గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2024, సోమవారం

శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము. (గర్భకవితామృతము) రచన. చింతా రామకృష్ణారావు.

శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము. 

(గర్భకవితామృతము)

రచన.  చింతా రామకృష్ణారావు.


భక్త జన పోష ! భవశోష ! పాపనాశ !

శ్రితజనోద్భాస ! యాదాద్రి శ్రీనృసింహ !

చరవాణి సంఖ్య.  9 2 4 7 2 3 8 5 3 7 //…//  8 2 4 7 3 8 4 1 6 5

అక్షరక్రమములో 118 వివిధ ఛందముల వివరములు.

శతకమునందలి సీస పద్యముల సంఖ్య 108.

108 సీసపద్యములందు గర్భితములైయున్న పద్యములందున్న వివిధ ఛందముల సంఖ్య 118.

అక్షరక్రమములో 118 వివిధ ఛందముల వివరములు.

క్రమ సంఖ్య/సీస గర్భస్థ పద్య నామము/శతకములోని సీస పద్య సంఖ్య/(పద్య లక్షణము)

01 అంతరాక్కర - 44. (1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము .. యతి 3 గణము చివరి అక్షరము)

చంద్ర గణములు.

రగ/నగగ/తగ/సలగ/భగ/నలగ/మల/సగల/రల/నగల/తల/సలల/భల/నలల)

02 అంబురుహ - 70. (       .. యతి 13)

03 అజితప్రతాప - 68. (1.3పాదములకు .. యతి 9 / 2.4 పాదములకు .. యతి 8)

04 అతివినయ - 4. ( .. యతి 11)

05 అపరాజిత - 71. (     .. యతి 9)

06 అలసగతి - 51. ( .. యతి 10)

07 అశ్వగతి - 72. ( .. యతి 10)

08 ఆటవెలది - 14.18. 44. (1.3.పాదములలో 3సూ..2 ఇం.., 2.4. పాదములు 5 సూ..

యతి 4 గణము మొదటి అక్షరము. ప్రాస యతి చెల్లును)

09 ఇందువదన - 69. (     .. యతి 9)

10 ఇంద్రవజ్ర - 74. ( గగ .. యతి 8)

11 ఉత్కళిక  - 98. (ఉత్కళిక - రెండు పాదములు. పాదమునకు 4 త్రిమాత్రాగణములు. అంత్యప్రాస కలదు)

12 ఉత్సాహ – 18. 38. (7 సూర్య గణములు 1 గురువు .. యతి 5 గణము 1 అక్షరము)

13 ఉపజాతి - 76. (1.3పాదములు తతజగగ ఇంద్రవజ్ర - 2.4పాదములు జతజగగ ఉపేంద్రవజ్ర. .. యతి 8)

ఇంద్రవజ్ర. - ఇత్తా, , గా సంగతి - నింద్రవజ్రా-వృత్తంబగున్సన్నుత - వృత్తరేచా!

ఉపేంద్రవజ్ర. - సపద్మ పద్మా! జత - జల్గగంబున్ - ఉపేంద్ర వజ్రాఖ్యము - నొప్పుఁజెప్పన్.

ఉపజాతి - రెండు వృత్తంబులు - నిందుఁగూడన్=సరోజనేత్రా! యుప - జాతి యయ్యెన్.

(భీమన ఛందము)

14 ఉపేంద్రవజ్ర - 75. (   గగ .. యతి 8)

15 ఊర్వశి - 33. ( .. యతి 8)

16 కంద - 100. (1.3.పాదములలో 3 చొప్పున 2.4. పాదములలో 5 చొప్పున "నల-నగ-సల---"

అనేగణములే రావచ్చును.4వగణము1 అక్షరముతో7వగణము1 అక్షరమునకుయతి.

ప్రాస కలదు. ప్రాస యతి చెల్లదు. జగణము2.4.6. గణములలోనే రావచ్చును.

6వగణము నల లేదా మాత్రమే రావలయును. 8 గణము చివర గురువు రావలెను)

17 కమలవిలసిత - 92. ( గగ.. యతి 9)

18 కమలాకర - 93. ( .. యతి 11)

19 కలరవ - 77. (    లగ .. యతి 8)

20 కలిత - 31. ( .. యతి 12)

21 కవిరాజవిరాజిత - 28. ( లగ .. యతి 1-8-14-20)

22 కుసుమవిచిత్ర - 63. ( .. యతి 7)

23 కోకిలక - 100. ( .. యతి 1-8-14)

24 కోమల - 83. (1.3పాదములు ..  యతి 8/ 2.4 పాదములు  .. యతి 9)

సలలితరీతి నజాయగణంబుల్ - చళుక్యభూప జభసజస్థగస్థితిన్.

మలయుచునర్థసమర్థతచేతన్ - వెలుంగఁ గోమల మను వృత్త మొప్పగున్.

25 కౌముది - 15. ( .. యతి 6)

26 గజవిలసితము - 10. ( .. యతి 8)

27 గాథా - 108. (విలక్షణ గురులఘు క్రమముతో ఎక్కువ తక్కువలు లేకుండా ఒక్కొక మారు మూడు లేక

ఒక్కొక మారు ఆరు చరణములు కలిగి పాడుకొనుటకు వీలు కలిగినది గాథా అను ఛందస్సుగా

ప్రసిద్ధికెక్కినది.गाथास्त्रिभिः षड्भिश्चरणैश्चोपलक्षिताः!! .१८ !! (केदार भट्टस्य  वृत्तरत्नाकरः)

28 గీతాలంబన - 61. ( .. యతి 8)

29 చంద్రలేఖ - 103. ( .. యతి 7)

30 చంద్రవర్త్మ - 101. ( .. యతి 7)

31చంద్రిక - 37. ( .. యతి 7) నగణయుగమునన్రవంబులన్- బ్రగుణరసవిరామసంగతిన్

తగిలి హరికథాసమేతమై - నెగఁడు గృతుల నిండి చంద్రికన్.

32 చంపకమాల - 1. 100. ( .. యతి 11)

33 చౌపద - 65. (4మాత్రాగణములు3, నగణము, అంత్యప్రాస .. యతి 3వగణాద్యక్షరము.జగణము వాడరాదు)

34 జలద - 66. (     .. యతి 10)

35 జాగ్రత్ - 107. ( గగ .. యతి 11)

36 జ్ఞాన - 8. ( .. యతి 10)

37 తరలి - 39. ( .. యతి 11)

38 తరల (ధృవకోకిల) - 9. ( .. యతి 12)

39 తరువోజ - 99. (3ఇం., 1సూ.. 3ఇం.. 1సూ.. యతి 1-3-5-7 గణాద్యక్షరములు)

40 తాండవజవము - 30. ( .. యతి 12)

41 తారక - 95. ( గగ .. యతి 11)

42 తురగవల్గిత - 97. ( .. యతి 15)

43 తేటగీతి - 44.100. (ప్రతీ పాదమున 1సూ.. 2ఇం.. 2 సూ..వచ్చును.

యతి 4 గణము 1 అక్షరము. ప్రాసయతి చెల్లును)

44 తోటక - 40. ( .. యతి 9)

45 తోదక - 59. ( .. యతి 8) జలరుహవక్త్ర! , - జా, యగణంబుల్

వెలయగఁ దోదక - వృత్తముఁ జెప్పున్. (భీమన ఛందము)

46 త్రిపది - 47. (1 పాదమున 4ఇం.. 2 పాదమున 2ఇం.. 2సూ.. 3 పాదమున 2 ఇం.. 1సూ.)

47 త్వరితపదగతి - 86. (     .. యతి 11)

48 దండక - 105. (అనేక తగణములు. చివర గగ)

49 దేవరాజ - 18. ( .. యతి 11)

50 ద్రుతవిలంబిత - 100. ( .. యతి 7)

51 ద్విపద - 7.9.99. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం..1సూ. .. యతి 3 గణము 1 అక్షరము)

52 ద్విరదగతిరగడ - 57. (2పాదములు. ప్రాస, అంత్య ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 5 మాత్రలు

గణములు 4 ఉండును. యతి 3 గణము 1 అక్షరము)

53 నది - 50. ( గగ .. యతి 8)

54 నర్కుట - 100. ( .. యతి 11)

55 నవనందిని - 81. (    గగ .. యతి 9)

56 నవమాలిని - 102. ( .. యతి 8)

57 నాందీముఖి - 82. (    గగ .. యతి 8)

58 నిశా వృత్తము - 46.( .. యతి 9)

59 పంక్తి - 106. ( .. యతి 7)

60 పణవము - 5. ( .. యతి 6)

61 పదమాలి - 79. ( .. యతి 10)

62 పాదప - 78. ( గగ .. యతి 7)  పాదపవృత్తము భాభగగంబుల్- మోదముతో నిరుమూఁటవిరామన్.

63 పాలాశదళ  లేదా శశిశోభ - 32. (15 లఘువులు గగ .. యతి 11)

64 ప్రణవము - 29. ( .. యతి 6)

65 ప్రభాత - 85. (     .. యతి 8)

66 ప్రమితాక్షర - 52. ( .. యతి 9)

67 ప్రముదితవదన - 23. ( .. యతి 8)

68 ప్రహరణకలిత - 67. (     .. యతి 8)

69 ప్రియంవద - 48. ( .. యతి 8)

70 ప్రియకాంత - 50. ( .. యతి 11)

71 ఫలసదన - 56. (   .. యతి 10)

72 బలభిన్మణి - 21. ( .. యతి 7)

73 బంభరగానము - 17. ( .. యతి 8)

74 భుజంగప్రయాత - 105. ( .. యతి 8)

75 భూతిలక - 94. ( .. యతి 12)

76 భూనుత - 73. ( గగ .. యతి 10) (భూనుత 2. గగ అని కొందరిమతము)

77 మంగళమణి - 96. ( .. యతి 11)

78 మంజరీద్విపద - 22. (3ఇం.. 1సూ.. యతి 3వగణము 1 అక్షరము. 2పాదములుండును.

ప్రాస నియమము లేదుప్రాసయతి చెల్లును)

79 మందారదామ - 54. ( గగ .. యతి 7)

80 మణిగణనికర - 58. ( .. యతి 9)

81 మణిభూషణ - 100. ( .. యతి 10)

82 మణిరంగ - 64. ( .. యతి 6)

83 మత్తకోకిల - 7.99. ( .. యతి 11)

84 మత్తహంసిని - 104. ( .. యతి 7)

85 మత్తేభ - 20. ( .. యతి 14)

86 మదన - 6. ( గగ .. యతి 9)

87 మధురాక్కర - 80. (1సూ.-3ఇం.-1చం. .. యతి 4 గణము 1 అక్షరము)

88 మధ్యాక్కర - 100. (2 ఇం.. 1 సూ.. 2 ఇం.. 1 సూ. .. యతి 4 గణము 1 అక్షరం)

89 మనోజ్ఞ - 25. (     .. యతి 10)

90 మనోహర - 62. (1.3. పాదములు కాంతా {గీతాలంబన} వృత్తము .. యతి 8.

2.4.పాదములు తోటక వృత్తము .. యతి 9)

91 మలయజము - 2. ( లగ .. యతి 1-8-15-22).

92 మానిని - 24. ( .. యతి 1-7-13-19)

93 మాలిని - 35. ( .. యతి 9)

94 మోహప్రలాప - 41. (     .. యతి 7)

95 మౌక్తికమాల - 60. ( గగ .. యతి 7)

96  రుచిర - 45. ( .. యతి 9)

97 లఘుసీసము - 42. (6`నలలలు. 2నగణములు .. మొదటి నాలుగు గణములు 1 అర్థ పాదము.2

4గణములు 2 అర్థ పాదము. 1 గణము 1 అక్షరముతో 3వగణము 1

అక్షరమునకు, 5 గణము 1 అక్షరముతో 7 గణము 1 అక్షరమునకు యతి.

ప్రాసయతి చెల్లును. పద్యాంతమున .వెలది కాని, తేటగీతి కాని తప్పక ఉండవలెను)

98 లత - 84. ( .. యతి 7)

99 లలితగతి - 13. ( .. యతి 11)

100 వంశపత్రపతిత - 3. ( .. యతి 11)

101 వనమంజరి - 87. (       .. యతి 14)

102 వనమయూర - 89. (    గగ .. యతి 9)

103 వరాంగి - 90. (1-2-4 పాదములు గగ, 3 పాదము గగ .. యతి 8)

సరిత్పదాబ్జా జతజల్గగల్బం - ధురం బగున్రెంట జతుర్థకాంఘ్రిన్

గారాముతోఁ దాజగగల్వరాంగిన్-హరార్చితా మూఁడవయంఘ్రి నొందున్.

104 వసంతతిలక - 88. (  గగ .. యతి 8)

105 వసంతమంజరి - 91. (       .. యతి 13)

106 విద్రుమలత - 36. ( .. యతి 8)

107 వృంతము - 43. ( గగ .. యతి 9)

108 శంభునటన - 12. ( .. యతి 1-10-18)

109 శతపత్ర లేదా చారుమతి - 11. ( .. యతి 1-13-17)

110 శార్దూల - 16. ( .. యతి 13)

111 శివశంకర - 19. ( .. యతి 11).

112 షట్పదద్వయ - 53. (1 పాదమునందు 2ఇం. . 2 పాదమునందు 2ఇం..

3 పాదమునందు 2ఇం. 1 చం. గణములు, 4 పాదమునందు 2ఇం. గణములు,

5 పాదమునందు 2ఇం. గణములు, 6 పాదమునందు 2ఇం. 1 చంద్ర గణములుండును.

యతి 3 పాదమునందు 3 గణము1వఅక్షరము6 పాదమునందు

3 గణము యొక్క 1 అక్షరము.

113 సన్నుత - 26. ( .. యతి 10)

114 సరసాంక - 34. ( .. యతి 10)

115 సర్వలఘుమధ్యాక్కర - 42. (2 ఇం.. 1 సూ.. 2 ఇం.. 1 సూ. .. యతి 4 గణము 1 అక్షరం)

116 సాధ్వీ - 27. ( .. యతి 1-8-15-22)

117 సుందర - 55. ( .. యతి 9)

118 స్రగ్విణి - 105. ( .. యతి 7)

Ref:

http://www.andhrabharati.com/bhAshha/ChaMdassu/ChaMdOdarpaNamu/index.html

(http://chandam.apphb.com/?chandassu=tel)

http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi  https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0/%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81

 

 

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి అష్టోత్తరశత నామాంచిత పద్య వివరణ.

1. ఓం నారసింహాయనమః.

చంపకమాల వృత్త గర్భ సీసము.

2. ఓం మహాసింహాయ నమః.

మలయజ వృత్త గర్భ సీసము.

3. ఓం దివ్యసింహాయ నమః.

వంశపత్రపతిత వృత్త గర్భ సీసము.

4. ఓం మహాబలాయ నమః.

అతివినయ వృత్త గర్భ సీసము.

5. ఓం ఉగ్రసింహాయ నమః.

పణవ వృత్త గర్భ సీసము

6. ఓం మహాదేవాయ నమః.

మదన వృత్త గర్భ సీసము.

7. ఓం స్తంభజాయ నమః.

మత్తకోకిల వృత్త - ద్విపదద్వయ గర్భ సీసము.

8. ఓం ఉగ్రలోచనాయ నమః.

జ్ఞాన వృత్త గర్భ సీసము.

9. ఓం రౌద్రాయ నమః.

తరల వృత్త - ద్విపదద్వయ గర్భ సీసము.

10. ఓం సర్వాద్భుతాయ నమః.

గజవిలసిత వృత్త గర్భ సీసము.

11. ఓం శ్రీమతే నమః.

శతపత్ర వృత్త గర్భ సీసము.

12. ఓం యోగానందాయ నమః.

శంభునటన వృత్త గర్భ సీసము.

13. ఓం త్రివిక్రమాయ నమః.

లలితగతి వృత్త గర్భ సీసము.

14. ఓం హరయే నమః.

ఆటవెలది గర్భ సీసము.

15. ఓం కోలాహలాయ నమః.

కౌముది వృత్త ద్వయ గర్భ సీసము.

16. ఓం చక్రిణే నమః.

శార్దూల వృత్త గర్భ సీసము.

17. ఓం విజయాయ నమః.

బంభరగాన వృత్త గర్భ సీసము.

18. ఓం జయవర్ధనాయ నమః.

ఆటవెలదిద్వయ - దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము.

19. ఓం పంచాననాయ నమః.

శివశంకర వృత్త గర్భ సీసము.

20. ఓం పరబ్రహ్మణే నమః.

మత్తేభ వృత్త గర్భ సీసము.

21. ఓం అఘోరాయ నమః.

బలభిన్మణి వృత్త గర్భ సీసము.

22. ఓం ఘోరవిక్రమాయ నమః.

మంజరీద్విపద చతుష్టయ గర్భ సీసము.

23. ఓం జ్వలన్ముఖాయ నమః.

ప్రముదితవదన వృత్త గర్భ సీసము.

24. ఓం మహాజ్వాలాయ నమః.

మానిని వృత్త గర్భ సీసము.

25. ఓం జ్వాలామాలినే నమః.

మనోజ్ఞ వృత్త గర్భ సీసము.

26. ఓం మహాప్రభవే నమః.

సన్నుత వృత్త గర్భ సీసము.

27. ఓం నిటలాక్షాయ నమః.

సాధ్వీ వృత్త గర్భ సీసము.

28. ఓం సహస్రాక్షాయ నమః.

కవిరాజవిరాజిత వృత్త గర్భ సీసము.

29. ఓం దుర్నిరీక్షాయ నమః.

ప్రణవ వృత్త గర్భసీసము.

30. ఓం ప్రతాపనాయ నమః.

తాండవజవ వృత్త గర్భ సీసము.                                                                                                                             

31. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః.

కలిత వృత్త గర్భ సీసము.

32. ఓం ప్రాఙ్ఞాయ నమః.

పాలాశదళ వృత్త గర్భ సీసము.

33. ఓం చండకోపినే నమః.

ఊర్వశి వృత్త గర్భ సీసము.

34. ఓం సదాశివాయ నమః.

సరసాంక వృత్త గర్భ సీసము.

35. ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః.

మాలిని వృత్త గర్భ సీసము.

36. ఓం దైత్యదానవభంజనాయ నమః.

విద్రుమలత గర్భ సీసము.

37. ఓం గుణభద్రాయ నమః.

చంద్రికాద్వయ గర్భ సీసము.

38. ఓం మహాభద్రాయ నమః.

ఉత్సాహ వృత్త గర్భ సీసము.

39. ఓం బలభద్రకాయ నమః.

తరలి వృత్త గర్భ సీసము.

40. ఓం సుభద్రకాయ నమః.

తోటక గర్భ సీసము.

41. ఓం కరాళాయ నమః.

మోహప్రలాప వృత్త గర్భ సీసము.

42. ఓం వికరాళాయ నమః.

సర్వ లఘు మధ్యాక్కర గర్భ లఘు సీసము.

43. ఓం వికర్త్రే నమః.

వృంత వృత్త గర్భ సీసము.

44. ఓం సర్వకర్తృకాయ నమః.

అంతరాక్కర - తేటగీతి - ఆటవెలదిద్వయ గర్భ సీసము.

45. ఓం శింశుమారాయ నమః.

రుచిర గర్భ సీసము.

46. ఓం త్రిలోకాత్మనే నమః.                                                                                                                                  

నిశా వృత్త గర్భ సీసము.

47. ఓం ఈశాయ నమః.

త్రిపదిద్వయ గర్భ సీసము.

48. ఓం సర్వేశ్వరాయ నమః.

ప్రియంవద వృత్త గర్భ సీసము.

49. ఓం విభవే నమః.

ప్రియకాంత వృత్త గర్భ సీసము.

50. ఓం భైరవాడంబరాయ నమః.

నది వృత్త గర్భ సీసము.

51. ఓం దివ్యాయ నమః.

అలసగతి వృత్త గర్భ సీసము.

52. ఓం అచ్యుతాయ నమః.

ప్రమితాక్షర వృత్త గర్భ సీసము.

53. ఓం కవిమాధవాయ నమః.

షట్పదద్వయ గర్భ సీసము.

54. ఓం అధోక్షజాయ నమః.

మందారదామ గర్భ సీసము.

55. ఓం అక్షరాయ నమః.

సుందర వృత్త గర్భ సీసము.

56. ఓం శర్వాయ నమః.

ఫలసదన వృత్త గర్భ సీసము.

57. ఓం వనమాలినే నమః.

ద్విరదగతిరగడ ద్వయ గర్భ సీసము.

58. ఓం వరప్రదాయ నమః.

మణిగణనికర వృత్త గర్భ సీసము.

59. ఓం విశ్వంబరాయ నమః.

తోదక వృత్త గర్భ సీసము.

60. ఓం అద్భుతాయ నమః.

మౌక్తికమాల వృత్త గర్భసీసము.

61. ఓం భవ్యాయ నమః

గీతాలంబన గర్భ సీసము.

62. ఓం శ్రీవిష్ణవే నమః..

మనోహర వృత్త గర్భ సీసము.

63. ఓం పురుషోత్తమాయ నమః.

కుసుమవిచిత్ర వృత్త గర్భ సీసము.

64. ఓం అనఘాస్త్రాయ నమః.

మణిరంగ వృత్త గర్భ సీసము.

65. ఓం నఖాస్త్రాయ నమః..

చౌపద గర్భ సీసము.

66. ఓం సూర్య జ్యోతిషే నమః

జలద వృత్త గర్భ సీసము.

67. ఓం సురేశ్వరాయ నమః.

ప్రహరణకలిత వృత్త గర్భ సీసము.

68. ఓం సహస్రబాహవే నమః.

అజితప్రతాప గర్భ సీసము.

69. ఓం సర్వఙ్ఞాయ నమః.

ఇందువదన వృత్త గర్భ సీసము.

70. ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః.

అంబురుహ వృత్త గర్భ సీసము.

71. ఓం వజ్రదంష్ట్రాయ నమః.

అపరాజిత వృత్త గర్భ సీసము.

72. ఓం వజ్రనఖాయ నమః.  .

అశ్వగతి వృత్త గర్భ సీసము.

73. ఓం మహానందాయ నమః.

భూనుత గర్భ సీసము.

74. ఓం పరంతపాయ నమః

ఇంద్రవజ్ర వృత్త గర్భ సీసము.

75. ఓం సర్వమంత్రైకరూపాయ నమః.

ఉపేంద్రవజ్ర గర్భ సీసము.

76. ఓం సర్వతంత్రాత్మకాయ నమః.

ఉపజాతి వృత్త గర్భ సీసము.

77. ఓం సర్వయంత్రవిదారణాయ నమః.

కలరవ వృత్త గర్భ సీసము.

78. ఓం అవ్యక్తాయ నమః.

పాదపము లేదా తోదకము లేదా దోధకము - గర్భ సీసము.

79. ఓం సువ్యక్తాయ నమః

పదమాలి వృత్త గర్భ సీసము.

80. ఓం భక్తవత్సలాయ నమః.

మధురాక్కర గర్భ సీసము.

81. ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః.

నవనందిని వృత్త గర్భ సీసము.

82. ఓం శరణాగత వత్సలాయ నమః.

నాందీముఖి వృత్త గర్భ సీసము.

83. ఓం ఉదార కీర్తయే నమః.

కోమల వృత్త గర్భ సీసము.

84. ఓం పుణ్యాత్మనే నమః.

లత గర్భ సీసము.

85. ఓం మహాత్మనే నమః.

ప్రభాత వృత్త గర్భ సీసము.

86. ఓం చండవిక్రమాయ నమః.

త్వరితపదగతి వృత్త గర్భ సీసము.

87. ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః.

వనమంజరి వృత్త గర్భ సీసము.

88. ఓం భగవతే నమః.

వసంతతిలక వృత్త గర్భ సీసము.

89. ఓం పరమేశ్వరాయ నమః.

వనమయూర వృత్త గర్భ సీసము.

90. ఓం శ్రీవత్సాంకాయ నమః.

వరాంగి వృత్త గర్భ సీసము.

91. ఓం శ్రీనివాసాయ నమః.

వసంతమంజరి వృత్త గర్భ సీసము.

92. ఓం జగద్వ్యాపినే నమః.

కమలవిలసిత (లేదా సురుచిర లేదా ఉపచిత్ర లేదా సుపవిత్ర) వృత్త గర్భ సీసము.

93. ఓం జగన్మయాయ నమః.

కమలాకర వృత్త గర్భ సీసము.

94. ఓం జగత్పాలాయ నమః.

భూతిలక వృత్త గర్భ సీసము.

95. ఓం జగన్నాధాయ నమః.

తారక వృత్త గర్భ సీసము.

96. ఓం మహాకాయాయ నమః.

మంగళమణి గర్భ సీసము.

97. ఓం ద్విరూపభృతే నమః.

తురగవల్గిత వృత్త గర్భ సీసము.

98. ఓం పరమాత్మనే నమః.

ఉత్కళిక చతుష్టయ గర్భ సీసము.

99. ఓం పరంజ్యోతిషే నమః.

గోమూత్రికాబంధ గూఢ పంచమ పాద యుక్త తరువోజ - మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.

100. ఓం నిర్గుణాయ నమః.

1.చంపక,2.మధ్యాక్కర, 3.నర్కుట, 4.కోకిలక, 5.మణిభూషణ, 6.ద్రుతవిలంబిత, 7.కంద,8.గీత గర్భసీసము.

101. ఓం నృకేసరిణే నమః.

చంద్రవర్త్మ వృత్త గర్భ సీసము.

102. ఓం పరతత్త్వాయ నమః.

నవమాలిని వృత్త గర్భ సీసము.

103. ఓం పరస్మైధామ్నే నమః.

చంద్రలేఖ వృత్త గర్భ సీసము.

104. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః.

మత్తహంసిని వృత్త గర్భ సీసము.

105. ఓం లక్ష్మీనృసింహాయ నమః.

దండక - స్రగ్విణి - భుజంగప్రయాతపంచక గర్భ సీసమాలిక.

106. ఓం సర్వాత్మనే నమః.

పంక్తి గర్భ సీసము.

107. ఓం ధీరాయ నమః.

జాగ్రత్ వృత్త గర్బిత సీసము.

108. ఓం ప్రహ్లాదపాలకాయ నమః.

గాథా ఛందోయుత మంగళ గీతిక గర్బ సీసము.

 

 

 

 

 

 

 

4. ఆముఖము.

శా. శ్రీమన్మంగళ దివ్యరూప! వరదా! శ్రీ నారసింహప్రభూ!

ప్రేమన్ లోకహితంబుఁ గూర్చుచు సదా విఖ్యాత యాదాద్రి శ్రీ

ధామంబందునఁ బూజలన్ వినఁబడున్. త్వన్నామముల్ దీప్తిగా

నా మంజుధ్వనినెంచి కూర్తు శతకం బష్టోత్తరంబొప్పుగన్. 1.

భావము.

మంగళప్రదమయిన లక్ష్మీప్రదమయిన రూపముగలిగిన వరదాయివయిన లక్ష్మీనరసింహా! ఎల్లప్పుడూ నీ అష్టోత్తర శత

నామములు ప్రేమతో లోకమునకు మేలును కూర్చుచు ప్రసిద్ధమయిన యాదగిరిపై పూజలలో వినబడుచుండును.

మనోహరముగా ధ్వనించు నామములను స్వీకరించి అష్టోత్తరశతకమును కూర్చుదును.

. అగణిత దివ్య ధాత్రిని జయంబులనిచ్చెడి శ్రీ నృసింహ! యీ

జగతి శుభాస్పదంబుగను, సజ్జనపాళికి స్వర్గధామమై,

ప్రగణిత వేదభూమిగ ప్రభావితమౌనటు చేయుమయ్య! నీ

సుగుణచయంబులన్ దెలిపి చూపఁగ నన్నుననుగ్రహింపుమా! 2.

భావము.

వర్ణింప శక్యముకాని గొప్పదైన భూమిపై జయమునను ప్రసాదించెడి లక్ష్మీ నరసింహా! లోకము శుభములకు తావు

అగునట్లుగనుండి మంచి వారికి స్వర్గ ధామమగుచు, మిక్కిలి పొగడఁబడెడివేద భూమిగ ప్రభావము పొందు  విధముగ

ఒనరింపుము. నీలో ఉన్న మంచి గుణముల సమూహమును నేను తెలుపుచు పాఠకులకు నిన్ను చూపించువిధముగ

నన్ననుగ్రహింపుము.

పరమాత్మ స్వరూపులైన కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య గురుదేవులు.

. శౌర్యతనొప్పి యాదగిరి సత్ప్రభ పెంచిన శ్రీ నృసింహ! నా

ధుర్యుఁడ! నీకిలన్ శతకతోయజ సత్కృతిఁ జేయఁ జేయ నే

నార్యులు కల్వపూడి సుమహాబ్ధిజ వేంకట వీర రాఘవా

చార్య గురూత్తమున్ గొలిచి, సాగిలి మ్రొక్కుదు భక్తియుక్తునై. 3.

భావము.

సౌర్యముతో ప్రకాశించుచు యాదగిరి యొక్క మంచి ప్రభను అధికము చేయుచున్న నరసొంహా! నా బాధ్యతను

వహించినవాఁడా ధరిత్రిపై నీకు శతకపద్యపద్మములతో  సత్కారము చేయునట్లు చేయుట కొఱకు నేను నా

గురువులగు కల్వపూడి వీరవేంకట రాఘవాచార్యులవారిని కొలిచి, సాష్టాంగ నమస్కారము భక్తితో చేయుచుంటిని.

. నిరతము నీ పదాబ్జములనే స్పృశియించుచు సేవఁ జేయు ధీ

వరులు, పునీత జన్ములు, వివర్జిత కామ మహాత్ములర్చకుల్.

పరమ పవిత్ర భక్తులగు వారి పదాబ్జ పరాగమంటినన్

దెరవును జూపు నిన్ గనఁగ. దివ్యుఁడ! నాకు లభింపఁ జేయుమా! 4.

భావము.

దివ్యుఁడవైన నరసింహా! ఎల్లప్పుడూ నీ పాద పద్మములనే తాకుచు,సేవచేయుచున్నటువంటి జ్ఞానశ్రేష్టులైన

అర్చకస్వాములు పవిత్రమైన జన్మ కలవారు.ఐహిక వాంఛలు లేనటువంటి మహనీయులు. నీకు పరమ భక్తులైన

అర్చకుల పాదధూళి సోకినంతనే నిన్ను కనుగొను మార్గము గోచరించును కదా. అట్టి వారి పాద ధూళి నాకు ప్రాప్తింపఁ

జేయుము.

సీ. పురుషోత్తమా! నేను సరస సత్కవి కల్వ - పూడి వంశోద్భవ పుణ్య మూర్తి

వినుత శ్రీ వేంకట వీర రాఘవ సదా - చార్యుల శిష్యుఁడ నార్య నుతుఁడ.

చిత్ర, బంధ సుగర్భ చిత్రపద్యములల్ల - మహిని చిత్రకవిసామ్రాట్టుననుచు

నల కోట నరసింహుఁ డిల నన్నుమెచ్చిన - చింతాన్వయుండను, చేరితి నిను.

గీ. రామకృష్ణాఖ్యు, సన్యాసిరామ పుత్రు            

జనని వేంకటరత్నము. కనుమ నన్ను.    

భక్త జన పోషభవశోషపాపనాశ

శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ! 5.

భావము.

భక్తజనులనుపోషించునట్టి, చెడును నశింపఁజేయునటువంటి, పాపములను హరించునటువంటి  సత్యప్రకాశుఁడవయిన

శ్రీ యాదాద్రి పురుషోత్తమా! నారసింహా! నేను సరస సత్కవి యైన కల్వపూడి వేంకటవీర రాఘవాచార్యులవారి శిష్యుఁడను.

పెద్దల సన్నుతిభాగ్యుఁడను. చిత్ర బంధ గర్భ కవితలల్లువాడనగుటచే నన్ను చిత్రకవితా సామ్రాట్టుననుచు అవధాని

బ్రహ్మశ్రీ కోట నరసింహము గారిచే ప్రశంసింపఁబడినవాడను. చింతా వంశజుఁడను, సన్యాసిరామారావు, వేంకటరత్నము

పుణ్యమూర్తుల సుతుఁడను. అటువంటి నన్ను నీవు ఆనందప్రదముగ చూడము.

. అష్టోత్తరశత నామము   -  లిష్టంబుగఁ జేర్చి చిత్ర మేర్పడ సీసం 

బష్టోత్తర శతసంఖ్యను   -  సృష్టింతును నీదు కృపను శ్రీశ! నృసింహా! 6.

భావము.

లక్ష్మీపతివైన నారసింహా! నీ నూటయెనిమిది నామములను ప్రీతితో చేర్చి నూటయెనిమిదిసీసపద్యములనునీకృపచే

వ్రాయుదును.

. పెక్కు ప్రసిద్ధ ఛందముల విస్తృతినొప్పెడి గర్భ సీసముల్,

చక్కని దండకాదులు ప్రశస్తిగనొప్పఁగ సీసమాలికల్,

మ్రొక్కఁగ నిన్ను పాటలను, పొల్పు వహించెడి సీసపద్యముల్,

నిక్కము వ్రాయనెంచితిని, నీవె రచింపఁగ చేయుమా హరీ! 7.

భావము.

నృహరీ! అనేకమైన సుప్రసిద్ధ ఛందములు విస్త్రుతముగా గర్భితమై ఒప్పునట్లుగను, మనోజ్ఞమైన దండకము

మొదలగునవి గర్భితమై ఒప్పురీతిని,నిన్ను మనసారా మ్రొక్కుటకనుకూలమైన పాటలు గర్భితమై ఒప్పునట్లును,

ప్రసిద్ధికెక్కు సీసపద్యములను ఖచ్చితముగ వ్రాయనెంచితిని. నీవే శక్తికొలిపి రచించునట్లుగా నన్ను చేయుము.

. ఇట్టి ప్రయత్నమందు పరమేశ్వర నీ కృపఁ గల్గి యుండుటన్

బట్టు ననేక ఛందములు భాసిలు సీసములందు, నింక నీ

వెట్టుల యానతిచ్చిన మహేశ్వర నిన్గని వ్రాయుదట్టులే.

గుట్టుగ నా మదిన్ నిలిచి కోరిక తీర రచింపుమా హరీ! 8.

భావము.

ఇటువంటి ప్రయత్నములో నీ కృప ఉండుట చేత సీపద్యములలో వివిధ ఛందములు గర్భితములయి ప్రకాశించును.

ఇంక నీవు విధముగ ఆనతినిత్తువో ఆవిధముగా నిన్నుచూచుచు వ్రాయుదును.నీవు గుంభనముగా నా మదిలో

మెదలుచు నా కోరికను తీరునట్లు నాచే రచింపఁజేయుము.

. గుణములు పెక్కులుండనగుఁ గోమల సత్శతకంబునందు.

ద్గుణ రహితంబునై సొగసు కోల్పడి యుండియునుండవచ్చు, దు

ర్గుణ రహితంబుగాఁ, గుసుమ కోమలమై, వర భావ సంపదన్,

మనమున భక్తిఁ గొల్పునటు, మన్ననలంద, రచింపఁ జేయుమా! 9.

భావము.

నేను రచింపఁబూనిన శతకమున సద్గుణములు పెక్కు ఉండవచ్చును, లేదా గుణరహితమైయుండిఅందము

నశించియైనను ఉండవచ్చును. చెడు గుణములు లేని విధముగను, పూలవలె సుకామారముగానొప్పిశ్రేష్టమైన

భావమనెడి సంపదతో ఒప్పునట్లు, పాఠకుల మదులలో భక్తి భావమును కొలుపు విధముగను, అందరి మన్ననలు

పొందునట్లుగను నాచే రచన చేయించుము.

. పరిపూర్ణ మానసంబున   -  స్థిరముగ యాదాద్రి శ్రీ నృసింహ శతకమున్,

ధర చదువు సుజన పాళికి   -  వరముగ నీవుండి కాచి వరలు నృసింహా! 10.

భావము.

నారసింహా! నిండు మనసుతో యాదాద్రి శ్రీ నృసింహశతకమును చదువు సుజనులైన పాఠకుల వరముగా నీవే ఉండి

కాపాడుచూ నీవు ప్రసిద్ధిగానుండుము.

 

 

 

అంకితము.

కృతిభర్త. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి.

. భద్రతనిచ్చు శ్రీపతికి, భాగ్య విధాతకు, బ్రహ్మ తాతకున్.

సద్రమణీయ రత్న విలసన్నుత సజ్జన సేవ్య భద్ర యా

దాద్రి నృసింహదేవునకు, హారముగా నొనరింప నిచ్చెదన్

మద్రచనన్ గృపన్ గొనఁగ. మార్గ సుదర్శి నృసింహ మూర్తికిన్. 11.

భావము.

సుజనులకు భద్రత కల్పించెడి లక్ష్మీపతికి, భాగ్యవిధాతయైన హరికి, భక్త రక్షకునకు, మంచిరమణీయమైన

రత్నకాంతులతోవిలసించి ప్రకాశించుచు, సజ్జనుల సేవలందుకొనుచున్న భద్రమైన యాదాద్రి వాసుఁడైన,

మార్గదర్శియైన శ్రీనరహరికి, ఆభరణముగా చేయుటకొఱకు శతకమును కృపతో స్వీకరించుట కొఱకు నంకితమిత్తును.

సీ. యదుసింహు నునికిచే యాదగిరి వెలిసె. - యదుసింహుడే నేటి మధుర నృహరి.

చినజియ్యరులవారి చిత్తమందున వెల్గి - యాదాద్రిగా మారె యాదగిరియు.

చంద్రశేఖరరావు జరిపించ యజ్ఞముల్ - యాదాద్రి వేదాద్రి యనఁగనొప్పె.

వేదాద్రియైన యీ యాదాద్రి వాస! నీ - సంతసంబునకేను శతకమల్లి,

గీ. చిత్ర కవితయౌ గర్భ సత్ సీసములను

నీదు నామాంచితంబుగా నేర్పుమీర

వ్రాసితిని, రామకృష్ణుఁడ, భక్తితోడ.

స్వీకరింపుము తృప్తిగా శ్రీ నృసింహ! 12

భావము.

యదుసింహుఁడై పరమాత్మ ఉనికి వలననే యాదగిరి ప్రసిద్ధమై వెలిసెను.నాటి యదు సింహుఁడే నేటి యీ మధుర

నరసింహుఁడు. స్వామి చినజియ్యరుస్వామి మనసులో వెలిగి యాదగిరి యాదాద్రిగా మారెను. మన రాష్ట్ర ముఖ్య

సచివులు చంద్రశేఖరరావు యజ్ఞములు జరిపించుటచే యాదాద్రి వేదాద్రియాయనునట్లొప్పెను. వేదాద్రియైన శ్రీ

యాదాద్రిని నివాసముగా కలఓ నరసింహా!నీ సంతోషము కొఱకు నేను శతక రచన చేసిచిత్ర కవితగా నలరారునట్లు

అనేకఛందోగర్భ సీసములను నీనూటెనిమిది నామములను చేర్చి నిపుణత మీర భక్తి భావముతో వ్రాసితిని. చింతా

రామకృష్ణారావు అనే పేరుగల నీ భక్తుఁడను. దీనిని నీవు తృప్తిగా స్వీకరించుమని ప్రార్థించుచున్నాను.

. ఖర నామ వత్సరంబున

సరిగా నాశ్వయుజ శుద్ధ షష్టిని, జ్యేష్టన్,

వర చింతా వంశ జనితు,

పరమేశ్వర! రామకృష్ణ వర చిత్ర కవిన్. 13. (D.B/06-10-1951.A.D)

భావము.

చింతా రామకృష్ణారావు అనే పేరుగల చిత్రకవినైన నేను శ్రీ చాంద్రమాన ఖర నామ సంవత్సర ఆశ్వియుజ శుద్ధ సప్తమినాడు

జ్యేష్టానక్షత్రమున జనించితిని.

గీ. నీదు నూటెన్మ్దినామాలు స్వాదు గీతు

లందు సీసాంతములను నేఁ బొందుపరచి,    

నూట పదు నెన్మ్ది ఛందముల్ తేటపడఁగ

సీస గర్భితమౌనటు వ్రాసితినయ. 14.

భావము.

స్వామీ నీయొక్క నూటెనిమిది నామములను సీసాంతములందు గీతులలో పొందుపరచితినినూట పద్ధెనిమిది

ఛందస్సులు స్పష్టమగునట్లుగా సీస గర్భితములుగా వ్రాసితినని మనవి చేయుచున్నాను.

. గుణములు నా కవిత్వమున గోచరమైన నృసింహ! నీవి. దు

ర్గుణములు, దోష సంహతియు గోచరమైన నిజంబు నావి. నా

మనమునఁ గల్గు భక్తిఁ గని, మన్ననఁ జేసి గ్రహింపుమీ కృతిన్.

గుణగణనాభిరాముఁడవు. కోరిక తీర్చుమ శ్రీ నృసింహుఁడా! 15.

భావము.

లక్ష్మీ నరసింహుఁడా! నాచే రచింపఁబడిన శతకమున సద్గుణములు గోచరించినచో అవియన్నియు నీవే సుమా.

విధముగా కాక చెడుకాని, దోషజాలము కాని కనిపించినచో అవి నా అపరిపక్వత కారణముగా సంభవించినవగుటచే నావే

సుమా. నీవు నా మనసులోని భక్తి భావమును చూచి, మన్నించుచు కృతిని స్వీకరింపుము. నీవు సుగుణ

గణాభిరాముఁడవు కదా! నా కోరికను తీరునట్లు చేయుము.

 

 

 

 

 

 

 

 

6.  శ్రీయాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారికి అష్టోత్తరశత నామాంచిత పద్యపుష్పార్చన.

1.  ఓం నారసింహాయ నమః.

చంపకమాల వృత్త గర్భ సీసము.

అగణిత భవ్యదేహశుభుఁడైన మహేశ్వ -  శ్రీగణేశులన్సుశ్రవణుని,

జగమును నిల్పు మా జనని సన్నుత భార - తిశ్రీరమాసతిన్దీక్షఁ గొలుతు,

బ్రగణిత రాఘవున్పరమ పావన సత్క - వి వ్రాతమున్లసత్ విశ్వ జనుల,

జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి -   ప్రేమఁ గొల్చెదన్తలచి మదిని.

గీ. బంధ బహుఛంద సీసముల్ వరలఁ గొలుప - వీర నరసింహ శతకంబు *నారసింహ*

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

1 సీస గర్భస్థ చంపకమాల వృత్తము.. ( .. యతి 11)

అగణిత భవ్యదేహశుభుఁడైన మహేశ్వ -  శ్రీగణేశులన్

జగమును నిల్పు మా జనని సన్నుత భార - తిశ్రీరమాసతిన్

బ్రగణిత రాఘవున్పరమ పావన సత్క - వి వ్రాతమున్

జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి -   ప్రేమఁ గొల్చెదన్

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా!   యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పొగడ శక్యముకాని గొప్ప దేహము కలవాఁడా! వీర

నరసింహ! శతకము అనేక ఛందములు గర్భితములై వరలు గొలుపు నిమిత్తము శుభములను కలిగించు శ్రీ

మహేశ్వరులను, సుశ్రవణుఁడయిన గణపతి దేవులను, సృష్టిని నిలిపెడి నా తల్లి శారదాంబను, మంగళస్వరూపిణియైన

లక్ష్మీదేవిని, సాటి లేనిదైన పార్వతీ మాతను దీక్షతో కొలిచెదను, మిక్కిలి పొగడఁ బడు శ్రీరాముని, గొప్ప పావన మూర్తులైన

సత్కవుల సమూహమును, విశ్వమందలి సజ్జనులను, లోకమునకే వెలుఁగుగానున్న మంచిగుణములు కలవారిని,

నా మదిలో తలచి తగిన విధముగా ప్రేమతో కొలిచెదను.

2. ఓం మహాసింహాయ నమః.

మలయజ వృత్త గర్భ సీసము.

సురనుత దైవమ! సుజనుల ధైర్యమ! - శుభములు గొల్పఁగఁ జొరుము హృదిని.

భరమొకొ నన్ గన భవభయ దూరుఁడ! - వరగుణ వర్ధన! వరలు మెదను.

మరిమరి కొల్చెద మహిమను జూపర. - మనుజులు నీదగు మహిమఁ గనఁగ.

నరహరి దైవమ! నయగుణ వర్తిగ - ననుఁ గను నిత్యము నడుపుమికను

గీ. నన్నుఁ గరుణించి నా దరినున్న నీవు. -  చింతలుండవు శ్రీ  *మహాసింహ* దేవ.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

2 సీస గర్భస్థ మలయజ వృత్తము. ( .. యతి 1-8-15-22)

సురనుత దైవమ! సుజనుల ధైర్యమ! శుభములు గొల్పఁగ చొరుము హృదిన్.

భరమొకొ నన్ గన భవభయ దూరుఁడ! వరగుణ వర్ధన! వరలు మెదన్.

మరిమరి కొల్చెద మహిమను చూపర మనుజులు నీదగు మహిమఁ గనన్.

నరహరి దైవమ! నయగుణ వర్తిగ ననుఁ గను నిత్యము నడుపుమికన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దేవతలచే పొగడఁబడెడి దైవమా! మంచివారికి

ధైర్యమైనవాఁడా! శుభములు కలుఁగఁ జేయుటకు నా హృదయమున ప్రవేశించుము. భవభయములను తొలగించువాఁడా!

నన్నుచూచుట నీకు కష్టమా? శ్రేష్ఠగుణములనభివృద్ధి చేయువాడవయిన ఓ దేవా! నా మదిలో మెదలుచుండుము.

నిన్ను పదే పదే కొలిచెదను. జనులు నీ మహత్వముచూచువిధముగ నీ మహత్వమును చూపించు తండ్రీ! శ్రీ

మహాసింహదేవా! నీవు నాదరినున్నచో నాకు విచారములుండవు.

3. ఓం దివ్యసింహాయ నమః.

వంశపత్రపతిత వృత్త గర్భ సీసము.

పరమాత్ముఁడా! యురుగుణా! యొనరఁ - నుమయా. కృపాసాంద్ర ప్రముదమిడఁగ.

శ్రీపతివైన నీ చెలువమే సిరిగఁ గొ - లుపుమా! మహాదేవ! స్వపర రహిత!

నీ పదపద్మముల్ నియతితో నిధియని - కననీయవయ్య మా కమలనయన!   

దీపిత నేత్రుఁడా! తెలియనేది యది తె - లుపుమా! నృసింహుఁడా! కృపను జూచి

గీకరమునందించి కావరాఘన సుచరిత! - తేజమునుఁ గొల్పి వరలించు  *దివ్యసింహ*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

3 సీస గర్భస్థ వంశపత్రపతిత వృత్తము.. ( .. యతి 11)

పరమాత్ముఁడా! యురుగుణా! యొనరఁ గనుమయా.

శ్రీపతివైన నీ చెలువమే సిరిగఁ గొలుపుమా!

నీ పదపద్మముల్ నియతితో నిధియని కననీ!

దీపిత నేత్రుఁడా! తెలియనేది యది తెలుపుమా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పరమాత్ముఁడా! గొప్ప గుణములకు నిలయమైనవాఁడా!

గొప్పకృప కలవాడా! నాకు మిక్కిలి ఆనందము కలుగునట్లుగా ఒప్పిదముగా నన్ను చూడుమయ్యా! స్వపరములన్నవి

లేనటువంటివాఁడా! లక్ష్మీపతివైన నీ యొక్క చెలువమునే నాకు ధనముగా కలుఁగఁ జేయుము. మావాఁడవయిన

పద్మములవంటి నేత్రములు కలవాఁడా! నీ పాదపద్మములే మాకు నిధియని నియమముతో కననిమ్ము. ప్రకాశవంతమైన

కన్నులు కలవాఁడా! నరసింహా! మాలో తేజమును కలిగించి, మేము వరలునట్లు చేయునట్టి దివ్య సింహా! నన్ను

కృపతో చూచి, తెలుసుకొనవలసినదేది కలదో అది నాకు తెలియునట్లు చేయుము.

 

4. ఓం మహాబలాయ నమః.                                                                                                                                        

అతివినయ వృత్త గర్భ సీసము.

హరివి నినుఁ గనిన తరిని నను నిలుపు - మయ నృహరీ! కాంచుమయ్య నన్ను.

వరద! ప్రణతులయ, పరమపథ వర - లమునిడుమా! నాదు లక్ష్యమరసి.

తలప ఘనము కద ధరను గన, ఘనుఁడ - నిను మదిలోనుంచి నిత్యముగను.   

సరిగఁ గనఁబడుమ కరుణఁ గని, కనుల - కును. ప్రవరాత్మలోతున వసించు.  

గీకనక కశిపునిఁ గరుణించి కనుచు పరమ - పదము నిడిన  *మహాబలా *! ప్రణుతిఁ గొనుము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

4 సీస గర్భస్థ అతివినయ వృత్తము. ( .. యతి 11)

నినుఁ గనిన తరిని నను నిలుపుమయ నృహరీ

ప్రణతులయ పరమపథ వర ఫలమునిడుమా!

ఘనము కద ధరను కన ఘనుఁడ నిను మదిలో.

కనఁబడుమ కరుణఁ గని, కనులకును ప్రవరా!   

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మహాబలా! నీవు మా శ్రీహరివి. నిన్ను నేను చూచు

సమయమున నీ యందు నన్ను నిలిపి, నన్ను చూడుము. వరదుఁడా! నీకు నమస్కారములు. నా యొక్క లక్ష్యమును

తెలుసుకొని, పరమపదమనెడి శ్రేష్ఠమైన ఫలితమును నాకు ప్రసాదించుము ఘనుఁడా ఆలోచింపఁగా మానవులు

నిన్ను ఎల్లప్పుడు మనసులో నిలిపి భూమిపై నిన్ను చూచుట గొప్పయేకదా! హిరణ్యకశిపుని కరుణించి చూచి అతనికి

పరమ పదమును ప్రాప్తింప చేసితివి. నా నమస్కారములు స్వీకరింపుము!   గొప్ప శ్రేష్ఠుఁడా! నన్ను కరుణతో చూచి, నా

కనులకు సరిగా కనిపించుము. నాహృదయపులోతులలో నీవు నివసించుము.  

5. ఓం ఉగ్రసింహాయ నమః.

పణవ వృత్త గర్భ సీసము.

మహిత! గుణాభిరామా! రావయ. రమణీ - యాక్షాక్షయా! నరహరి! నుతింతు.

నో దేవ! సత్య ప్రేమోద్భాసుఁడ! శ్రియముల్ - కొల్పన్ నన్నెంచి, నిల్ప రమ్ము.

మాన్యుఁడా! వినుము. నీమంబొప్పఁగ నిను నేఁ - గొల్తున్ హృదిన్నీవు కొలువు తీరు.

మాతల్లి యైన శ్రీమాతాశ్రయ! శ్రిత - త్పోషా! మదిన్ నిత్య తుష్టినిమ్ము.

గీ. నీవు కాకున్న మాకింక నేతలేరి? -  యుర్వి దౌష్ట్యంబులణచెడి  *ఉగ్రసింహ*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

5 సీస గర్భస్థ పణవ వృత్తము. ( .. యతి 6)

రామా! రావయ. రమణీయాక్షా! - ప్రేమోద్భాసుఁడ! శ్రియముల్ కొల్పన్.

నీమంబొప్పఁగ నిను నేఁ గొల్తున్ - శ్రీమాతాశ్రయ! శ్రిత సత్పోషా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్పవాఁడా! మంచిగుణములచే అందముగ

శోభించువాఁడా! రమణీయమైన నాశ రహితుఁడా! నరహరీ! నిన్ను నుతింతును నీవు రమ్ము. దేవా! సత్యములోను,

ప్రేమలోను ప్రకాశించువాఁడా! నన్ను నీవు గుర్తించి నాకు శ్రేయములు కొలుపుచు నిలబెట్టుటకు రమ్ము.

మాననీయుఁడానామాట వినుము. నేను నిన్ను నియమముతో కొలుచుదును. నా మనసులో నీవు కొలువు తీరుము. మా

తల్లి శ్రీమాతను ఆశ్రయించినవాఁడా! ఆశ్రయించిన మంచి వారిని పోషించువాఁడా! నా మనసుల నిత్యసంతుష్టిని

కల్పింపుము. భూమిపై దుర్మాగములనణచెడి ఉగ్రసింహా! నీవు కాకున్నచో ఇంక మాకు నాయకులేరి?

6. ఓం మహాదేవాయ నమః.

మదన వృత్త గర్భ సీసము.

అరసి రక్షించు యాదాద్రి వాస నృహరీ! - యభయంబునిమ్మా. మహానుభావ!

దయఁ గల్గి మమ్ము మోదంబుతోడ కనుమో - భువనైకవేద్యా! ప్రపూజ్యదేవ!

యసుర సంహార! పాదాంబుజంబులకు నన్ - బ్రణమిల్లనిమ్మా సవినయముగను.

దరహాసముఖుఁడ! మోదంబుఁ గూర్చు, వరదా! - భువిపైన మాకున్. సుకవి వినోద!

గీపరమ భక్తుఁడు ప్రహ్లాదునరసి కాచు - కరుణవార్ధి! *మహాదేవ*! కావ రావ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

6 సీస గర్భస్థ మదన వృత్తము. ( గగ .. యతి 9)

యాదాద్రి వాస నృహరీ! యభయంబునిమ్మా.

మోదంబుతోడ కనుమో భువనైకవేద్యా!

పాదాంబుజంబులకు నన్ బ్రణమిల్లనిమ్మా.

మోదంబుగూర్చు వరదా! భువిపైన మాకున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మమ్ములను ఎఱిగి రక్షించునటువంటి

మహానుభావుఁడవైన యాదాద్రినివాసుఁడవైన నరసింహా! మాకు అభయమిమ్ము. ప్రసిద్ధముగా

పూజింపఁబడెడివాడా! మాపై దయ కలిగి మమ్ములను సంతోషముతో చూడుము. !  సృష్టిలో తెలుసుకొనఁదగినవాడా!

రాక్షసాంతకా! నీ పాదపద్మములకు నయవినయములతో నన్ను నమస్కరింపనీయుము. చిరునవ్వులొలుకు

ముఖమువాఁడా! మంచి కవులకు వినోదమును కూర్చువాఁడా! వరములనొసఁగు నరసింహా! భూమిపై

మాకు సంతోషమును కలిగించుము. పరమ భక్తుఁడయిన ప్రహ్లాదుని అరసి, కాపాడు కరుణా సముద్రుఁడవైన ఓ

మహాదేవా! నన్ను కాపాడుటకు రమ్ము.

7. ఓం స్తంభజాయ నమః.

మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.

మంచి చెడ్డలు వీడి, మాన్యుల మార్చి, వం - చనఁ జేయుచున్ వారి ఘనతఁ బాపి,

కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పుచుం - డిరి బాధలన్ దుష్ట పరులు భువిని.

వంచితాత్ములనెంచి వంచనఁ బాపి, కా - వుమ మాన్యులన్ నీవు విమల చరిత!

మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్యతన్. - నరసింహుఁడా! నీదు కరుణఁ జూపి.

గీ. దుష్ట సంహారమును చేసి శిష్ట జనులఁ - సాకి రక్షించు సుజన హృత్  *స్తంభజా*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

7 సీస గర్భస్థ మత్తకోకిల. ( .. యతి 11)  

మంచి చెడ్డలు వీడి మాన్యుల మార్చి వంచనఁ జేయుచున్

కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పుచుండిరి బాధలన్.

వంచితాత్ములనెంచి, వంచనఁ బాపి, కావుమ మాన్యులన్,

మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్యతన్! నరసింహుఁడా!

7 సీస గర్భస్థ ద్విపద ద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం..1సూ.. యతి 3 గణము 1   

                                          అక్షరము ప్రాస నియతి కలదు)

1.మంచి చెడ్డలు వీడి మాన్యుల మార్చి - కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పు.

2.వంచితాత్ములనెంచి, వంచన బాపి, - మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్య!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై దుర్మార్గులు మంచిచెడులను పూర్తిగ విడిచిపెట్టి,

మంచివారిని సహితము మాయమాటలతో మార్చివేయుచు, వారి ఔన్నత్యమును నశింపఁ జేయుచు, పాపభీతి

కొంచెమైనను లేనివారై వారిని బాధపెట్టుచుండిరి. సుజనుల హృదయములందుండు స్తంభ జాతా! దుష్ట స్వభావులను

సంహరించి, శిష్టులను కాపాడి, పోషించు విమలచరిత్రుఁడవైన నరసింహుఁడా! నీకరుణఁ జూపి మోసస్వభావము

కలవారిని నీవు గ్రహించి, వారిలోగల వంచన స్వభావమును పోఁగొట్టి, మంచివారికి రక్షణ కల్పించుము.

8. ఓం ఉగ్రలోచనాయ నమః.

జ్ఞాన వృత్త గర్భ సీసము.

బలమైన నీ పాదములను బట్టితి. నేని - క విడఁ జాలన్, హరీ! కావుమీవు

ప్రగణిత శ్రీ పాదయుగళమే నిలిచెన్ న - ను నిలుపంగన్ గృపన్ ఘనతరముగ.

కలిగిన పాపాళి తొలగఁగాఁ గనవచ్చు - నిను నృసింహా! సదా కనుము నన్ను.

సుగణితా! దీపించును గద నీదగు దివ్య - ప్రతిభ దేవా! నన్ను వరలఁజేయ.

గీ. జ్ఞాన గర్భ సుసీసస్థ కల్పతరువ! - *ఉగ్రలోచనా*! నన్నుననుగ్రహించు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

8 సీస గర్భస్థ జ్ఞాన వృత్తము. ( .. యతి 10)

నీ పాదములను బట్టితి నేనిక విడఁజాలన్ - శ్రీపాద యుగళమే నిలిచెన్ నను, నిలుపంగన్.

పాపాళి తొలగఁగాఁ గనవచ్చు నిను నృసింహా! - దీపించును గద నీదగు దివ్య ప్రతిభ దేవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్రీ హ్రీశక్తివంతమైన నీ పాదములను నేను

పట్టుకొంటిని. ఇంక విడువను. నన్ను కాచువాడవు నీవే సుమా. మిక్కిలి పొగఁడఁబడెడివాఁడా! లక్ష్మీప్రదమైన నీ

పాదద్వయమే నన్ను నిలఁబెట్టుటకు నిలిచెను. నాకు సంతోషమునొసగును.   నరసింహా! నన్నంటియున్న పాపములు

తొలగిపోవు విధముగా నిన్ను చూడవచ్చును. నీవు నన్ను ఎల్లప్పుడూ చూచుచుండుము. మంచిగా గణింపఁబడువాఁడా!

నన్ను వరలునట్లు చేసినచో నీ యొక్క దివ్యమైన ప్రభ వరలును కదా. జ్ఞాన వృత్తమును గర్భమునందు కలిగిన సీస

పద్యమున వరలుచున్న కల్పతరువా! ఉగ్రలోచనా! నన్ను అనుగ్రహించుము.

9. ఓం రౌద్రాయ నమః.

తరల - ద్విపదద్వయ గర్భ సీసము.

శరణమంచును నిన్ను సన్నుతి సల్పినన్ - గరుణింతువే నీవు కమలనయన!

వరమునిమ్మని మేము భక్తిని పల్కగా - వరమిత్తువే మాకు భక్తవరద!

చరణ దాసులఁ గాచు సన్నుత సామివే - నరసింహుఁడాకొల్పు నాకు శక్తి.

వరదయానిధి! భక్తి భావ వివర్ధనం - బొనరింతువేనిత్య పూజ్య దేవ!

గీ. దుష్ట సంహార *రౌద్ర*! మా కష్టములను - దుష్టులను పాపి తొలఁగించు, శిష్టరక్ష!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

9 సీస గర్భస్థ తరలము. ( .. యతి 12)

శరణమంచునునిన్ను సన్నుతి సల్పినన్ గరుణింతువే

వరమునిమ్మని మేము భక్తిని పల్కగా వరమిత్తువే

చరణ దాసులఁ గాచు సన్నుతసామివే నరసింహుఁడా

వరదయానిధి! భక్తి భావ వివర్ధనంబొనరింతువే

9 సీస గర్భస్థ ద్విపద ద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం..1సూ. ..

                                          యతి 3 గణము 1 అక్షరము)

1.శరణమంచును నిన్ను సన్నుతి సల్పి, వరమునిమ్మని మేము భక్తిని పల్క.

2.చరణ దాసులఁ గాచు సన్నుతసామి వరదయానిధి! భక్తి భావ వివర్ధ.                                                                  

భావము.                                                                                                

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! తామరపూవులవంటి కన్నులు కలవాఁడా! శరణు వేడుచు

నిన్ను సన్నుతించినచో నీవు కరుణింతువుకదా. భక్త వరదా! భక్తితో మేము నిన్ను వరములీయమని అడిగినంతనే

మాకు వరములిత్తువు కదా! నరసింహుఁడా! నీ చరణ దాసులను కాపాడు పొగడఁబడెడి స్వామివి కదా, నాకు శక్తిని

కలుఁగఁ జేయుము. నిత్యము పూజింపఁబడువాఁడా! శ్రేష్ఠమైన దయా స్వభవమునకు స్థానమైనవాఁడానీవు భక్తి

భావనమును వృద్ధి చేసెడివాడవుకదా! దుర్మార్గులను సంహరించు రౌద్రుఁడా! శిష్ట రక్షకుఁడా! దుర్మార్గులను

లేకుండా చేసి మా కష్టములను తొలగించుము.

10. ఓం సర్వాద్భుతాయ నమః.

గజవిలసిత గర్భ సీసము.

పరమదీక్షగను నీ పద పద్మముల్ కని - కనులు కనులగున్ నా నరహరి

నుతియించుచుండి శ్రీపతి నిన్ గనన్ బరి - ణతి కలుగు మదికిన్ క్షితిజులకును.

జగమందు నీవు ప్రాపుగనుంటివో వర - లుదు నిరతము హరీ! మది నిలువుమ.

సరి లేనివాఁడ! శ్రీ పరమేశ్వరా! సిరి - ని, నినుఁ గనఁ దగనా? నిగమసార!  

గీ. ప్రేమఁ గనుమ *సర్వాద్భుత* నామ, మమ్ము! - పాప హరణంబు చేయుమో పరమ పురుష!  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

10 సీస గర్భస్థ గజవిలసిత వృత్తము. ( .. యతి 8)

నీ పద పద్మముల్ కనిన కనులు కనులగున్ - శ్రీ పతి నిన్ గనన్ బరిణతి కలుగు మదికిన్.

ప్రాపుగనుంటివో వరలుదు నిరతము హరీ - శ్రీ పరమేశ్వరా! సిరిని, నినుఁ, గనఁ దగనా?

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరహరీ! గొప్ప దీక్షతో నీ పాదపద్మములను చూచిన

కన్నులే కన్నులగును కదా. లక్ష్మీ వల్లభా! జనులకు నిన్ను పొగడుచు నిన్ను చూచుచుండినచో మనసుకు పరిణతి

కలుఁగును. శ్రీ హరీ! లోకములో నీవు ఆధారముగా ఉన్నచో ఎల్లప్పుడూ వరలుదును. నన్ను మనసులో నిలుపుము. సాటి

లేనివాఁడా! వేదసారమైన మంగళప్రదుఁడవగు పరమేశ్వరా! మాలక్ష్మీదేవి తల్లిని, నిన్నూ చూచుటకు నేను సరిపోనా?

సర్వాద్భుత నాముఁడా! మమ్ములను ప్రేమతో జూడుమా. పరమ పురుషా! మాలోని పాపమును నశింపఁజేయుము.

11. ఓం శ్రీమతే నమః.

శతపత్ర వృత్త గర్భ సీసము

నడిచి రా, కొలిచెదన్ నరహరీ! శుభములన్ - వలచి రా. పదములన్ వదల నేను.

ధరను నీ కరుణకున్ నిరతమున్ యెదురునే - కనుదు నీ దయనికన్ మనసుతోడ.  

ఘనుఁడ! శ్రీకరుఁడవే! కరముతోఁ గరముచే - కొనుము, శ్రీ ధరుఁడ! చేకొనుము నన్ను.

సకల! నాకికను నీ వొకఁడవే కలవు. నన్ - విడకు. నా కరమునే. విడకు రామ!  

గీ. శరణు శతపత్రగర్భసీసస్థ నృహరి! - వినుత *శ్రీమతీ* యుతుఁడవై వెలుఁగునిమ్ము.   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

11 సీస గర్భస్థ శతపత్ర (చారుమతి) వృత్తము. ( .. యతి 1-13-17)

రా, కొలిచెదన్ నరహరీ! శుభములన్ వలచి రా. పదములన్ వదల నే.

నీ కరుణకున్ నిరతమున్ యెదురునే కనుదు నీ దయనికన్ మనసుతో.  

శ్రీకరుఁడవే! కరముతోఁ గరముచే కొనుము, శ్రీధరుఁడ! చేకొనుము నన్ .

నాకికను నీ వొకఁడవే కలవు. నన్ విడకు. నా కరమునే. విడకు రా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరహరీ! శుభములనే కోరుచు నీతిగా నిన్ను నేను

కొలిచెదనా? నీ పాదములను నేను విడువనునీ దయ వలన మనస్పూర్తిగా నీ కరుణ కొఱకు భూమిపై ఎల్లప్పుడు ఎదురు

చూచుదును. గొప్ప దైవమా! మంగళప్రదుఁడవే, నీ చేతితో నా చేయి పట్టుకొనుము. శ్రీధరుఁడవైన హరీ! నన్ను

చేకొనుము. సమస్తమైనవాఁడా! అందమైన హరీ! నాకింక నీవొక్కఁడవే ఉంటివి. నన్ను విడువకుము.   శతపత్ర వృత్త గర్భ

సీసమున ఉన్న నరహరీ!పొగడఁబడెడి శ్రీమతితో కూడినవాడవై మాకు ప్రకాశము నిమ్ము.

12. ఓం యోగానందాయ నమః.

శంభునటన వృత్త గర్భ సీసము.

ఘన హరీ! కరుణతో వినుమయా. నిరుపమా - సదయా, కనుమయా నయముతోడ.

చిర ధరన్ నిరతమున్ హరి పదంబులను నేఁ - గొననెదన్ దలతునే గురువుగాను.  

కల చరాచరములన్ గలుగు సచ్చిర హరీ! - కనఁగ సాక్షివి కదా! కరినుతాంఘ్రి!

కరి పరాత్పరుఁడవే కద భవా! ననుఁ గనన్ - దలపవా? శరణమో ధనప్రదాద్య!  

గీ. కలుఁగు రాజయోగానంద కారకుఁడవు. - రాజ యోగము కల్పించి ప్రబలనిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

12 సీస గర్భస్థ శంభు నటన వృత్తము. ( .. యతి 1-10-18)

హరీ కరుణతో వినుమయా. నిరుపమాన సదయా కనుమయా నయముతో.

ధరన్ నిరతమున్ హరి పదంబులను నేఁ గొననెదన్ దలతునే గురువుగా.

చరాచరములన్ గలుగు సచ్చిర హరీ! కనఁగ సాక్షివికదా! కరినుతా!

పరాత్పరుఁడవే కద భవా! ననుఁగనన్ దలపవా? శరణమో ధనప్రదా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శ్రీహరీ! సాటి లేనిదయతో కూడుకొన్నవాఁడా!

కరుణతో నా మాట వినుము. నయ మార్గమున నన్ను చూడుము. ప్రాచీన మైన భూమిపై ఎల్లప్పుడును హరి

పదములను నేను గురువుగా పట్టుకొనుటకు నా మనసులో తలంతును. సృష్టిలో ఉన్న సమస్త చరాచరములందును

ఉన్నట్టి సత్యమైన శాశ్వితమైన హరీ!  గజేంద్రనుత పాదపద్మా! చూడగా సమస్తమునకు సాక్షివి నీవే కదా.   భవా!

గజేంద్రునికి పరాత్పరుఁడవైనవాఁడివే కదా,  నన్ను చూడతలపవాయేమిధనప్రదాతలలో ప్రథముఁడా! శరణు.

ఇప్పుడు సంభవించు రాజయోగము వలన కలిగెడి ఆనందమునకు కారకుఁడవు నీవే కదా. నాకు రాజయోగమును

కల్పించి వృద్ధియగునట్లు చేయుము.

13. ఓం త్రివిక్రమాయ నమః.

లలితగతి వృత్త గర్భ సీసము

హిత కలిత! సుర వినుత, శుభ కలిత, సుం - దర పదా! గోవింద! శరణు శరణు.

ముదమొసఁగు పరమపద మొసగు మిక - క్త సులభా! కేశవా! కావు మీవె.

మనమునను నిరతమును నినుఁ గనెడి నే - ర్పునిడుమా. కృపతోడ ప్రణవరూప!

ప్రవరుఁడవు. నరహరివి మనవి విని - న్ను కనుమా! మాధవా! ప్రకటితముగ.

గీ. సత్య వేద్య *త్రివిక్రమా*! సార్వభౌమ! - నీవు లేనట్టిదేది? మా నీరజాక్ష!  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

13 సీస గర్భస్థ లలితగతి వృత్తము. ( .. యతి 11)

సుర వినుత శుభ కలిత సుందర పదా! - పరమపద మొసగుమిక భక్త సులభా!

నిరతమును నినుఁ గనెడి నేర్పునిడుమా. - నరహరివి మనవి విని నన్ను కనుమా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! హితముతో కూడుకొన్నవాఁడా! శుభములతో

కూడుకొన్నవాఁడా! దేవతలచే పొగడఁబడెడి అందమైన పాదములు కలవాఁడా! గోవిందా! శరణమునిమ్ము.

భక్త సులభుఁడా! కేశవా! సంతోషమును ఇచ్చెడి పరమపథమును నాకు దయచేయుము. నీవే కాపాడుము. ప్రణవ

స్వరూపుఁడామనస్సులో ఎల్లప్పుడు నిన్ను చూచెడి నైపుణ్యమును కృపతోనిమ్ము. మాధవా! నీవు మిక్కిలి శ్రేష్ఠుఁడవు,

నారసింహుఁడవు, నా మనవినాలకించి స్పష్టమగునట్లుగా నన్ను చూడుము. సత్యమున తెలియఁబడెడి త్రివిక్రముఁడా!

సార్వభౌమా! మా నీరజాక్షా! నీవు లేనటువంటిది లేనే లేదు.

14. ఓం హరయే నమః.

ఆటవెలది దశక గర్భ సీస మాలిక.

1.మహిని కరుణ తోడ మము గాచు నరసింహ! - సహజ సుగుణ మిచ్చి మహిమఁ గనుమ.

యిహము పరము నీవె, హరి! మొగమాటమా? - వరములొసఁగ మాకుఁ బపరమ పురుష!

దురిత హరుఁడనీకు సరియెవ్వరిలలోనఁ - గరము పట్టి నడుపు కామితదుఁడ!

సుజనుల మదిలోన శుభ రూపముననుండు - నిరుపమ నుత యాదగిరి నివాస!

2.జగతిని కలవారు జగమేల వలతురు. - జగతిని నిరతంబు మిగులుదురొకొ?

ప్రగతిని కనినంత జగ మేల తగుదురో? - జగతికి పతివీవె నిగమ వేద్య!

నిజముగ జగమెట్లు నినువీడి వెలుగును? - నిరుపమ గుణధామ నిత్యపూజ్య!

నిరతము కని మమ్ము నీవె కాపాడుమా! - ప్రగతి మార్గమునను ప్రబలనిమ్మ.

3.పరమ పురుష సృష్టి పరమార్థమును కంటి. - ప్రతిభఁ జూపెడి నిను మతిని కంటి.

నిరుపమానమయిన కరుణార్ద్రతను కంటి - శోభఁ గొల్పుదువని శ్రుతుల వింటి.

సకల శుభదుఁడంచు సన్నుతుల్ గన వింటి - సరస మతులలోనఁ జక్కఁ గంటి.

చిన్న పిల్లల మది నున్న నిన్ గనుగొంటి - శ్రీ కరుండ వనుచుఁ జేరనుంటి.

4.కవుల తలపులందుఁ గమనీయ భావనా - గతివి నీవె మధుర కృతివి నీవె.

గాయకాళి మధుర గానామృతము నీవె - పాటలందుఁ గలుఁగు ప్రభవు నీవె.

నాట్యకారుల మది నటరాజువే నీవు, - నయతను విడనట్టి నటుఁడ వీవె.

యలరఁ జేయఁగ నిల నాంధ్రామృతము నీవె. - శంకరాభరణపు శక్తి వీవె.

5.కాల మీవె కనఁగకాలాంతకుఁడవీవె. - ధర్మ మీవె సృజన మర్మమీవె.

భూత పంచక యుత పూర్ణ రూపుఁడవీవె. - పృథ్విపై ప్రబలెడు ప్రేమ వీవె.

సజ్జనాళిని కను సన్నుతాత్ముఁడవీవె. - సన్నుతాత్మలఁ గల సత్వమీవె.

శ్రీపరాత్పరి మది సేద తీరుదు వీవె. - భూసతి మది లోనఁ బొంగుదీవె.

గీ. దుష్ట హరణంబు చేసెడి శిష్టరక్ష! - కాన రావయ్య. నిరతంబు కావవయ్య.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

14 సీస గర్భస్థ ఆటవెలది దశకము

1.మహిని కరుణ తోడ మముఁగాచు నరసింహ! - సహజ సుగుణ మిచ్చి మహిమఁ గనుమ.

యిహముఁ బరము నీవె, హరి! మొగమాటమా? - వరములొసఁగ మాకుఁ బరమ పురుష.

2.దురిత హరుఁడనీకు సరియెవ్వరిలలోనఁ - గరముపట్టి నడుపు కామితదుఁడ!

సుజనుల మదిలోన శుభ రూపముననుండు - నిరుపమ నుత యాదగిరి నివాస!

3.జగతిని కలవారు జగమేల వలతురు. - జగతిని నిరతంబు మిగులుదురొకొ?

ప్రగతిని కనినంత జగమేల తగుదురో? - జగతికి పతివీవె నిగమ వేద్య!

4.నిజముగ జగమెట్లు నినువీడి వెలుగును? - నిరుపమ గుణధామ నిత్యపూజ్య!

నిరతము కని మమ్ము నీవె కాపాడుమా! - ప్రగతి మార్గమునను ప్రబలనిమ్మ.

5.పరమ పురుష సృష్టి పరమార్థమును కంటి. - ప్రతిభఁ జూపెడి నిను మతిని కంటి.

నిరుపమానమయిన కరుణార్ద్రతను కంటి - శోభఁ గొల్పుదువని శ్రుతుల వింటి.

6.సకల శుభదుఁడవని సన్నుతుల్ గన వింటి - సరస మతులలోనఁ జక్కఁ గంటి.

చిన్న పిల్లల మది నున్న నిన్ గనుగొంటి - శ్రీ కరుండ వనుచుఁ జేరనుంటి.

7.కవుల తలపులందుఁ గమనీయ భావనా - గతివి నీవె మధుర కృతివి నీవె.

గాయకాళి మధుర గానామృతము నీవె - పాటలందుఁ గలుఁగు ప్రభవు నీవె.

8.నాట్యకారుల మది నటరాజువే నీవు, - నయతను విడనట్టి నటుఁడ వీవె.

యలరఁ జేయఁగ నిల నాంధ్రామృతము నీవె. - శంకరాభరణపు శక్తి వీవె.

9.కాల మీవె కనఁగకాలాంతకుఁడవీవె. -  ధర్మ మీవె సృజన మర్మమీవె.

భూత పంచక యుత పూర్ణ రూపుఁడవీవె. -  పృథ్విపై ప్రబలెడు ప్రేమ వీవె.

10.సజ్జనాళిని కను సన్నుతాత్ముఁడవీవె. -  సన్నుతాత్మలఁ గల సత్వమీవె.

శ్రీపరాత్పరి మది సేద తీరుదు వీవె. -  భూసతి మది లోనఁ బొంగుదీవె.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై కరుణతో మమ్ము కాపాడే నరసింహా! సహజమైన

సుగుణమును మాలో కొలిపి మహిమతో చూడుము. పరమ పురుషా. మాకు ఇహము పరము నీవే కదా. మరి శుభములు

మా కొసగుటకు నీము మొహమాటమెందులకు? పాపములు పారద్రోలువాడా! కోరికలు తీర్చుచూ చేయిపట్టి నడిపేవాడా!

భూమిపై నీకు సాటి ఎవరూలేరు. సాటిలేని పొగడబడువాడా! యాదాద్రీశా! మంచివారి మనస్సులలో శుభముల

రూపమున ఉండుము. ప్రపంచముననున్నవారు జగమునే పాలింప భావింతురు. జగత్తులో శాశ్వితముగా

నిలుచువారెవరు కలరు? ఏదో ప్రగతిని సాధించినంతమాత్రమున లోకమునేల సరిపోవుదురా? వేదవేద్యా! జగతిని

ఏలు పతివి నీవు మాత్రమేకదా. సాటిలేని గుణములచే ప్రకాశించువాడా! నిజమునకు జగత్తు నిన్ను విడిచి ఎట్లు

ప్రకాశింపకలదుఎల్లప్పుడూ మమ్ములను చూచుచు కాపాడుము. ప్రగతిమార్గముననే మమ్ము నడుపుము. పరమ

పురుషా! సృష్టి పరమార్థమును చూచితిని. ఇందు ప్రతిభను చూపెడి నిన్ను నా మనమున చూచితిని. నీయందున్న

సాటిలేని కరుణను చూచితిని. శోభను కొలిపేవాడివని వేదములందు వింటిని. సకలశుభములనొసగువాడివని

సన్నుతులు కనుటను వింటిని. సరస హృదయులలో నిన్ను చక్కగా చూచితిని. చిన్నపిల్లల మనస్సులలోనున్న నిన్ను

చూచితిని. నీవు శుభంకరుఁడవని నిన్ను చేరనుంటిని. కవుల తలపులలో కమనీయమైన భావనలకు మార్గము నీవే.

మధురమయిన రచయు నీవే. గాయకుల మధుర గానామృతము నీవే కదా. పాటలందు వెలిగెడి ప్రభవు నీవే.

నాట్యకారులలో నటరాజువు నీవే. న్యాయమును వీడని గొప్ప నటుడవు నీవేకదా. పాఠకులనలరఁ జేయుటకు ఉన్న

ఆంధ్రామృతము నీవే కదా. శంకరాభరణము యొక్క శక్తివి నీవేకదా. కాలము నీవే. కాలాంతకుడవూ నీవే. ధర్మము నీవే

సృజనలో ఉన్న మర్మము నీవే. పంచభూతములతో కూడిన పూర్ణస్వరూపుడవీవే. భూమిపై వెలుగొందు ప్రేమ నీవే

సుమా. మంచివారిని చూచెడి సన్నుతాత్ముఁడవు నీవే. సన్నుతాత్ములలో ఉండే సత్వ స్వభావమూ నీవే. లక్ష్మీ

హృదయమున సేదతీరెడివాడవు నీవే. భూమాత మదిలో పొంగెడివాడవూ నీవే. చెడును హరించెడి సద్రక్షకామాకు

కనిపింప రమ్ము. ఎల్లప్పుడూ కాపాడుము.

15. ఓం కోలాహలాయ నమః.

కౌముది వృత్త ద్వయ గర్భ సీసము.

మదిని భావింపగా మాన్య నీ పదరజం బున్, బ్రభల్ వర్ధిలున్ పుణ్య పురుష!

సదయ సంతోష సంస్కారముల్ మదిని - ల్పించు ప్రేమన్ , హరీ! వెలసి నీవు!  

హృదయ సీమన్ హితంబెప్పుడున్ పదిలమున్ - జేయు సంవర్ధకా! చేకొనుమయ

మధుర భావా మహాత్మా! ననున్ మదిని నీ - వుంచుకొమ్మా కృపన్ గాంచి నృహరి!

గీ. భక్త *కోలాహలా*సక్త! ముక్తి వరద! - శక్తినిమ్ము నిన్ గాంచఁగా శాశ్వతముగ.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

15 సీస గర్భస్థ కౌముది వృత్త ద్వయము. ( .. యతి 8)

1.మదిని భావింపగా మాన్య నీ - పదరజంబున్ బ్రభల్ వర్ధిలున్

సదయ సంతోష సంస్కారముల్ - మదిని కల్పించు ప్రేమన్ ,  హరీ

2.హృదయ సీమన్ హితంబెప్పుడున్ - పదిలమున్ జేయు సంవర్ధకా!  

మధుర భావా మహాత్మా! ననున్ - మదిని నీవుంచుకొమ్మా కృపన్.  

 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మాన్యుఁడవైన పుణ్య పురుషా! నీ పాద రజమును

మనసున తలచినంతనే మాలో దివ్య ప్రభలు వర్ధిల్లునుకదా.  లక్ష్మీదేవికి మనోజ్ఞుఁడవైన శ్రీహరీ! దయతో మా మదిలో

నీవు ప్రేమతో వెలసి సంతోషమును, సంస్కారమును కల్పించుము! నా హృదయ సీమలో మంచిని భద్రపరచే

సంవర్ధకుఁడవైన మహాత్మా! నన్ను చేకొనుము. మధురమైన భావమైనవాఁడా! నరహరీ! కృపతో నన్ను చూచి, నీమదిని

నిలుపుకొనుము. భక్తులకోలాహలముపై ఆసక్తి కలవాఁడా! ముక్తిని వరముగా దయచేయువాఁడా! నిన్ను శాశ్వితముగా

చూచుటకొఱకు నాకు శక్తిని ప్రసాదించుము.   

16. ఓం చక్రిణే నమః.

శార్దూల వృత్త గర్భ సీసము.

పగ వాని ప్రార్థన భారమంచనకనే - ప్రహ్లాదు రక్షింపవా మహాత్మ!

యిల మానప్రాణములెల్లఁ గాచితివిగా! - మాన్యుండ! రక్షింపుమా ధరిత్రి.

మది జ్ఞాన శ్రేయ సుమాధురుల్ గొలుపుచున్ - గర్తవ్యమున్ జూపఁ గామ్యదాత!

శ్రితమౌని ప్రార్థిత శ్రీయుతుండ! కనుమా - మమ్మున్, మదిన్ నిల్పుమా ముకుంద!

గీ. వక్రతను బాపు *చక్రి*! ప్రవర్తనమున - సత్య జీవనగతినిమ్ము శాశ్వతముగ.   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

16 సీస గర్భస్థ శార్దూల వృత్తము. ( .. యతి 13) 

వాని ప్రార్థన భారమంచనకనే ప్రహ్లాదు రక్షింపవా!

మానప్రాణములెల్లఁ గాచితివిగా! మాన్యుండ! రక్షింపుమా.

జ్ఞాన శ్రేయ సుమాధురుల్ గొలుపుచున్ గర్తవ్యమున్ జూపఁగా,

మౌని ప్రార్థిత శ్రీయుతుండ! కనుమా మమ్మున్, మదిన్ నిల్పుమా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పగతురకు సంబంధించిన వాని ప్రార్థన బరువని పలుకక

ప్రహ్లాదుని రక్షించితివి కదా. భూమిపై వాని మానప్రాణములను రక్షించితివి.కదా. మాన్యుడా! కామితములనొసగువాడా!

మనసులలో జ్ఞానము శ్రేయము సుమాధురిని కల్పించి కర్తవ్యమును చూపుచు భూమిని కాపాడుము.

ఆశ్రయింపఁబడిన మునులచే ప్రార్థింపబడు లక్ష్మీ సమన్వితుఁడా! ముకుందా. మమ్ములను కనుము. నీ మదిలో

నిలుపుము. చక్రీ! మా ప్రవర్తనలో వంకరను పోఁగొట్టుము. సత్యమైన జీవన గతిని శాశ్వతముగా మాకిమ్ము.

17. ఓం విజయాయ నమః.

బంభరగాన వృత్త గర్భ సీసము.

సుజన వరద! జయము జయము కేశవ! - శాశ్వితుఁడా! గుణసాంద్ర వినుత!

పూజితుఁడా! ప్రియము గొలుపు నీవిక - మాకిలలో శుభమార్గదర్శి!

పొంగుచు నీ నయమును కననీ. నవ - నీత ప్రియా! ఫలదాత! నృహరి!

వెతలనిడే భయము తొలఁగనీ వర - భక్తి సుధన్! భవబంధ నాశ

గీ. నిత్య కల్యాణ యాదాద్రి నిలయ శ్రీశ! - స్తుత్య విజయాఖ్య సర్వేశ! సుప్రకాశ!  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

17 సీస గర్భస్థ బంభర గాన వృత్తము. ( .. యతి 8)

జయము జయము కేశవ! శాశ్వితుఁడా! - ప్రియము గొలుపు నీవిక మాకిలలో.

నయమును కననీ. నవనీత ప్రియా! - భయము తొలఁగనీ వర భక్తి సుధన్.

భావము.

నిత్యకల్యాణ యాదగిరివాసా! శ్రీపతీ! పొగడఁబడే విజయనామకా! సర్వేశ్వరా! సుప్రకాశా

భక్తులను పోషించువాఁడా! చెడును నశింపఁజేయువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!  సుగుణములచే

పొగడఁబడువాడా! శాశ్వితుఁడా! ఆశ్రితులయందు ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!

మంచివారి కోరికలు తీర్చెడి కేశవా! నీకు జయము. పూజింపఁబడువాడా! ఇలలో మాకు శుభమార్గదర్శివి. ఇక మాకు నీవు

ప్రియమునే లభింపఁజేయుము. నవనీత ప్రియుడా! ఫలితములొసగు నరహరీ! నీ న్యాయమార్గమును పొంగిపోవుచూ

మమ్ములను చూడనిమ్ము. భవబంధనాశకా! భయమును గొలిపే బాధలను నీవొసగు శ్రేష్టమైన భక్త్యమృతముచేత

తొలగునట్లు చేయుము.

18. ఓం జయవర్ధనాయ నమః.

ఆటవెలది ద్వయ - దేవరాజ వృత్త - ఉత్సాహ  గర్భ సీసము,

శ్రీశ! వినుత శ్రీహరీ! మనవిని వీను - లార వినవొకో సుధీర నృహరి!

సాక కనుల విందుగా కనఁబడి గౌర - వమ్ము నిలుపుకో. సుఖమ్మదేను. (.వె.)

ధాత్రిన్ క్షణము చాలదా కనులకుఁ గాని - పించుటకు హరీ! వసించ మదిని.

దీప్త! మనసు తెల్పితిన్ మహితుఁడ! మాకు - నీవెకద సదా పునీత చరిత! (.వె.)

గీ. జనుల జయవర్ధనా నీకు జయము జయము. - సుజన సంవర్ధనము చేసి చూడు మనఘ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

18 సీస గర్భస్థ దేవరాజ వృత్తము. ( .. తి 11)

వినుత శ్రీహరీ! మనవిని వీనులార, వినవొకో?

కనుల విందుగా కనఁబడి గౌరవమ్ము నిలుపుకో.

క్షణము చాలదా కనులకుఁ గానిపించుటకు హరీ!

మనసు తెల్పితిన్ మహితుఁడ! మాకు నీవెకద సదా!

18 సీస గర్భస్థ ఉత్సాహ.  . (7 సూర్య గణములు 1 గురువు .. యతి 5 గణము 1 అక్షరము)

వినుత శ్రీహరీ! మనవిని వీనులార, వినవొకో?

కనుల విందుగా కనఁబడి గౌరవమ్ము నిలుపుకో.

క్షణము చాలదా కనులకుఁ గానిపించుటకు హరీ!

మనసు తెల్పితిన్ మహితుఁడ! మాకు నీవెకద సదా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! వినుతింపఁబడే శ్రీహరీ! ధీరుఁడవైన నరసింహా! మా

మనవిని చెవులారా వినవా? కనులవిందుగా మాకు కనఁబడి మమ్ములను సాకుచు నీ గౌరవము నిలుపుకొనుము. అదే

సుఖముసుమా. మా మనసులో నివసింప వచ్చుటకు, కనులకు కనఁబడిటకు క్షణకాలము చాలదా నీకు? ప్రకాశించువాడా!

పవిత్ర చరితుఁడా!నా మనసును నీకు తెలిపితిని. మాకు నీవే దిక్కు.ప్రజల జయమును పెంచువాడా! నీకు

జయమగుగాక.మంచివారిని వర్ధిల్లచేసి వారి మనసును తెలుసుకొనుము.

19. ఓం పంచాననాయ నమః.

శివశంకర వృత్త గర్భ సీసము.

హరినామ జపము, సుందర హరి పూజయు - శుభమౌన్. సుభక్తాళి శోభ పెంచు.

హరియించు కుగతి. మాధురి హరిమార్గమె - యిలలోని జనులకు వలయు నిదియె.

పరమాత్ముఁడు దయ పంచుర. భజియించుడు - హరినే మదిని నిల్పి మురియ వలయు.

నరసింహుఁడ! యిది నిన్గను నయమార్గము - కదరా! కృపన్నీవు. కావ రార.    

గీ. నన్నుఁ బ్రోచెడి *పంచాననా*! నృసింహ - భావమందున నీవుండి ప్రబలుమయ్య.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

19 సీస గర్భస్థ శివశంకర వృత్తము. ( .. యతి 11)

హరినామ జపము, సుందర హరిపూజయు శుభమౌన్.

హరియించు కుగతి. మాధురి హరిమార్గమె యిలలో.

పరమాత్ముఁడు దయ పంచుర. భజియించుడు హరినే.

నరసింహుఁడ! యిది నిన్గను నయమార్గము కదరా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! నన్ను కాపాడెడి విశాలమైన ముఖము కలనృసింహా! నా

భావమున నీవుండి అతిశయింపుము.పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితుజనమున ప్రకాశించువాఁడా!

యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! హరి నామ జపము, హరి పూజ మంచి భక్తజనులకు శుభంకరమే కాక వారి శోభను

కూడా పెంచును. .దుర్గతిని పారద్రోలును. అది మధురమైన మార్గము.భూజనులకిదే అవసరము.. పరమాత్ముఁడు

దయను పంచును.కాన అతనిని సేవించుడు. శ్రీహరినే మనసున నిల్పి మురియదగును. నరసింహుఁడా! ఇదే నిను

చూడఁదగిన ధర్మ మార్గము.కృపతో నీవు కాపాడ రమ్ము.

20. ఓం పరబ్రహ్మణే నమః.    

మత్తేభ వృత్త గర్భ సీసము.    

స్వ పర భావంబును బాపుమయ్య కృపతో! - భాస్వన్నఖాకేశవామహేశ!

సుకరమీవందిన శోభ కల్గు నృహరీ! - కల్యాణ సంవర్ధకా గ్రహించు.

ప్రవర మేధాక్షయ భాసమాన ఘృణివే! - వర్ధిల్లనిమ్మా ప్రభన్ వసించి.

స్వధర కాలున్ బలె పాపులన్ దునుము చోన్ - ధర్మంబు నిల్చున్ గదాసతంబు.

గీ. దుర్జనాళికి గుండె లోతులను మెలగి - భయము గొల్పు. పరబ్రహ్మ పథము చూపు

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

20 సీస గర్భస్థ మత్తేభ వృత్తము. ( .. యతి 14) 

పరభావంబును బాపుమయ్య కృపతోభాస్వన్నఖాకేశవా!

కరమీవందిన శోభ కల్గు నృహరీకల్యాణ సంవర్ధకా!

వర మేధాక్షయ భాసమాన ఘృణివేవర్ధిల్లనిమ్మా ప్రభన్ .

ధర కాలున్ బలె పాపులన్ దునుముచోన్ ధర్మంబు నిల్చున్ గదా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!  ప్రకాశవంతమైన నఖములు కల కేశవా! మహేశా! స్వ

పర భావములను మా నుండి తుడిచివేయుము.. నృహరీ! నీవందుకొనినచో మాకు అది జీవితము సుకరము. మాకు శోభ

కలుగును. కల్యాణ సంవర్ధకా! ఇది గ్రహించుము.మిక్కిలి శ్రేష్టమైన మేధ చేత అక్షయమైన ప్రకాశించు

భాస్కరుఁడవే.మాలో నివసించి యుండి మమ్ములను వర్ధిల్లనిమ్ము. నీ భూమిపై కాలునివలె నున్న పాపాత్ములను

సంహరించినచో ఎల్లప్పుడూ ధర్మము నిలుచునుకదా! దుర్జనుల గుండెలలో ఉండి వారికి భయమును

కలిగించుము.వారికి పరబ్రహ్మ పదమును చూపుము.

21. ఓం అఘోరాయ నమః.

బలభిన్మణి వృత్త గర్భ సీసము

నిరుపముఁడవును శ్రీకరుఁడవు, శాశ్వత - శుభదుఁడవే చూడ, శుభ్రతేజ

యిటనుంటినయ్య! ప్రాకటముగ నన్ వర - లఁ గనుమికన్ దేవ! లాలితముగ.

మనమున నన్నుఁ జేకొనఁగఁ దలంచెడి - కరివరదా! హితకారివీవె.

మలిన హరుండ! నీకిలశుభముల్, నిరు పమ నృహరీ! నన్ను వదలఁబోకు

గీ. నయము, భయమును జగతి విస్మయముఁ గొలుపు - ఘోరదూర! *అఘోరా*ఖ్య! కుజన నాశ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

21 సీస గర్భస్థ బలభిన్మణి వృత్తము. ( .. యతి 7)

శ్రీకరుఁడవు, శాశ్వత శుభదుఁడవే. - ప్రాకటముగ నన్ వరలఁ గనుమికన్.

జేకొనఁగఁ దలంచెడి కరివరదా! - నీకిలశుభముల్, నిరుపమ నృహరీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! నీతిని, భయమును,

విస్మయమును కలిగించు ఘోరములను దూరము చేయువాడా! అఘోరాఖుఁడా! దుష్టులను నశింపఁ జేయువాడా!  

ఆశ్రితజనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పవిత్రమైన తేజస్సు కలవాఁడా! నీవు

సాటిలేని వాడవు.. మంగళప్రదుఁడవు. శాశ్వితమైన శుభములు క్జూర్చువాడవే సుమా. ఇక్కడుంటిని. నన్ను వరలునట్లుగా

లాలితముగా చూడుమునీ మదిలో నన్ను చేకొన తలచెడి కరివరదా! నీవే హితకారివి. మాలిన్యములను

హరించువాడా! భూమిపై నీకు శుభములగుగాక. సాటి లేని నరసింహా! నన్ను విడువఁ బోకుము.  

22. ఓం ఘోరవిక్రమాయ నమః.

మంజరీద్విపద చతుష్టయ గర్భ సీసము.  

పాపంబులను జేయు పాపులనుండి నన్ - భువిఁ గాచుమా నయ పుణ్య ఫలద!

సన్మార్గ దూరుల సమయింతువయ్య. నన్ - గని బ్రోవు మాన్యుఁడ! గౌరవాఢ్య.!

నిర్భాగ్యులను గాచు నిరుపమ భాగ్య సా - ధనమార్గమున్ జను తత్వమిమ్ము.

ప్రవరులఁ బూజించుపాపులనణచుమా - పయిచూపు ప్రేమను భక్తపాల.

గీ. జగతిలో వెల్గు నీవెల్గు జనులలోన - నడుపుమయ *ఘోరవిక్రమా*! నాయకుఁడుగ.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

22 సీస గర్భస్థ మంజరీ ద్విపద చతుష్టయము. (మంజరీద్విపద 3ఇం., 1సూ..    

                                 2పాదములు. ప్రాస లేదు. యతి 3వగణం 1 అక్షరం)  

1.పాపంబులను జేయు పాపులనుండి - నన్ భువిఁ గాచుమా నయ పుణ్య ఫలద!

2.సన్మార్గ దూరుల సమయింతువయ్య - నన్ గని బ్రోవు మాన్యుఁడ! గౌరవాఢ్య.!

3.నిర్భాగ్యులను గాచు నిరుపమ భాగ్య - సాధన మార్గమున్ జను తత్వమిమ్ము.

4.ప్రవరులఁ బూజించుపాపులనణచు. - మా పయిచూపు ప్రేమను, భక్తపాల!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గౌరవప్రదుడా! నీతిని, పుణ్య ఫలములను ఇచ్చువాడా!

పాపకర్ముల నుండి నన్ను కాపాడుము. దుర్మార్గులను నశింపఁ జేసెదవు.  నన్ను చూచు మాన్యుడా!  నీవు నన్ను

కాపాడుము నిర్భాగ్యులను కాపాడ గలిగిన సాటిలేని భాగ్య సాధన మార్గమున ప్రవర్తించు స్వభావమునిమ్ము. భక్తపాలకా!

ప్రవరులను పూజించేటువంటి,  పాపులనణచేటువంటి వాడవు, మాపైన ప్రేమను చూపుము. ఘోర విక్రమా! జనులలోన

జగతిలోన నీ వెలుగే వెలుగును. నాయకుడుగా నీవే మమ్ము నడుపుము.

23. ఓం జ్వలన్ముఖాయ నమః

ప్రముదితవదన వృత్త గర్భ సీసము.

భువి ప్రసన్నత, నయము ప్రియము కానగన్ - మాధవున్, ప్రార్థించి మసలుచుండి

మతిని నిలిపి, భయము తొలఁగ, ప్రాభవం - బొప్పఁగా గొల్చిననొనరు సుగతి.

సుచరితమున, నియతిఁ, జరణ సన్నిధిన్ - సేవలన్ జేసిన జిత్తమలరు.

సుకృతి పెఱుఁగ జయము కలుఁగ నాశ తోఁ - జేయనౌన్ స్మరణ మా చేవ చూపి.     

గీ. “ప్రముదితవదన గర్భ సీసమున వెల్గు - దుష్టపాళి *జ్వలన్ముఖా*! శిష్టరక్ష

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

23 సీస గర్భస్థ ప్రముదిత వదన. ( .. యతి 8)

నయము ప్రియము కానగన్ మాధవున్, - భయము తొలఁగ, ప్రాభవం బొప్పఁగా,

నియతిఁ జరణ సన్నిధిన్ సేవలన్ - జయము కలుఁగ నాశ తోఁ జేయనౌన్.   

భావము.

ప్రముదిత వృత్త గర్భ సీసమున వెలుగొందుచున్నవాడా! దుష్టుల సమూహము విషయమున జ్వలన్ముఖుఁడా! శిష్ట రక్షకా!

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భువిపై ప్రసన్నత, నీతి, ప్రియము కాంచుట కొఱకు

మాధవుని ప్రార్థించుచు మసలుచుండి, మనసు నిలిపి. భయము తొలఁగి పోవగా ప్రాభవము కనఁబడునట్లుగా కొలిచిన

సుగతి ప్రాప్తించును. మంచి ప్రవర్తనతో నియమముతో,  నీ పాదముల సమీపమునసేవలు చేసినచో మనసు పొంగును.

చేసిన  మంచి పెఱుఁగుట కొఱకు, జయము కలుగుట కొఱకు ఆశ కలిగి మా చేవ చూపిసేవ చేయనగును.     

24. ఓం మహాజ్వాలాయ నమః.

మానిని గర్భ సీసము

శ్రీ నరసింహవిశేష శుభాస్పద! - చిన్మయ రూపవశింపు మదిని.

నీ నయగారము నీ శుభ రూపము - నేఁ గని బొంగెద నిత్యమిలను.

మానవమాత్రుఁడమాయలఁ జిక్కుదు, - మాయలఁ బాపుము మంచినిడను.

హీన పథోద్గతి హేయముపాపు  - హీన శుభాస్పదహీన గతిని.

గీ. నిత్య నుత *మహాజ్వాలా*ఖ్య! నిర్మలాత్మ - సత్య సన్మార్గ వర్తన సదయనిడుమ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

24 సీస గర్భస్థ మానిని. ( .. యతి 1-7-13-19)

శ్రీ నరసింహవిశేష శుభాస్పదచిన్మయ రూపవశింపు మదిన్.

నీ నయగారము నీ శుభ రూపము నేఁ గని బొంగెద నిత్యమిలన్.

మానవమాత్రుఁడమాయలఁ జిక్కుదుమాయలఁ బాపుము మంచినిడన్.

హీన పథోద్గతి హేయముపాపు మహీన శుభాస్పదహీన గతిన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! చిన్మయ రూపా! విశేష శుభాస్పదుఁడవైన శ్రీ నరసింహా!

నా మనసులో నివసింపుము. నీ మార్దవము, నీ శోభన రూపము, నేను నిత్యము చూచుచు పొంగుచుందును. నేను

మానవమాత్రుఁడను. మాయలలో చిక్కుచుందును. నాకు మంచినొసగుటకు మాయలను పారద్రోలుము. హీన

మార్గమనుసరించుట అసహ్యకరమైనది అహీన శుభాస్పదా! నాలోని హీనత రూపుమాపుము. నిత్యము పొగడఁబడెడి

మహాజ్వాల నామకుఁడా! నాకు నిర్మలాత్మను, సత్య సన్మార్గ వర్తనమును దయచేయుము.

25. ఓం జ్వాలామాలినే నమః.

మనోజ్ఞ వృత్త గర్భ సీసము.

జయముల నిచ్చుచు సంతసంబున నిల్పి - తే యాదగిరివాసధీప్రభాస!

భయమును బాపుచు భక్త బాంధవ ప్రోచి - తే నీదు కృపఁ జూపి దివ్య మూర్తి.

నయ వినయంబులు నాకు నా కృతికిచ్చి -  తే నన్ను దీవించి? దీన బంధు!

ప్రియమున నన్గను విశ్వ వేద్య నృసింహుఁ - డానందసంధాత యనఁగ నిలిచి,

గీ. సన్మనోజ్ఞ యుత వర సీసంబునందు. - నున్నవాఁడ! *జ్వాలామాలి*! నన్ను కనుమ.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

25 సీస గర్భస్థ మనోజ్ఞ వృత్తము. (     .. యతి 10)

జయముల నిచ్చుచు సంతసంబున నిల్పితే! - భయమును బాపుచు భక్త బాంధవ ప్రోచితే

నయ వినయంబులు నాకు నా కృతికిచ్చితే. - ప్రియమున నన్గను విశ్వ వేద్య నృసింహుఁడా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నాకు జయములు కలుఁగ జేయుచు నాకు సంతోషమును

నిలిపితివా.  ధీ ప్రభాసుడా యాదగిరీశుడా! భక్తబాంధవా! నాలోని భయమును పారద్రోలుచు నన్ను కాపాడితివా. దీన

బంధూ! నాకు, నా కృతికి నయ వినయములు కలుఁగఁజేసితివా. నీవు ఆనంద సంధాతవనునట్లుగా నృసింహా నిలిచి

ప్రియముతో నన్ను కనుము. మంచి మనోజ్ఞవృత్తముగర్భమునందు కలిగియున్న సీస పద్యమున ఉన్న ఓ జ్వాలామాలి

నన్ను కనిపెట్టుకొని చూచుచుండుము.   

26. ఓం మహాప్రభవే నమః.

సన్నుత వృత్త గర్భ సీసము.

శ్రీమన్మహా దేవ! నా మొరన్ విన వల - దే ప్రియ నృహరీ! మదీయ హృదయ!

యీనాటి యీ జీవ మీవె కాదొకొ? వర - సేవిత ఘనుఁడా! ప్రసిద్ధ దేవ!

కడఁదేర్చగా నావగా మమున్ నడుపు. ప్ర - ణామము లనఘా! సుధామ దేవ!

నా మదిలో భావనా సుధాంబుధివయి - వర్తిలు కృపతోడ, భక్త సులభ.  

గీ. భక్తునెంచి *మహాప్రభా*! భావనమున - నిలిచి జీవింపఁ జేయుమా నేర్పునొసఁగి.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

26 సీస గర్భస్థ సన్నుత. ( .. యతి 10) 

దేవ! నా మొరన్ విన వలదే ప్రియ నృహరీ!

జీవ మీవెగాదొకొ? వర సేవిత ఘనుఁడా!

నావగా మమున్ నడుపు. ప్రణామములనఘా!

భావనా సుధాంబుధివయి వర్తిలు కృపతో.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్తీమన్మహాదేవా! నా హృదయమైన వాడా! నృహరీ! నా మొర

విన వలదా? నాటి నా జీవితము నీవే కదా. శ్రేష్ఠుఁడవైన సేవింపబడే ఘనుఁడా! ప్రసిద్ధమైన దేవా!. చక్కగా

ప్రకాశించు దైవమా. నీకు నమస్సులు. ఒడ్డునకు చేర్చు వరకు సంసార నౌకను నీవే నడుపుము. ఓ భక్త సులభా! నా

మనస్సులోని భావనాసముద్రుడవయి కృపతో సంచరింపుము. మహాప్రభా! నీ భక్తులను గణించి, వారి భావనములలో

నిలిచి, నేర్పునొసగి వారిని జీవింపఁజేయుము..!  

27. ఓం నిటలాక్షాయ నమః.

సాధ్వీ వృత్తగర్భ సీసము.

రాజిత పదయుగ! రంజక వచసుఁడ! - ప్రార్థన వినుమయ రమ్యముగను.    

పూజిత వరదుఁడ! పుణ్య ఫలమ! నినుఁ - బొందితిమిల ఘన పుణ్యముగను.        

మా జయములకును మాన్యుఁడవగు నిను - మన్ననఁ గనుదుము మంచిఁ గనను,

శ్రీజయ విభవుఁడ! చేకొనుమయ మము - చిత్తమునను నిలు. క్షేమమిడను.

గీ. సాధ్వి గర్భిత సీస ప్రశాంతరూప! - చేదుకొనుమయ్య *నిటలాక్ష*! చిత్ప్రకాశ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

27 సీస గర్భస్థ సాధ్వీ. ( .. యతి 1-8-15-22)

రాజిత పదయుగ! రంజక వచసుఁడ! ప్రార్థన వినుమయ రమ్యముగన్.    

పూజిత వరదుఁడ! పుణ్య ఫలమ! నినుఁ బొందితి మిల ఘన పుణ్యముగన్.        

మా జయములకును మాన్యుఁడ వగు నిను మన్ననఁ గనుదుము మంచిఁ గనన్.

శ్రీజయ విభవుఁడ! చేకొనుమయ మము చిత్తమునను నిలు క్షేమమిడన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశించు పదములు కలవాడా! మనో రంజకమైన

వాక్కులు కలవాడా! రమ్యముగా నా ప్రార్థన వినుము. పూజింపఁబడే వరప్రదాతా! మా పుణ్యముల ఫలితమైనవాడా! మా

యొక్క గొప్ప పుణ్యముగా నిన్ను పొందితిమి. మా జయముల కొఱకు, మంచి కనుట కొఱకు మాన్యుఁడవయిన నిన్ను

మన్ననతో చూచుదుము. మంగళకర జయవైభవము కలవాడా! మమ్ములను మనః పూర్వకముగా చేకొనుము. మాకు

క్షేమము కలుగఁ జేయుట కొఱకు మానస్సులో నిలిచి యుండుము. సాధ్వీవృత్త గర్భిత సీసరూపమున నున్న ప్రశాంత

స్వరూపుఁడా! నిటలాక్ష చిత్ప్రకాశా! మమ్ములను చేదుకొనుము .

28. ఓం సహస్రాక్షాయ నమః.

కవిరాజవిరాజిత గర్భ సీసము

జనులకు సేవలు చక్కగఁ జేయుచుఁ - జక్కని పాలన సల్పు ప్రభుని

కనుమయ నిత్యము గౌరవమొప్పఁగఁ - గల్పకమై మముఁ గావు కృపను.

జనుల మనంబులఁ జక్కని వాఁడుగ - సన్నుతిఁ గాంచెడి సౌమ్య విభుని

మనమునఁ గావుమ మన్ననఁ గొల్పుమ, - మా నరసింహుఁడ మంచిఁ గనఁగ.

గీ. ప్రజల మనములు దోచెడి ప్రభువులందు - నిలుతువీవె *సహస్రాక్ష* నిత్యముగను

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

28 సీస గర్భస్థ కవిరాజవిరాజితము. ( లగ .. యతి 1-8-14-20)

జనులకు సేవలు చక్కగఁ జేయుచుఁ జక్కని పాలన సల్పు ప్రభున్.

కనుమయ నిత్యము గౌరవమొప్పఁగఁ గల్పకమై మముఁ గావు కృపను.

జనుల మనంబులఁ జక్కని వాఁడుగ సన్నుతిఁ గాంచెడి సౌమ్య విభున్.

మనమునఁ గావుమ మన్ననఁ గొల్పుమమా నరసింహుఁడ మంచిఁ గనన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! జనులకు సేవలు చక్కగా చేయుచు పరిపాలన చేసెడి

ప్రభువులను గౌరవ ప్రదముగా నిత్యమూ చూడుము. కల్పకమై మమ్ములను కృపతో కాపాడుము. ప్రజల మనస్సులలో

చక్కని రాజ్యపాలకునిగా సన్నుతి గడించినసౌమ్యుఁడయిన ప్రభువులకు మన్నన కలుగఁజేయుచు మనస్సున

నిలుపుకొని మన్నింపఁబడునట్లుగా కాపాడుము. సహస్రాక్షా! ప్రజలు మెచ్చెడి ప్రభువులందుండువాడ వీవేకదా.

29. ఓం దుర్నిరీక్షాయ నమః.

ప్రణవ వృత్త గర్భసీసము.

కమల నాభుండ! నే కాంక్షించెద నినుఁ జూ - డంగన్ మనంబునుప్పొంగఁగనిల.

గౌరవార్హుండ. నీకై నేనిట నిలుతున్ - దేవా! కృపాసాంద్ర! దివ్య పురుష!

కమలనాభుండ! శ్రీ కామ్యార్థద! సిరితో - రమ్మా! లసత్ జ్ఞాన మిమ్ము నృహరి!

గోకుల వాస! నాకున్ దిక్కయి నడు నా - తండ్రీ! ప్రణవ రూప! దర్శనమిడు.

గీ. దోష కలుషిత జనులకు *దుర్నిరీక్ష*! - దోషములు పాపి కాపాడు శేషశాయి!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

29 సీస గర్భస్థ ప్రణవము. ( .. యతి 6)

నే కాంక్షించెద నినుఁ జూడంగన్. - నీ కై నేనిట నిలుతున్ దేవా!

శ్రీ కామ్యార్థద! సిరితో రమ్మా! - నా కున్ దిక్కయి నడు నా తండ్రీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కమల నాభుఁడా! నా మనసు ఉప్పొంగిపోవునట్లుగా

నిన్ను నేను మనస్సులో చూచుటకు కోరెదను. గౌరవార్హుఁడవయిన కృపాసాంద్రా! హరీ! ముకుందా! నీ కొఱకై

నేనిక్కడ నిలిచి యుంటిని. కమలనాభుఁడా! మంచి కోరికలు తీర్చువాడా! లక్ష్మీసమేతుఁడవై రమ్ము. నృహరీ!

ప్రకాశించే జ్ఞానమును నాకు ప్రసాదించుము.. ప్రణవరూపుడా! గోకులవాసా! నాకు దిక్కుగానుండి నడువుము. నాకు నీ

దర్శనము కలిగించుము. పాపకలితులకు దుర్నిరీక్షుఁడవైన శేషశాయీ! మా దోషమునను పోఁగొట్టి కాపాడుము.

30. ఓం ప్రతాపనాయ నమః.

తాండవజవ వృత్త గర్భ సీసము.

నడిపించు కరుణామయుఁడవుకద, నను కా - వఁగ నిల లేవా ప్రభావమెలయ.

జయసింహ! భరమా? సుజనుల నిలుపఁగఁ బ్రా - ర్థన విని రావా! సురక్షకుఁడుగ.

ప్రకటిత పరిపాలక! కని నిలుపఁగ బా ధ్యుఁడవిటఁ గావా! మధు ప్రహార!

పొసఁగును నిరపాయము నినుఁ దలచిన ని - త్య! నృహరి దేవా! మహా ప్రభావ!  

గీ. సచ్చిదానంద సామ్రాజ్య సాధనమున, - దుష్ట చిత్త *ప్రతాపనా*! తోడు నిలుమ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

30 సీస గర్భస్థ తాండవజవము. ( .. యతి 12)

కరుణామయుఁడవుకద, నను కావగ నిల లేవా

భరమా! సుజనుల నిలుపఁగఁ బ్రార్థన విని రావా!

పరిపాలక! కని నిలుపఁగ బాధ్యుఁడవిటఁ గావా!

నిరపాయము నినుఁ దలచిన నిత్య! నృహరి దేవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లోకములను నడిపించు కరుణాపూర్ణుఁడవే కదా. నీ

ప్రభావము వ్యక్తమగునట్లుగా నన్ను కాపాడుటకయి నీవు నిలబడలేవా?. జయసింహా! మంచివారిని నిలుపుట నీకు

బరువా యేమి?మా ప్రార్థన విని మంచిని రక్షించువాడిగా రావా? మధుసూదనా! ప్రకటిత పాలకుడా! మమ్ములను

చూచి నిలుపుటకు బాధ్యుడవు నీవే.నిత్యుఁడవైన నరహరీ!  గొప్ప ప్రభావము కలవాడా! నిన్ను తలచినచో నిరపాయము

పొసగును.సచ్చిదానంద సామ్రాజ్య స్థాపనము విషయమున దుష్ట చిత్తులను మిక్కిలి తపింపచేయువాడా! మాకు తోడుగా

నిలఁబడుము.

31. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః.

కలిత వృత్త గర్భ సీసము

సమవర్తివి. జయ పథము నీవు. వర కవిన్ - నడిపెడి నరహరీ! నన్నుఁ గనుమ.

గణనీయ! ప్రజల సుఖము నీవయ. ఘన - క్షణఁ గొలుపు గతివే! కమలనయన!

మదినుండు సుజన వరదుఁడా! శుభకర! శో -  భఁ గొలుప వలదొకో? పాపహారి!

సుగుణుఁడ! నిజముఁ గనఁగ నీవె యనుచు నే - ర్ప వలదొ? తెలియఁగన్ ప్రవిమల గతి.

గీ. కలిత గర్భసు సీసస్థ! కామితదుఁడ! - ధరణి వర *మహాదంష్ట్రాయుధా*! జయోస్తు.    

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

31 సీస గర్భస్థ కలిత. ( .. యతి 12) 

విజయ పథము నీవు. వర కవిన్ నడిపెడి నరహరీ!

ప్రజల సుఖము నీవయ ఘన రక్షణఁ గొలుపు గతివే

సుజన వరదుఁడా! శుభకర! శోభఁ గొలుప వలదొకో?

నిజముఁ గనఁగ నీవె యనుచు నేర్ప వలదొ? తెలియఁగన్.

 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీవు సమవర్తివిజయ మార్గముకూడా నీవే.శ్రేష్ఠకవిని

నడిపించువాడవు. నన్నును చూడుము. గణింపబడువాడా! ప్రజల సుఖమునీవే.   కమల నయనా! గొప్ప రక్షణ

గొలుపు వాడవే సుమా. శుభకరుడా! మదిలో వసించు సుజన వరదుఁడా! నీవు మాకు శోభను గొలుప వలదా?

సుగుణాఢ్యుడా! నిర్మలచిత్తముతో తెలుసుకొనుటకు చూడగా నిజమనిన నీవేయని నేర్పవలదా నీవు. కలిత వృత్తగర్భ

సీసరూపుఁడా! కోరిక లీడేర్చువాడా! భువిని గొప్ప కోరలు ఆయుధముగా కలవాడా! నీకు జయము.

32. ఓం ప్రాఙ్ఞాయ నమః

పాలాశదళ వృత్త గర్భ సీసము.

జన హితము కొలుపు మన సచివు లిల నీ – వే, రక్షకుఁడవు నీవే మురారి,

ఘనుఁడవగు సునయన నిగమ సుగమ దే - వాదిదేవుఁడవు మహానుభావ!

ఘనతఁ గల సచివులను గనుచు శుభ మి - మ్మాదరించెడు బుద్దిననయమిమ్ము.

మనుజులకు సుఖద ఘన మహితులనె యి - మ్మా శుభజులఁ గావుమా నృసింహ!

గీ. పాలకుల బుద్ధి బాగున్న బాగు మాకు. - పాలకులను *బ్రాజ్ఞా*! కన బాగు నీకు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

32 సీస గర్భస్థ పాలాశదళ వృత్తము. (15 లఘువులు గగ .. యతి 11)

జన హితము కొలుపు మన సచివు లిల నీవే

ఘనుఁడవగు సునయన నిగమ సుగమ దేవా!

ఘనతఁ గల సచివులను గనుచు శుభ మిమ్మా!

మనుజులకు సుఖద ఘన మహితులనె యిమ్మా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై ప్రజా హితమును నెరవేర్చెడి మన నేతలు నీవే.  

రక్షకుఁడవు నీవే కదా.  ఘనుఁడవగు సునయనా! మహానుభావా! నీవు వేదములందు సుగమమయే

దేవాదిదేవుఁడవు.  గౌరవము కలిగిన పాలకులను నీవు చూచుచు శుభములనొసఁగుము. నిన్నాదరించు బుద్ధిని ఎల్లప్పుడు

ఇమ్ము. మానవాళికి సుఖమును కల్పించెడి నాయకులనే ప్రసాదింపుము. శుభజులను కాపాడుము.పాలకుల బుద్ధి

బాగున్నచో మాకు క్షేమము. ప్రజ్ఞావంతుఁడా! ఆ విధముగ చూచుటయే నీకు మంచిది సుమా..

33. ఓం చండకోపినే నమః.

ఊర్వశి వృత్త గర్భ సీసము.

సన్నుతుండ! సుజన సంరక్షకా! సుంద - రాంగ! రారా! మృగరాజ ముఖుఁడ!  

భక్తులైన ప్రజల బాధల్ కనన్ రార - రక్ష నీవే కదా! రాక్షసారి!

నీరజాక్ష! నిజము నిన్నే మదిన్ నిల్పి - యున్నవారిన్ గాంచు మన్ననమున.

ధరను గావ కుజన దౌష్ట్యంబులం గూల్చి - యాదుకోరా! ప్రీతిఁ జేదుకోర

గీ. దురితులకుఁ *జండకోపీ* బెదురు కొలుపుచు - సుజనులకు శాంత మూర్తివై శోభఁ గొలుపు.   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

33 సీస గర్భస్థ ఊర్వశి. ( .. యతి 8)

సుజన సంరక్షకా! సుందరాంగ! రారా! - ప్రజల బాధల్ కనన్ రార. రక్ష నీవే!

నిజము నిన్నే మదిన్ నిల్పి యున్నవారిన్ - కుజన దౌష్ట్యంబులం గూల్చి ఆదుకోరా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సింహముఖుఁడా! పొగడఁబడువాడా! మంచివారిని

కాచువాడా! సుందరాంగా! నాకడకు విచ్చేయుము.. రాక్షసారీ! భక్తులైనవారి బాధలను చూచి నివారించుటకు రమ్ము.

నీవేకదా భక్తులకు రక్ష. పద్మనేత్రుఁడా! ఇది నిజముగా నిన్నే మనసున నిలిపి యున్నవారిని మన్ననముతో

చూడుము. సాటిలేని దురాగతములు చేయు కుజనులదుశ్చర్యలనుండి మమ్మాదుకొనుము. మమ్ములను చేపట్టుము.

చండ కోపీ! దుర్మార్గులకు బెదురుపుట్టునట్లు చేయుచు మంచివారికి శాంతమూర్తివై శోభిలఁజేయుము.  

34. ఓం సదాశివాయ నమః.

సరసాంక వృత్త గర్భ సీసము.

నా దివ్య దేవర! నంద బాలమణివే - ప్రభవిల్లు దేవాక్షరానృసింహ!

ప్రఖ్యాతిగా నిరపాయ జీవన గతిన్ - నిజ శక్తినిమ్మా దనుజ విదార!

యిలఁ గావుమా కరుణించి నా మనమునన్ -  గల చింత తీరంగఁ గమలనయన!

అరుదైన నా పరమాత్ముఁడా! మదిని నిన్ - వదలన్ సతంబుండు భవ్య నృహరి!

గీ. నిత్య సరసాంక సంయుక్త నిరుపమాన - భువి *సదాశివా*! యాదాద్రి పూజ్యదేవ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

34 సీస గర్భస్థ సరసాంక వృత్తము. ( .. యతి 10)

వర నంద బాలమణివే ప్రభవిల్లు దేవా!

నిరపాయ జీవన గతిన్ నిజ శక్తినిమ్మా!

కరుణించి నా మనమునన్ గల చింత తీరన్,

పరమాత్ముఁడా! మదిని నిన్ వదలన్ సతంబున్!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! సరసాంక సంయుక్త నిత్యుఁడా! సాటి లేనివాడా! సదాశివా! యాదాద్రి పూజ్య దేవరా!.

యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దివ్యుఁడవైన నా పరమాత్మా! నాశ రహితుఁడవై ప్రభవిల్లు దేవా! నందబాలమణివి

నీవు. దనుజ సంహారకా! ప్రఖ్యాతమైన నిరపాయమైన నిజజీవనగతిని శక్తిని నాకిమ్ము.నామనసునగల చింతపోకార్పు

దేవరా! కరుణించి నన్ను కాపాడుము.అరుదైన పరమాత్ముఁడా! భవ్య నృసింహా! మదిలో నిన్ను వదలను.

35. ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః.

మాలిని వృత్తము గర్భ సీసము.

వినయ మనయమునీవే నవ్య సూర్యప్ర - కాశానృసింహా! వికాసమీవె!

విజయ విభవములీవే సత్య సంపన్మ - హేశామహద్భాగ్య మీవె నాకు

సదయనొసఁగు రమేశాదర్ప మూలప్ర - ణాశామహద్ధర్మ నవ్యగతిని.

యనయ వితరణమిమ్మా! నన్ను రక్షించు - శ్రీశా! మహాత్మా! విశేష భాస!

గీ. దనుజుఁడగు *హిరణ్యకశిపుధ్వంసి*! నృహరి! - వినుత ప్రహ్లాదుఁ గాచిన విశ్వవేద్య!   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

35 సీస గర్భస్థ మాలిని వృత్తము. ( .. యతి 9)

నయమనయము నీవే నవ్య సూర్యప్రకాశా! - జయ విభవములీవే సత్య సంపన్మహేశా

దయనొసఁగు రమేశాదర్ప మూల ప్రణాశా! - నయ వితరణమిమ్మానన్ను రక్షించు శ్రీశా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! రాక్షసుఁడగు హిరణ్యకశిపుని నశింపఁ జేసినవాడా!

నరహరీ! ప్రశంసింపఁబడు ప్రహ్లాదును కాపాడిన విశ్వమంతటను తెలియఁబడువాడా!.  ఉదయ సూర్యప్రకాశా!

నృసింహా! ఎల్లప్పుడూ వినయ స్వభావము నీవే అగుదువు. నాకు వికాసమునిమ్ము. సత్య సంపన్నా! విజయవిభవములు

నీవే సుమా. రమేశా! నీవే నాకు గొప్ప భాగ్యమును దయతో నొసగుము. దర్పమును సమూలముగా నశింపఁ

జేయువాడా!.నన్ను రక్షించు శ్రీశా! మహేశా! విశేషముగా ప్రకాశించువాడా! అనయ వితరణబుద్ధినిమ్ము.

36. ఓం దైత్యదానవ భంజనాయ నమః.

విద్రుమలతా వృత్త గర్భ సీసము.

నిరుపమ! కొల్చెద నిను నిరతమిలన్ సు - సౌందర్య లహరివి సారసాక్ష!

తరుణము కావఁగ, ధరను ననుఁ గనన్ - కలనయినం గని కావుమయ్య!

చరణములందుదు సమయమిది హరీశ! - స్మరణమె ముక్తిని చక్కనిచ్చు.

వరముగనందుమ వరలఁ గన ననున్ వి - వర్ధిలఁ జేయుమ, భవ్య నృహరి!

గీ. విద్రుమలతగర్భ సీసస్థ! వెలసి మదిని - *దైత్యదానవ భంజనా*! తనియనిమ్ము

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

36 సీస గర్భస్థ విద్రుమలతావృత్తము. ( .. యతి 8)

నిరుపమ! కొల్చెద నిను నిరతమిలన్

తరుణము కావఁగ, ధరను ననుఁ గనన్

చరణములందుదు సమయమిది హరీ!

వరముగనందుమ వరలఁ గన ననున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేని వాడా! నిన్ను కొలిచెదను. సారసాక్షా! నీవు

మంచి సౌందర్యకెరటమే..  భూమిపై నన్ను చూచుటకు కాపాడుటకు ఇదే మంచి సమయము. నా కలలోనైనను నన్ను

చూచి  కాపాడుము. హరిపరమాత్మా! ఇది మంచి సమయము. నీ పాదములందుకొందును. .నీ స్మరణమె చక్కగా

ముక్తినిచ్చును కదా.నన్ను వరలునట్లు చూచుటకు నీవు నాకు వరముగా లభించుము. గొప్పవాడవైన నరహరీ నను

ప్రవర్ధిలఁ జేయుమయ్యా. దైత్య దానవ భంజనా! విదృమ వృత్తగర్భ సీసపద్యమున కలవాడా! నా మనసున వెలసి

నన్ను తృప్తిపడనిమ్ము.

37. ఓం గుణభద్రాయ నమః.

చంద్రికాద్వయ గర్భ సీసము.

సరస సుగుణ సాధ్య సత్ప్రభూమరువకు - నను మాన్య రక్షకా! కనుము కృపను.

సిరులనడుగఁజిత్ప్రసిద్ధుఁడావరము నొ - సఁగు భక్తి భావమున్నిగమ వేద్య!

సురుచిర కృతి శోభఁ జూడరాస్థిరుఁడవు - కన దీని దీప్తిలోఁగమల నయన.

పరమ పురుష బ్రహ్మబాంధవాశరణు  - రణు చంద్రికాసుధార్ణవ, మనోజ్ఞ!

గీచంద్రికాద్వయ గర్భిత సాంద్ర సీస - రమ్య *గుణభద్ర*! దాసుఁడన్. రక్షనిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

37 సీస గర్భస్థ చంద్రికాద్వయము. ( .. యతి 7)

1.సరస సుగుణ సాధ్య సత్ప్రభూ! - మరువకు నను మాన్య రక్షకా!

సిరులనడుగఁజిత్ప్రసిద్ధుఁడా! - వరము నొసఁగు భక్తి భావమున్

2.సురుచిర కృతి శోభఁ జూడరా! - స్థిరుఁడవు కన దీని దీప్తిలో

పరమ పురుష బ్రహ్మబాంధవా! - శరణు శరణు చంద్రికాసుధా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సరస సుగుణములచేత మాత్రమే సాధ్యమగువాడా!

మన్ననలందు నా రక్షకుడవైన హరీ! నన్ను కృపతో చూడుము, మరువకుసుమా. చిద్రూపిగా వేదములచే

యెఱుగబడెడివాడా! నేను ధనములు కోరుటలేదు. .భక్తి భావములే నాకు వరముగా నిమ్ము. ప్రసిద్ధమయినవాడా!

కమలనయనా! శతకము యొక్క ప్రకాశములో నీవు స్థిరుఁడవై యున్నావు. .చూడుము.. వెన్నెలసుధా సాగరమా!

మనోజ్ఞుఁడా! పరమ పురుషా! బ్రహ్మ పితా! నిన్ను శరణు కోరుచున్నాను..చంద్రికావృత్తద్వయగర్భసీసస్థుఁడవైన

గుణభద్రా! నేను నీ దాసుఁడను. నీవు నాకు రక్షణనిమ్ము..

38. ఓం మహాభద్రాయ నమః.

ఉత్సాహ వృత్త గర్భ సీసము.

నారసింహ కనుమ నన్ను నయముఁ గొల్పు - చున్, సదా నియతిని శోభిలు మది.

చేర వచ్చెదనయ కోరి శ్రీహసనము - చిన్మయాకృతిఁ జూచి తన్మయమవ.

చేరి, పాదయుగళి సేవఁ చేయుదును - రీ! సదా భక్తితో శ్రీశ! కొనుమ.

కోరుకొందు సతము, కూర్మిఁ గొనుమ నన్ను - శ్రీపతీ! నిలుము నా చేతనమయి.

గీ. అసమ నుత *మహాభద్రా*ద్రి యాద గిరియె - వసుధ రాజిల్లె నీకు నివాసమగుచు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

38 సీస గర్భస్థ ఉత్సాహ వృత్తము. (7 సూర్య గణములు 1 గురువు ,,

                                             యతి 5 గణము 1 అక్షరము)

నారసింహ కనుమ నన్ను నయముఁ గొల్పుచున్ సదా.

చేర వచ్చు జనులు కోరు శ్రీహసనము చిన్మయా!

చేరి, పాదయుగళి సేవఁ చేయుదును హరీ! సదా.

కోరుకొందు సతము, కూర్మిఁ గొనుమ నన్ను శ్రీపతీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నాలో నయమార్గమును నిలుపుచు నన్ను చూడుము.

ఎల్లప్పుడూ నియమముతో నానో శోభించుము. నీ యొక్క మంగళప్రదమైన నవ్వు, చిన్మయ స్వరూపమును చూచుచు

ఉప్పొంగుటకు నిన్ను చేరుటకై వచ్చెదను.   లక్ష్మీ పతీ! భక్తితో నీ పాద సేవ చేయుదును నీవు స్వీకరింపుము.

నేనెప్పుడూ కోరుకొందును, నన్ను ప్రేమతో స్వాకరింపుము. నా చైతన్య స్వరూపమై నాలోనే ఉండుము. పొగడబడెడి

స్వామీ! యాదాద్రి మహా భద్రగిరియే నీ నివేశమై రాజిల్లుచున్నది..

39. ఓం బలభద్రకాయ నమః.

తరలి వృత్త గర్భ సీసము.

హరి! నీకు వందన మనఘా! ననుఁ గను - వ్య వినుత శ్రీహరీ! భవభయహర

వరదుఁడా! సుందర వదనా! సురుచిర శు - ద్ధ హృదయ మాధవా! మహిమఁ గనుమ.

యసమాన! మంద సుహసనా! పలుకుము మా - న్యుఁడ! సదయుండవై. విడకు నన్ను.

ప్రవరుండ! బంధితుఁడవనన్ మనసును బా - యక నిలుమా కృపన్. బ్రకటితముఁగ.

గీ. శ్రీశ! తరలి గర్భ మహిత సీస వాస! - సుందరా! *బలభద్రకా*! వందనములు

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

39 సీస గర్భస్థ తరలి. ( .. యతి 11)

వందన మనఘా! ననుఁ గను భవ్య వినుత శ్రీహరీ!

సుందర వదనా! సురుచిర శుద్ధ హృదయ మాధవా!

మంద సుహసనా! పలుకుము మాన్యుఁడ! సదయుండవై.

బంధితుఁడవనన్ మనసును బాయక నిలుమా కృపన్.  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భవభయ హరా అనఘా! నీకు వందనము.

వరదుఁడా! సుందర వదనుడా! సుందరమైన శుద్ధ హృదయా! మాధవా! నన్ను మహిమతో చూడుము.సాటిలేని

మంచి సురుచిర మందహాసా! మాన్యుఁడా! పలుకుము. దయతో కూడినవాడవై నన్ను విడిచెపెట్టకుము..

సర్వశ్రేష్టుఁడా! నీవు బంధితుడవైతివను విధముగా కృపతో నా మనసునుండి విడిపోకుండా స్పష్టమగునట్లుగా నాలో

నిలుము. శ్రీపతీ తరలి వృత్త గర్భ సీసపద్యస్థుఁడా! సుందరా! బలభద్రకా! నీకు నమస్కారములు.

40. ఓం సుభద్రకాయ నమః.

తోటక గర్భ సీసము.

దండించుమాదురితంబులు చేసెడి - దుర్జనులన్ గాంచి తోయజాక్ష!

ఘోరమౌ దుష్ పరిహారము చేయుమ - భక్త నుతానీదు శక్తిఁ జూపి,

వర్ధిల్లుచున్ నిరపాయులు కావలె - నీ జనులున్దేవనీవె రక్ష.

యాదుకోరా! పరమాత్మ గణించి కృ - పంగనుమాదేవపరమ పురుష!

గీ. దుర్మదాంధుల దండించి త్రోవఁ జూపు - కర్మసాక్షి *సుభద్రకా*! కరుణఁ గనుమ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

40 సీస గర్భస్థ తోటకము. ( .. యతి 9)

దురితంబులు చేసెడి దుర్జనులన్.

పరిహారము చేయుమ భక్తనుతా

నిరపాయులు కావలె నీ జనులున్.

పరమాత్మ గణించి కృపం గనుమా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! తోయజాక్షా! చెడుగా ప్రవర్తించెడి చెడ్డవారిని

దండించుము. నీ శక్తి కొలది ఘోరమైన  చెడును పరిహరించుము. దేవా నీ జనులు వర్ధిల్లుచూ నిరపాయులు

కావలెనయ్యా. వారికి నీవే రక్షం   పరమ పురుషా! దేవా! కృపతో నీవు చూచి ఆదుకొనుమా. దుర్మదాంధులను దండించి

త్రోవ చూపెడికర్మసాక్షివైన సుభద్రకా! కరుణతో చూడుము.

41. ఓం కరాళాయ నమః.

మోహప్రలాప వృత్త గర్భ సీసము.

ధీవర! ముక్తి,  సుధీ! యిచ్చి ప్రోవ రా - వామహా దేవరా! ప్రేమతోడ.

జీవికఁ జూచి సృజించంగఁ జూచు దే - వా! మహా దేవదేవా! సమర్ధ!

భావికి శ్రీవరభాగ్యమ్మునీయరా - వాగర్థ సంభాసపాప నాశ!

సేవకుఁ జూచి ప్రసిద్ధంబుఁ గొల్పరా - రాజాధిరాజనిన్ బూజ సేతు.

గీ. ప్రాణ భీతినిఁ బాపు *కరాళ*! నృహరి! - జ్ఞాన భాతిని గొల్పుమా కన్నతండ్రి!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

41 సీస గర్భస్థ మోహప్రలాప వృత్తము. (     .. యతి 7)

ధీవర! ముక్తి , సుధీ! యిచ్చి ప్రోవ రావా? - జీవికఁ జూచి సృజించంగఁ జూచు దేవా!

భావికి శ్రీవరభాగ్యమ్మునీయ రావా! - సేవకుఁ జూచి ప్రసిద్ధంబుఁ గొల్ప రారా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మహా దేవరా! ధీవరా! ప్రేమతో ముక్తిసుధను నాకు

ప్రసాదించి కాపాడ రావా? సమర్ధుఁడా! దేవదేవా! జీవనాధారమును చూచి సృజించ జూచువాడవా?. పాపహరా!

వాగర్థ సంభాసా!. భావి కొఱకు శ్రేష్ఠమైన భాగ్యమునిమ్ము!. రాజాధి రాజా! నెన్ను పూజింతును. సేవకుని చూచి

ప్రసిద్ధమగునట్లు చేయుము. ప్రాణభయమును పోగొట్టు కరాళ! నృహరీ! కన్న తండ్రీ! నాలో జ్ఞానదీప్తిని కొల్పుము.!

42. ఓం వికరాళాయ నమః.

సర్వలఘు మధ్యాక్కర గర్భ సర్వలఘు సీసము.  

జనితమగు సకలము నిజ జనితము కదటయ నృ - హరి! కనఁగ ఘనతకద! నిరుపమమిది.

కనుదునయ నిను. కనుమిక కమలనయనుఁడ! ననుఁ - గృపఁ గిలిగి సుగుణ పథ తపన మొసఁగు.

క్షణమయిన నిక విడువక, కనులనిడుకొని కను - మయ దయను. సురవినుత మహితవరద!  

గుణగణననిక మరువకు గురువరుని పగిది సు - లభ! శుభద! గుణము గని, యభయమొసఁగు.

గీ. వేల్పువయి కాచు *వికరాళ*! వేడెద నిను - దౌష్ట్యమడచుచు కావఁగన్ ధర్మమిలను.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

42 సీస గర్భస్థ సర్వ లఘు మధ్యాక్కర. (2 ఇం.. 1 సూ.. 2 ఇం.. 1 సూ. .. యతి 4

                                                 గణము 1 అక్షరం. 4పాదములు)

జనితమగు సకలము నిజ జనితము కదటయ నృహరి!

కనుదునయ నిను. కనుమిక కమలనయనుఁడ! ననుఁ గృప.

క్షణమయిన నిక విడువక, కనులనిడుకొని కనుమయ.

గుణగణననిక మరువకు గురువరుని పగిది, సులభ

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పుట్టబడుచున్నవన్నియు నీచే పుట్టింపబడుచున్నవేకదా

ఇది ఘనమైనదే, సాటియు లేనిది. నేను నిన్ను చూచెదను, నీవును నన్ను చూడుము. కృపను కలిగి సుగుణతపనను

నాకొసగుము. దేవతలచే పొగడబడెడి గొప్ప వరదుఁడా! ఇంక క్షణకాలమయినను నన్ను విడువకుండా దయతో నన్ను

చూడుము. సులభుఁడా! శుభదుఁడా! ఇక గురువరుని వలె గుణగణనమును మరువకుము.. గుణము చూచి

నాకభయమొసగుము. .దేవతామూర్తివై కాపాడే వికరాళా! నిన్ను దౌష్ట్యములనణచుచు ధర్మమును కాపాడుమని నిన్ను

వేడుకొందును.

43. ఓం వికర్త్రే నమః.

వృంత వృత్త గర్భ సీసము

ఉపమాన రహిత! తిరుపతివగు మహదే - వా! రా! కృపన్ జూడవా! నృసింహ!

ఘనుఁడ! ముదమున తరుణమిదిర కన ధా - త్రీశా! దృగబ్జముల్ తెరచి చూడు.

కనఁగ వలచితి. చరణకమలములు చా - లంటిన్ గదా! కనుమొంటివాడ!

వరమిడ నికను పరమ పురుష నినుఁ బ్రా - ర్థింతున్. మదిం గననెంతునయ్య.

గీ. కర్తనౌదును నీవున్న కావ్య గతికి. - కావ్యకారక! నిజము *వికర్త*వీవె.    

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

43 సీస గర్భస్థ వృంత వృత్తము. ( గగ .. యతి 9)

తిరుపతివగు మహదేవా! రా! - తరుణమిదిర కన ధాత్రీశా!

చరణకమలములుచాలంటిన్ - బరమ పురుష నినుఁ బ్రార్థింతున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సరిపోలునది లేనివాడా! లక్ష్మీ పత్రివైన మహాదేవా!

నరసింహా! రమ్ము. నన్ను కృపతో చూడవా. ధాత్రీశా!  ప్రేమతో చూచుటకు ఇదే మంచి సమయము. . ఘనుఁడా! నీ

కనుపద్మములను తెరచి చూడుము..నేను చూడకోరుచుంటినయ్యా. అందులకు నీ చరణపద్మములే చాలునంటిని

కదా. .నేను ఒంటరి వాడను నన్ను చూడుము.పరమ పురుషా! నాకు వరమొసగుటకై నిన్ను వేడుదును.. మనసులో చూడఁ

గోరుదునయ్యా. నీవు రహించు కావ్యగతికి నేను కర్తగా అగుదును. కావ్యకారకుఁడా! వికర్తవీవేయనుట నిజము.!

44. ఓం సర్వకర్తృకాయ నమః.

అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము.

కూర్మితోడ సిరులు కురిపించునట్టి శ్రీన్ - జేరి కూర్మి వరలఁ జిత్ప్రభాస

చిత్రమైన వర నృసింహంబుగా నీవ - ప్రభవమొందఁగ ఘన ప్రభలతోడ.

శ్రీధరుండ! ధరను యాదాద్రి వర నుత - ధామమయ్యెను కద! తండ్రివీవె.

ధుర్య వర్య! కరుణతో భక్త వరులను - కను నృసింహ! సదయ వినుము మనవి.

గీ. విశ్వ భర *సర్వకర్తృకా*! శాశ్వితమగు - శుభసుచరితంబు కొల్పి నన్ జూడుమయ్య!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

44 సీస గర్భస్థ తేటగీతి - అంతరాక్కర. (1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము ..

                                                యతి 3 గణము చివరి అక్షరము)

సిరులు కురిపించునట్టి శ్రీన్ జేరి కూర్మి - వర నృసింహంబుగా నీవ ప్రభవమొంద,

ధరను యాదాద్రి వర నుత ధామమయ్యె. - కరుణతో భక్త వరులను కను నృసింహ

44 సీస గర్భస్థ ఆటవెలదిద్వయము

1.కూర్మితోడ సిరులు కురిపించునట్టి శ్రీన్ - జేరి కూర్మి వరలఁ జిత్ప్రభాస

చిత్రమైన వర నృసింహంబుగా నీవ - ప్రభవమొందఁగ ఘన ప్రభలతోడ.

2.శ్రీధరుండ! ధరను యాదాద్రి వర నుత - ధామమయ్యెను కద! తండ్రివీవె.

ధుర్య వర్య! కరుణతో భక్త వరులను - కను నృసింహ! సదయ! వినుము మనవి.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! శ్రీధరా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! చిత్ప్రభాసా! ప్రేమతో సిరులను

కురిపించునటువంటి లక్ష్మీ దేవిని చేరి వరలుట కొఱకు చిత్రమైన నరసింహ రూపముతో గొప్ప కాంతులతో నీవు

ప్రభవింపగా యాదాద్రి శ్రేష్ఠమైన పొగడఁబడెడి ప్రదేశమయ్యెను. మమ్ములను భరించెడివాడవైన తండ్రివి నీవే.

కరుణతో భక్తులను చూడుము దయతో మా మనవి వినుము.. విశ్వభరుడవైన సర్వకర్త్రుకా!  శాశ్వితమైన శుభప్రదమైన

మంచి ప్రవర్తన నాకు ప్రసాదించుచు నన్ను చూడుము.

45. ఓం శింశుమారాయ నమః.

రుచిర వృత్త గర్భ సీసము.

ఆత్మస్థుఁడ! దయామయా! కరుణను దారిఁ - జూపవా? మాకిల ప్రాపు నీవె.

శ్రీకరుఁడ! ప్రయాసనే కనవొకొ? ప్రాణ - నాథుఁడా! మాకిట్టి బాధలేల?

నా దేవుఁడ! ప్రియంబునన్ గన నిను వేడు - కొందునే. నన్ను నీవందలేవ?

దీనబంధు! జయాన్వితా! నరహరి! సత్య - శోభితా! కొలుపుమా ప్రాభవంబు.

గీ. చిత్తహీనులనణచెడి *శింశుమార*! - భక్తపాళిని మదిఁగాంచి శక్తినిడుము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

45 సీస గర్భస్థ రుచిరవృత్తము. ( .. యతి 9)

దయామయా! కరుణను దారిఁ జూపవా?

ప్రయాసనే కనవొకొ? ప్రాణ నాథుఁడా!

ప్రియంబునన్ గన నిను వేడుకొందునే.

జయాన్వితా! నరహరి సత్య శోభితా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఆత్మలో నున్నవాడా! దయాపూర్ణుఁడా! ఇలలో నీవే

మాకు దిక్కు. దారి చూపుము.. ప్రాణనాథుఁడా! శ్రీకరా! మా శ్రమను గమనింపవేల? మాకీ బాధలెందులకు? నా

దైవమా! నన్ను ప్రేమతో చూడుమని వేడుకొనుచున్నాను. నన్ను నీవు అందుకొనలేవా? దీనబాంధవా! జయాన్వితా!

నరహరీ! సత్యమునందు ప్రకాశించువాడా!మాకు ప్రాభవమును కొలుపుము. హృదయము లేనివారినణచెడి

శింశుమారా! భక్తులను నీ మనసునందు చూచి శక్తిని ప్రసాదించుము.

46. ఓం త్రిలోకాత్మనే నమః.

నిశావృత్త గర్భ సీసము

జయము జయము దేవ! సన్మార్గ సత్య ప్ర - కాశా హరీ! నన్ను కావుమయ్య.  

భయము తొలఁగ నిన్ను భద్రుండ! చిత్తంబు - లోఁ గాంచుదున్ నేను భోగ శయన!

ప్రియము కలిగి నన్ను విజ్ఞానిగాఁ జేసి - రక్షించుమా! నిత్యరాజితాంఘ్రి!

నయముఁ గనఁగఁ జేసి నాలోన రాణించు - మా దేవ! రారా! రమావినోద!

గీ. ఘన నిశాగర్భ సీసస్థ కామితదుఁడ! - ఘన *త్రిలోకాత్మ* వైన నిన్ గనఁగనిమ్ము.               

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

46 సీస గర్భస్థ నిశావృత్తము. ( .. యతి 9)

జయము జయము దేవ! సన్మార్గ సత్యప్రకాశా హరీ!

భయము తొలగ నిన్ను భద్రుండ! చిత్తంబులోఁ గాంచుదున్

ప్రియము కలిగి నన్ను విజ్ఞానిగాఁ జేసి రక్షించుమా!

నయముఁ గనఁగఁ జేసి నాలోన రాణించుమా దేవరా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సత్యమున ప్రకాశించు శ్రీహరీ! దేవా! నీకు

జయము.నన్ను కాపాడుము. శేషశాయీ! భద్రుఁడా! భయము తొలఁగిపోవుట కొఱకు నింనే నా మదిలో చూచెదను. .

నిత్యప్రకాశపాదా! నీపై ప్రేమకలిగి నన్ను విజ్ఞానిగా చేసి రక్షించుము. రమా వినోద! మా దేవా! తప్పక రమ్ము.  నేను

నయమునే చూచునట్లు  నన్ను చేసి, నాలోనీవు రాణించుము. నిశావృత్తగర్భసీసపద్యస్థుఁడా! కామితప్రదుఁడా! ఘనమైన

ముల్లోకములకు ఆత్మవైనవాడా! నిన్ను నేను చూచునట్లు చేయుము.

47. ఓం ఈశాయ నమః.

త్రిపదిద్వయ గర్భ సీసము.

నీవు లేవనుటకు నింగియే సాక్షిగా! - నీవుంటివనుటకు నిప్పు సాక్షి.

నీవగు భువనముల్ నీవెగా నరసింహ! - నిరపాయ సదుపాయ స్మరణమీవె.

నీవె చలనమన నీరమే సాక్షిగా. - నీవె ప్రాణము, ప్రాణ నిధియె సాక్షి.

నీవ లక్ష్మివి లక్ష్మి నీదె నా దైవమా! - నిరతంబు నా మది నిలుము నీవె

గీపంచ భూతాళి సాక్షిగా ప్రబలు దేవ! - సహజ సద్భాస*యీశ*! మా సాక్షివీవె.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

47 సీస గర్బస్థ త్రిపది ద్వయము. (1 పాదము 4ఇం.. 2 పాదము 2ఇం.. 2సూ..

                                          3 పాదము 2 ఇం.. 1సూ..) 

1. నీవు లేవనుటకు నింగియే సాక్షిగా! …నీవుంటివనుటకు నిప్పు సాక్షి….నీవగు భువనముల్ నీవె.

2. నీవె చలనమన నీరమే సాక్షిగా! …నీవె ప్రాణము, ప్రాణ నిధియె సాక్షి….నీవ లక్ష్మివి లక్ష్మి నీదె.  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీవు ఆకాశానివి, అగ్నివి,. భువనములు నీవే, అపాయ

రహితమైన సదుపాయముకొల్పు స్మరణము నీవే, కదలి ముందుకు సాగే నదులు నీవే. ప్రాణ చయము నీవే. నీవే లక్ష్మివి

ఆలక్ష్మి నీదే. నా పరమాత్మా! నన్ను నిత్యము నా మదిలో నిలుము. పంచభూతములసాక్షిగా ప్రబలు సహజ

సద్భాసుడవీవే. ఈశ్వరా! మా అస్తిత్వమునకు నీవే సాక్షివి.

48. ఓం సర్వేశ్వరాయ నమః.

ప్రియంవద వృత్త గర్భ సీసము.

కుసుమాస్త్ర జనక సరసిజాననుఁడ! సన్ను - తాత్ముఁడా! శుభులకు హాయినిమ్ము.

క్షమనొప్పునట్టి పరమ భక్త పరిపాల - కా! హరీ! బాపుమా మోహపటిమ.

ప్రియమునన్ గనుచు దరిని నిల్చి రహదారి - చూపుమా పాపముల్ పాపుమయ్య.

రయమున నీవు కరము బట్టి మము గావు - మా ప్రభూ! కనుమయ్య మమ్ము నీవు.

గీ. పేర్మి నిట్టి ప్రియంవద వృత్త గర్భ - సీస *సర్వేశ్వరా*! నుతుల్. శేషశాయి

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

48 సీస గర్భస్థ ప్రియంవద వృత్తము. ( .. యతి 8)

సరసిజాననుఁడ! సన్నుతాత్ముఁడా! - పరమ భక్త పరిపాలకా! హరీ!

దరిని నిల్చి రహదారి చూపుమా! - కరము పట్టి మము గావుమా ప్రభూ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహామన్మధ జనకుడవైన పద్మ ముఖా! సన్నుతాత్ముఁడా!

శుభప్రదులకు సుఖమునిమ్ము.క్షమాగుణము గల భక్తపాలా! హరీ! మాలోని మోహపటిమను తొలగించుము.

.ప్రియముతో మమ్ము చూచుచు మా దగ్గరుండి జీవనమార్గమును చూపుము..మాపాపములను పోగొట్టుము. మా చేయి పట్టి

వేగముగా మమ్ము కాపాడుము, మమ్ములనెల్లప్పుడూ చూచుచుండుము. .ప్రియంవదవృత్త గర్భ సీసస్థ సర్వేశ్వరా!

శేషశాయీ! నీకు మా నుతులు.!

49. ఓం విభవే నమః.

ప్రియకాంతా వృత్తగర్భ సీసము.    

కలియుగ ధర్మంబు కనుచు గర్వింతువ - దేమో కృపాసాంద్ర! శ్రీమహేశ!

తెలిసియునిట్లీవె మలచితే, మాకు - హాత్మా! నిరోధించి యాపలేవ?

చలమది నీకేల? కలుష సంహారక! - దేవాది దేవా! ప్రదీప్తినిమ్ము.

ఖల సువిదారుండ! కనుచు కాపాడఁగ - రారా! పరంధామ! రక్షనీవె.     

గీ. అనుపమ *విభవా*! కలియుగమందు కృతము - వరలఁ జేయుమ సుఫలదా! ప్రవరముగను.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

49 సీస గర్భస్థ ప్రియకాంత వృత్తము. ( .. యతి 11)

కలియుగ ధర్మంబు కనుచు గర్వింతువదేమో!

తెలిసియునిట్లీవె మలచితే, మాకు మహాత్మా

చలమదినీకేల? కలుష సంహారక దేవా!

ఖల సువిదారుండ! కనుచు కాపాడఁగ రారా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కృపాసాంద్రు!ండవైన మహా దేవా అదెందువలననో

కాని కలియుగ ధర్మమును చూచి నీవు గర్వించుచుందువు. .అన్నియూ తెలిసి కూడా విధముగా ఎందులకు

సృజించితివి?   మహాత్మా! వాటిని అడ్డుకొని ఆపలేవా?   దేవాదిదేవా! కలుష సంహారకా! నీకు కోపమేల.మాలో దీప్తిని

కలుగఁ జేయుము. దుష్ట విదారకా! పరంధాముఁడా! చూచుచు మమ్ము కాపాడగా రా. మాకు రక్ష నీవే సుమా.సాటిలేని

వైభవ సంపన్నుడా! సుఫలదా! కలియుగమును నీవు కృతయుగముగా వరలఁ జేయుము..

50. ఓం భైరవాడంబరాయ నమః.

నదీ వృత్త గర్భ సీసము.

చలము విడి, జయముఁ గొలపరా. సత్య శుండ! శ్రీశా! నీ వశుండ నేను.

దురిత జన భయము తొలఁగినన్ భక్తిని - నిల్తు నేనే. మదిన్ నిలిపి నిన్ను.

బ్రతుకులోన నయము భయము లున్నన్ గన - నౌను నిన్నే ప్రభూ! దీన రక్ష!

కొలుతునిను, నయ సుగుణ నిధానా! కను - దేవ దేవా! మనోభావమెఱిఁగి.

గీ. ఆద్య! భైరవాడంబరా! ఆత్మవీవె! - దాసులందున వసియించు ధర్మమీవె

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

50 సీస గర్భస్థ నదీ వృత్తము. ( గగ .. యతి 8)

జయముఁ గొలపరా. సత్య వశుండ శ్రీశా!

భయము తొలఁగినన్ భక్తిని నిల్తు నేనే.

నయము భయము లున్నన్ గననౌను నిన్నే.

నయ సుగుణ నిధానా! కను దేవ దేవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్రీపతీ! నేను నీకు వశమయియున్నవాడను. నీవు

చలము విడిచి నాకు జయము కొలుపుము. .చెడ్డవారివలన కలిగుచ్చున్న భయము నాకు తొలఁగినచో నిన్ను మదిలో

నిలిపి భక్తితో నిలువఁగలను.బ్రతుకులో నీతి దానిని వ్యతిరేకించు విషయమున భయము కలిగినచో నిన్నె చూచుట

సాధ్యమగునయ్యా.  దీన రక్షకా!. నయ గుణ నిధానా! నిన్ను నేను సేవింతును.నా ఆంతర్యమెఱిఁగి నన్ను

కనుచుండుము. మూలపురుషా! భైరవాడంబరా! నా ఆత్మవు నీవే సుమా..నీ దాసులలో ఉండే ధర్మస్వరూపము నీవేకదా.!

51. ఓం దివ్యాయ నమః.

అలసగతి వృత్త గర్భ సీసము.

నిగమవేద్యా! అలసగతి నుంటిని. సహా - యివయి రావా సద్విభవమగుచును?

దయ చేసి యీ చలితమగు నా మదిని - క్కగను జేయన్ స్థితిన్ గలుఁగఁ జేయ.

ప్రముదంబుగా పలుకుమయ. పుణ్య ఫల భా - విత నృసింహా! నన్నుఁ బ్రేమఁ జూడు.

శ్రమకోర్చుకొని నిలుము మది నీవికను ని - త్యముగ దేవా! నిత్య ధర్మనిలయ.  

గీ. అలసగతి గర్భ సీసస్థ! వెలయుము మది. - భావ సంభాస *దివ్యా*! ప్రభావమిమ్ము.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

51 సీస గర్భస్థ అలసగతి. ( .. యతి 10)

అలసగతి నుంటిని. సహాయివయి రావా.

చలితమగు నా మదిని జక్కగను జేయన్.

పలుకుమయ పుణ్య ఫల భావిత నృసింహా!

నిలుము మది నీవికను నిత్యముగ దేవా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! వేదవేద్యా! నీను అలసగతినున్నాను.

మంచివిభవముగానగుచు నాకు సహాయిగా రమ్ము. చలించు నా మనసును దయతో చక్కగా చేయుటకు స్థితిని

కలుగ జేయుటకుప్రముదముతో మాటాడుము. పుణ్య ఫలమును కలుగ జేయు నృసింహా నన్ను ప్రేమతో చూడుము.

నిత్య ధర్మ నిలయా! శ్రమను భరించి నా మనసులో నీవిక నిత్యముగా ఉండుము.అలసగతి వృత్తగర్భసీసపద్యస్థుఁడా!

నా మదిని వెలయుము.నా భావమున ప్రకాశించు దివుఁడా! నాకు ప్రభావమునిమ్ము.!

52. ఓం అచ్యుతాయ నమః.

 ప్రమితాక్షర వృత్త గర్భ సీసము.

అనుపముఁడున్ సుజనాభిరామ శుభ శో - భితుఁడాశ్రిత సువర్ణ పేటి యంద్రు.   

రక్తితోడను నిజ భక్తపాళి మది ని - ల్పు నినున్ బ్రసిద్ధుఁడా! భోగశయన!

సంతోషముగ భజియింతురయ్య వర భా - వనతోడ, కనుమయ్య పరమ పురుష!

అల లక్ష్మితో ప్రజలందు నీ యునికి భా - వ్యమయా. స్వభక్త సేవ్యా! నిలుమయ.

గీ. *అచ్యుతా*! ప్రమితాక్షర హరివి నీవు. - ప్రముద ప్రమితాక్షర సుసీస భావ భాగ్య!  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

52 సీస గర్భస్థ ప్రమితాక్షర వృత్తము. ( .. యతి 9)

సుజనాభిరామ శుభ శోభితుఁడా! - నిజ భక్తపాళి మది నిల్పు నినున్.

భజియింతురయ్య వర భావనతో, - ప్రజలందు నీ యునికి భావ్యమయా.        

భావము.  భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓశేషశాయీ! సాటి లేనివాఁడును,

సుజనమనోహర శుభ శోభితుండును, ఆశ్రితులకు స్వర్ణపేటి అని నీ భక్తుల సమూహము అనురాగముతో

నిన్నే మదిని నిలుపును..ఉత్సాహముతో నిన్ను భజించును. పరమ పురుషా! వరభావనతో నీవు వారిని

చూడుము. స్వభక్తులచే సేవింపబడువాఁడా! లక్ష్మీసమేతుఁడవై ప్రజలలో నీవుండుట భావ్యము. కావున వారి మధ్య లక్ష్మీ

సమేతుఁడవై ఉండుము.

53. ఓం కవిమాధవాయ నమః.

షట్పద ద్వయ గర్భ సీసము

నరహరీ! నీ కృపన్ వరలించు, ధరణిని - నిరుపమానముగనో నీరజాక్ష!  

పరిహాసమును మాని కరుణించు నను నీవు - నిరపాయ సదుపాయ నిపుణుఁ జేయ.

నరసింహ పరమాత్మ! మురియంగ నినుఁ జూచి, - దరహాస చంద్రికన్ దక్కనిమ్ము.

చిరకీర్తిని రచింప పరివర్తన రచించు - శ్రీ రమా వల్లభా చిత్ప్రభాస!

గీ. ఘన సు*కవిమాధవా*! ననుఁ గనుమ. నాదు - కవితలందున వెలుగుమ, కవనమగుచు.   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

53 సీస గర్భస్థ షట్పద ద్వయము. (1 పాదమునందు 2ఇంద్ర గణములు, 2 పాదమునందు 2ఇంద్ర గణములు, 3

పాదమునందు 2ఇంద్ర 1చంద్ర గణములు, 4 పాదమునందు 2ఇంద్ర గణములు, 5 పాదమునందు 2ఇంద్ర గణములు,

6 పాదమునందు 2ఇంద్ర 1చంద్ర గణములుండును. యతి 3 పాదమునందు 3 గణము1వఅక్షరము. 6

పాదమునందు 3 గణము యొక్క 1 అక్షరము) {చంద్రగణములు.రగ/నగగ/తగ/సలగ/భగ/

                                     నలగ/మల/సగల/రల/నగల/తల/సలల/భల/నలల}

1.నరహరీ! నీ కృపన్

వరలించు ధరణిని 

నిరుపమానముగనో నీరజాక్ష!  

పరిహాసమును మాని

కరుణించు నను నీవు

నిరపాయ సదుపాయ నిపుణుఁ జేయ.

2.నరసింహ పరమాత్మ!

మురియంగ నినుఁ జూచి,

దరహాస చంద్రికన్ దక్కనిమ్ము.

చిరకీర్తిని రచింప

పరివర్తన రచించు

శ్రీ రమా వల్లభా చిత్ప్రభాస!   

భావము. భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పద్మనేత్రుఁడా! నీ కృపతో భూమిని సాటి

లేని విధముగా వరలించుము. నీవు పరిహాసము మాని నన్ను నిరపాయ సదుపాయ నిపుణునిగా చేయుటకు నన్ను

కరుణించుము. నరహరీ! శాశ్వత కీర్తి కలిగించుటకై మంచి మార్పును మాలో కొలిపెడి రమా వల్లభా! చిత్రప్రభాస

నిన్ను చూచి మేము ఒప్పొంగిపోవునట్లుగా నీ దరహాసచంద్రికలు మాకు దక్కునట్లు చేయుము. సుకవిమాధవా! నా

కవితలందు వెలుగువై నన్ను కరుణించుము.!

54. ఓం అధోక్షజాయ నమః.

మందారదామ వృత్త గర్భ సీసము.

దేవాదిదేవా! ప్రదీప్త ప్రభావా! - మస్తే! నమస్తే, నమామి శ్రీశ!

భావింప నిన్నున్ శుభంబుల్ వరించున్. శు - భాకార! నిరతంబుఁ బ్రబలు మదిని.

నీవుండి మాలోన నేర్పించుమెల్లన్ బు - నీత్వత్వముం గొల్పు నీరజాక్ష!

నీవారలం గాచు నీకున్ శుభంబుల్ - దా మంగళంబులుదారచరిత!

గీ. నన్నుఁ గాంచి *యధోక్షజా*! నయము నిమ్ము, - మహిత మందారదామస్థ మంగళాంగ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

54 సీస గర్భస్థ మందారధామ వృత్తము. ( గగ .. యతి 7)

దేవాదిదేవా! ప్రదీప్త ప్రభావా! - భావింప నిన్నున్ శుభంబుల్ వరించున్.

నీవుండి మాలోన నేర్పించుమెల్లన్, - నీవారలం గాచు నీకున్ శుభంబుల్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దేవాది దేవా! ప్రదీప్త ప్రభావా! శ్రీశా! నీకు

నమస్కారము.నిన్ను మా మనసులందు భావించినంతనే మమ్ము శుభములు వరించును. శుభాకారా! మా మదులందు

నీవు ప్రబలుము.పవిత్రతను గొలిపెడి నీరజాక్షా! నీవు మాలో ఉండి అన్నియు నేర్పించుము. ఉదార చరితా! నీవారైన

భక్తులను కాపాడెడి నీకెల్లప్పుడూ మంగళములు కలుగుగాక. మహనీయ మందార దామవృత్తపద్యమునగల

మంగళాంగా! అధోక్షజా! నన్ను నీవు చూచి నయమును ప్రసాదించుము.

55. ఓం అక్షరాయ నమః.

సుందర వృత్త గర్భ సీసము.

జీవము నీవయ. నీవె జీవన మీయ - వాదేలనయ్య? యో వాఙ్మనోజ్ఞ!

భావము నీవయ. నీవె భావనమీయ - వాణీశు తాతవే, వంకలేల?

రావము నీవయ. నీవె రమ్యతనీయ - వాగ్భాసినై నిన్నుఁ బాడనొక్కొ

నీవె ముకుందుఁడ! నేనె నీవనఁ జేయ - వాఙ్మాధురిన్ నినున్ వరలఁ గొలుతు

గీ. ప్రణవ సుందర సద్వృత్త ప్రభవు నీవు. - సీసమున వెల్గు *నక్షరా* శ్రితుఁడవీవు.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

55 సీస గర్భస్థ సుందర వృత్తము. ( .. యతి 9)

జీవము నీవయ. నీవె జీవన మీయవా?

భావము నీవయ. నీవె భావనమీయవా?

రావము నీవయ. నీవె రమ్యతనీయవా?

నీవె ముకుందుఁడ! నేనె నీవనఁ జేయవా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!   వాఙ్మనోజ్ఞుఁడా! నీవే మాలో జీవమయి యుంటివి. మాకు

జీవికను ఇచ్చుటకు వాదమెందులకుబ్రహ్మపితవే. భావము మాకు రమ్యగుణమొసగినచో మంచి మాటనైపుణ్యము కలిగి

నిన్ను ప్రశంసించకుందుమా. ముకుందుఁడా! నేను నీవే అనే విధముగా నీవు చేయగలిగినచో నిన్ను ప్రకాశింప జేసి

కొలిచెదను. సుందరమైన ప్రణవ వృత్తరూపుడవు నీవు. సీసపద్యమున ప్రకాశించే నాశ రహితుఁడవు నీవే సుమా!

56. ఓం శర్వాయ నమః.

ఫలసదన వృత్త గర్భ సీసము.

కుమదము నణచు సుగుణ మహితుఁడవు నీ - వే దేవ! నీవె మా వేల్పువయ్య.  

సుమధుర వచన కుసుమ మహతిఁ గొనుమీ - వే, పూజ నేఁ జేయు వేళలందు.  

కుముదమున నిను మిగులఁ బొలయఁగను, గొ - ల్తున్ సదా, మహనీయ! తోయజాక్ష!      

సహృదయమునఁ గను, జయహిత సుఫల దా - తా! హరీ! నిల్చి చిత్తంబులోన.

గీ. ఫలసదనవృత్త గర్భిత లలిత సీస - సరస సంభాస *శర్వా*! ప్రశాంతమిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

56 సీసగర్భస్థ ఫలసదనవృత్తము. (   ..  యతి 10)

మదము నణచు సుగుణ మహితుఁడవు నీవే. - మధుర వచన కుసుమ మహతిఁ గొనుమీవే.  

ముదమున నిను మిగులఁ బొలయఁగను గొల్తున్. - హృదయమునఁ గను జయ హిత సుఫల దాతా!

భావము.  

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కుత్సిత మదమును అణచెడి

మంచిగుణములతో ప్రకాశించు గొప్పవాఁడవు నీవే. దేవా ! నీవే మా దైవము.మేము పూజనాచరించే వేళలలో.మిక్కిలి

మధురమయిన మా వాక్కులనెడిపూల గొప్పదనమును స్వీకరించు. మహనీయుఁడవయిన పద్మనేత్రా! భూమిపై నీవు

మిక్కిలి ప్రకాశించు విధముగా నేను నిన్ను కొలిచెదను..జయమును హితముని కలిగించు మంచి ఫలమునొసగు హరీ!

నా హృదయమున నిలిచి నామన్సులోనుండియే నన్ను చూడుము.ఫలసదన వృత్తగర్భిత సీసమున సరసముగా

సంభాసించువాఁడా! శర్వా! మాకు మిక్కిలి శాంతిని కలుగఁజేయుము..

57. ఓం వనమాలినే నమః

ద్విరదగతి రగడ ద్వయ గర్భ సీసము.

నరసింహ! పరమాత్మ! ననుఁ గావఁగా రావ? - యాదాద్రి వాసా! జయంబు నీవ.

నరహరీ! నన్ గృపన్ నడిపింపఁగాలేవ? - నారాయణా! నీవె నన్నుఁ గనవ?

కరుణార్ద్ర హృదయ! నన్ గాపాడఁగాలేవ? - ధరనేలు తండ్రివే దయను కనవ

భరమొకో ననుఁ గావ వరద చిన్మయ దేవ? - సాష్టాంగ ప్రణుతులు సత్యదేవ!

గీ. రగడ గర్భిత సీస పరంతపుండ! - రార *వనమాలి*! సత్కృతిన్ జేర రమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

57 సీస గర్భస్థ ద్విరదగతి రగడ ద్వయము. (ద్విరదగతి రగడ - 2 పాదములు. ప్రాస, అంత్య  

                  ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 5 మాత్రలు గణములు 4 ఉండును.

                  యతి 3 గణము 1వఅక్షరము)

1.నరసింహ! పరమాత్మ ననుఁగావఁగా రావ?

నరహరీ! నన్ గృపన్ నడిపింపఁగాలేవ?

2.కరుణార్ద్ర హృదయ! నన్ గాపాడఁగాలేవ?

భరమొకో ననుఁ గావ వరద చిన్మయ దేవ?

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా ! నన్ను కాపాడుటకు రావా? నీవు విజయ స్వరూపుడవే కదా,

నన్ను నడపలేవా? నారాయణా నన్ను చూడవా? కరుణాంరతంగా! నన్ను కాపాడలేవా నీవు? ధరనే పాలించు

తండ్రివి కదా, నన్ను దయతో చూడలేవా? వరప్రదుఁడా! నన్ను కాపాడుట నీకు భారమా? నీకు సాష్టాంగ

ప్రణామములు.. రగడను గర్భమునందు కలిగిన సీస పద్యముననుండు పరంతపా! వనమాలీ కృపతో కృతిని

వసింప రమ్ము.?

58. ఓం వరప్రదాయ నమః.

మణిగణనికర వృత్త గర్భ సీసము.

జయములు కొలిపెడి సఖుఁడవు నృహరీ! వి - జయచింత నాకేల? సద్విభాస!

నయముగ నడిపెడి నరుఁడవు కదయావి - నయ వర్తనము చింత నాకదేల?

భయములనణచెడి వరదుఁడవుకనంగ -  నినుఁ గానకుందునా నిత్యసత్య!

ప్రియమున నిలువఁగ వెలయుము మదిలోన - విజ్ఞాన తేజమై వెలుఁగు నీయ.

గీ. సకల సద్గుణ మణిగణనికర గర్భ - సీస భాస *వరప్రదా*! చేరుము నను.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

58 సీస గర్భస్థ మణిగణనికర వృత్తము. ( .. యతి 9)

జయములు కొలిపెడి సఖుఁడవు నృహరీ!

నయముగ నడిపెడి నరుఁడవు కదయా

భయములనణచెడి వరదుఁడవు కనన్.

ప్రియమున నిలువఁగ వెలయుము మదిలో.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! విజయములు కలిగించెడి సఖుఁడవైన నీవుండగా నాకు

విజయము విషయములో అనుమానము లుండనవసరము లేదు. నయమార్గమున నడిపెడి నీ తోడు నాకుండగా నీతితో

కూడిన ప్రబర్తన విషయమై నాకు విచారము ఉండనవసరము లేదు. భయములను బాపెడి నీవు నన్ను కనకుండగా

ఉండవు. మనములందు ప్రేమతో వసింప వచ్చి విజ్ఞానతేజమునిమ్ము. మణిగణ వృత్త గర్భసీసమునందు ప్రకాశించు

సకల సద్గుణమణివైన వరప్రదా! నన్ను చేరుము.!

59. ఓం విశ్వంభరాయ నమః

తోదక వృత్త గర్భ సీసము.

నిరుపమ! నరహరి! నిల్చితె నామది - నిత్యాత్మవై నిలు. నిలుపు నన్ను.

మహితుఁడా! పరహిత మార్గము భద్రత - నిమ్మా! కృపం జూపు నెమ్మితోడ.

వినుతాత్మ! పరిణతి వేడుదు భవ్యుఁడ! - ముక్తిన్ మహా భక్తి పూర్వకముఁగ.

నిన్ గొల్తు, సిరిపతి నీవికఁ జేకొను - మయ్యా నృసింహా! మహానుభావ.

గీ. శ్రీశ! తోదక గర్భ సత్సీస వాస! - వినుత *విశ్వంభరా*! నాదు ఘనత నీవె.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

59 సీస గర్భస్థ తోదకము. ( .. యతి 8)

నరహరి! నిల్చితె నామది, నిత్యా! - పరహిత మార్గము భద్రతనిమ్మా!

పరిణతి వేడుదు భవ్యుఁడ! ముక్తిన్ - సిరిపతి నీవికఁ జేకొనుమయ్యా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేనివాడా! నా మదిలో నిలిచితివా, నిత్యాత్మవై నిలిచి,

నన్ను నిలుపుము. పరహితమార్గమును ఇచ్చుచు నాకు భద్రతను ప్రసాదించుము.నన్ను కృపతో చూడుము. వినుతాత్మా!

నా విజ్ఞానమునకు పరిణతిని, నాకు ముక్తిని కల్పించుమని భక్తిగ నిన్ను ప్రార్థించుచున్నాను.. శ్రీపతీ! నిన్ను

ఆరాధింతును. మహానుభావా నీవు నన్నింక చేకొనుము..తోదక వృత్తగర్భ సీసస్థుఁడవైన శ్రీశా! విశ్వంభరా! నాకు

సంప్రాప్తమగుచున్న కీర్తి యనునదున్నచో అది నీవే సుమా.

60. ఓం అధ్భుతాయ నమః.

మౌక్తికమాల వృత్త గర్భసీసము.

జీవము నీవేర! స్థితియు నీవేనురా! - జీవికవీవె నా జీవితేశ!

భావము నీవే, విభవము నీవే ధరన్. - గౌరవమీవేను, ఘనుఁడవీవె.

దేవుఁడ వీవే మదిఁ గన నీవేనురా! - రావేలరా నాకు రక్షనీయ.

నావయు నీవేను నడుపుదీవే సదా. - నావాడ నరసింహ! నీవె దిక్కు

గీ. వినుత మౌక్తిక మాలస్థ! వినుము భవ్య! - *అద్భుతా*నంద రూప నన్నాదుకొమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

 

60 సీస గర్భస్థ మౌక్తికమాల. ( గగ .. యతి 7)

జీవము నీవేర! స్థితియు నీవే. - భావము నీవే విభవము నీవే.

దేవుఁడ వీవే మదిఁ గన నీవే. - నావయు నీవేను నడుపుదీవే.     

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహానా జీవము, స్థితి, జీవిక,అన్నియు నీవే. భావము నీవే

విభవము నీవే, గౌరవమనునదియును నీవే, నీవే ఘనుడవు..దేవుఁడవు నీవే, నన్ను రక్షింపరావేల? ఓఅద్భుతానందరూపా!

నా మాట వినుము. నన్నాదుకొనుము.

61. ఓం భవ్యాయ నమః.

గీతాలంబన వృత్త గర్భ సీసము

రాజిత పాద! నీరేజదళేక్షణ! - నీ కృపచేఁ జిక్కు నిర్మల గతి.

రాజీవముగను చేరన్ నిను మాకగు - చిన్మయుఁడామదిన్ చేర్చుకొమ్ము.

చిత్త విభాస! ధీరోత్తమ! నీ దరి - తేజము తోడుతన్ ధ్యేయమలర

రాగిల్లు మదిని చేరంగనె పోవును - చింతలిలన్. గొప్ప శాంతి కలుగు..

గీ. సత్యమైనది నీ *భవ్య* సన్నిధి కద!దానిఁ జూపక నీవుంట తప్పు కాద?

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

61 సీస గర్భస్థ గీతాలంబన వృత్తము. ( .. యతి 8)

నీరేజదళేక్షణ! నీ కృపచే

చేరన్ నిను మాకగు చిన్మయుఁడా!

ధీరోత్తమ! నీ దరి తేజముతో

చేరంగనె పోవును చింతలిలన్

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశవంతమైన పాదపద్మములు కలవాఁడా! తామర

రేకులవంటి కన్నులు కలవాఁడా! నీ కృప చేతనే నిర్మలమైన గతి మాకు లభించును. చిన్మయుఁడా! ప్రకాశవంతముగా

నిన్ను చేరుట మాకు సాధ్యమగును. మమ్ము నీ హృదయమున చేర్చుకొనుము. హృదయమున ప్రకాశించువాఁడా!

ధీరోత్తముఁడా! అనురాగ పూర్ణమైన మనసుతో మంచిధ్యేయము కలిగి నీ సమీపమునకు చేరినచో వెంటనే భువిపై మా

చింతలన్నియు తొలగును. గొప్ప శాంతి కలుగును.  నీ సన్నిధియే సత్యము. సన్నిధిని నీవు మాకు చూపకుండుట తప్పే

కదా..!

62. ఓం శ్రీవిష్ణవే నమః.

మనోహర వృత్త గర్భ సీసము

హాయిగానున్న యాదాద్రి నివాస! - యాపర! నాకమీ శ్రీపదములె.

యార్తిని నా హృదయాద్రి వసించుట - శ్రేయము కావునఁ జేర రమ్ము.

తప్పదు. నిజము. నా దారిఁక నీవె. - నాతనుఁడా! కాంచు ప్రీతితోడ.

ధీరుఁడ! నన్ ముదమారఁగఁ జూడు ప్ర - భూ! నృహరీ! వర ముక్తి వరద!    

గీ శుభద! *శ్రీ విష్ణు*దేవుఁడా! అభయమిమ్ము.నన్ను వీడనటంచునుసన్నుతాత్మ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

62 సీస గర్భస్థ మనోహర వృత్తము. (1.3. పాదములు కాంతా{గీతాలంబన}

                                             వృత్తము. .. యతి 8.

                                                   2.4.పాదములు తోటక వృత్తము .. యతి 9) 

యాదాద్రి నివాస దయాపర! నా - హృదయాద్రి వసించుట శ్రేయముగా?

నా దారిఁక నీవె సనాతనుఁడా! - ముదమారఁగఁ జూచూడు ప్రభూ! నృహరీ!   

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సుఖముగా నొప్పెడి యాదాద్రి నివాసాదయాపరా! నీ

మంగళప్రదములైన పాదములే స్వర్గము. ఆర్తితో నా హృదయాద్రిని నీవుండుట మంచిది కావున నీవు నా

హృదయమున ఉండ రమ్ము.. సనాతనుఁడా! నా దరికి నీవు రాక తప్పదు.  ప్రీతితో చూడుము. ధీరుఁడవైన స్వామీ!

వర ముక్తి వరప్రదాతానీవు నన్ను ప్రేమతో చూడుము. శుభప్రదా! శ్రీవిష్ణుదేవుఁడా! సన్నుతాత్మా! నన్ను విడి పోనని

అభయమునిమ్ము.!

63. ఓం పురుషోత్తమాయ నమః.

కుసుమవిచిత్ర వృత్త గర్భ సీసము.

వినుత మహాత్మ! విధిని విధించన్ దేవ! - ప్రణుతులు కొనుమయ్య పద్మనయన!

ఘనుఁడవు కానన్ కను నయవర్తీ! నన్ను, - గమ్యంబు చేర్చరా! కామితదుఁడ!  

క్షణమున నిన్నున్ గను నయరీతిన్ ముద - మున మనసారగా కనుచునిమ్ము.

కనుఁగొను నేర్పున్ గనునటులిమ్మా. కోరి - కను తీర్చి కాపాడు కరుణతోడ.

గీ. కుసుమ సువిచిత్ర గర్భ సీస సుమవాస! - పూజ్య *పురుషోత్తమా*! నన్నుఁ బ్రోవుమయ్య!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

63 సీస గర్భస్థ కుసుమవిచిత్రవృత్తము. ( .. యతి 7)

వినుత మహాత్మ! విధిని విధించన్ - ఘనుఁడవు కానన్, గను నయవర్తీ

క్షణమున నిన్నున్ గను నయ రీతిన్ - గనుఁగొను నేర్పున్ గనునటులిమ్మా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రస్తుతింపఁబడు పద్మనేత్రా! విధిని శాసించుట కొఱకు   

నా వందనములు స్వీకరింపుము. నయవర్తీ! నీవు ఘనుఁడవు కావున నన్ను చూడుము. కోరికలనీడేర్చువాఁడా! నన్ను

గమ్యమునకు చేర్చుము. నన్ను మనసారా చూచి క్షణములో నిన్ను చూచు నయమార్గమును ప్రసాదించుము. నిన్ను

చూడఁగలిగిన నైపుణ్యమును నిన్ను చూచెడి శక్తిని ప్రసాదింపుము. నా కోరిక తీర్చి నన్ను కాపాడుము. కుసుమ వృత్త గర్భ

సీస సుమ నివాసా! పూజ్యుఁడవైన పురుషోత్తమా నన్ను బ్రోవుము.!

64. ఓం అనఘాస్త్రాయ నమః.

మణిరంగ వృత్త గర్భ సీసము.

రమణీయుఁడా! శ్రీధరా! నిలు చిత్తము - నందున్ బ్రపూర్ణశాంతాక్షియుగళ!    

వరణీయ! మా మాధవా! నయ మార్గముఁ - జూపన్గనంజాలు చూడ్కులిడుము.

లక్ష్యమున్ గన బాధలన్ విడి భావము - నందున్ నినుం గొల్చు హాయి నిడుము.

హరినామ సద్ బోధనందినఁ బూజ్యత - కల్గున్ గదామాకుఁ గల్గనిమ్ము.

గీ. శ్రీశ! మణిరంగ గర్భ సచ్చీస వాస! - కరుణ ననుఁ జూచి *యనఘాస్త్ర*! కావ రమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

64 సీస గర్భస్థ మణిరంగ వృత్తము. ( .. యతి 6)

శ్రీధరా! నిలు చిత్తమునందున్. - మాధవా! నయ మార్గముఁజూపన్

బాధలన్ విడి భావమునందున్. - బోధనందినఁ బూజ్యత కల్గున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! అనఘాస్త్ర! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శాంతపూర్ణాక్షిద్వయా! రమణీయమైన

పరమేశ్వరా! వరణీయమైన నయమార్గము చూపుటకొఱకై నా మనసున నిలువుము! మా లక్ష్యము సాధించుటకై బాధలను

విడిచి భావమున నిన్ను గొలుచు హాయిని ప్రసాదింపుముహరి నామ బోధ కలిగినచో గౌరవము లభించును

కదా.అందులకై మాకు ప్రసాదించుము.

65. ఓం నఖాస్త్రాయ నమః.

చౌపద గర్భ సీసము.

శ్రీనరసింహుఁడ! చేకొను శ్రితుని నన్ - జిత్తంబులో నిల్చి చేరువగుము.

జ్ఞానము నీయఁగఁ గనఁబడు కలను. శ్రీ - కరుఁడ! నా తోడయి వరములిమ్ము.

మౌనము వీడుము మహిఁ గనుమ నను సన్ - మాన్యునిగా నిల మలచుమయ్య.

శ్రీనుత శ్రీహరి! చేకొను క్షితిని నన్ - మా ప్రియ దైవమా! మహిమఁ జూపు.

గీ. చౌపదాన్విత సీస సంచార దేవ! - పూజిత *నఖాస్త్ర* ! యాదాద్రి పూజ్య నృహరి.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

65 సీస గర్భస్థ చౌపద. (4మాత్రాగణములు3, నగణం, అంత్యప్రాస .. యతి 

                              3వగణాద్యక్షరము. జగణమురాదు)

శ్రీనరసింహుఁడ! చేకొను శ్రితుని. - జ్ఞానము నీయఁగ కనఁబడు కలను.

మౌనము వీడుము మహిఁ గనుమ నను - శ్రీనుత శ్రీహరి! చేకొను క్షితిని.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పూజ్య నఖాయుధుఁడా! నేను నిన్ను

ఆశ్రయించినవాఁడను. నా మనసులో నిలిచి నాకు దగ్గర అగుము.. నాకు జ్ఞానమునిచ్చుటకైనను నా కలలోనైనను

కనఁబడుము. నాకు తోడుగా ఉండి వరములు దయతో ఇమ్ము. నీ మౌనము విడిచినన్ను మహిమతో చూడుము. నన్ను

గొప్పవానిగా మలచుము. లక్ష్మీదేవిచే ప్రశంసింపబడువాడా! నాకిష్టమైన దేవా! నన్ను మహిమతో చూడుము.

66. ఓం సూర్యజ్యోతిషే నమః.

జలద వృత్త గర్భ సీసము.     

శ్రీహృదయేశ్వరా! క్షితి వసింపగ రా, - రాత్పరా! నీవు నా రక్షకుఁడుగ,

నా హృది నుండు సన్మణిసనాతనుఁడాత్మ - సాక్ష్యాకృతిన్ గొల్పి సాక్షివగుము.

మోహముఁ బాపరాభువిని మోక్షదుఁడాత్మ - నీవే కదాయేల నీవు రావు?

నీ హృది నన్నికన్ నిలుపు నీ కృపతోడ - నీ ధర్మ మదినాదు బాధ బాపు.

గీ. జలద గర్భ సుసీసస్థ! బలము నిమ్ము జయనిధాన! *సూర్యజ్యోతిషా*! నమామి

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

66 సీస గర్భస్థ జలద వృత్తము. (     .. యతి 10)     

శ్రీహృదయేశ్వరా! క్షితి వసింపగ రా! - నా హృది నుండు సన్మణిసనాతనుఁడా!

మోహముఁ బాపరాభువిని మోక్షదుఁడా! - నీ హృది నన్నికన్ నిలుపు నీ కృపతో.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! శ్రీ లక్ష్మీ హృదయేశ్వరా!  నాకు రక్షకుఁడుగా భూమిపై నివసించుట కొఱకు రమ్ము.

యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నా మదిలో ఉండు మణీ! సనాతనా! ఆత్మలో సాక్షాత్కరించి సాక్షిగా

నిలుము. నాలోని మోహమును పోగొట్టుము. మోక్షప్రదా! భూమిపై మాలో ఉండే ఆత్మవు నీవే కదా, ఐనప్పటికీ నీవు రావేల?

జలద వృత్తగర్భ సీసముననున్నవాఁడా! నాకు శక్తిని ప్రసాదించు.జయమునకు నిధివయిన సూర్యజ్యోతిషా! నీకు

నమస్కరించుచున్నాను.!

67. ఓం సురేశ్వరాయ నమః.

ప్రహరణకలిత వృత్త గర్భ సీసము.

దీన బంధు నృహరి! తెలియ నీ నిజ ఘన -  నిలన్. బ్రభా పూర్ణదర్ప హరుఁడ!

కలిగినట్టి సహన ఘనతచే జయములు - కనితిన్ గదా నీదు కరుణ చేత.

గొప్పదైన యిహము కొలుపు నీహృదయమ - ది భువిన్ పరాత్పరాత్రిభువనేశ!

జ్ఞాన మిచ్చిమహిమఁ గనునటుల్ మలచుమ - మములన్ మహాదేవ! మా నృసింహ!

గీ. పాప ప్రహరణ గుణగణ శ్రీపతివయ! - జయము ధీరా! *సురేశ్వరా*! జయము జయము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

67 సీస గర్భస్థ ప్రహరణకలిత వృత్తము. (     .. యతి 8)

నృహరి! తెలియ నీ నిజ ఘనత నిలన్.

సహన ఘనతచే జయములు కనితిన్ .

యిహము కొలుపు నీహృదయమది భువిన్.

మహిమఁ గనునటుల్ మలచుమ మములన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దీనబంధూ! నీ ఘనత తెలిసికొనుట కొఱకు నాకు

కలిగియున్న సహనము యొక్క గొప్పతనము చేతజయమునందితిని, అది నీకరుణచేతనే సుమా. త్రిభువనేశా! నీ

గొప్ప మనసు ఇహమును ప్రాప్తింప చేయుట కోసము మాకు జ్ఞానమును ప్రసాదించి, మహిమమును కనునట్టుల

మమ్ములను మలచుము. పాప ప్రహరణ గుణగణుఁడవయిన లక్ష్మీపతివి, సురేశ్వరా! నీకు జయము.

68. ఓం సహస్రబాహవే నమః.

అజితప్రతాప గర్భ సీసము.

శ్రీకరుఁడా! నరసింహుఁడా! శుభద! నన్ - గనుమా! కృపాసాంద్ర కరుణతోడ

నురు గుణాలయుఁడ! నిరుపమాన కృప నీవు - చూపుమా.  నాకిలఁ బ్రాపు నీవె.

యసమాన! నీ చరణాంబుజంబులకు సా - గిలనీయుమా నన్ సుకృతునిఁ జేయ.

నుత దివ్య తేజ! నిరతమున్మదిని నిన్నె -  గొల్చెదన్ మహనీయ కోర్కె తీర.  

గీ. సుప్రసిద్ధా! నృహరి! యజితప్రతాప! - యరసి పాపులన్ బాపు *సహస్రబాహు*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

68 సీస గర్భ అజితప్రతాపము. (1.3పాదములకు .. యతి 9. /

                                       2.4 పాదములకు .. యతి 8)

నరసింహుఁడా! శుభద! నన్ గనుమా! - నిరుపమాన కృప నీవు చూపుమా.  .

చరణాంబుజంబులకు సాగిలనీ. - నిరతమున్మదిని నిన్నె గొల్చెదన్

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మంగళప్రదుఁడా! శుభదా! కృపాసాంద్రా! నన్ను

కరుణతో చూడుము. గొప్పగుణములకు స్థానమైనవాడా! నాపై కృప చూపుము. నాకాధారము నీవే సుమా. సాటి లేనివాడా!

నన్ను సుకృతునిగా చేయుటకు నీ పాదములపై నన్ను సాగిలబడనీ. నా కోరిక తీరునట్లుగా ఎల్లప్పుడూ నిన్నే మనసులో

తలంతును అజితప్రతాపా! సహస్ర బాహూ పాపులనెంచి అణచివేయుము.

69. ఓం సర్వజ్ఞాయ నమః

ఇందువదన వృత్త గర్భ సీసము.

పూజ్యుఁడావర దైవముఁగ నిన్ గొలుచు దాసుఁ - డనయా! దయాపర మనమున నిలు.

పూజ్యతన్ వర భావమున నిన్ నిలిపి భక్తిఁ - గొలుతున్.పరాత్పర! కూర్మిఁ గనుమ..

నిగమవేద్యా! దేవుఁడుగ భక్తులకు దీప్తి - నిడుచున్బ్రభన్ జూపు దీవె దేవ!

లక్ష్యంబుతో జీవులను కావుమయ చిత్త - విభవామహాదేవ! విశ్వనాథ!

గీ. ఇందువదన! నీ భక్తుల ముందు నిలుము. - జాలమేలయ *సర్వజ్ఞ*! మేలుఁ గొలుప.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

69 సీస గర్భస్థ ఇందువదన వృత్తము. (     .. యతి 9)

దైవముఁగ నిన్ గొలుచు దాసుఁడనయా.

భావమున నిన్ నిలిపి భక్తిఁ గొలుతున్

దేవుఁడుగ భక్తులకు దీప్తినిడుచున్,

జీవులను కావుమయ చిత్త విభవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పూజ్యుఁడా! నిన్ను శ్రేష్టమయిన దైవముగా కొలిచు

దాసుఁడను నేను. దయాపరా! నా మనసులో నిలుము. నా భావములో నిన్ను పూజ్యముగా నిలిపి, భక్తితోఁ గొలుతును.

నన్ను ప్రేమతో చూడుము. నిగమవేద్యా! దైవముగా నీవు భక్తులకు ప్రకాశము కొలుపుచు, నీ ప్రభను చాటుకొందువు.

జీవులను లక్ష్యముతో కాపాడుము. సర్వజ్ఞా! . నీవు నీ భక్తులముందు నిలుము. మేలు కలిగించుటకాలస్యమెందులకు?

70. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః.

అంబురుహ వృత్త గర్భ సీసము.

శ్రీ నరసింహ! వసించు మనంబున - శ్రీరమా సతితోడుగా రమేశ!

ప్రాణము కన్నను భక్తియె మేలని - రాజితానన! నేర్పరా మహాత్మ!

జ్ఞానముఁ గొల్పుచుఁ గాంచఁగ నిమ్మిఁక - కామితార్థద! నిన్నిఁకన్ బ్రకాశ!

నేననినీవనినేఁ గన నేరను - నిర్మలాత్ముఁడఁ! గొల్వనీ నృసింహ!.

గీ. అంబురుహనేత్ర! కన్పించుమద్భుతముగ. - *సర్వసిద్ధిప్రదాయకా*! శక్తినిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

70 సీస గర్భస్థ అంబురుహ వృత్తము. (       .. యతి 13)

శ్రీ నరసింహ వసించు మనంబున శ్రీరమా సతితోడుగా!

ప్రాణము కన్నను భక్తియె మేలని రాజితానన నేర్పరా!

జ్ఞానముఁ గొల్పుచుఁ గాంచఁగ నిమ్మిఁక కామితార్థద నిన్నిఁకన్.

నేననినీవనినేఁ గన నేరను నిర్మలాత్ముఁడఁ! గొల్వనీ.  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! రమేశా! రమా సతితో కలిసి నా మనసులో నివసింపుము.

ప్రాణముకన్నా భక్తియే గొప్పదని నేర్పుము. మాకు జ్ఞానము ప్రసాదించి నిన్ను చూడఁ జేయుము. తరతమభేదములతో

చూడను నేను అట్టి నన్ను గ్రహించుము. అంబురుహ నేత్రా! కనిపించుము. సర్వ శక్తిప్రదాయకా! నాకు శక్తినిమ్ము.

71. ఓం వజ్రదంష్ట్రాయ నమః.

అపరాజిత వృత్త గర్భ సీసము.

జయము జయము దేవ! జాగృతిఁ గొల్పరా! - జగమున నిన్ గని జయము పలుక.

జయము జయము. నాకు సద్గుణ మీయరా! - యసహాయులకు నే సహాయపడఁగ.

జయము జయము శ్రీవశంకర దేవరా! - చిత్తమందున నిన్నుఁ జేర్చి కొలుతు.

జయము జయము సత్య సాంద్ర సుధీవరా! - సత్య సంధతఁ గొల్పి శాంతినిమ్ము.

గీచిద్భవాపరాజిత గర్భ సీస వాస! - *వజ్ర దంష్ట్రా* దురాత్ములఁ బాపుమిలను.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

71 సీస గర్భస్థ అపరాజిత వృత్తము. (     .. యతి 9)

జయము జయము దేవ! జాగృతిఁ గొల్పరా! - జయము జయము. నాకు సద్గుణ మీయరా

జయము జయము శ్రీవశంకర దేవరా! - జయము జయము సత్య సాంద్ర సుధీవరా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లోకము నిన్ను చూచి జయమును పలుకునట్లు జాగృతిని

గొలుపుము. అసహాయులకు నేను సహాయపడుటకు వీలుగా నాకు సద్గుణములనిమ్ము.. శ్రీవశంకరా! నీకు జయము. నిన్ను

నా మనసున చేర్చి కొలిచెదను. సత్య సాంద్రా! సుధీవరా! సత్యసంధతను నాకు కలిగించి శాంతినిమ్ము. అపరాజిత

వృత్త గర్భ సీసపద్య స్వరూపా! వజ్ర దంష్ట్రా! లోకమునందలి దురాత్ములను నశింపఁ జేయుము,

72. ఓం వజ్రనఖాయ నమః

అశ్వగతి వృత్త గర్భ సీసము.

జీవితమంతయు సేవలు చేసితి. - శ్రీహరి రావావసింప మదిని.

భావనఁ జేయుచు భక్తిగఁ బ్రార్థనఁ - జేసితి నిన్ నే విశేషముగను.

నీవిఁక నేనని. నేనన నీవని, - నేఁ గనుదున్ మహనీయ చరిత!

నీవిల నాకిఁక నిత్యము నేర్పుము - నీ స్థితి నేర్వ సునేత్ర భాస!

గీ. అశ్వ గతినెన్ని కల్కివై యవతరించి - ఖలులఁ జీల్చు *వజ్రనఖా*! సుఖంబు నిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

72 సీస గర్భస్థ అశ్వగతి వృత్తము. ( .. యతి 10)

జీవితమంతయు సేవలు చేసితిశ్రీహరి రా! - భావనఁ జేయుచు భక్తిగఁ బ్రార్థనఁ జేసితి నిన్.

నీవిఁక నేనని, నేనన నీవనినేఁ గనుదున్. - నీవిల నాకిఁక నిత్యము నేర్పుము నీ స్థితినే.

 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నా జీవితమంతా నీకు సేవలు చేసితిని, నిన్ను భావన

చేయుచు భక్తిగా ప్రార్థన చేసితిని. నా మనసున నివసించుటకు రమ్ము. ఇక నీవూ నేనూ ఒకటేననిభావింతును.

సునయనా! నీ స్థితిని నేర్చుటను నాకు నేర్పుము. అశ్వగతిని కల్కివై ఖలులను చీల్చు వజ్రనఖా! నాకు

సుఖమునిమ్ము.

73. ఓం మహానందాయ నమః.

భూనుత గర్భ సీసము.

భాసమానుఁడ! దేవుఁడా! సుగుణ మతికిఁ - దేజము నీవేర దివ్య పురుష!

శ్రీశుఁడా! వర జీవితేశుఁడవు మహిత! - జీవము నీవేగ, చిద్విభాస!

నాలోన నుతభావనన్ నిలుచు నిగమ - భద్రుఁడవీవేను, ప్రముఖ దేవ!

రక్షకుండవు ప్రోవ రావయ కరుణను - పూజ్య నృసింహాఖ్య! ముక్తినిడుమ!

గీ. దుఃఖములు బాపి కష్టముల్ తొలఁగఁ జేసి, - నన్ను రక్షించుమో *మహానంద* రూప

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

73 సీస గర్భస్థ భూనుతము. ( గగ .. యతి 10)

దేవుఁడా! సుగుణ మతికిఁ దేజము నీవే.

జీవితేశుఁడవు మహిత! జీవము నీవే.

భావనన్ నిలుచు నిగమ భద్రుఁడవీవే

ప్రోవ రావయ కరుణను పూజ్య నృసింహా!    

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశవంతుఁడా! పరమాత్మా! దివ్య పురుషా!

సుగుణాత్ముల ప్రకాశము నీవే. చిద్విభాసా! లక్ష్మీపతీ! శ్రేష్ఠమైన జీవితేశుఁడవు నీవేకదా! జీవము కూడా నీవేకదా!

ప్రముఖ దేవా! నాలో ప్రశంసనీయమైన భావనతో నిలుచు నిగమములందెఱుఁగఁబడు భద్రుఁడవు నీవే సుమా.నీవే

రక్షకుఁడవు.  కరుణతో కాపాడ రమ్ము. పూజ్య నారసింహా! ముక్తిని ప్రసాదించుము.. మహానంద రూపా! దుఃఖములు

పోగొట్టి, కష్టములను నశింపఁ జేసి నన్ను రక్షించుము.

74. ఓం పరంతపాయ నమః.

ఇంద్రవజ్ర వృత్త గర్భ సీసము.

పాపాలఁ బాపు నీ రూపు నీ రేఖ  - ణింతు నేనేనాకు సంతసమది.

పుణ్య సద్భాస కారుణ్య నీ రూపు వి - కాసమిచ్చున్ జగత్కారకుండ!

శృంగార వీర! చేరంగ నే నిన్ను సు - చేతనంబున్ గొల్పు చిద్వలాస!

సత్వప్రకాశధీరత్వముం గొల్పుమ! - దీపితాక్షానీవె ప్రాపు మాకు.

గీ. ఇంద్ర వజ్ర మనోధైర్యసాంద్ర నృహరి! - దుష్టహారి *పరంతపా*! తోడు నీవె.!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

74 సీస గర్భస్థ ఇంద్రవజ్ర వృత్తము. (   గగ .. యతి 8)

నీ రూపు నీ రేఖ గణింతు నేనే. - కారుణ్య నీ రూపు వికాసమిచ్చున్.

చేరంగ నే నిన్ను సుచేతనంబున్. -  ధీరత్వముం గొల్పుమ! దీపితాక్షా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పాప శమనము గావించు నీ రూపు రేఖలను నేను

సంతోషముగా గణింతును. పుణ్య సద్భాసా! జగత్కారకా! నీ రూపము మనోవికాసము కలిగించును. శృంగార వీరా!

చిద్విలాసా! నిన్ను నేను చేరగనే నాలో చైతన్యము కలుగును. సత్వగుణ ప్రకాశా! నాకు ధైర్యము కొలుపుము. ప్రకాశ

నయనా! మాకు నీవే ఆధారము.ఇంద్రవజ్రసమాన మనోధైర్యసాంద్రా! దుష్టహారివైన పరంతపా! నాకు తోడు నీవే

సుమా.!

75. ఓం సర్వమంత్రైకరూపాయ నమః.

ఉపేంద్రవజ్ర గర్భ సీసము.  

అచ్యుతాత్ముండ! మురారి! నీ సాటి ప్ర - మోద దాతల్ సత్వపూర్ణ తేజు

లిద్ధర నింక మరేరి చూడంగను? - మా మహేశా! నీవె మాకు దిక్కు.

ఇంపుగా నీవు చరింపుమా మా మది - శాంతరూపా! మాకు శాంతినిమ్ము.

శాంతంబు నీయ తరింతుమయ్యా! సుఖ - దా! యనంతా! వరదాయి నృహరి!  

గీ. వాసిగనుపేంద్ర వజ్రస్థ సీసవాస! - యీప్సితములిచ్చు  *సర్వమంత్రైకరూప*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

75 సీస గర్భస్థ ఉపేంద్రవజ్ర. ( గగ  ..  యతి 8)  

మురారి నీ సాటి ప్రమోద దాతల్

మరేరి చూడంగను? మా మహేశా!

చరింపుమా మా మది శాంత రూపా!

తరింతుమయ్యా! సుఖదా! యనంతా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై నీవలె ప్రమోదమును కూర్చు దాతలు మరి

కానరారు. మా దైవమా! మాకు దిక్కు నీవే. మా మనస్సులలో ఇంపుగా సంచరింపుము. శాంత రూపా! మాకు శాంతిని

ప్రసాదింపుము. అప్పుడు మేము తరించ గలము. ఉపేంద్ర వజ్రవృత్తము గర్భమందు కలిగిన సీసవాసా!

సర్వమంత్రైకరూపా! మా ఆర్తి పోకార్పుము.

 

76. ఓం సర్వయంత్రవిదారణాయ నమః.

ఉపజాతి వృత్త గర్భ సీసము.

తేజోమయుండనీ తేజముం జూచి పు - నీతునౌదున్ బ్రభూనిర్వికల్ప!

ధర్మస్వరూపాసతంబు నిన్  గాంతుఁ బ్ర - శాంతమొప్పన్. మహేశా! మనోజ్ఞ!

దాక్షిణ్యమునను చైతన్యముం గొల్పుము - సామ వేద్యాసత్య శాంతరూప!

ధర్మంబు నందు నితాంత సంతో షిగ - నిన్నె కందున్హరీనిష్కళంక.

గీ. ఉందువుపజాతులందునో సుందరాంగ. - *సర్వయంత్రవిదారణా*! సౌమ్య రూప!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

76 సీస గర్భస్థ ఉపజాతి. (13పాదాలు    గగ {ఇంద్రవజ్ర}

                               24పాదాలు    గగ {ఉపేంద్రవజ్ర} .. యతి 8) 

నీ తేజముం జూచి పునీతునౌదున్. - సతంబు నిన్ గాంతుఁ బ్రశాంతమొప్పన్

చైతన్యముం గొల్పుము సామ వేద్యా! - నితాంత సంతో షిగ నిన్నె కందున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నిర్వికల్పా! తేజోమయా! నీ ప్రకాశమును చూచి

పునీతునగుదును. ధర్మ స్వరూపా! ప్రశాంతిగా ఉండుటకు ఎల్లప్పుడూ నిన్ను చూచెదను. సామ వేద్యా! నాలో

చైతన్యమును కొల్పుము. నిష్కళంకుఁడవైన హరీ! ఉపజాతివృత్త గర్భ సీసమందున్న సుందరాంగా!

సర్వయంత్రవిదారణా! సౌమ్య రూపా! ధర్మమునందు ఎనలేని సంతోష స్వరూపునిగా నిన్నే చూతును..

77. ఓం సర్వతంత్రాత్మకాయ నమః.

కలరవ వృత్త గర్భ సీసము.

సుందరాంగుఁడ నినుఁజూచుచును మనిన - ప్రభ పెఱుగున్ గదావారిజాక్ష!

కాంచుచు మముఁ గనిపించుమిఁకను కరు - ణను శుభదాక్షరానయ విభాస!

చిత్తమున్ గని మనఁ జేయుమయ సుమ  -  జనకుఁడానాకు రక్షఁ గొల్పు.

నా చిత్తమున నిను నమ్మితినయ నిరు - పమ నృహరీమహత్ పావనాంఘ్రి!

గీ. కలరవంబయి వినిపించు కన్న తండ్రి! - కనుమ *సర్వతంత్రాత్మకా*! గారవమున.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

77 సీస గర్భస్థ కలరవ వృత్తము. (    లగ .. యతి 8)

నినుఁ జూచుచును మనిన ప్రభ పెఱుగున్. - గనిపించుమికను కరుణను శుభదా

మనఁ జేయుమయ సుమశర జనకుఁడా! - నిను నమ్మితినయ నిరుపమ నృహరీ

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! వారిజాక్షుఁడా! సుందరాంగుఁడా! నిన్ను చూచుచు

బ్రతుకుచున్నచో మాలో ప్రభ పెరుగును. శుభములనొసగు అక్షరుఁడా! నయ విభాసా! మమ్ములను నీవు చూచుచు

మాకు కనిపించుము. మన్మధ జనకా! నా మనసు చూచి నన్ను మనఁ జేయుము. నాకు రక్ష నీవే కదా. మహత్

పావనాంఘ్రివైన నృహరీ! నా మనసున నిన్నే నమ్మితిని. కలరవమయి వినిపించెడి కన్న తండ్రీ! సర్వ

తంత్రాత్మకా! నన్ను గారవమున చూడుము.

78. ఓం అవ్యక్తాయ నమః.

పాదప గర్భ సీసము.

చిత్భవ శ్రీనరసింహుఁడచిన్మణి - రావాకృపాసాంద్రరక్షఁగొల్ప.

భక్తులౌ దీనుల పాలిటి తేజము - నీవేమముం గాతువీవె జగతి!

దినమణి భానుని తేజము వర్ధిలు - నీచేతనే కదానిగమ వేద్య!

జగతిని మానిత సజ్జన మన్నన - మీవేకదారమా హృన్నివాస!

గీ. సీస పద్యస్థ పాదపా! చిత్ప్రకాశ! - కరుణఁ జూపెడి *యవ్యక్త* కల్పతరువ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

78 సీస గర్భస్థ పాదపము లేదా తోదకము లేదా దోధకము. ( గగ .. యతి 7)

శ్రీనరసింహుఁడచిన్మణి రావా! - దీనుల పాలిటి తేజము నీవే

భానుని తేజము వర్ధిలు నీచే. - మానిత సజ్జన మన్నన మీవే

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా చిద్భవుఁడా! చిన్మణీ! కృపాసాంద్రా! చిన్మణీ! మాకు

రక్షణ గొలుపుటకై రమ్ము,భక్తులయిన దీనుల తేజస్సు నీవే, మమ్ములను కాపాడునది నీవే. నిగమవేద్యా!

సూర్యుని ప్రకాశము నీ వలననే వృద్ధియగుచుండునుకదా. లోకమున గొప్పవారి మన్నన  నీ స్వరూపమే కదా.సీస గభిస్థ

పాదపవృత్తమున కలవాడా! అవ్యక్తా! కరుణ చూపుము.

79. ఓం సువ్యక్తాయ నమః.

పదమాలి వృత్త గర్భ సీసము.

అహరహంబును నో నరహరి! నీ దయ చాలు - నాకిలన్ గతివీవె శ్రీకరుండ!  

క్షమఁ గొల్పవయ్య పరమ దయాపర! భక్త - బాంధవా! నా తోడఁ బంతమేల?

జగదేకవీర! సరగున నీపద సేవ - చాలురా! కల్పించు సమ్మతమున.

కనిపించుమయ. నే ధరనిఁక నిన్ విడలేను - దైవమాతోడుండు తత్వమెఱిగి.

గీ. చిత్ర పదమాలి గర్భ స్థ సీస! శ్రీశ! - సుజన *సువ్యక్త* తేజమా! చూడు నన్ను.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

79 సీస గర్భస్థ పదమాలి. ( .. యతి 10)

నరహరి నీ దయ చాలు నాకిలన్

పరమ దయాపర! భక్త బాంధవా!

సరగున నీ పద సేవ చాలురా!

ధరనిక నిన్ విడలేను దైవమా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! అహరహమూ నీ దయ నాకు చాలును.భూమిపై నాకు నీవే

గతివి సుమా. నాకు క్షమను ప్రసాదింపుము. నాతో నీకు పంతము వలదు. నీ పదసేవ నాకు చాలును కల్పింపుము. నేను

నిన్ను విడిచి ఉండ లేను. నా తత్వమెఱిఁగి నాకు తోడుగా ఉండుము. చిత్రపదమాలి వృత్త గర్భ సీసపద్య రూపా! శ్రీశా!

సుజనులకు వ్యక్తమగు సువ్యక్తా! నన్ను చూడుము.

80. ఓం భక్తవత్సలాయ నమః.

మధురాక్కర గర్భ సీసము

నరహరి చరణముల్నయనంబులకు వినో - దంబు సదా శాశ్వతంబుగాను.

సిరిపతి తలపులే చిద్వశీకర శుభ - ముల్ ధాత్రి పైనున్న పూజ్యులకును.

గురువు హరియె కదా! కోరుకో నొసఁగు - మస్తంబు మదినెంచి మాకు నృహరి!

హరి యను పదమదే యక్షయంబయ నర - సింహంబ! చెడుఁ బాపి, చేవఁ జూపు.  

గీ. సీస మధురాక్కరలలోనఁ జెలఁగు శ్రీశ! - ప్రవర నిజ *భక్త వత్సలా*! పద్మ నయన!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

80 సీస గర్భస్థ మధురాక్కర. (1సూ.. 3ఇం.. 1చం. .. యతి 4 గణము 1 అక్షరము)

నరహరి చరణముల్నయనంబులకు వినోదంబు.

సిరిపతి తలపులే చిద్వశీకర శుభముల్ ధాత్రి.

గురువు హరియె కదా! కోరుకో నొసఁగు సమస్తంబు.

హరి యను పదమదే యక్షయంబయ నరసింహంబ

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరహరి పాదపద్మములు కనులకు విందు. సిరిపతి

తలపులే పూజ్యులకు చిద్విలాసములు. గురువన అశ్రీహరియే కదా. కోరుకొనగనే సమస్తము మాకొసగును. హరి పదమే

అక్షయము. కావున నరసింహా! మధురాక్కర గర్భసీసపద్యమున చెలగువాఁడా! ప్రవరా! నిజభక్త వత్సలా! పద్మ

నయనా! చెడును బాపు నీ సమర్థత చూపుము.

81. ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః.

నవనందిని వృత్త గర్భ సీసము.

అనుపమానుఁడ! కమలాక్ష! నీ దయను  -  మ్మని సుఖంబున్పొంది మనఁగనుంటి.

హృదినున్న శ్రీ కమలేశ! నీ వలన గౌ -  రవము కల్గున్ గదారమ్య చరిత!.

కుడిభుజంబై సుమకోమలామదిని చొ -  క్కి మనవయ్యానీకు కేలు మోడ్తు.

ప్రఖ్యాతిగా సమ భావనన్ గనుమ  -  క్కఁగ మహాత్మాకొల్తు గౌరవముఁగ.

గీ. కనగ నవనందినీ వృత్త ఘనుఁడ! నృహరి! - ఉర్వి *వైశాఖశుక్లభూతోత్థ*! రమణ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

81 సీస గర్భస్థ నవనందిని వృత్తము. (    గగ .. యతి 9)

కమలాక్ష! నీదయను కమ్మని సుఖంబున్, - కమలేశ! నీ వలన గౌరవము, కల్గున్.

సుమకోమలామదిని చొక్కి మనవయ్యా! - సమ భావనన్ గనుమ చక్కఁగ మహాత్మా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీయొక్క దయచేత చక్కనైన సుఖముతో మననుంటిని.

నా మదినున్న శ్రీపతీ! రమ్య చరితా! నీ వలన నాకు గౌరవము కలుగుచున్నది కదా. నవనందినీవృత్తరూప ఘనుడా!  

వైశాఖశుక్లభూతోత్థ! రమణా!.! నీకు నమస్కరింతును. నాకు కుడిభుజంగా అన్నివిధాలా సహాయ పడుచు మనసులో

ఉండుము. సమభావనతో నన్ను ప్రఖ్యాతిగా చూడుము.

82. ఓం శరణాగత వత్సలాయ నమః.

నాందీముఖి వృత్త గర్భ సీసము.

ఘన శుభకర విజయననుఁ గావన్ విశ్వ - విఖ్యాత! రారా! సువేదివగుచు,

ప్రముదితులగు ప్రజల మదులందున్ శ్రద్ధ - వీవే సుధీరాప్రవృద్ధి నిమ్ము.

నయ నిధానమ! సుజన హృదయాబ్జా! శుద్ధ - వాగ్రూప! రారా! కృపాపయోధి.  

అమర వినుత విజయ పథ భాసావిశ్వ - నేతా! నృసింహాఖ్య! నీవె దిక్కు.

గీ. విమల నాందీముఖీ శుభ వృత్త భాస! - అనుపమ *శరణాగత వత్సలా*! నరహరి!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

82 సీస గర్భస్థ నాందీముఖి వృత్తము. (    గగ .. యతి 8)

విజయననుఁ గావన్ విశ్వవిఖ్యాత! రారా!

ప్రజల మదులందున్ శ్రద్ధ వీవే సుధీరా

సుజన హృదయాబ్జాశుద్ధ వాగ్రూపరారా!

విజయ పథ భాసావిశ్వనేతా నృసింహా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శుభములు కలిగించు విజయుఁడా!

విశ్వమున ప్రఖ్యాతిగా వ్యక్తమగువాడా! నన్ను కాపాడ రమ్ము. నిరంత రానంద కలితులందు శ్రద్ధవు నీవే సుమా.

అభివృద్ధిని ప్రసాదించుము. నయ నిధానమా! కృపాపయోధీ! సుజన హృదయా! శుద్ధ వాగ్రూపా! రమ్ము. దేవతా

వినుత విజయపథ భాసా! విశ్వ నేతా! నాందీముఖీవృత్త భాసా! అనుపమ శరణాగత వత్సలా! నీవే నాకు దిక్కు.

 

83. ఓం ఉదార కీర్తయే నమః.

కోమల వృత్త గర్భ సీసము.                                  

తిరునాథనిరుపమ! ధీవర! నీరజ - నేత్రాకృపం బ్రోచు నేతవీవు.

రమ్యాత్ముఁడనిరంత రంబు మదిని నిన్  - లంచెదన్. మాకు ప్రపంచ మీవె.

దయ నిహ పరమ హితంబు ప్రపంచముఁ - బొందన్ గఁ జేయుచున్ బూజ్యతఁ గను

ఘన చరితవరంబుగానొసఁగుము భక్త - బాంధవామృత దయా సింధునృహరి!

గీ. వినుత కోమల వృత్తస్థ! విశ్వ వేద్య - ధాత్రి వెల్గెద వీవె *యుదార కీర్తి* .

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

83 సీస గర్భస్థ కోమల వృత్తము. (1.3.పాదములు     .. యతి 8/ 

                                                     2.4 పాదములు .. యతి 9)

నిరుపమ! ధీవర! నీరజ నేత్రా! - నిరంత రంబు మదిని నిన్ దలంచెదన్. 

పరమ హితంబు ప్రపంచముఁ బొందన్. వరంబుగానొసఁగుము భక్త బాంధవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లక్ష్మీపతీ! సాటిలేని దీవరా! పద్మాక్షుఁడా! కృపతో

మమ్ము కాచు నేత వీవే కదా. రమ్యాత్ముఁడా! ఇహపరసుఖదుడవగుదువని, మమ్ములను గౌరవముగా చూచుదువని

ఎల్లప్పుడూ మదిలో నిన్ను తలంచెదను. నాకు దైవము నీవే కదా. భక్తబాంధవా! దయామృతసింధూ! ఘనసుచరితను

నాకు వరముగనొసగుము. కోమలవృత్తవాసా! విశ్వ వేద్యా! ఉదార కీర్తీ! విశ్వమున వెలిగెడెది నీవే కదా.!

84. ఓం పుణ్యాత్మనే నమః.

లతా వృత్త గర్భ సీసము.

అసమాన తేజ నృహరివి నీవే నిజ - ము దెలుపుమా. మాదు మదిని కలవొ

ఆత్మలన్ సతము సహజముగా నీ స్మర - కలుగనీ! మా కనన్యసాధ్య!

ఉపమాన రహిత! యిహపర మీవే హృద - విలసితా! సంశయంబు లేదు.

ధర నిల్పితీవె. యహరహము నిన్నర - సి కొలిచెదన్ హరీ! ప్రకటితముగ.

గీ. లలిత సుకుమార వర కృతి లతకుఁ జూడ - కర్తవీవౌదు *పుణ్యాత్మ*! ఘనత నీది.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

84 సీస గర్భస్థ లత. ( .. యతి 7)

నృహరివి నీవే నిజము దెలుపుమా. - సహజముగా నీ స్మరణ కలుగనీ!.

యిహపర మీవే హృదయ విలసితా! - అహరహమున్నిన్నరసి కొలిచెదన్.

భావము. భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేని కాంతివంతుఁడవయిన నృహరివి నీవే

కదా? మా హృదయములందు నీవు కలవా? నిజము తెలుపుము. అనన్య సాధ్యా! మా ఆత్మలందు సహజముగనే నీ

స్మరణమును కలిగించుము. సాటి లేనివాఁడా! హృదయములందు విలసిల్లువాఁడా! ఇహపరములందు నీవే కలవు.

సందేహమే లేదు.. భూమిని నిలిపెడివాడవు నీవే,. నిన్నెల్లవేళలా కొలిచెదను. పుణ్యాత్మా! లలితసుకుమారమయిన

కృతికర్తవు నీవే సుమా, నేను నిమిత్తమాత్రుడనే. ఘనత నీదే సుమా.

85. ఓం మహాత్మనే నమః  -

ప్రభాత వృత్త గర్భ సీసము.

విడనుకుసుమ సమానుఁడగోపబాలకా! - రారమ్ముకాపాడ రార దేవ!

సకల విషమ వినాశకవేల్పువీవ, రా! - రాణింపఁ జేయ, రారమ్య చరిత.

ఘనుఁడవసుధ ననున్ గన భక్త పాలకా! - రాజిల్లు నాయెదన్  బూజితముగ.

జయము త్రసన హరాక్షర! రాయఘాపహా! - రాక్షసాంతక! రారరక్షనీయ.

గీ. ఘన ప్రభాత పూర్ణోద్భాస కనఁగ రమ్ము. - వినుతుఁడ! *మహాత్మ*వై నిల్చి ఘనత నిలుపు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

85 సీస గర్భస్థ ప్రభాత వృత్తము. (     .. యతి 8)

కుసుమ సమానుఁడగోపబాలకా! రా! 

విషమ వినాశకవేల్పువీవరారా

వసుధ ననున్ గన భక్త పాలకా! రా!

త్రసన హరాక్షర! రాయఘాపహారా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సుమ సుకుమారా! నిన్ను నేను విడిచిపెట్టను, సమస్థ

విషయ లంపటములు నశింపఁ జేయువాడా! రమ్య చరితా! రాణింపఁజేయువాఁడవు నీవే, వేగముగా రమ్ము.భయమును

హరించువాడా! నీకు జయము.. దురాపహా! రాక్షసాంతకా! రక్షణనిచ్చుటకు రమ్ము. గొప్ప ప్రభాసవృత్తమున పూర్తిగా

ప్రకాశించువాడా! నన్ను చూచుటకు రమ్ము, ప్రశంసింపబడు దేవా! గొప్ప ఆత్మవై నాలో నిలిచి నా గొప్పతనము

నిలుపుము. గోపబాలకా! నన్ను కాపాడుటకు రమ్ము. ఘనుఁడా! భక్తపాలకా! వసుధపై నన్ను చూచుటకు

నాహృదయములో ప్రకాశించుము.

86. ఓం చండవిక్రమాయ నమః.

త్వరితపదగతి వృత్త గర్భ సీసము.

నరహరి కన నిను స్మరణము విడువను, - దేవా! మహాభాగ! దీనబంధు!  

మురహర! శుభములు తిరముఁగ నిలుపుము - మాలో, శుభాకార మహిమఁ గొలుపు..

పరమ పథమునిడు పరవశ మగుచుఁ - నంగన్, నియతి తోడ నన్నుఁ గనుము.

నిరుపమ వరదుఁడనిను నిరతము నిక - వీడన్. మహాదేవ! ప్రేమఁ జూపు.

గీ. త్వరితపదగతి వర్తించి వరలు నీవె - *చండ విక్రమా*! మదిలోననుండుమింక.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

86 సీస గర్భస్థ త్వరితపదగతి వృత్తము. (     .. యతి 11)

నరహరి! కన నిను స్మరణము విడువనుదేవా! 

మురహర! శుభములు తిరముఁగ నిలుపుము మాలో.

పరమపథమునిడు పరవశ మగుచుఁ గనంగన్. 

నిరుపమ వరదుఁడనిను నిరతమునిక వీడన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మహా భాగా! దీన బంధూ! నిన్ను చూచువరకు నీ

స్మరణమును విడిచిపెట్టను శుభాకారా మాలో శుభములను స్థిరముగా నిలుపుము. నేను పరవశమగుచు చూచునట్లు

పరమపథమునిడుము.. నన్ను కనుచుండుము. వరములొసగుటలో సాటి లేనివాడా! మహాదేవా! నిన్ను

నేనింక విడువను. చండవిక్రమా! త్వరితపదగతివృత్తమున కలవాడవు నీవేనా మదిలో ఉండిపొమ్ము.

87. ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః.

వనమంజరి వృత్త గర్భ సీసము.

అగణితమైన మహాద్భుత శక్తిని - హాయినిచ్చు దయామయాముకుంద!    

ప్రగణిత సుందర! భక్త హృదీశ! శు - భంకరా! మహితప్రభా! మహాత్మ!  

ద్విగుణిత శక్తిని దివ్యుఁడ! నాకిడి - తేజమున్ నెలకొల్పు దేవదేవ!

నిగమ సువేద్యుఁడ! నిన్ను గ్రహింతును - నిత్యమున్ నినుఁ గొల్తు నేర్పుమీర.

గీ. ప్రథితమౌ వనమంజరీ పద్య రూప! - శరణు *వేదత్రయ ప్రపూజ్యా*! మహాత్మ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

87 సీస గర్భస్థ వనమంజరి వృత్తము. (       .. యతి 14)

అగణితమైన మహాద్భుత శక్తిని హాయినిచ్చు దయామయా!    

ప్రగణిత సుందర! భక్త హృదీశ! శుభంకరా! మహితప్రభా

ద్విగుణిత శక్తిని దివ్యుఁడ! నాకిడి తేజమున్ నెలకొల్పుదే!

నిగమ సువేద్యుఁడ! నిన్ను గ్రహింతును నిత్యమున్ నినుఁ గొల్తునే.                    

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! అగణిత శక్తిని, సుఖమును ఇచ్చు దయామయా!

ముకుందా! ప్రశంసింపబడు మనోహరాకారా! భక్తుల హృదయేశ్వరా! శుభంకరా! మహితప్రభాన్వితా! మహాత్మా!

దివ్యుఁడా! ద్విగుణితమైన శక్తిని నాకొసఁగి తేజమును నాకు కల్పించు దేవదేవా! వేదవేద్యా! నిన్ను నిత్యమూ గ్రహింతును,

నేర్పుతో నిన్ను సేవింతును. .వనమంజరీ పద్యరూపుఁడా! వేదత్రయీప్రపూజ్య! శరణు.!

88. ఓం భగవతే నమః.

వసంతతిలక వృత్త గర్భ సీసము.  

ప్రపవు ప్రాణప్రదుండ! పర ప్రస్ఫుట! పాప - నాశా! సుసంపత్ప్రకాశ! శ్రీశ!  

సతము నీ నామమే జయమునే కరుణించు - దేవాదిదేవా! ప్రభావమీవ.

మహిత దీనావనా! మహిమఁ దేల్చుము దీప్తిఁ - గొల్పన్. మదిన్నిన్నె కొల్తుననఘ!  

వెలసి ప్రాణాకృతిన్ నిలుము పావన పద్మ - నాభా! మహాదేవ! శోభనిమ్ము.           

గీ. మహి వసంత తిలకగర్భ మహిత దీప్త - దివ్య సీసోజ్వల *భగవతే* నమామి.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

88 సీస గర్భస్థ వసంతతిలకవృత్తము. (  గగ .. యతి 8

ప్రాణప్రదుండ! పర ప్రస్ఫుట! పాపనాశా!

నీ నామమే జయమునే కరుణించు దేవా!

దీనావనా! మహిమఁ దేల్చుము దీప్తిఁ గొల్పన్.

ప్రాణాకృతిన్ నిలుము పావన పద్మనాభా!            

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీవు చలివేన్ద్రము. పరమున ప్రస్ఫుటమగువాఁడా!

పాపనాశకా! మంచి సంపదలందు ప్రకాశించుశ్రీశా! దీనులను కాచు ఘనుఁడా! వసంతిలక పద్యమున  ప్రకాశించు

సీసపద్యమునఁ గల మహితుఁడా! నీ మహిమతో నన్ను భవాంధమునుండి తేల్చుము. నాకు  దీప్తిని కొలుపుట కొఱకు

మదిలో నిన్నే తలంతును. ప్రాణముగలస్వరూపముతో వెలసి నాముందు నిలుము. నాకు శోభ కల్పింపుము. భగవతా

నమస్కరించుచున్నాను.!

89. ఓం పరమేశ్వరాయ నమః.

వనమయూర వృత్త గర్భ సీసము.

కలుగు నీ మహిమ నీ గరిమ నే నెఱుఁగ నా - ద్యారమా పూజ్య!  నా ధ్యాస నీవె.

మహితనీ మనమునన్ మనఁగ నీమమున నుం - టిన్నిల్పు నీ మదిన్ సన్నుతాత్మ!

మాన్యనే మనుదు నీ మదిని నెమ్మదిని బ్రో - వన్ జాలుదీవంచు భవ్యమంచు.

గణ్యనీ మదిని నేఁ గనఁగ. నేనచటనుం - టిన్నిల్పితీవేను మన్ననమున.

గీ. నేను *పరమేశ్వరా*త్మనే, నీవె నేను. - నేను నీవైన నీవును నేను కావె?

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

89 సీస గర్భస్థ వనమయూరవృత్తము( గగ .. యతి 9)

నీ మహిమ నీ గరిమ నే నెఱుఁగ నాద్యా

నీ మనమునన్ మనఁగ నీమముననుంటిన్.

నే మనుదు నీ మదిని నెమ్మదిని బ్రోవన్ 

నీ మదిని నేఁ గనఁగ. నేనచటనుంటిన్ .

 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! రమాపూజ్యుఁడవయిన ఆదిపురుషా! నీకు గల ఘనత

మహిమ నే నెఱుఁగను. నా ధ్యాసంతయు నీపైనే సుమా!.నీ మనసున ఉండుటకొఱకై నియమముతో ఉంటిని నీ మనసులో

నన్ను నిలుపుము.నెమ్మదిని నీవు నీ మదిని నన్ను బ్రోవతగినవాఁడవని నీ మదిలో నేనుందును. నీ మనసును నే

నెఱుఁగుట కొఱకు నీవే నన్ను నీ మనసున నిలిపియున్నావు. నేను పరమేశ్వరుని ఆత్మనే, నేనే నీవు. అయినప్పుడు నీవు

నేనే కదా.

90. ఓం శ్రీవత్సాంకాయ నమః

వరాంగి వృత్త గర్భ సీసము.

మహిత శుభావహా! మాకిల శోభ నీ - వే దివ్య దైవమా! వేగ రమ్ము.

కూర్మిన్ ప్రభావమున్ గొల్పెడి భాగ్యదుం - డా! మముఁ గావ రమ్మోమహాత్మ.

కూర్చి మా భావ మీడేర్చెడి మా హృదీ - శా! కృపాసాంద్ర! సత్ సౌమ్యరూప!

దివ్య శుభంబు లందించు యశోనృసిం - హా! వందనములు, నయానువర్తి!

గీ. వర వరాంగి సంశోభిత! ప్రాణనాథ! - మాకు మహిత *శ్రీవత్సాంక*! మార్గమీవె

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

90 సీస గర్భస్థ వరాంగి వృత్తము (1-2-4 పాదములు గగ,

                                          3 పాదము గగ .. యతి 8)

శుభావహా! మాకిల శోభ నీవే - ప్రభావమున్ గొల్పెడి భాగ్యదుండా!

మా భావ మీడేర్చెడి మా హృదీశా! - శుభంబు లందించు యశోనృసింహా!   

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శుభములకు స్థానమైనవాఁడా! ఇలపై మాకు నీవే శోభ.

దైవమా! వేగముగా నాకడకు రమ్ము. ప్రేమతో ప్రభావమును మాయందు కలుగఁ జేయు. భాగ్యదా! మమ్ము చూచుటకు

రమ్ము. మా భావములనీడేర్చెడి హృదీశా! కృపాసాంద్రా! సౌమ్య స్వరూపా! దివ్యశుభములందించు నృసింహా!

నయానువర్తీ! నీకు వందనములు.. వరాంగివృత్తస్థా! శ్రీవత్సాంకా మాకు మార్గము నీవే సుమా.

91. ఓం శ్రీనివాసాయ నమః.

వసంతమంజరి వృత్త గర్భ సీసము. 

నినుఁ గనన్ నరసింహ! నిరతము నేనిటన్ - భజియింతు నిన్ మహద్భక్తితోడ.

కనులకున్ గనిపించు ఘనతను గానఁగన్ - కరుణాలయావచ్చి కావుమయ్య.

మునులకున్ గనిపించు ఘనుఁడవుముందు  - న్బడు నాకికన్నీవు పద్మనాభ!

నిను విడన్. గమనించు నను నిల నీ పదాం - బుజ సేవకున్మహత్పూర్వ దేవ!

గీ. వినుత సువసంత మంజరీ వృత్త గర్భ - సీస సంభాస! జయము శ్రీ *శ్రీనివాస*.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

91 సీస గర్భస్థ వసంత మంజరి వృత్తము. (       .. యతి 13)

నినుఁ గనన్ నరసింహ నిరతము నేనిటన్ భజియింతు నిన్.

కనులకున్ గనిపించు ఘనతను గానఁగన్ కరుణాలయా

మునులకున్ గనిపించు ఘనుఁడవుముందు కన్బడు నాకికన్

నిను విడన్ గమనించు నను నిల నీ పదాంబుజ సేవకున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరసింహా! నిన్ను చూచుటకు నేను గొప్ప భక్తితో

భజించుచుంటిని. కరుణాంతరంగా! నీ ఘనత మేము చూచునట్లుగా మా కనులకు కనిపించుము. వచ్చి మమ్ము

కాపాడుము.. మునులకు కనిపించువాడవు కదా నీవు వచ్చి వేగముగా నాకు కనబడుము. . మహిమాన్విత దైవమా!  నిన్ను

నేను వీడను. నీ పాద సేవకుఁడను.. నన్ను చూడుము. వసంతమంజరీవృత్తగర్భసీసపద్యమున ప్రకాశించు శ్రీనివాసా! నీకు

జయము పలుకుదును.

92. ఓం జగద్వ్యాపినే నమః.

కమలవిలసిత వృత్త గర్భ సీసము

మనుజుల మదులను మలినము బాపన్గ - భక్తితత్పరతను వరలఁ జేసి,

ఘనతను గొలపను కరుణను బ్రోవన్గ - భక్త రక్షణ పూర్ణ భావనమున

మనముల నిలిచిన మహితుఁడ వీవేర! - మముఁ బ్రోచు యాదాద్రి మాన్యదేవ!

కనుమయ కృప మము ఘన నరసింహాఖ్య! - వర దైవమా! నీవె వరము మాకు.

గీ. కమల విలసిత శ్రీశుఁడా! ప్రముద మొసగి పాఠకాళిన్ *జగద్వ్యాపి*! వరలఁ గనుమ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

92 సీస గర్భస్థ కమలవిలసిత వృత్తము. ( గగ .. యతి 9) 

మనుజుల మదులను మలినము బాపన్ 

ఘనతను గొలపను కరుణను బ్రోవన్ 

మనముల నిలిచిన మహితుఁడ వీవే 

కనుమయ కృప మము ఘననరసింహా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా!పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మమ్ములను కాపాడు యాదాద్రివాసా! మానవులలో

మలినము పోగొట్టుట కొఱకు భక్తిని కల్పించి, ఘనత  కొలుపుటకని,కరుణతో కాపాడుటకని, భక్తరక్షణ భావముతో

మనస్సులలో నిలిచిన ఘనుడవీవే.. నీవే మాకు వరము.. కృపతో మమ్ము కనుము. కమలవిలసితవృత్తస్థశ్రీశా!

జగద్వ్యాపీ! పాఠకాళికి ప్రముద మొసగి వరలఁజేయుము.

93. ఓం జగన్మయాయ నమః.

కమలాకర వృత్తగర్భ సీసము.

కరుణాన్విత నృహరీ! కనఁబడ వేమయ! - నిన్ గనలేమాపునీత చరిత

నుతియింతును మహిమాన్విత! కన రావయ. - మాకొఱకింకన్ రమామనోజ్ఞ!  

భువనేశ్వరస్పృహఁ గొల్పుమ, నినుఁ గాంచఁగఁ - బ్రీతిని మాలోని చేతనమయి.

సకలార్థదగహనంబొకొ నినుఁ గాంచుట? - గౌరవమొప్పన్ వికాసమొంద

గీ. ప్రథిత కమలాకర సువృత్త భాస! నిన్నుఁ - గనఁగనెంతు *జగన్మయా*! కాంచనిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

93 సీస గర్భస్థ కమలాకరవృత్తము. ( .. యతి 11)

నృహరీ! కనఁబడ వేమయ! నిన్ గనలేమా

మహిమాన్విత! కన రావయమాకొఱకింకన్.

స్పృహఁ గొల్పుమ నినుఁ గాంచఁగఁ బ్రీతిని మాలో.

గహనంబొకొ నినుఁ గాంచుట? గౌరవమొప్పన్

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పునీత చరితా! నీవు కనబడవేమి? మేము నిను కనలేమా?

రమా మనోజ్ఞా! నిన్ను నుతింతును. కనబడుటకు రమ్ము.   భువనేశ్వరా! మాలో చేతనమయి మాకు నిన్ను చూచుట

కొఱకు స్పృహ కలిగించుము. సకలార్థదా! గౌరవముగా వికాసము పొందుట కొఱకు  నిన్ను చూచుట మాకు గహనమా?

కమలాకర వృత్త పద్యస్థా! జగన్మయా! నిన్ను చూడనెంచితిని. చూడనిమ్ము..

94. ఓం జగత్పాలాయ నమః.

భూతిలక వృత్త గర్భ సీసము.

నీవట నేనిట నిత్యముండుట నీకు - సమ్మతమా? హరీసత్వ భాస!

భావన చేసిన నీవ నేనను భావ - భాగ్యమె భాగ్యమౌన్ భక్తకల్ప!

నీ వర తేజము నేర్పునే మహనీయ - తత్వము మాకిలన్ ధర్మతేజ

నీవిక నన్ విడ నేరవెన్నఁగ, నిత్య - సత్యము నీవెగాసౌమ్య నృహరి!  

గీ. వినుత భూతిలక సువృత్త వేద్య! నిన్నుఁ - గవితనెంతు *జగత్పాల*! కావ్యమగుము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

94 సీస గర్భస్థ భూతిలక వృత్తము. ( .. యతి 12)

నీవట నేనిట నిత్యముండుట నీకు సమ్మతమా హరీ!

భావన చేసిన నీవనేనను భావ భాగ్యమె భాగ్యమౌన్ 

నీ వర తేజము నేర్పునే మహనీయ తత్వము మాకిలన్ 

నీవిక నన్ విడ నేరవెన్నఁగ నిత్య సత్యము నీవెగా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!   సత్వగుణమున భాసించువాఁడా! నీవక్కడ, నే నిక్కడ

నిత్యమూ ఉండుట నీకు సమ్మతమా? భక్తకల్పకమా! భావన చేసినచో నేవే నేను అనెడి భావ భాగ్యమే భాగ్యముకదా.

ధర్మతేజా! మాకు నీ తేజస్సే మహనీయ తత్వబోధ చేయును.  సౌమ్యస్వరూపా! నీవిక నను వీడి చనలేవు. మాయనిదగు

సత్యమున్నచో అది నీవే సుమా. భూతిలకవృత్త పద్యమున తెలియబడు జగత్పాలా! నిన్ను కవితలో భావింతును

కావ్యముగా రూపు దాల్చుము.

95. ఓం జగన్నాథాయ నమః

 తారక వృత్త గర్భ సీసము.

నిరుపమా! కననుంటి నిను మనోజ్ఞుఁడ! కావ్య - గతిని దేవా! నాదు కృతిని నిలుమ!

దుస్థితిన్ విన వేడుదు కమలాక్షుఁడ! వేద - ననిక ప్రేమన్ బాపి, నన్ను నిలుపు.

ఉరుగుణ! కనిపించియుఁ గనిపించక క్రాలు - నయమేనా నీకు? ఘన సుచరిత!

శుభదుఁడ! వినిపించుచు కనిపించుము విశ్వ - మున మహాత్మ! నీకు ప్రణుతులిడుదు.

గీ. తారకస్థ! *జగన్నాథ*! తలపు నీది. - కవిగ నే పొందు సత్కృతిన్ ఘనత నీది.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

95 సీస గర్భస్థ తారక. ( గగ .. యతి 11)

కననుంటి నిను మనోజ్ఞుఁడ! కావ్య గతిని దేవా!

విన వేడుదు కమలాక్షుఁడ! వేదననిక ప్రేమన్.

కనిపించియుఁ గనిపించక క్రాలుట నయమేనా?

వినిపించుచు కనిపించుము విశ్వమున నృసింహా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేనివాఁడా! నిన్ను కావ్యమున చూడనుంటిని

నా కవ్యమగుము. కమలాక్షా! ప్రేమతో నా బాధలను విని పారద్రోలుము. గొప్పగుణములచే ప్రకాశించువాడా! గొప్ప

సచ్చరిత కలవాడా! నాకు కనిపించీ కనిపించనట్లు ఉండుటన్నది తగునా? శుభదుఁడా! నీవు మాకు లోకమునందు

సుశబ్దరూపమున వినిపించుచు కనిపించుము.తారకవృత్తపద్యస్థా! జగన్నాథా! రచన విషయమున ఆలోచన నీదే,

కవిగా  నేను పొందెడి సకృతిలో ఘనతయు నీదే.

96. ఓం మహాకాయాయ నమః.  

మంగళమణి గర్భ సీసము.

శ్రీపతి! ననుఁ గాంచు, చెలఁగ శ్రీ శుభము లి  - లన్ బెక్కు శోభఁ గొల్పగను నీవు

నా పరమయి మంచి నడత నాకొసఁగుమ - యా! నయ వర్తనన్ హాయిఁ గనుదు.  

దీపిత నరసింహ! తెలుపుదే నిజమెఱుఁ - గన్ మదిన్ వెలుగొందు కాంతివీవొ

నా ప్రభువయి నీ వనయము నన్ గనెదవు - గా సత్కృపన్ లసత్ కమల నయన!

గీ. మంగళమణివృత్తస్థుఁడా మహిని నన్నుఁ - గనుమయా *మహాకాయా*! ప్రకాశమిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

96 సీస గర్భస్థ మంగళమణి. ( .. యతి 11)

శ్రీపతి! ననుఁ గాంచు, చెలఁగ శ్రీశుభములిలన్.

నా పరమయి మంచి నడత నాకొసఁగుమయా!   

దీపిత నరసింహ! తెలుపుదే నిజమెఱుఁగన్.

నాప్రభువయి నీ వనయము నన్ గనెదవుగా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్రీపతీ! మిక్కుటముగా శుభములతో వర్ధిల్లునట్లు నన్ను

చేయుటకు నీవు కృపతో నన్ను చూడుము. నీవు నాపరమయి నాకు మంచి ప్రవర్తననొసంగుము  నేను మంచిగా ప్రవర్తించి

సుఖింతును. ప్రకాశించునట్టి నరసింహా! నిజము తెలుపుదువా? నా మదిలో వెలుగుచుందువా నీవు? చక్కని

పద్మాక్షుఁడా! నీవెల్లప్పుడూ మంచి కృపతో నన్ను చూచుచుందువు కదా. మంగళమణి వృత్తపద్యమున ప్రకాశించువాఁడా!

మహా కాయా! నన్ను కరుణతో చూచి ప్రకాశమిమ్ము.

97. ఓం ద్విరూపభృతే నమః.

తురగవల్గిత వృత్త గర్భ సీసము.

జయము గొలుపఁగ విజయ పథమున చక్క - గా నడిపింతువేకమల నయన!

భయము తొలఁగగ విభవమొలయఁగ భక్తి - నే కలిగింతువేనిష్కళంక!

ప్రియముఁ గొలిపెడి భవిత నిలిపెడి విశ్వ - తేజము నీవెగాపూజనీయ

నయముఁ గొలుపుచు వినయమొసగుచు నన్ను - బ్రోవుమ దేవరామోదమునను.

గీతురగవల్గిత వృత్త సచ్చరణ యుక్త - సీస *ద్విరూపభృతా* విశేష తేజ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

97 సీస గర్భస్థ తురగవల్గిత వృత్తము. ( .. యతి 15)

జయము గొలుపగ విజయ పథమున చక్క గానడిపింతువే

భయము తొలగగ విభవమొలయగ భక్తినే కలిగింతువే

ప్రియముఁ గొలిపెడి భవిత నిలిపెడి విశ్వతేజము నీవెగా

నయముఁ గొలుపుచు వినయమొసగుచు నన్ను బ్రోవుమ దేవరా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కమల నయనా! నాకు జయము కలిగించు నిమిత్తము

నన్ను చక్కగా నడిపించుదువే, అకళంకుఁడా! నాలో భయమును బాపి, వైభవము కలిగించదలచి నాకు భక్తిని

ప్రసాదింతువే. తురగవల్గితవృత్త చరణములతోనొప్పు సీసపద్యమున ప్రకాశించు సర్విరూపభృతా! విశేషమైన తేజస్సు

కలవాడా! పూజనీయా! ప్రేమను కొలుపుచు, భవితను నిలుపెడి విశ్వతేజము నీవే. దేవరా! నీతిని కొలుపుచు, నాకు

వినయము కొలుపుచు మోదముతో నన్ను కాపాడుము.

98. ఓం పరమాత్మనే నమః.

ఉత్కళికా చతుష్టయ గర్భ సీసము.

నరహరి నను కను నయమున వరదుఁడ!

                       నిలుపుము మనమును. నీరజాక్ష!

సురుచిర వదనుఁడ! శుభ ఘన చరణుఁడ!

                       వినుమయ పలుకును విశ్వతేజ!

భరమొకొ ననుఁ గన వసుధను? నిరుపమ

                       పరివృత మునిగణ! పాపనాశ!

స్థిరముగ మనమున కరుణను వరదుఁడ!

                       నిలుమయ కనఁగను నిత్య సత్య!

గీ. ఉత్కళిక భాస సీసస్థ! సత్కృతులయ.

మదుల వెలిగెడి *పరమాత్మ*! మమ్ముఁ గనుమ.

భక్త జన పోషభవశోషపాపనాశ

శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

98 సీస గర్భస్థ ఉత్కళికా చతుష్టయము. (ఉత్కళిక - రెండు పాదములు.

                                                   పాదమునకు 4నగణములు.  

                                                   అంత్యప్రాస కలదు. ప్రాస నియమము కలదు)

1.నరహరి నను కను నయమున

వరదుఁడ! నిలుపుము మనమును

2.సురుచిర వదనుఁడ! శుభ ఘన          

చరణుఁడ! వినుమయ పలుకును!

3.భరమొకొ ననుఁ గన వసుధను,

నిరుపమ! పరివృత మునిగణ!

4.స్థిరముగ మనమున కరుణను

వరదుఁడ! నిలుమయ కనగను.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! వరదుడవైన ఓనరహరీ! నీరజాక్షా! నా మనమును నీతిపై

నిలుపుము. అందమైన ముఖము కలవాఁడా! శుభప్రదమైన ఘనమైన పాదపంకజుఁడా! విశ్వతేజా నా పలుకు వినుము.

పాపనాశా! మునిగణ [అరివృతుఁడా! నన్ను చూచుట నీకు భారమా? నిత్యసత్యమైన వరదుఁడా! నేను నిన్ను

చూచుటకు వీలుగా నిత్యము నా మనసున నిలుము. ఉత్కళిక చతుష్టయ గర్భిత సీసపద్య భాసా! నీకు నా సత్క్టృతులు.

మనసులందు ప్రకాశించు పరమాత్మా! మమ్ము చూడుము.

99. ఓం పరంజ్యోతిషే నమః.

గోమూత్రికాబంధ గూఢ పంచమపాదయుక్త తరువోజ - మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.

క్షేమమీవె యనంత! శ్రీ ఖగ సేవ్య! శ్రీ - సతి మోహనా! చిత్త శక్తివి, నుత!

శ్రీ మనమ్మ! సుచంద్ర శేఖర సేవ్య! శ్రీ - ! వసించు మా చిత్ ప్రశస్త! మహిని

క్షేమ మిచ్చెడి భద్ర చిత్త! ప్రసేవ్య జీ - ! నృసింహుఁడా! చిత్ ప్రభావ! మనుమ!

నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య ని - ర్మలుఁ జేయుమా! నేర్పు రమ్య గతిని.

గీ. పాద త్రితయస్థ గోమూత్ర బంధ యుక్త - ఛంద త్రితయ *పరంజ్యోతిషా*మ్ పతివయ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

99 సీస గర్భస్థ గోమూత్రికా బంధస్థ గూఢ పంచమ పాదము.

క్షే మీవె   నంత శ్రీ సేవ్య    శ్రీ - సతి మోహ నాచిత్త     శక్తివి    నుత!

శ్రీ మ్మ! సు చంద్ర శే    సే వ్య శ్రీ-! సిం చు మా చిత్ ప్ర   స్త! మహి ని

క్షేమ మి చ్చెడి    ద్ర cచిత్త!ప్ర సే వ్య జీ-! నృ సింహుఁడా!చిత్ ప్రభావ     నుమ!.

క్షేమమిమ్మయ చంద్రశేఖర సేవ్య   శ్రీ - ! నృసింహ మా చిత్ ప్రశస్త మహిత.

99 సీస గర్భస్థ తరువోజ (3ఇం., 1సూ.. 3ఇం.. 1సూ.. యతి 1-3-5-7 గణాద్యక్షరములు)

క్షేమమీవె యనంత! శ్రీ ఖగసేవ్య! శ్రీ సతి మోహనా! చిత్తశక్తి విను,

శ్రీ మనమ్మ! సుచంద్ర శేఖర సేవ్య శ్రీ ! వసించు మా చిత్ ప్రశస్త! మహి

క్షేమ మిచ్చెడి భద్ర చిత్త! ప్రసేవ్య జీవ! నృసింహుఁడా! చిత్ ప్రభావ! మను!

నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య నిర్మలుఁ జేయుమా! నేర్పు రమ్యగతి.

99 సీస గర్భస్థ మత్తకోకిల. ( .. యతి 11)  

క్షేమమీవె యనంత! శ్రీ ఖగసేవ్య! శ్రీ సతి మోహనా

శ్రీ మనమ్మ! సుచంద్రశేఖర సేవ్య శ్రీశ! వసించుమా!

క్షేమ మిచ్చెడి భద్రచిత్త! ప్రసేవ్య జీవ! నృసింహుఁడా!

నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య నిర్మలుఁ జేయుమా!

99 సీస గర్భస్థ ద్విపదద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం..1సూ. .. యతి 3 గణము 1 అక్షరము

(1)క్షేమమీవె యనంత! శ్రీ ఖగ సేవ్య! - శ్రీ మనమ్మ! సుచంద్రశేఖర సేవ్య!  

(2)క్షేమమిచ్చెడి భద్ర చిత్త! ప్రసేవ్య! - నీ మనంబున నన్ను నిల్పుమ నిత్య!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పొగడబడువాడా! శ్రీసతి మోహనా! యనంతా! క్షేమము

నీవే. చిచ్ఛక్తియు నీవే. లక్ష్మీ హృదయా! చంద్ర శేఖర సుసేవ్యా! శ్రీశా! ప్రశస్తా! మా మదులందు నివసించుము.

క్షేమప్రద భద్ర చిత్తుఁడా! జీవులచే సేవింపబడువాడా! చిత్ప్రభావా! నీవు మాలో మనుము. నీ మనసులో నన్ను

నిల్పుము. నన్ను నిత్యనిర్మలునిగా చేయుము. రమ్యగతిని నేర్పుము.మూడు పాదములందు

గోమూత్రికాబంధమొప్పుచుండ, మూడు వృత్తములు గర్భముననొప్పు సీసమునందు వెలుగెడి పరంజ్యోతిషాంపతివి నీవు.

100. ఓం నిర్గుణాయ నమః.

1.చంపక, 2.మధ్యాక్కర, 3.నర్కుట, 4.కోకిలక, 5.మణిభూషణ, 6.ద్రుతవిలంబిత, 7.కంద, 8.గీత గర్భ సీసము.

స్థిర వర సేవలే శివము శ్రీకర సేవ్య - ము శ్రీధి యౌనుగా పుణ్య గుణుఁడ!

సరస రసా వనాజవన సత్వ రజ స్త -  క్ష్మాధరాన భాసూక్ష్మ రూప!

పుర ధర బ్రోవగా భువన ప్రోక్తర పూజ్య - పు భ్రూధరార్యకా పూజ్య చరిత!

ధర వర ధావనాస్తవ నితాంతరతా భు - వి త్రాత వేగదా వినుత నృహరి!

గీ. పెక్కు ఛందంబులిమిడిన చక్కనైన - సీస సంభాస *నిర్గుణా*! క్షేమమిడుమ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

 (1)100 సీస గర్భస్థ చంపకమాల. ( .. యతి 11)

స్థిర వర సేవలే శివము శ్రీకర సేవ్యము శ్రీధి యౌనుగా !

సరస రసా వనాజవన సత్వ రజ స్తమ క్ష్మాధరాన భా

పుర ధర బ్రోవగా భువన ప్రోక్తర పూజ్యపు భ్రూధరార్యకా!

ధర వర ధావనాస్తవ నితాంతరతా భువి త్రాత వేగదా!

(2)100 సీస గర్భస్థ మధ్యాక్కర. (2 ఇం.. 1 సూ.. 2 ఇం.. 1 సూ. .. యతి 4 గణము 1 అక్షరం )

స్థిర వర సేవలే శివము శ్రీకర సేవ్యము శ్రీధి!

సరస రసా వనాజవన సత్వ రజ స్తమ క్ష్మాధ!

పుర ధర బ్రోవగా భువన ప్రోక్తర పూజ్యపు భ్రూధ!

ధర వర ధావనాస్తవ నితాంతరతా భువి త్రాత!

(3)100 సీస గర్భస్థ నర్కుటము. (      .. యతి 11)

స్థిర వర సేవలే శివము శ్రీకర సేవ్యము శ్రీ !

సరస రసా వనాజవన సత్వ రజస్తమ క్ష్మా!

పుర ధర బ్రోవగా భువన ప్రోక్తర పూజ్యపు భ్రూ!

ధర వర ధావనాస్తవ నితాంతరతా భువి త్రా!

(4)100 సీస గర్భస్థ కోకిలకము. ( .. యతి 14)

స్థిర వర సేవలే శివము శ్రీకర సేవ్యము శ్రీ!

సరస రసా వనాజవన సత్వ రజ స్తమ క్ష్మా!

పుర ధర బ్రోవగా భువన ప్రోక్తర పూజ్యపు భ్రూ!

ధర వర ధావనాస్తవ నితాంతరతా భువి త్రా!

(5)100 సీస గర్భస్థ మణి భూషణము. ( .. యతి 10)

సేవలే శివము శ్రీకర సేవ్యము శ్రీధి యౌ

సా వనాజవన సత్వ రజ స్తమ క్ష్మాధరా !

బ్రోవగా భువన ప్రోక్తర పూజ్యపు భ్రూధరా

ధావనాస్తవ నితాంతరతా భువి త్రాత వే!

(6)100 సీస గర్భస్థ ద్రుతవిలంబితము. ( .. యతి 7)

శివము శ్రీకర సేవ్యము శ్రీధి యౌ ! 

జవన సత్వ రజ స్తమ క్ష్మాధరా

భువన ప్రోక్తర పూజ్యపు భ్రూధరా ! 

స్తవ నితాంతరతా భువి త్రాతవే!

(7)100 సీస గర్భస్థ కందము.

వర సేవలే శివము శ్రీ

కర సేవ్యము శ్రీధి యౌనుగా! సరస రసా

ధర బ్రోవగా భువన ప్రో

క్తర పూజ్యపు భ్రూధరార్యకాధర వర ధా!

(8)100 సీస గర్భస్థ గీతము.

శివము శ్రీకర సేవ్యము శ్రీధి యౌను

జవన సత్వ రజ స్తమ క్ష్మాధరాన

భువన ప్రోక్తర పూజ్యపు భ్రూధరార్య

స్తవ నితాంతరతా భువి త్రాత వేగ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పుణ్యగుణ సంపన్నుఁడా! స్థిరమగు శ్రేష్ఠమైన సేవలే

శుభకరము. మంగళప్రదముగా సేవింపఁదగిన లక్ష్మీ నిలయము అగును కదా. సరస రసావనా! సూక్ష్మ రూపా!

భూమిపై ప్రకాశించువాఁడా! వేగముతో నొప్పెడి సత్వ రజస్తమోగుణ రూపా! పురధరుఁడా! పూజ్య చరితా! చతుర్దశ

భువనములందు భూమిని కాపాడుటకు గొప్పగా చెప్పబడెడి పూజ్య భృకుటి ధరించినవాఁడా! భువిపై శ్రేష్ఠత్వమును

భువిని శ్రేష్ఠమైన శుద్ధమైన వాఁడా! పొగడబడెడి అంతులేనిబ్రహ్మైక్యనందు కలవాడా! భువిని నీవు రక్షించు దైవమే కదా.

అష్టాధిక ఛందస్సులు గర్భందుకల సీసపద్యమున ప్రకాశించునిర్గుణా! మాకు క్షేమమును ప్రసాదించుము.

101. ఓం నృకేసరిణే నమః.   

చంద్రవర్త్మ వృత్త గర్భ సీసము.

పరమేశ్వరా! నీదు పాదపద్మములు - ట్టి విడువ, నిన్నే వడిన్ గొలిచెద.

బాధలన్ దీర్చెడి నీదు రూపమును నే - ను కనవలెన్. గాంచ సుకరమదియె.

శ్రీకరంబైనట్టి శ్రీధరా! కృపను చే - దుకొనుమయా! చేరుదు, నను కనుమ!

బాధఁ బాపెడి, వర బోధఁ గొల్పి ననుఁ బ్రో - చు నరహరీ! నన్నుఁ జూచి ప్రోచు

గీ. చంద్రవర్త్మ సద్ గర్భిత సత్ప్రకాశ - సీస వాస *నృకేసరి*! శ్రీహృదీశ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

101 సీస గర్భస్థ చంద్రవర్త్మ వృత్తము. ( .. యతి 7)

పాదపద్మములు పట్టి విడువ నిన్. - నీదు రూపమును నేను కనవలెన్.

శ్రీధరా కృపను చేదుకొనుమయా! - బోధఁ గొల్పి ననుఁ బ్రోచు నరహరీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పరమేశ్వరా! నీ పాదపద్మములను విడువను, వడివడిగా

నిన్నే నేను కొలిచెదను. బాధలను బాపు నీ ముఖము చూచెదను. అదియే సులభము. శ్రీకరుఁడవయిన శ్రీధరా! కృపతో

నన్ను చేదుకొనుము. నేను నిన్ను చేరెదను. నన్ను చూడుము. బాధలను పోగొట్టెడి మంచి బోధను నాకు కలిగించు

శ్రీనరహరీ! చం ద్రవర్త్మవృత్తగర్భ సీసపద్యమున ప్రకాశించు నృకేసరీ! శ్రీహృదీశా! ! నన్ను చూచి కాపాడుము.

102. ఓం పరతత్త్వాయ నమః.

నవమాలిని వృత్త గర్భ సీసము.

నరహరి! చూచితే నరుల బాధల్? మదిన్ - కలిచివేయును కన్న కమల నయన!

మురహర! తీర్చవే భువిని క్షోభల్. సదా - శోభిలం జేయవే సుందరాంగ.

నిరుపమ! నిత్యమై నిలుతువీవే మదిన్ - శోభిల్లఁ జేసినన్ సుజనులందు

చరణము పట్టనీ సదయ నన్నున్. నీదు - పద ధూళి కైవల్య పథము చేర్చు

గీ. విదిత నవమాలినీ గర్భ వినుత సీస - దీప్త *పరతత్వ*! నిన్ గొల్తు దేవదేవ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

102 సీస గర్భస్థ నవమాలిని. ( .. యతి 8)

నరహరి! చూచితే నరుల బాధల్?

మురహర! తీర్చవే భువిని క్షోభల్.

నిరుపమ! నిత్యమై నిలుతువీవే.

చరణము పట్టనీ సదయ నన్నున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కమల నయనా! నరుల బాధలు చూచినచో మనసును

కలిచివేయును. నీవు చూడుము. మురహరా! సుందరాంగా! మమ్ములను శోభిల్లఁ జేయుటకు నీవు క్షోభలను

నశింపఁ జేయుము. నిరుపమా! నీ వావిధముగ చేసినచో సుజనుల మనస్సులలో నీవే శోభిల్లుచుందువు కదా.నీ

పదములను నన్ను పట్టనీ, నీ పాద ధూళి కైవల్య పథమును చేర్చును.నవమాలినీ వృత్త గర్భ సీసమున ప్రకాశించు

పరతత్వమా! దేవదేవా! నిన్ను నేను కొలిచెదను 

103. ఓం పరంధామ్నే నమః.

చంద్రలేఖ వృత్త గర్భ సీసము

అరయ ఘన విజయమగు మహేశా! ప్రశాం - స్వరూపా! మహోద్భాస! శ్రీశ

కూర్మినొప్పెడి నయగుణ నిధానా! ప్రణా - మంబు దేవా! వివేకంబు నిమ్ము.

కృష్ణుఁడా! సుప్రియ హృదయ శౌరీ! నిజం - బీవె సత్యాశ్రయా! శ్రీవిభాస!

మనమున విస్మయమునణగించన్ రా - రా మనోజ్ఞా! సుధీరా ముకుంద!

గీ. చంద్రలేఖా సముద్ద్భాస సరస సీస - విభవ! ఘన *పరంధామ*! మా వెలుఁగు నీవె.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

103 సీస గర్భిత చంద్రలేఖ. ( .. యతి 7)

జయమగు మహేశా! ప్రశాంత స్వరూపా  -  నయగుణ నిధానా! ప్రణామంబు దేవా!

ప్రియ హృదయ శౌరీ! నిజం బీవె సత్యా! -  స్మయమునణగించంగ రారా మనోజ్ఞా!!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! అరయగా ఘనవిజయస్వరూపమగు మహేశా! ప్రశాంత

స్వరూపా! గొప్పగా ప్రకాశించు శ్రీశా! ప్రేమతో ఒప్పియుండెడి నయగుణ నిధానమా! దేవా! నీకు వందనములు. నాకు

వివేకమునిమ్ము.. కృష్ణా! సుప్రియ హృదయ శౌరీ! శ్రీ విభాసా! సత్యాశ్రయా! నిజమన్నది నీవు మాత్రమే. సుధీరా!

ముకుందా! మనోజ్ఞుఁడా! నా మనస్సునందలి విస్మయమునురూపుమాపుటకు వేగముగా రమ్ము. చంద్రలేఖావృత్తగర్భ

సీసప్రకాశా! పరంధామా! మా వెలుగువు నీవే సుమా.

104. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః  

మత్తహంసిని వృత్త గర్భ సీసము.

ఎన్ని కను మురారి! నిన్నే విభునిగా ను - తింతు రా, మదిలోన శాంతి నిల్ప.

సాకఁగను పరాకు నీకేల ప్రవరుండ! - కావఁగా కష్టమా కరుణఁ జూచి?

పుణ్యులును, నరోత్తముల్ జీవనము నీవె = యందురే! వినవేమి సుందరాంగ!!  

రాక్షసారి! పరాత్పరా! నీవె ప్రభవంబుఁ - గొల్పరా! తీర్చరా కోరికలను.

గీ. మత్తహంసిని గర్భ సన్మహిత సీస - *సచ్చిదానంద విగ్రహా*! సన్నుతులయ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

104 సీస గర్భస్థ మత్తహంసినీ వృత్తము ( .. యతి 7)  

మురారి! నిన్నే విభునిగా నుతింతురా. - పరాకు నీకేల ప్రవరుండ! కావఁగా.

నరోత్తముల్ జీవనము నీవె యందురే! - పరాత్పరా! నీవె ప్రభవంబుఁ గొల్పరా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మురారీ! నా మనసులో శాంతిని నింపుట కొఱకు

ప్రత్యేకించి విభుఁడుగా నిన్నె ఎన్నుకొని కొలుచుదును. ప్రవరుఁడా! మమ్ములను సాకుట విషయమున పరాకు

నీకెందులకు? కరుణతో మమ్ము కాపాడుట నీకు కష్టమా? సుందరాంగా! నరోత్తములు, కృత పుణ్యులు జీవనము నీవే

యని అందురే, వారి పలుకులాలకింపవేమి? రాక్షసారీ! పరాత్పరా! నీవే మాలో శౌర్యము కొలుపుము. మా కోరికలను

తీర్పుము. మత్తహంసినీ వృత్త గర్భ సీసమున వెలుగొందుచున్న సచ్చిదానందవిగ్రహా! నీకు నా సన్నుతులు.    

105. ఓం లక్ష్మీనృసింహాయ నమః

దండక - భుజంగప్రయాత వృత్త చతుష్టయ - స్రగ్విణి వృత్త గర్భ సీసమాలిక.                  

(1) నారాయణా! నీదు నామంబు నేఁ బల్కి - నాలోన నిన్ గాంచి నయమునొప్పి,

నీ దివ్య రూపంబునే యాత్మలో నిల్పి - నీ పూజలంజేసి నియతి నుండి,

ప్రార్థించినంతన్ శుభంబుల్ వరించున్ బ్ర - భావంబునే జూపు పరమ పురుష.

నీవుండి నాలోన నిత్యత్వమున్ గొల్పి - దీపింపుమాలోన దివ్య తేజ!

(2) నీ పాద పద్మంబు లేపార జూడన్  - దిన్ నిల్చి నన్నేలు దీనబంధు.!

నీ నామ రూపంబులే నాకు జీవంబు - నన్నేలుమా నీవె నాకు రక్ష.

నీ భావనంబే పునీతంబు చేయున్ - నో నాయకుండాప్రణుతులఁ గొలుతు.

భావ ప్రభాసా! స్వభావంబు నీవేను. - సాక్షాన్నృసింహాఖ్యసత్స్వరూప!

(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేద - ముల్ పైకి కన్పించ మూర్ఖుఁడైన

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటి - నన్నింటినిన్ బట్టి మిన్నకుండ

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్ష - ణంబీవు గావించ నంబుజాక్ష!

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు - మత్స్యంబు నీవేర మహిత దేవ!

 (కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న క్షీరాబ్ధినే చిల్కఁ జేరి యచట

కవ్వంబుగా కొండఁగైకొంచు నా త్రాడు - గా వాసుకిన్గొంచు కవ్వమట్లు

చిల్కంగ నవ్వేళఁ జిత్రంబుగా నీవు - కూర్మంబువై కాచికూర్మిఁ జూపి

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి - రక్షింతువే నీవు ప్రాణ నాథ.

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు - నింజంపిభూమిన్ సునీతినొప్ప

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి - దుష్టాత్మునిన్ జంపి సృష్టిలోన

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి - భక్తాళినే బ్రోచిప్రతిభనొప్పి,

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి - వర్ధిల్లి తీవేగ ! వశమునుండు.

(నరసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ దండ్రి - నిన్నీనృసింహంబు నేర్పు తోడ

రూపంబుగాఁ దాల్చి పాపాత్మునిం ద్రుంచి - ప్రహ్లాదు రక్షించిప్రభను జూప

చిద్రూపమొప్పార సింహాచలంబింక, - యాదాద్రి యందీవు హ్లాదమొదవ

తేజంబుతోనిల్చిదీపింతువే పెక్కు - చోట్లన్ నృసింహాఖ్యశోభఁ గూర్ప.

(వామనావతారము)

(7) యజ్ఞాదులం జేయు ప్రజ్ఞాన్వితుండౌ - లిం గాంచి పాతాళ ప్రాంగణమున

లోకాధిపుం జేయ శ్రీకారముం జుట్టి - శ్రీవామనుండౌచుఁ జేర వచ్చి,

దానంబుగా కోరి ధాత్రిం ద్రిపాదంబు - లీయన్ వరాకాశ హృన్మనోజ్ఞ

భూభాగముల్గొంచు మూడున్ గొనన్ శీర్ష - మున్ ద్రొక్కితీవేగప్రోవ నెంచి

 (పరశురామావతారము)

(8) భూపాలకుల్ సృష్టిఁ బాపాత్ములై మంచి - చెడ్డల్ విడన్ గాంచియడ్డగించి

నీ గొడ్డలిన్ బట్టి వేగంబుగాఁ జేసి - తే రాజ నాశంబుదేవ దేవ!

రాముండవైకాన రావయ్య నేడున్ దు - రాత్ముల్ విజృంభించి  యవని పైన

దౌష్ట్యంబులన్ జేయుదండించు వారిన్  - ముం గావ రావేర పుణ్య ఫలమ!

(శ్రీరామావతారము)

(9) కామాతురుండై మృగంబట్లు వర్తించు - చున్ రావణ బ్రహ్మ శోభ చెదర

సీతాపహారంబు సేయంగ వానిన్  - ధించంగ సుగ్రీవు పంచఁ జేరి

స్నేహంబునే చేసి శ్రీలంకనే చేరి - యారావణుం జంపి యచట నున్న

సీతమ్మతోఁ జేరి శ్రీరామ.! రాజ్యంబు - పాలించితీవేరపరమ పురుష!

 (శ్రీకృష్ణావతారము)

(10) శ్రీమన్మహా గీతఁ జేకొండటంచున్ బ్ర - బోధంబు సేయంగ భూమిపైన

కృష్ణుండుగాఁ బుట్టితృష్ణన్ నినున్ జూచు - భక్తుండు పార్థుండు భయముఁ గొల్పు

యుద్ధంబులో భీతినొద్దంచు యుద్ధంబు - మానంగ నచ్చోట మహిమఁ జేసి

గీతన్ బ్రబోధించి చైతన్యముం గొల్పి - చేయించితీవేర చిద్విభాస!

(బుద్ధావతారము)

(11) భూమీశులున్ మానవుల్ యజ్ఞ యాగాదు - లన్ జేయుచున్ నందు లక్ష్యమొప్ప

జీవాళినే జంపజీవంబులన్ దీయు - యాగంబులన్ మాన్ప నవనిపైన

సిద్ధార్థుఁడై పుట్టి బుద్ధుండుగామారి, - బౌద్ధంబు బోధించిప్రస్ఫుటముగ

హింసా విధిన్ మాన్పిహృత్సీమలో శాంతి - నే గొల్పితీవేర నిత్య శుభద!

 (కల్క్యవతారము)

(12) దుష్టుల్ విజృంభించిశిష్టాత్ములన్ బాధ - లన్ ముంచుటం జేసి లక్ష్యమైన

ధర్మంబు క్షీణింపమర్మాత్ములం జంపి - ధర్మంబు రక్షింపఁ దప్పదంచు

కల్యంతమున్ ఘోర ఖడ్గంబునే దాల్చి - భూభారమే తగ్గ దుష్ట నిహతిఁ

జేయంగ జన్మించు శ్రీమన్మహా కల్కి - దేవా నమస్తేస్తు దీప్త నృహరి!

(13) హే మా రమానాథప్రేమార రమ్మన్న - రావేర వేగంబు రార దేవ!

నే నేరనా? వల్లభానేర్పరానా వి - ధిన్ శ్రీ నృసింహాఖ్యదీప్తిఁ గొలుప,

ధీరారమోద్ధాముఁడారారరక్షింప - రారాకృపాసాంద్ర రక్షనీవె!

నిన్ నా రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచు -  మాతండ్రి నిత్యాత్మమమ్మునింక.

(14) సత్యంబు నీవేభుజంగేశు పర్యంక - పూర్ణానురాగాఢ్య! బోధ వీవె.

సత్వంబు నీవేప్రజాళిన్ గనంగా  - రంబీవె నిత్యాత్మ రాగులకును.

జాడ్యంబుఁ బాపన్నిజంబెన్ని చూపంగ - నిన్ గొల్తుమయ్యాసునేత్ర భాస!

సాంతంబు నిన్నున్ భజింతున్ మదిన్ నిల్పి - భక్తిన్ నృసింహాస్వ భక్త పాల!

(15) హర్షావహంబౌ మహత్పూజ్య యాదాద్రి - మాన్యంబు కానన్  మహిమఁ గొలుపు

నాత్మన్ స్థిరంబై యిహంబున్ బరంబెన్ని -  యిష్టాప్తినీయంగ శిష్టులకిల.

నచ్చోట నీవుంటి వర్ధిన్ నృసింహుండ! - మమ్మేలు నిన్నేను సమ్ముదమున

నాత్మన్ గనన్ నీ సహాయంబు నర్థింత్రు - సన్మార్గవర్తుల్.  స్వ సత్వ నిధులు.

(16ధర్మంబు నిల్పన్ సదా నన్ను రక్షించు - సర్వేశ్వరా! నా సుపర్వమీవె!

ధీశక్తిఁ గొల్పన్ హృదిన్నిల్చి దీక్షన్  - హిన్వెల్గరాదా! ప్రభన్వెలుంగ!

హర్షంబుఁ గంల్పన్ సదానంద రూపుండ! - సత్వ ప్రకాశాఢ్యశాంత తేజ!

ఆత్మ ప్రకాశాచిదానందమూర్తీ! నృ - సింహా! నమస్తేస్తు శిష్ట రూప!

(17) ప్రహ్లాద రక్షాప్రభా పూర్ణ సాక్షీప్ర - పంచ ప్రసిద్ధాత్మ! బ్రహ్మ తేజ!

భావంబు నీవే సు భద్రాత్మనీవేవి - శుద్ధాత్మ నీవేరచూడ రార!

పాపాత్ములందున్సు భక్తాళి యందున్ బ్ర - శోభింతు వీవేరసుప్రకాశ!

భవ్యాత్మతే జః ప్రభావంబుతో మమ్ము - రక్షీంపరావేరరార నృహరి!

(18) యాదాద్రిపై నీవు మోదంబుతో నుండి, - బాధార్తులన్ బ్రోచ, బాధఁ బాపి,

భక్తాళినే గాంచి శక్తిం బ్రసాదించి, - కర్తవ్యమున్ గొల్పి, కరుణఁ జూపి,

నిత్యత్వ మీయన్, మనీషాళిఁ బ్రోవన్, గృ - పన్ నిల్చితీవేర! పరమ పురుష!

మా హృన్నృసింహా నమస్తే నమస్తే - మస్తే నమస్తే నమామి నృహరి!

గీ. దండకోద్దండ సీసస్థ! దండములయ - శ్రీశ! *లక్ష్మీనృసింహ*! నన్ జేదుకొనుమ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

105  సీస మాలిక గర్భస్థ దండకము.

(1) నారాయణా నీదు నామంబు నేఁ బల్కినాలోన నిన్ గాంచి,

నీ దివ్య రూపంబు నే యాత్మలో నిల్పినీ పూజలంజేసి ,

ప్రార్థించినంతన్ శుభంబుల్ వరించున్, భావంబునే జూపు .

నీవుండి నాలోన నిత్యత్వమున్ గొల్పి దీపింపుమాలోన.

(2) నీ పాద పద్మంబు లేపార జూడం మదిన్ నిల్చి నన్నేలు 

నీ నామ రూపంబులే నాకు జీవంబు నన్నేలుమా నీవె 

నీ భావనంబే పునీతంబు చేయున్మనో నాయకుండాప్ర 

భావ ప్రభావా! స్వభావంబు నీవేనుసాక్షాన్నృసింహాఖ్య!

(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేదముల్ పైకి కన్పించ

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటినన్నింటినిన్ బట్టి 

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్షణంబీవు కావించ 

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు మత్స్యంబు నీవేర. 

(కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న క్షీరాబ్ధినే చిల్క 

కవ్వంబుగా కొం డఁ గైకొంచు నా త్రాడుగా వాసుకిన్గొంచు 

చిల్కంగ నవ్వేళఁ జిత్రంబుగా నీవు కూర్మంబువై కాచి

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి రక్షింతువే నీవు . 

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు నింజంపిభూమిన్ సు 

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి దుష్టాత్మునిన్ జంపి 

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి భక్తాళినే బ్రోచి

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి వర్ధిల్లి తీవేగ?.

(నారసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ దండ్రి నిన్నీనృసింహంబు 

రూపంబుగా తాల్చి పాపాత్మునిం ద్రుంచి ప్రహ్లాదు రక్షించి

చిద్రూపమొప్పార సింహాచలంబింకయాదాద్రి యందీవు 

తేజంబుతోనిల్చిదీపింతువే పెక్కు చోట్లన్ నృసింహాఖ్య

(వామనావతారము)

(7) యజ్ఞాదులం జేయు ప్రజ్ఞాన్వితుండౌ బలిం గాంచి పాతాళ 

లోకాధిపుం జేయ శ్రీకారముం జుట్టి శ్రీవామనుండౌచు 

దానంబుగా కోరి ధాత్రిం ద్రిపాదంబు లీయన్ వరాకాశ 

భూభాగముల్గొంచు మూడున్ గొనన్ శీర్షమున్ ద్రొక్కితీవేగ?

(పరశురామావతారము)

(8) భూపాలకుల్ సృష్టిఁ బాపాత్ములై మంచి చెడ్డల్ విడన్ గాంచి

నీ గొడ్డలిన్ బట్టి వేగంబుగాఁ జేసితే రాజ నాశంబు

రాముండవైకాన రావయ్య నేడున్ దురాత్ముల్ విజృంభించి  

దౌష్ట్యంబులన్ జేయుదండించు వారిన్ మముం గావ రావేర. 

(శ్రీరామావతారము)

(9) కామాతురుండై మృగంబట్లు వర్తించుచున్ రావణబ్రహ్మ 

సీతాపహారంబు సేయంగ వానిన్ వధించంగ సుగ్రీవు 

స్నేహంబునే చేసి శ్రీలంకనే చేరి యా రావణుం జంపి 

సీతమ్మతోఁ జేరి శ్రీరామరాజ్యంబు పాలించితీవేర.

(శ్రీకృష్ణావతారము)

(10) శ్రీమన్మహా గీత చేకొండటంచున్ బ్రబోధంబు సేయంగ 

కృష్ణుండుగాఁ బుట్టితృష్ణన్ నినున్ జూచు భక్తుండు పార్థుండు 

యుద్ధంబులో భీతినొద్దంచు యుద్ధంబు మానంగ నచ్చోట 

గీతన్ బ్రబోధించి చైతన్యముం గొల్పి చేయించితీవేర.

(బుద్ధావతారము)

(11) భూమీశులున్ మానవుల్ యజ్ఞ యాగాదులన్ జేయుచున్ నందు 

జీవాళినే జంపజీవంబులన్ దీయు యాగంబులన్ మాన్ప 

సిద్ధార్థుఁడై పుట్టి బుద్ధుండుగామారిబౌద్ధంబు బోధించి

హింసా విధిన్ మాన్పిహృత్సీమలో శాంతినే గొల్పితీవేర.

(కల్క్యవతారము)

(12) దుష్టుల్ విజృంభించిశిష్టాత్ములన్ బాధ - లన్ ముంచుటం జేసి 

ధర్మంబు క్షీణింపమర్మాత్ములం జంపి ధర్మంబు రక్షింప

కల్యంతమున్ ఘోర ఖడ్గంబునే దాల్చి భూభారమే తగ్గ 

జేయంగ జన్మించు శ్రీమన్మహా కల్కిదేవా నమస్తేస్తు.

(13) హే మా రమానాథప్రేమార రమ్మన్న రావేర వేగంబు

నే నేరనా? వల్లభానేర్పరానా విధిన్ శ్రీ నృసింహాఖ్య

ధీరారమోద్ధాముఁడారారరక్షింప రారాకృపా సాంద్ర !

నిన్ నా రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచు మా తండ్రి నిత్యాత్మ!

(14) సత్యంబు నీవేభుజంగేశు పర్యంక పూర్ణానురాగాఢ్య!

సత్వంబు నీవేప్రజాళిన్ కనంగా వరంబీవె నిత్యాత్మ!       

జాడ్యంబుఁ బాపన్నిజంబెన్ని చూపంగ నిన్ గొల్తుమయ్యాసు

సాంతంబు నిన్నున్ భజింతున్ మదిన్ నిల్పి భక్తిన్ నృసింహాస్వ 

(15) హర్షావహంబౌ మహత్పూజ్య యాదాద్రి మాన్యంబు కానన్గ 

నాత్మన్ స్థిరంబై యిహంబున్ బరంబెన్ని యిష్టాప్తినీయంగ 

నచ్చోట నీవుంటి వర్ధిన్ నృసింహుండమమ్మేలు నిన్నేను

నాత్మన్గనన్నీ సహాయంబున ర్థింత్రు సన్మార్గవర్తుల్. స్వ 

(16)  ధర్మంబు నిల్పన్ సదా నన్ను రక్షించు సర్వేశ్వరా! నా సు

ధీశక్తిఁ గొల్పన్ హృదిన్నిల్చి దీక్షన్ మహిన్వెల్గరాదా! ప్ర

హర్షంబుఁ గంల్పన్  సదానంద రూపుండ! సత్వ ప్రకాశాఢ్య!

ఆత్మ ప్రకాశా! చిదానందమూర్తీనృసింహా! నమస్తేస్తు.

(17) ప్రహ్లాద రక్షాప్రభా పూర్ణ సాక్షీప్రపంచ ప్రసిద్ధాత్మ!

భావంబు నీవే సు భద్రాత్మనీవేవిశుద్ధాత్మ నీవేర!

పాపాత్ములందున్సు భక్తాళి యందున్ బ్రశోభింతు వీవేర!

భవ్యాత్మతేజః ప్రభావంబుతో మమ్ము రక్షీంపరావేర?

(18) యాదాద్రిపై నీవు మోదంబుతో నుండి, బాధార్తులన్ బ్రోచ,

భక్తాళినే గాంచి శక్తిం బ్రసాదించి, కర్తవ్యమున్ గొల్పి,

నిత్యత్వ మీయన్, మనీషాళిఁ బ్రోవన్, గృపన్ నిల్చితీవేర!

మా మార్గమీవే. సమస్త ప్రకాశా! నమస్తే నమస్తే

105 సీస (మాలిక) గర్భస్థ భుజంగప్రయాత వృత్త చతుష్టయము. (యయయయ .. యతి 8

(1)రమానాథప్రేమార రమ్మన్న రావే!

రమా వల్లభానేర్పరానా విధిన్ శ్రీ. 

రమోద్ధాముఁడారారరక్షింప రారా

రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచు మాతన్!

(2)భుజంగేశు పర్యంక పూర్ణానురాగా!

ప్రజాళిన్ గనంగా వరంబీవె నిత్యా!

నిజంబెన్ని చూపంగ నిన్ గొల్తుమయ్యా!

భజింతున్ మదిన్ నిల్పి భక్తిన్ నృసింహా!               

(3)మహత్పూజ్య యాదాద్రిమాన్యంబు కానన్.

యిహంబున్ బరంబెన్ని యిష్టాప్తినీయన్

మహచ్ఛ్రీ నృసింహుండ!  మమ్మేలు నిన్నే 

సహాయంబు నర్ధించు సన్మార్గవర్తుల్.               

(4) సదా నన్ను రక్షించు సర్వేశ్వరా! నా

హృదిన్నిల్చి దీక్షన్ మహిన్వెల్గరాదా!

సదానంద రూపుండ! సత్వ ప్రకాశా!

చిదానందమూర్తీ నృసింహా నమస్తే.

105 సీస(మాలిక) గర్భస్థ స్రగ్విణి వృత్తము. (   ..  యతి 7)                       

మా రమానాథప్రేమార రమ్మన్న రా! - నేరనా? వల్లభానేర్పరానా విధిన్,

రారమోద్ధాముఁడారారరక్షింప రా! - నా రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచుమా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!

(1) నీ పేరునునేనుపలికి ఋజుమార్గములో ఒప్పియుండి, నీ స్వరూపమునాత్మలో నిలిపి, నీ పూజలు చేసి నీతిగా ఉండి,

నిన్ను ప్రార్థించినంతలో నన్ను శుభములు చేరును. వాటి ప్రభావమును చూపును సుమా. నీవు నాలో ఉండి

నిత్యత్వమును నాకు కలిగింపుము.

(2) నీ పాదపద్మములను కనులువిప్పరి చూచినచో నా మనసులో నిలిచి నన్నేలుము. నీ నామ రూపములే నాకు

జీవము. నన్నేలెడి మా నీవే నాకు రక్షణ. నిన్ను భావించినంతనే పవిత్రులమగుదుము. మనోనాయకా వందనము

లందుకొమ్ము. నా భావమున ప్రభాసించువాఁడా! సత్వరూపా! నరసింహా! నా భావము నీవే సుమా

(3) బ్రహ్మ నిదురించు సమయమున హయగ్రీవరాక్షసుడు వేదములనపహరించుకొనిపోగా వానిని సంహరించి

వానినుండి వేదములను కాపాడుటకు మత్స్యవతారమెత్తినది నీవే కదా.

(4) దేవదానవులు క్షీర సాగర మథనము చేయు సమయమున కవ్వముగా చేయబడిన మందర పర్వతమును

మ్రోయుటకు కూర్మావతారమెత్తినది నీవే కదా. శ్రీకూర్మమున వెలసి మమ్ములను రక్షింపనుంటివి. 

(5) హిరణ్యాక్షుఁడు తన రాక్షసబలిమి చూపి భూమిని చాపగా చుట్టిపట్టుకొనిపోవుచున్న సమయమున భూదేవిని

రక్షించుట కొరకు నీవు వరాహరూపమున నవతరించి రాక్షసుని సంహరించితివి కదా.ఆర్తితోనున్న ప్రాణులను నీవు

కాపాడుచుంటివి కదా.

(6) ప్రహ్లాదుని రక్షించుట కొఱకు, అతని తండ్రియగు హొరణ్యకశ్యపుని శిక్షించుట కొఱకు, నరసింహావతారమెత్తితివి నీవే

కదా. సింహాచలము, యాదాద్రి మున్నగు అనేక ప్రదేశములలో నీవు భక్తులను రక్షించుటకై వెలసి యుంటివికదా..

(7) యజ్ఞములు చేయు బలిని చూచి అతనిని పాతాళ లోకాధిపతిని చేయు తలపుతో వామనునిగా వచ్చి మూడడుగులు

దానముగా పొంది మూడవ అడుగు అతని శిరమున మోపి అతనిని పాతాళమునకు ద్రొక్కితివి నీవేకదా.

(8) భూమిపై రాజుల దురాగతములు గాంచి ధర్మరక్షణకై గొడ్డలి పట్టి వారిని సంహరించిన పరశురాముఁడవు నీవే కదా.

నేడునూ దురాత్ములు చెలరేగిపోవుచున్నారు. వారిని సంహరింప వేగమే రమ్ము.,

(9) కామాతురుఁడై రావణుండు సీతనపహరించగా నీవు సుగ్రీవునితో మైత్రి చేసి, లంకచేరి రావణ సంహారము చేసి సీతతో

అయోధ్యలో పట్టాభిషిక్తుఁడవయిన రామావతారము నీదే కదా.

(10) అర్జునుఁడు బంధు వ్యామోహమున చిక్కి యుద్ధ విముఖుడు కాగా మాయ చేసి వానికి గీత బోధించి యుద్ధము

చేయించితివి. విధముగ భూజనులకు గీతను బోధింప నవతరించిన కృష్ణుఁడవు నీవే కదా. .

(11) భూ జనులు యజ్ఞాదులు చేయుచు జంతువులను బలియిచ్చుచుండ, నీవు సిద్ధార్థుఁడుగా పుట్టి తపస్సు చేసి

బుద్ధుఁడుగా మారి అహింసను బోధించితివి.  అట్టి బుద్ధునిగా అవతరించినది నీవే కదా.

(12) భూమిపై జనులు సకల పాపప్రవర్తనలు చేయుట గాంచి కలికాలమునందలి కల్మషులను సంహరించి ధర్మ పరిరక్షణ

చేయుట కొఱకు చేత ఖడ్గమును ధరించి దుష్ట సంహారము చేయుటకవతరించబోవు కలికివి నీవే కదా.!

(13) హరీ! పిలుచుచుంటిని వేగముగా రమ్ము. నేను నా ధర్మమెఱుఁగనా? ఐనచో నీవే నాకు నేర్పుము. రమోద్ధామా! నీవే

రక్షకుఁడవు రమ్ము.నిన్ను మా తల్లి లక్ష్మిని కొలిచెదము.మమ్ము చక్కగ చూచి కాపాడుడు.

(14) శేషశయనముపై పూర్ణానురాగముతో నిండినవాఁడానీవే నిత్యుఁడవు. మాకు కలుగు బోధవు నీవే సుమా. ప్రజలను

కాచుటకు సత్వస్వరూపము నీవే కదా. రాగులకు నీవే వరము సుమా. మా జాఢ్యము పోఁ గొట్టుటకు,నిజమెన్ని చూపుటకు

నిన్ను కొలిచెదము. భక్త పాలా! మా జీవితాంతము నిన్ను భజింతుము..

(15) యాదాద్రి సంతోషమునకాలవాలము., చూడ గొప్పది, అది మహిమ చేయునది..ఆత్మలందు నిలిచి,

ఇహపరములనొసగునది. అచ్చట మంచివారికి మేలు చేయ వెలసిన నృసింహా! మమ్ములనేలు నిన్ను ఇష్టముతో

తమయాత్మలందు నిన్ను చూచుకొనునట్లు చేయుట కొఱకు నీ సహాయమును సన్మార్గవర్తులు కోరుదురు.

(16ధర్మపరిరక్షణార్థము నన్ను రక్షించు పరమేశా! నీవు నాకు పండుగవే. నాలో ధీశక్తిని ప్రభవింపఁ జేయుటకు, దీక్షతో నా

మదిలో నిలిచి, జగతిలో నీవు ప్రకాశించ వచ్చును కదా. సంతోషకారకా! సదానందరూపా! సత్వ ప్రకాశా! శాంతి

స్వరూపా! ఆత్మను ప్రకాశించువాడా! చిదానంద స్వరూపా! శిష్టులరూపముననుండువాడా! నీకు వందనములు..

(17) ప్రహ్లాద రక్షకా! కాంతిరూపమున సాక్షిగా ఉండు దేవా! ప్రసిద్ధ ఆత్మస్వరూపా! బ్రహ్మ తేజా! ఆత్మలందుప్పొంగు

భావము నీవే. సుభద్ర యొక్క ఆత్మవు నీవే. విశుద్ధాత్మవు నీవే. మమ్ము చూడ రమ్ము. అందరియందూ ప్రకాశించెడివాడవు

నీవే. భవ్యమయిన ఆత్మ తేజస్సు యొక్క ప్రభావముతో మమ్ము రక్షింప రమ్ము.

(18) బాధార్తులను కాపాడుటకు యాదాద్రిని మోదముతో వసించుచు, బాధలు పోగొట్టి, భక్తులను చూచి శక్తి ప్రసాదించి,

కర్తవ్య నిర్దేశము చేసి,నీ కరుణ చూపి, శాశ్వతత్వమిచ్చుట కొఱకు, గొప్పవారిని కాచుట కొఱకు, కృపతో అచ్చట

నిలిచితివి. మా హృదయములందు ప్రకాశించు మా నారసింహా! నీకు శతకోటి నమస్కారములు.

దండకముతో నొప్పు సీసపద్యమున ప్రకాశించు శ్రీశా! లక్ష్మీ నరసింహా! నీకు వందనములు. నన్ను నీవు చేరుకొనుము.

106. ఓం సర్వాత్మనే నమః.

పంక్తి వృత్త గర్భ సీసము

శ్రీనరసింహుఁడ! చిత్తములోపలన్ - చిత్ప్రకాశమ్ముగా చెలఁగుటకును

జ్ఞానముఁ గొల్పగ కల్గుమికన్, నినున్ - భావనఁ జేయుచు పరవశించి

ధ్యానముతోడ నహర్నిశలున్ మధు - రార్ద్రతతోడను నమలినమతిఁ

బ్రాణముగా కని వర్ధిలుదున్. దయ - చూడుమ నా మది శోభిలుమయ.

గీ. పంక్తి గర్భ సుసీసస్థ! పావనాంఘ్రి! - రామ కృష్ణుండ *సర్వాత్మ*! రక్షవీవె.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

106 సీస గర్భస్థ పంక్తి. ( .. యతి 7)

శ్రీనరసింహుఁడ! చిత్తములో - జ్ఞానముఁ గొల్పగ కల్గుమికన్

ధ్యానముతోడ నహర్నిశలున్ - బ్రాణముగా కని వర్ధిలుదున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! చిత్తములో చిత్తేజముతో చెలగుట కొఱకుమాకు జ్ఞానము

ప్రసాదించుటకై నీవు మాకు కలుగుము. నిన్ను భావించుచు,  పరవశించుచు, రాత్రింబవళ్ళు ధ్యానముతో తీయనైన

ఆర్ద్రమనస్సుతో నిన్ను ప్రాణప్రదముగా కని వర్ధిల్లుదును. .దయచూడుము!. నా మదిని శోభిల్లుము. పంక్తివృత్తగర్భ

సీసపద్యమునప్రకాశించువాఁడా! సర్వాత్మా! నేను చింతా రామకృష్ణారావును. నాకు రక్ష నీవే సుమా.

107. ఓం ధీరాయ నమః.

జాగ్రత్ వృత్త గర్బిత సీసము.

1. ఒకమారు నరసింహుఁడ కరుణించుచు ననుఁ - బ్రోవఁగ రావాప్రభూ! మహాత్మ!

భువిపైని భరమా కరి వరదా! కని వర - లం గన లేవా? ఖల పరిహార!

సత్పూజ్య చరణాంబుజ వర సేవలె జయ - మార్గము నాకున్సమస్తమునకు.  

సకల భాసుర సేవిత! కరుణించుటె సుక - రంబది నీకున్వరంబు నాకు.

2. స్థితిఁ గొల్పు జయభారతి శుభ హారతి జయ - దంబగు నీకున్ ఘనంబుగాను.

స్తవనీయ ప్రియముల్ గన వరలింపుము శ్రిత - రక్షక దేవానిరంతరంబు

భవదీయ ప్రియ భక్తుల వర సేవలు ప్రియ - మున్ గను నీకున్ సుపూజ్య దేవ

సుజనాత్మజయ మంగళ జయమంగళ చయ - ముల్ నరసింహా!  ప్రపూర్ణ రూప!

గీ. జాగ్రదసమాన సదవస్థ చక్కఁగనిడు. - కరుణఁ గావుమ గుణ *ధీర*! కామితదుఁడ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

107 సీస గర్భస్థ జాగ్రత్ వృత్తద్వయము. ( గగ .. యతి 11) 

1.నరసింహుఁడ కరుణించుచు ననుఁబ్రోవఁగ రావా! - భరమా కరి వరదా! కని వరలం గన లేవా

చరణాంబుజ వర సేవలె జయమార్గము నాకున్, - సుర సేవిత! కరుణించుటె సుకరంబది నీకున్.

2.జయ భారతి శుభ హారతి జయదంబగు నీకున్ ప్రియముల్ గన వరలింపుము శ్రిత రక్షక దేవా!  

ప్రియ భక్తుల వర సేవలు ప్రియమున్ గను నీకున్ జయ మంగళ! జయమంగళ చయముల్ నరసింహా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మహాత్మా! కరుణించుచు ననుఁ బ్రోచుటకు ఒకమారు

రావేమి? ఖలపరిహారా! ఒకమారు నన్ను చూచి భూమిపై నేను వరలునట్లుగా చేయుట నీకు భారమా? నాకును

సృష్టి కంతటికిని, నీ పవిత్ర పాద సేవయే జయమార్గము కదా. అంతటను ప్రకాశించుచు సేవింపబడువాడా, మమ్ములను

కరుణించుటయే నీకు సుకరము. మాకది వరము. సత్స్థితిని గొలుపునటువంటి జయప్రద భారతి యొసగెడి శుభప్రదమగు

హారతి నీకు గొప్పగా జయప్రదమగును.. ఆశ్రిత రక్షకా! ఎల్లప్పుడూ పొగడదగినవగు స్థితులను మా యందు వరలింపుము.

పూజ్యపరమాత్మా! నీకు నీ ప్రియ భక్తులు చేయు పూజలు ప్రియముగానొప్పును.సుజనులందాత్మవై యొప్పు దేవా!

నీకు మంగళములు. .సుగుణములతోనొప్పు ధీరా! కామితప్రదా! అసమానమైన జాగ్రదవస్థను మాకు చక్కగా

కల్పింపుము.

108. ఓం ప్రహ్లాదపాలకాయ నమః.  

గాథా ఛందోద్భాసిత మంగళ గీతిక గర్బ సీసము.

నారసింహునకు ననఘ నాయక మణి దే - మణికి మది వెల్గు రమణునకును  

వీర వర సుధీ రవికిని విజయ మంగ ళంబులు శుభమంగళంబులగుత!  

సారసాక్షునకు నసమ సత్య విభవ సం - స్తుతునకు యాదాద్రిపతికి హరికి 

స్మర జనక వివేక మణికి జయ సుమంగ - ళంబులు శుభమంగళంబులగుత!

వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృ - సింహవిభుని శుభ సంహతియగు 

పూజ్య పాద జలజములకు భువిని మంగ - ళంబులు లక్ష్మీ విలాస భాస!             

గీ. మంగళములు గాథాభాస! మంగళములు - మహిత *ప్రహ్లాదపాలకా*! మంగళములు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

108 సీస గర్భస్థ గాథా ఛందోద్భాసిత మంగళ గీతిక.

(విలక్షణ గురులఘు క్రమముతో ఎక్కువ తక్కువలు లేకుండా ఒక్కొక మారు మూడు లేక ఒక్కొక మారు ఆరు చరణములు

కలిగి పాడుకొనుటకు వీలు కలిగినది గాథా అను ఛందస్సుగా ప్రసిద్ధికెక్కినది.

गाथास्त्रिभिः षड्भिश्चरणैश्चोपलक्षिताः!! .१८ !! (केदार भट्टस्य  वृत्तरत्नाकरः)

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి - వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.  

సారసాక్షునకు నసమ సత్య విభవ సంస్తుతునకు - స్మార జనక దైవ మణికి జయ సుమంగళమ్.

వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృసింహవిభుని - పూజ్య పాద జలజములకు భువిని మంగళమ్.

గానానుకూల మంగళహారతి (పాట).

1. నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి   

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

లక్ష్మీ

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

2. సారసాక్షునకు నసమ సత్య విభవ సంస్తుతునకు,

సారసాక్షునకు నసమ సత్య విభవ సంస్తుతునకు

స్మర జనక వివేక మణికి జయ సుమంగళమ్.

స్మర జనక దైవ మణికి జయ సుమంగళమ్.

లక్ష్మీ

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

3. వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృసింహవిభుని

వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృసింహవిభుని

పూజ్య పాద జలజములకు భువిని మంగళమ్

పూజ్య పాద జలజములకు భువిని మంగళమ్.

లక్ష్మీ

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

విజయ మంగళమ్విజయ మంగళమ్

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లక్ష్మీ విలాసభాసా!  అఘరహితుఁడయిన నాయకమణియు,

దేవమణియు అయిన నా మదిలో వెలుగు రమణుఁడయిన నారసింహునకు వీరవరుడైనవానికి సుధీరవికి మంగళమగుగాక.

పద్మనేత్రునకు, అసమ సత్యవిభవములచేత స్తుతింపబడుయాదారీశునకు, స్మరజనకునకు, వివేకమణికి,  

జయమగుగాక. యాదాద్రి నివాసముగా కల విశ్వపతికి, శుభసంహతి యగు పూజ్య పాదజలజునకు భువిని

మంగళములు.,గాథావృత్తమున భాసించువాడా! నీకు మంగళములు. మహితుఁడవయిన ప్రహ్లాదపాలకా! నీకు

మంగళములు.  

కాణ్వశాఖీయ కౌశికస గోత్రోద్భవ చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల

జ్యేష్ట  పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూపులు కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య ప్రియ శిష్యుఁడును

అగు,చింతా రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే రచింపంబడిన యాదాద్రి శ్రీనృసింహ శతకము సంపూర్ణము.  స్వస్తి.                                                                                                                                                                                                                            నమస్కరోమి.

ఉగ్రమ్, వీరమ్, మహావిష్ణుమ్, జ్వలంతమ్ సర్వతోముఖమ్,

నృసింహ భీషణమ్ భద్రమ్, మృత్యోర్మృత్యుమ్ నమామ్యహమ్.


నేను నా రచనలు

కృతికర్త

భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు    

    ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున

      మూడు మకుటములతో మూడు శతకములు.)

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

    పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద   

    ఉత్పలమాలిక.

స్వస్తి


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.