ ధర్మార్థులై పద్యముల్

కరుణోద్ధాముఁడవైన నిన్ను మదులన్ గాంక్షించుచున్ గాంచఁగా,

వరలన్ దీక్షఁ బఠింత్రు, వారికిలలోఁ బ్రఖ్యాతిఁ జేకూర్చుమా.

చిర కీర్తిప్రద దేవదేవ ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా                                       101

 

. నినుఁ జూడన్ బరతెంచినట్టి సుజనుల్ నీవారలే. వారలన్

గనుమా. కోర్కెలు తీర్చుమా. కరుణతోఁ గాపాడుమా. శంకరా!

మునుమున్ లోక హితార్థులై చెలఁగగాఁ,బూజ్యుండ! కావింపుమా.

చినవారిన్ బ్రభవింపఁ జేయు లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా                                102

 

. నినునిచ్చోటున నిల్పినందునను జ్ఞానిన్ బండరీ వంశజున్

ఘన సంస్కారయుతున్, మహోన్నత గుణున్ గల్పాంతమున్ నిల్పుమా.

తన వంశ స్థితి తృప్తిఁ గొల్పఁ దనకున్ దక్షుండవై చేయుమా.          

చినవారిన్ బ్రభవింపఁ జేయు లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా                             103

 

శా. స్త్రీలే జాతికి మూలమయ్యు, జగతిన్ జీవింపలేకుండిరే!

యేలా కావవు స్త్రీలనీశ? భరమాయెన్ వారికీజన్మమే.

జాలిన్ గొల్పుచునుండె వారి బ్రతుకుల్. చాలింక. నీ జాగు. యీ

స్త్రీలన్ బ్రోవుము ప్రేమతోడ లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!.                                   104

 

శా. భస్మంబున్ గొని మేనికద్దిన ననున్ భాసిల్లఁగాఁ జేయు నీ

వస్మ ద్దైవమటంచు నెంచి మది నిన్ భాసిల్లఁగాఁ జేయఁగా

భస్మంబున్ దనువెల్లఁ బూసుకొనుదున్. భాస్వన్మణీ! శంకరా!

శ్రీస్మేరాంచిత దేవదేవ! లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా!                               105

 

శా. జీవంబెన్నఁగ నీదు తేజమె హరా! జీవించ నే నెవ్వడన్?

భావింపన్ బరమాత్మవీవె. మహితా! భావించుఁ జేరంగ నిన్

జీవాత్మే. తుదఁ జేర్చుకొమ్ము గృపతో. జీవేశ! సర్వేశ్వరా!

జీవాత్మన్ బరమాత్మ జేర్చు లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!.                           106

 

. కృతినీవే రచియింపఁ జేసితివి నీ దృష్టిన్ ననున్ నిల్పి.

మ్మతితో దీని గ్రహింపుమయ్య. దొసగుల్ మన్నించు ప్రేమన్ హరా!

క్షితినీ పద్యములన్ బఠించ శుభముల్ శ్రీలొందఁగా జేయుమా

కృతధర్మంబు రచించి కాచు. లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా.             107

 

. క్షితిజుల్ కాంచుత మంగళంబులు. శుభశ్రీ మంగళంబుల్ సదా

హితులై సత్ కవులైనవారి కిలలో హిందుత్వమున్ బెంచు స్వ

చ్ఛతతో వెల్గెడి వారికిద్ధర సదా సన్మంగళంబుల్ హరా!

శ్రిత మందార! సుమంగళంబు. లలితా శ్రీచంద్రమౌళీశ్వరా!                          108     

స్వస్తి.                                              తే.

                 lord-shiva.jpg     ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు

.            CRK-20180821-WA0013.jpg

                                                                         

                                                    తే. 10 . 12 . 2019.

 

నేను,  నా పరిచయం.

 

కృతికర్త. 

భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A.,

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు    

    ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ

     రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు

      పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే

     శతకమున మూడు మకుటములతో మూడు శతకములు.)

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

      పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత

      పాద ఉత్పలమాలిక.

 

 

 

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.