గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2024, బుధవారం

నేను రచించిన అష్టవిధ నాయికలు పద్యములపై శ్రీ టేకుమళ్ళవేంకటప్పయ్యగారి విశ్లేషణ. 30 - 7 - 2020.


జైశ్రీరామ్.

నేనేమంటానంటే...

వెంకటప్పయ్య టేకుమళ్ళ గారి సమీక్ష.

చిత్ర కవితా సామ్రాట్ శ్రీ చింతా రామకృష్ణరావుగారి పద్యాలను విశ్లేషించుకునే ముందుగా చిత్రకవిత గురించి కొంత చెప్పాలి. ఒక పద్యంలో ఉండే అక్షరాలు, పదాలు, వాటి అమరికల గురించి అసాధారణమైన షరతులకు లోబడి రాసే, లేదా చెప్పే, పద్యాన్ని చిత్రకవితగా నిర్వచించొచ్చు. కే.వి.ఎస్ రామారావుగారు చిత్రకవిత్వంపై అద్భుతవ్యాసం వ్రాశారు. దానిలోని కొన్ని విశేషాలు మీరు తెలుసుకుని తీరాలి. ఉదాహరణకి, అష్టావధాన ప్రక్రియలో దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం పద్యాలు చిత్రకవిత కిందికి వస్తాయంటే అవధానులు ఆక్షేపణ చెయ్యొచ్చుగానీ, దత్తపదిలో పృఛ్ఛకుడు ఇచ్చిన పదాలు ఆ పద్యంలో వచ్చి తీరాలి; న్యస్తాక్షరిలో అక్షరాలూ, వాటి స్థానాలూ నిర్దేశించిన విధంగా ఉండితీరాలి; నిషిద్ధాక్షరిలో పృఛ్ఛకుడు నిషేధించిన అక్షరాల్ని వాడటానికి లేదు; సమస్యా పూరణానికి పృఛ్ఛకుడిచ్చిన పాదాలో, పాదభాగమో ఎలా ఇచ్చారో అలా పూర్తి పద్యంలో వచ్చి తీరాలి. నా ఉద్దేశంలో ఇవన్నీ చిత్రకవితలో భాగాలే!

మనకు తెలిసినంత వరకు తెలుగు కావ్యాల్లో చిత్రకవిత్వం తొలిసారిగా కన్పించేది నన్నెచోడుని “కుమారసంభవం” లో. ఇతను కూడ నన్నయ కాలానికి చాలా దగ్గరి వాడు. ఇతను నాగభూషణుడైన శివుణ్ణి ఒక నాగబంధ పద్యంలో స్తుతిస్తాడు; అంటే, కొన్ని చుట్టలు చుట్టుకున్న ఒక పాము బొమ్మ గీసి ఆ పాము శరీరం మీద అడ్డగళ్ళు పెట్టి ఒక్కో గళ్ళో ఒకో అక్షరం రాస్తారు; ఆ పాము తల నుంచి తోక వరకు వరసగా చదువుకుంటూ వెళ్తే పద్యం వస్తుంది. అలాగే చక్రధరుడైన విష్ణువుని ఒక చక్రబంధ పద్యంతో స్తుతిస్తాడు నన్నెచోడుడు. మరొక విశేషమైన పద్యంలో, “భక్తుడి శరీరంలో భగవంతుడు ఉంటాడు” అని చెప్తూ దానికి ఒక కందగర్భ చంపకమాల ని వాడాడు.అనగా చంపకమాల పద్యంలో ఓ కందం కూడా ఇమిడి ఉంటుందన్న మాట. ఆ పద్యం ఇది. "హరు మనమార గొల్చు; డరుదాతని గొల్చయు నాది బోడగా - బొరియునె భూరి భోగ పుర భూతి విభుత్వము పొంది పేర్మితోన్ - పరజన దారుణోగ్ర శరపాత నియుక్త పదంబు నందు తా - బొరయడు వారకోర్చి పొరి భూతగణేశ్వరు పొందు నాత్మలోన్" దీన్లో ఉన్న కందం ఇది. "మనమార గొల్చు డరుదా - తని గొల్చయు నాది బోడగా బొరియునె భూ - జన దారుణోగ్ర శర పా - తనియుక్త పదంబు నందు తా బొరయడు వా! అలాంటి చమత్కారాలున్నదే చిత్ర కవిత్వం.
భారతంలో ఎక్కడా చిత్రకవిత్వం వాడలేదని అంటారు. భాగవతంలో పోతన గారు కొన్ని సర్వలఘు కందాల్ని రాశారు. వాటిలో గజేంద్రమోక్షణ ఘట్టంలో “అడిగెద నని కడువడి జను” అనే పద్యం ఆ సందర్భానికి అద్భుతంగా అతికింది. 15వ శతాబ్దం వాడైన భైరవకవి “శ్రీరంగ మహాత్మ్యం” లో శివుణ్ణి ఒక సర్వలఘుకందంలో స్తుతిస్తాడు. 16వ శతాబ్దం వరకు చిత్రకవిత్వాన్ని కావ్యాల్లో వాడినా, అది చెదురుమదురుగా, కేవలం ఒక సందర్భానికి అవసరం అనుకుంటే తప్ప, వాడలేదు. ఆ తర్వాత మాత్రం, “చిత్రకవిత్వం కోసమే చిత్రకవిత్వం” అన్నట్టుగా విజృంభించారు మన కవులు. అప్పుడే పింగళి సూరన “రాఘవపాండవీయం” అనే ద్వ్యర్థి కావ్యం రాశాడు. అంటే ప్రతి పద్యం లోనూ రామాయణానికి సంబంధించిన అర్థం ఒకటి, భారతానికి సంబంధించిన అర్థం మరోటి ఉంటాయన్న మాట. అతన్ని చూసి “నేనేం తక్కువ తిన్లే”దంటూ భట్టుమూర్తి “హరిశ్చంద్రనలోపాఖ్యానం” రాశాడు హరిశ్చంద్రుడి కథనీ నలచరిత్రనీ కలిపి ముడేస్తూ. ఇంక ఆ తర్వాత ఎన్నో వచ్చాయి ఇలాటి రెండర్థాలు, మూడర్థాలు, నాలుగర్థాల కావ్యాలు. వీటన్నిట్లో “రాఘవపాండవీయం” ఒక్కటే మామూలు మనుషులకి కొంతైనా కొరుకుడు పడేది. ఐతే పింగళి సూరన ” కళాపూర్ణోదయం” లో చేసిన ప్రయోగాలు సందర్భానుకూలంగా ఉండి కొంతవరకు ఉల్లాసాన్ని కలిగించగలవ్. నలుగురు కవులు ఓ రాజుని చూట్టానికి వెళ్తే ఒక మంత్రి వాళ్ళకి అడ్డు తగుల్తుంటాడు. ఇలా కాదని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ వేషాల్లో ఆ రాజు దగ్గరికెళ్ళి ఓ పద్యం యిలా చెప్తారు "మాయమ్మాన సు నీవే - రాయలవై కావ దేవరా జేజేజే - మాయాతుమ లానిన యది - పాయక సంతోసమున్న ఫల మిలసామీ" చదువేమీ రాని వాళ్ళ మాటల్లా అనిపించే ఈ పద్యం నిజానికి తెలుగు పద్యం గానూ, సంస్కృత శ్లోకం గానూ కూడా చదువుకోవచ్చు. ముందుగా, తెలుగు పద్యానికి అన్వయం ఇది దేవరా, జేజేజే, ఇలసామీ (భూమిని పాలించే వాడా), నీవే రాయలవై కావ, సంతోసము, పాయక (విడవకుండా), మాయాతుమలు (మా ఆత్మలు), ఆనినయది (తాకింది), ఉన్నఫలము, మాయమ్మ, ఆన, సు! అని అర్ధం వస్తుంది. ఇదే పద్యం సంస్కృతంలో ఐతే హే, సునీవే (శుభప్రదమైన మూలధనము కలవాడా), ఆయమ్ (రాబడిని), మామాన (లెక్కపెట్టుకో వద్దు), అలవా (ముక్కలు కాని), రాః (ధనము), ఏకైవ (ఒక్కటే), అవత్ (కష్టాల్లో రక్షించేది); అజేజే (యజ్ఞం చేసే), రాజే (రాజు కోసం), మా (లక్ష్మి), ఆయాతు (వస్తుంది), మలాని న (పాపాలు అంటవు); పాయక (ఓ రక్షకుడా), సః (మంచివాళ్ళు), యది (దర్శనానికొస్తే), అసముత్ (సంతోషం లేకుండా), నఫల (వాళ్ళని చూడకుండా ఉండొద్దు), మిల (వాళ్ళతో కలువు), అమీ (వచ్చిన మేము), సా (ఆ లక్ష్మీ దేవే అనుకో) ఇంత వ్యవహారం ఉంది ఆ చిన్ని కందంలో! ఈ సందర్భంలో మరో వింతైన పద్యం కూడా గమనించండి "తా వినువారికి సరవిగ - భావనతో నానునతి విభా వసుతేజా - దేవర గౌరవ మహిమన - మా వలసిన కవిత మరిగి మాకు నధీశా" దీన్ని తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది! "శాధీనకు మా గిరి మత - వికనసి లవమాన మహిమ వర గౌరవ దే - జాతే సువ భావి తినను - నాతో నవభాగ విరస కిరివానువితా" వీటికిక్కడ అర్థాలు చెప్పటం కష్టం.
చిత్రకవిత్వానికి స్వర్ణయుగం 17, 18 శతాబ్దాలు. “ఉషాపరిణయం” లో దామెరల అంకన్న ఒక కందపద్యంలో 108 కందాల్ని బంధించాడు. అంటే, ఏ అక్షరం దగ్గర మొదలై ముందుకు వెళ్ళినా, వెనక్కి వెళ్ళినా ఓ కందం వస్తుందన్న మాట.
అలాగే, గణపవరపు వేంకటకవి “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం” అనే కావ్యం రాశాడు. దీన్లో ఇతను చెయ్యని చిత్రకవితా ప్రదర్శనం లేదు. వెయ్యి పైగా పద్యాల్ని ఇముడ్చుకున్న ఓ సీసం కూడా ఉన్నదిందులో! ఆ తర్వాత ఇంకా ఎన్నో చిత్రకవితా విశేషాల్తో కావ్యాలొచ్చాయి. ఉదాహరణకి రావిపాటి లక్ష్మీనారాయణ “భారతగర్భ రామాయణం” లో పద్యాలు రామాయణార్థంలో ఉంటే ప్రతి పద్యంలోను ఇమిడి ఉన్న మరో పద్యం భారతార్థాన్నిస్తుంది!ఇలా ఎన్నో రకాల చిత్ర విచిత్ర పాండిత్య విన్యాసాలు సాగేయి మన చిత్రకవిత్వం లో. వందల కొద్ది చిత్రాలు గీసుకుని వాటిలో పట్టే పద్యాల్ని తయారు చేశారు అసలు నిజమైన చిత్రకవిత ఇదేనంటారు కొందరు. ఈ ప్రక్రియలో కవి కంట బడ్డ ఏ వస్తువైనా చిత్రకవితకి అర్హమే! గుళ్ళు, గోపురాలు, రథాలు, చక్రాలు, ఖడ్గాలు, ఛురికలు, చెట్లు, సర్పాలు, గోవులు (గోమూత్రం కూడా), కోతులు, ఇంకా ఎన్నెన్నో ఆకారాలు చిత్రకవిత్వానికి పనికొచ్చినయ్. ఆరుద్ర తన సమగ్రాధ్ర చరిత్రలో చిత్రకవిత్వం గురించి చెబుతూ చిత్రకవిత్వంలో చిత్రాలే తప్ప కవిత్వానికి తావుండదన్నాడు. అయినా ఇప్పటికి ఎంతో మంది చిత్రకవిత్వం పట్ల ఆకర్షితులౌతూనే ఉన్నారు. సరి ఇంతటితో ముగిస్తాను.
సుదీర్ఘ ఉపోద్ఘాతాననంతరం విషయంలోకి వెళ్దాం. పద్యంతో పరిచయం ఉన్న ఏ కవికైనా చింతా కాదు కాదు చిత్రకవిత రామకృష్ణారావు గారి గురించి తెలిసే ఉంటుంది. ఆయన 2008 సం నుండి "ఆంధ్రామ్రుతం" పేరుతో బ్లాగు నిర్వహిస్తూ ఈనాటికి అనేక ఉపయోగరమైన టపాలను పెడుతున్నారు. యలమంచిలి సమీపంలోని సర్వసిద్ధి అనే ప్రాంతానికి చెందిన వీరు చోడవరం కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ తర్వాత హైదరబాదులో స్థిరపడ్డారు. ఆయన 2016 చివరిలో అనుకుంటాను 118 ఛందస్సులతో 108 సీసగర్భ పద్యాలతో యాదాద్రి నృసింహ శతకం వ్రాసి రికార్డు సృష్టించడం నాకు బాగా జ్ఞాపకం. ఇంక ఇంతకంటే ఆయన్ను గురించిన ఇంట్రో ఎందుకు చెప్పండి?
కవిగారు వ్రాసిన పద్యాలను చూద్దాం. ఆయన అష్టవిధ నాయికలను శ్రీకృష్ణుని అష్ట మహిషులతో పోల్చి మూడు చంపకమాలలలోను, ఐదు ఉత్పలమాలలతోను కవిత్వ చెప్పారు. మొదట స్వాధీనపతికను రుక్మినిగా సంభావించారు. ఆవైనం కొంచెం చూద్దాం. "తన యనురాగ హేలను ముదంబును గూర్చెడి రుక్మిణీ సతిన్ - మనమున నిల్పి, యామె యభిమాన సుఖప్రద మందిరంబహో! - వినుత ముకుంద! వీడవుగ, విజ్ఞత క్రోల్పడి భామ ప్రేమచే - తనకు వశుండవై చెలగ తాను రహించెను నీదు ప్రేమచే" అన్నారు. రుక్మిణీదేవి సామాన్యమైనదా వలచి వలపించుకొన్న భాగ్యశాలి. దంతవక్తృని సంహరించి, జరాసంధుణ్ణి, శిశుపాలురలను యుద్ధంలో నిలువరించి తెచ్చుకున్న అనుంగు ప్రేయసి. శ్రీకృష్ణుడు రుక్మిణీ సతిని సదా మనస్సులో నిల్పుకొండాటట. ఆమెకు వశుడై, వశ్యుడై నడుచుకుంటూ ఉంటే ఆమె ప్రేమాతిశయంతో ఆయన వర్ధిల్లాడట. వాసకసజ్జికను సత్యభామగా వర్ణిస్తూ "తానిచ్చనలంకరించుకొని, నేర్పుగ తల్పమలంకరించి పల్ - ముచ్చటతోడ నిన్ గవసి పోఁడిమినొప్ప నుపేక్ష చేయ నీవిచ్చట కృష్ణ!" అన్నారు. కృష్ణుడుకి ప్రీతిప్రదంగా అలంకరించుకొని, తలమూ అలంకరించి, పోడిమి అంటే ఒప్పు, సంపద, సౌఖ్యం అని చాలా అర్ధాలున్నై - ఉపేక్ష చేయడం ఎందుకు ? అని ఆమె వేదనను వివరించారు. శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో ఎంత విశిష్టమైన పాత్ర సంతరించుకొంది మనకు తెలుసు. స్వాధీనపతికయైన నాయికగా, భావిస్తారు ఆమెను. సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్ర ఉంటుంది. సత్యభామజడ కూచిపూడి సాంప్రదాయ నృత్యంలో ఎంత ప్రాచుర్యం ఉన్నది అందరికి తెలిసిందే! స్వాధీన పతికను వాసకసజ్జిక చేసిన కవి చమత్కారం గొప్పది. విరహోత్కంఠితను జాంబవతిగా వర్ణిస్తూ "విరహము చేత కల్గనిట వేగిరపాటు, భరింప లేనిదై -సరగున చేరె పాన్పునకు చప్పున జాంబవతీలలామ. నీ - వరుగుము కృష్ణ! యామెమదినాత్రతఁ గాంచి సుఖింపఁ జేయగా" అన్నారు. విరహం కలిగిన నాయిక పానుపు చేరింది. అయ్యా! కృష్ణా తాము వెళ్ళండి. ఆమె విరహం తీర్చండి అని బ్రతిమాలుతున్నాడు. జాంబవతి కథ మనకు తెలిసిందే! రామాయణం నాటి జాంబవంతుడు తనకు దొరికిన శమంతకమణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు. ఇక విప్రలబ్ధను మిత్రవిందతో పోల్చి కృష్ణా మరచిపోయావా! మిత్రవిందకు మాటిచ్చావు. ఈనాటి రాత్రికి వస్తానని. ఆమె పరిస్థితి గమనించు కొంచెం "తరుణిని విప్రలబ్ధగను ధాత్రిని మార్చితివీవె కృష్ణ. సుం - దరమగు మేని సొమ్ములను తా పెకలించి విదల్చె కోపియై" అన్నాడు. వేసుకొన్న నగా నట్రా విసిరేసింది. వెళ్ళి ఓదార్చటం, కైవసం చేసుకోవడం చాలా ముఖ్యం అంటున్నాడు. ఈమె శ్రీకృష్ణుని మేనత్త కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరమాల వేసి వరించిందీమె. ఇక భద్రను ఖండితగా వివరించారు. భద్ర శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక. ఈమె సకల సలక్షణ సమన్విత. జాగ్రత్త గల నడవడిక కలది. కృష్ణుడికి మేనమరదలి వరుస. ఆమెను "భద్రతఁ గొల్పి సాధువుల వర్ధిలఁ జేయగ రాత్రి నీ వహో - నిద్రను మాని యుండుటను నీ కను లెఱ్ఱగ నుండు టెన్ని నీ - భద్ర ‘పరాంగనన్ కలిసి వచ్చితివంచు’ బ్రమించి కోపియై - ఛిద్రము చేసె వస్తువులు శ్రీహరి! ఖండితనెట్లు మోసెదో?" అన్నారు. స్వామి సాధురక్షణకై వెళ్ళియుండగా ఆ రాత్రి కన్నులెర్రబడి యుండగా ఆమె వేరే గోపకాంతతో కులికి వచ్చాడనుకొని ఫ్రిజ్, డ్రెస్సింగ్ టబుల్ సారీ! హంసతూలికాతల్పము,అలంకరణ పేటికలు నాశనం చేసిందట అదీ కథ. కలహాంతరితగా నాగ్నజితిని వర్ణించారు. పద్యంలో ఆమె పేరు ప్రస్తావన లేకపోయినప్పటికి ఆమె నాగ్నజితే! ఆమె కోసల దేశాధీశుడైన నగ్నజితి అనే మహారాజు రాజ్యంలో వృషభాలు మదించిన ఏనుగుల మాదిరిగా ఊరిమీదపడి ప్రజలను బాధిస్తుండగా ఆ నాగ్నజితు యెవరైతే వృషభాలను బంధిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని చాటించాడు. పెళ్ళికి ఆశ పడకపోయినా లోకోపకారార్ధం దేవకీ సుతుడు వెళ్లి అనాయాసంగా వృషభాలను బంధించాడు. రాజుగారు అన్నమాట ప్రకారం తన కుమార్తె నాగ్నజితినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. ఇక ఆమె ఏమంటున్నదంటే "కోపము చెందె నీ మరులు గొల్పెడి మాటలకా సుదంత.. సం- తాపము తోడ నిన్ విడిచె దర్పముతో. మదిలోన నిన్ను తా - కోపము వీడి రావలచి చింతిలుచుండెను. గాంచితే హరీ!- హా! పరమేశ! యంచు కలహాంతరితాత్మఁ గృశించె. గాంచితే?" అన్నాడు. కోపంతో ఏవో నాలుగుమాటలన్నది. ఆమె చింతిస్తూ కృశించి పోతున్నది హరీ! వచ్చి ఏలుకో ఆమెను అంటునాడు. ప్రోషితభర్తృక గా కాళింది నిలిచింది. కాళింది సూర్యుని కూతురు. ఆమె విష్ణుమూర్తి భర్త గావాలని తపస్సు చేసింది. కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెడితే ఆవిడ కామవాంచతో కృష్ణుని చూచింది. అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి యిద్దరికీ సంధానం చేశాడు. గోపాలుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను ద్వారక తీసికెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఆమెను కవి "కాళింది మనంబునన్ వగచె క్లేశమునొందుచు నీవు లేక తాన్. సందడి చేయు నీవచట చక్కని ప్రోషిత భర్తృకన్ గనన్" అన్నాడు. అయ్యా! కృష్ణా నీవు నీ రాచకార్యాలమీద ఇళ్ళు విడిచి వెళ్ళావు. ఆమె మనోవ్యధతో మంచం పట్టింది. వచ్చి ఆమెతో సందడి చెయ్యి కాసేపు అంటున్నాడు. ఇక చివరిగా అభిసారికగా లక్షణ. ఆమెను "సన్నుతితోడ నిన్ను కను సన్నల రమ్మను చోటు చేరగా - నన్నులమిన్న లక్షణ సమస్త భయంబులు వీడి వచ్చి నీ - కన్నుల ముందటన్ నిలిచె కష్టములెన్నిటినైన నోర్చి. సం-పన్నతనొప్పు నామెకగు భవ్యముగా నభిసారికా ప్రియా" అంటున్నాడు. లక్షణ బృహత్సేనుని ముద్దుల కూతురు. ఈమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్ధ్యము నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది. ఆమె తండ్రి ఒక మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికి కూతురుని ఇస్తానని చాటించాడు. అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక నందనందనుడు సునాయాసంగా మత్స్యాన్ని పడేశాడు. లక్షణ తన లక్ష్యం సిద్ధించిందని ఆనందించి వరమాల వేసి వరించింది. శ్రీకృష్ణుడు తనకు అడ్డు వచ్చిన రాజులందరినీ యెదురించి లక్షణని తీసుకుని ద్వారక చేరాడు.మరి మత్స్యయంత్రం కొట్టి తెచ్చిన నాయికను మల్లారి ఆమెను అభిసారికగా మారిస్తే ఎలా చెప్పండి? ఆమె అంత ఇష్టంతో, సమస్త భయాన్ని వీడి రమ్మన్న చొటుకుకు వచ్చింది కదా? అక్కడికి చేరుకోవాలి కదా! అంటునాడు. ఇదీ ఇవాళ్టి కథా కమామిషూ. మళ్ళీ రేపు. శెలవు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.