గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2024, గురువారం

ఓకారము - ఓంకారము.

 జైశ్రీరామ్.

ఓకారము - ఓంకారము. 


ప్రథమ వయస్సులో నున్నబాలురకు ఓంకారము ఉపదేశింపబడదు. ఓంకార ప్రతీకగా ఓ కారము దేశింప బడుచున్నది. ప్రణవమును " ఓమ్ " అని "ఓ " అని ఉచ్చరించుట లేక వ్యవహరించుట వైదిక సంప్రదాయము. ఓంకారాకృతి ఓ కారమని శ్రుతి వర్ణించుచున్నది. 

" ఓమిత్యేదను కృతి హస్మవాఆప్యోశ్రావయేత్యాశ్రావయాన్తి "( థైత్తెరీ యారణ్యక ) 

అస్మిన్ మంత్రే యదేత దోకారొచ్చారణమ్ తదేత దో మిత్యేత దను కృతియే ( సాయణ భాష్యం ) " ఓంకారాను కృతియే ఓకారము. 

ఈ శ్రుతి ప్రమాణము ననుసరించి , సంప్రదాయము ననుసరించి ఓంకారమోకార ప్రతిరూపమే అగుచున్నది. ప్రథమ వయసునున్న బాలునకు సంప్రదాయo ఓంకారమును సరాసరి ఉపదేశింపక తత్ప్రతి రూపము నుపదేశించుచున్నది. ఓంకారోపదేశమును తురీయాశ్రమమున ప్రవేశించు యతులకు మాత్రమే ఉపదేశింప బడుచున్నది. కనుకనే భారతీయుల అక్షరాభ్యాసము ఓంకారోపాసనతో ప్రారంభమగుచున్నది. కనుకనే పెద్దలు దీనిని 

" అక్షరవిద్యోపాసన " అని చెప్పుచున్నారు. 

                    శ్రుతి ఎన్నో ఉపాసనలను విధించినది. ఆ ఉపాసనలు విద్యాలుగా వ్యవహరింపబడుచున్నవి. శాండిల్య వైశ్వానర విద్య పంచాగ్ని విద్య పర్యంక విద్య మొదలగు విద్యలు ఉపాసనా రూపములే. ఈ విద్యలకు మూలభూతమగు అక్షరవిద్య బాలిశమునందే అక్షరాభ్యాసారంభమున ఉపదేశించుచున్నది. అనగా భారతీయ జీవితమునకు బాల్యము నుండియే ప్రణవ సంబంధ మేర్పడుచున్నది. పరోక్షముగా ప్రణవ విద్య అభ్యసింప బడుచున్నది. ఓనమాలు దిద్దుటతో ప్రారంభమైన ఈ అభ్యాసము విద్యనార్జించిన కొలది గురు శుశ్రూష చేసిన కొలది జన్మతారక మగుచున్నది. 

" చిత్తస్య ఏకస్మిన్ అవలంబనే సర్వతః సమాహృత్య పునః స్థాపన మభ్యాస " ( గీత శాంకరభాష్యం ) 

చిత్తమును యితరవిషయముల నుండి మరల్చి యొకే లక్ష్యమున నిలుపుటకు మరలమరల జేయు యత్నము అభ్యాసము. " 

బాల్యమున ప్రారంభమైన ఓనమాలు దిద్దుట అక్షర విద్యాభ్యాసము జ్ఞాన యోగమున ప్రణవ విద్యోపాసనగా రూపొందుచున్నది. 

యోగనిష్ఠుడైన సాధకుడు బాల్యమున తానభ్యసించిన అక్షర విద్యాస్వరూపము నవగతము జేసుకొనుచున్నాడు. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.